సర్వోత్తమ దార్శనికుడు

జనవరి 19 ని వేమన జయంతిగా జరుపుకునే ఆచారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ కూడా ఉందని విన్నాను. కొన్నిచోట్ల 18 నే ఒక పండగలాగా జరుపుకునే సంప్రదాయమూ ఉందని విన్నాను. అలాగే మొన్న ఆదివారం కూకట్ పల్లి వివేకానంద నగర్ కాలనీలో యోగివేమన ఫౌండేషన్ వారు వేమన జయంతి జరుపుకుంటూ, నన్ను కూడా రమ్మని, వేమన గురించి నాలుగు మాటలు మాట్లాడమని పిలిస్తే వెళ్ళాను.

ఆ ఫౌండేషన్ అధ్యక్షులు ఎం.ఇ.వి.ప్రసాద రెడ్డి పాత్రికేయులు. చాలా కాలం కిందట జోలదరాశి చంద్రశేఖర రెడ్డిగారి ఆహ్వానం మేరకు ఆ కాలనీలో వేమన గురించి నేను చేసిన ప్రసగం గుర్తుపెట్టుకుని ప్రసాదరెడ్డిగారు నన్ను మళ్ళా పిలిచారు. ఆయన తన ప్రసంగంలో తాను ఆ మధ్య కటారుపల్లె వెళ్ళి వచ్చానని చెప్తూ, అక్కడ ఒక ప్రాజెక్టు చేపట్టాలని తనకి కలుగుతున్న ఆలోచనలని సభ ముందుంచారు. కటారుపల్లె దగ్గరలో పదెకరాల స్థలం తీసుకుని అక్కడ యోగివేమన అధ్యయన కేంద్రం ఒకటి ప్రారంభించాలని తనకు సంకల్పం కలిగిందని అందుకు గాను ముందు తన వంతుగా పదిలక్షలు విరాళం ప్రకటించారు. అక్కడికక్కడే సభలో మరికొందరు దాతలు తమ వంతు విరాళం తామూ ప్రకటించారు.

బసవన్న, వేమన, గురజాడ లాంటి కవుల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎప్పటికప్పుడు కొత్తగా తెలిసేవీ ఉంటాయి, మాట్లాడుతుండగా అప్పటికప్పుడు మనకి కొత్తగా స్ఫురించేవీ ఉంటాయి. అందుకని, కొత్తవీ, పాతవీ కొన్ని ఆలోచనలు మళ్ళా మొన్నటి సభలో పంచుకున్నాను.

వేమన అంటే మనందరికీ తెలిసినట్టే ఉంటుంది. ఆ కవిత్వం కూడా మొత్తం మనం చదివినట్టే ఉంటుంది. కానీ వేమన పద్యాల పేరు మీద లభ్యమవుతున్న ఏ సంకలనం తెరిచినా, మనకి బాగా చిరపరిచితమైన పాతిక ముప్ఫై పద్యాలు దాటి ముందుకు నడవడం కష్టమైపోతుంది. ఆ తర్వాత పద్యాలు కొత్తగా కనిపిస్తాయి. అందుకని  వేమన పుస్తకం పుస్తకానికీ మారుతుంటాడు. మొన్నటి సభలో నా సహవక్త నౌరోజీ రెడ్డిగారు చెప్పినట్టు ఎవరికి తోచిన వేమన వారికి కనిపిస్తాడు. ఎవరు చూడాలనుకున్న వేమనని వారు చూడటం మొదలుపెడతారు. ఆ వేమననే అసలు వేమన అని ప్రచారం చెయ్యడం మొదలుపెడతారు. అందుకనే కొందరికి ఆయన సంసారాన్ని వదిలిపెట్టిన యోగి. కొందరికి ఆయన సంసార యోగి. కొందరికి ఆయన అద్వైతి, కొందరికి నాస్తికుడు, కొందరికి శైవుడు, కొందరికి అచలుడు, కొందరికి నాథయోగి, కొందరికి దిగంబరజైనుడు కూడా.

మన పసితనంలో  ఆయన పద్యాలతోటే మనం చదువుమొదలుపెట్టినందువల్ల, ఆ తెలుగు తేటతెలుగు కావడంవల్లా ఆయన మనకు బాగా తెలుసనుకుంటాంగానీ, తీరాచేసి, ఆయన గురించి చదవడం మొదలుపెడితే, ఆయన గురించి మనకే కాదు, ఎవరికీ ఏమీ ఇతమిత్థంగా స్పష్టంగా తెలియదని తెలుస్తుంది.

ప్రజల నాలుకలమీద జీవిస్తున్న వేమన మొదటిసారి కాగితాలమీదకు ఎక్కింది, మనకు తెలిసినంతవరకూ, 1730 లో. ఆ ఏడాది సంజీవనాథ స్వామి (ఫాదర్ లెగాక్) అనే ఆయన  వేమన పద్యాల్ని (368) సేకరించి పారిస్ కి  పంపించాడు. వాటిని ఫ్రెంచిలోకి అనువదించుకున్నారు. ఆ రకంగా ఆధునిక యుగంలో యూరోప్ కి పరిచయమైన మొదటి భారతీయ కవి వేమన అనే అనుకోవాలి. (కాళిదాసుని విలియం జోన్స్ ఇంగ్లిషులోకి అనువదించింది 1789 లో. తిరుక్కురళ్  మొదటి రెండు అధ్యాయాలు 1730లో లాటిన్ లోకి అనువాదమయ్యాయి.  కానీ పోప్ చేసిన పూర్తి అనువాదం 1886 కి కానీ ఇంగ్లిషులోకి రాలేదు) వేమన 1730 నాటికే పారిస్ చేరినందువల్లనే, అబె దుబోయిస్ అనే ఒక కాథలిక్ మిషనరీ తన  Hindu Manners, Customs and Ceremonies: The Classic First-Hand Account of India in the Early Nineteenth Century (1815) పుస్తకంలో వేమన గురించి ప్రస్తావించగలిగాడు.

ఆ తర్వాత అయిదేళ్ళకి అంటే 1820 లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కడపలో ఉద్యోగంలో చేరాడు. ఈస్టిండియా కంపెనీ నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగీ ఒక దేశభాష కూడా విధిగా నేర్చుకోవలసి ఉండటంతో, బ్రౌన్ తెలుగు భాష నేర్చుకోడానికి ఉత్సాహపడ్డాడు. కానీ తీరాచూస్తే ఒక విదేశీయుడు తన అభ్యాసం మొదలుపెట్టడానికి సులభంగా తోచే తెలుగు సాహిత్యమేదీ ఆయనకి కనిపించలేదు. అటువంటి పరిస్థితుల్లో దుబోయిస్ రాసిన పుస్తకం ద్వారా ఆయనకు వేమన పద్యాల గురించి తెలిసింది. అదీ కాక, డుబోయిస్ తన పుస్తకంలో వేమన కడప జిల్లాకి చెందిన వాడని రాసినందువల్ల కూడా బ్రౌన్ కి వేమన పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉండవచ్చు. నాలుగేళ్ళ అధ్యయనం తర్వాత, 1824 లో వేమన పద్యాల్ని ఇంగ్లిషులోకి అనువదించుకుని, ఆ సంపుటానికి బ్రౌన్ ఒక ముందుమాట కూడా రాసుకున్నాడు. అంటే ఇప్పటికి రెండువందల ఏళ్ళ కిందనన్నమాట!

అప్పటికి ఆయన తొమ్మిది రాతప్రతుల్ని పరిశీలించుకుంటే పద్యాలు దాదాపు రెండువేలుదాకా లెక్కతేలాయి.  ఆయన వాటిని ఆయన తాను సేకరించుకున్న క్రమంలో కాక, ఒక పద్ధతిలో వర్గీకరించడానికి పూనుకున్నాడు. దాని గురించి 1829 లో రాసుకున్న ముందుమాటలో ఇలా రాసాడు:

It next became necessary to reduce the verses to some regular arrangement. Each transcriber had evidently selected such as he preferred, and no order was anywhere preserved. I at length formed the whole into five tolerably consistent divisions— religious, moral, satirical, mystic and miscellaneous. The two last of these form more than half the work, but are omitted in the present volume because devoid of interest and utility. The student will 1 perhaps find the second and third chapters easier than the first, which may, therefore, be read afterwards.

ఇలా వింగడించడం పాశ్చాత్య పద్ధతి అయినప్పటికీ వాటిని 1824 లో మొదట మూడు విభాగాలు గా moral, satirical and mystic గా అనుకుని, 1829 నాటికి మరలా, అయిదుగా లెక్క వేసుకుని తిరిగి వాటిని మూడింటికి కుదించుకున్నాడు. ఈ కుదింపులో మొదట ఉన్న mystic  విభాగం స్థానంలో religious వచ్చి చేరింది. ఆ మూడింటి క్రమం కూడా  religious, moral and satirical గా మారింది. కానీ పుస్తకం శీర్షికలో moral, religious and satirical అనే క్రమం కనిపిస్తుంది. అంటే ఐదేళ్ల కాలంలోనే ఆయన వేమనని అర్థం చేసుకునే క్రమ పద్ధతిలోనే ఎంతో మార్పు సంభవించింది. పందొమ్మిదో శతాబ్ది పూర్వార్ధంలో  వేమనపద్యాలను బ్రౌన్ ఇలా వింగడించుకున్నప్పణ్ణుంచీ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వేమన ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాడని మాత్రం నాకు అనిపిస్తూ ఉన్నది.

తెలుగు నేర్చుకోడానికి ఏ అభ్యాసకుడైనా వేమన పద్యాలతో మొదలుపెట్టడం సులభంగా ఉంటుందని బ్రౌన్ స్వానుభవంతో గ్రహించాక పందొమ్మిదో శతాబ్దంలో ప్రాథమిక స్థాయిలో తెలుగు వాచకాల్లో వేమన పద్యాల్ని చేర్చడం మొదలుపెట్టారు. కాని దానిమీద పెద్ద వివాదమే చెలరేగిందని  Henry Bowers రాసిన ఒక వ్యాసంద్వారా మనకు తెలుస్తున్నది (చూ. వేమన, మరుపూరు కోదండరామిరెడ్డి, 2005, పే.349-51). బవర్స్ ఆ రోజుల్లో ఇన్ స్పెక్టర్ ఆఫ్ స్కూల్సుగా పనిచేసాడు. వేమన పద్యాల్లో మతపరమైనవీ, అధిక్షేపణతో కూడుకున్నవీ వివాదాస్పదమవుతున్నాయని గమనించాక, ఆ పద్యాల్లో నీతిప్రధానమైన పద్యాలు మాత్రమే నెమ్మదిగా పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకోవడం మొదలుపెట్టాయని మనం గమనించవచ్చు. అప్పణ్ణుంచి ఇప్పటిదాకా కూడా అవే కొనసాగుతూ ఉన్నాయి.

వేమన పద్యాల్ని బ్రౌన్ మూడు విభాగాలుగా విభజించినప్పటికీ, ఆ విభాగాల్లోని పద్యాల్ని నిశితంగా చూస్తే, వాటిని అలా ఏదో ఒక విభాగానికి కుదించలేమని అర్థమవుతుంది. ప్రతి పద్యమూ దాని సారాంశంలో ఒక విభాగంలోంచి తక్కిన రెండు విభాగాల్లోకీ పొంగిపొర్లుతూనే కనిపిస్తుంది. అందుకనే పందొమ్మిదో శతాబ్దంలో వేమనని ప్రస్తుతించిన ఇంగ్లిషు, యూరపియన్ పండితులు బ్రౌన్, విలయం హోవార్డ్ కాంప్ బెల్, మాక్ డొనాల్డ్, బార్ నెట్, గోవర్, గ్రిబుల్, గ్రియర్ సన్ మొదలైనవారు వేమనని ఏదో ఒక గాటన కట్టడానికి ఇష్టపడలేదని మనకు తెలుస్తున్నది. వారిలో చివరి వాడని చెప్పదగ్గ గ్రిర్ సన్ ఇలా రాస్తున్నాడు:

సరియైన విధమున వేమన గుణవిశేషములను చిత్రించినచో, ఆయన కవితాసౌభాగ్యము రచనా శక్తులవల్లనే కాక, మానవాళిపై, ఆయన చల్లిన ప్రేమరసము వల్లను సర్వప్రపంచ హృదయమును లోబరచుకోగలడు. ఆయన కోపము, నింద,  అవహేళనము, అసూయాప్రేరకములు గావు. పొరపాటుపడుచున్న మానవుల ధోరణి పట్ల ఆయనకు కలిగిన ఆవేదనమే ఈ రూపమున బయటపడినది, మానవుడు ఈ లోపము నన్నిటిని పోకార్చుకోనవలెననియే ఆయన స్వచ్ఛ కాంక్ష. మానవుడు సగౌరవముగా ఈ భూమిలో తల ఎత్తుకుని తిరిగి స్వతంత్రముగ మనవలయుననియే ఆయన వాంఛ. మానవ స్వాతంత్ర్యము, సమానత్వము, ప్రతిష్ఠను ఆకాంక్షించే ప్రపంచ దార్శనిక మహాకవులలో వేమన సర్వోత్తముడు. (వేమన, మరుపూరు, 2005, పే.353)

ఈ లోపు వేమన పద్యాల సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వచ్చింది. నేదునూరి గంగాధరం వంటి విశ్వసనీయ సాహిత్యవేత్త వెలువరించిన సంకలనంలో(1960) వేమన పద్యాలు 5010 దాకా చేరుకున్నాయి! మరొకవైపు సార్వత్రిక, సార్వకాలిక సత్యాల్ని తేటతెలుగులో పద్యాలుగా కూర్చిన వాడుగా మాత్రమే వేమన పాఠ్యపుస్తకాల ద్వారా పరిచయమవుతూ ఉన్నాడు. కాని ఇరవయ్య శతాబ్దపు తెలుగు సాహిత్యం ఈ పద్యాల్లో ధిక్కారకుడిగా, సంఘ విమర్శకుడిగా,  కనిపించే వేమననే అసలైన వేమనగా పైకెత్తుతూ వచ్చింది. వారందరి రచనల్లోనూ అంతస్సూత్రం దాదాపుగా ఒక్కటే. అది వేమన జీవితంలోనూ, సమాజం లోనూ కూడా ద్వంద్వనీతిని అంగీకరించలేదనే. చలంగారిని ఇరవయ్యవశతాబ్దపు వేమన యోగిగా శ్రీశ్రీ అభివర్ణించినప్పుడు ఆ మాటల్లో వినిపించే సత్యం స్పష్టమే: అదేమంటే, వేమనకీ, చలంగారికీ కూడా సమానలక్షణం చిత్తశుద్ధి అని చెప్పడమే.

ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దం మొదలయ్యాక, మళ్ళా వేమన గురించిన అవగాహనలో తిరిగి రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇరవయ్యవశతాబ్ది అవగాహనను కొనసాగిస్తూ ఆధిపత్య వర్గాల, కులాల ద్వంద్వ నీతినీ, వర్ణవ్యవస్థనీ, ఆచారవ్యవహారాల సంకుచితత్వాన్నీ ఖండించినవాడిగా వేమనని చూడటం. మరొకవైపు, ఈ పార్శ్వాన్ని పక్కన పెట్టకుండానే, వేమనను ఒక సమగ్రమానవతావాదిగా దర్శించడానికి ప్రయత్నించడం. ఒక్కమాటలో చెప్పాలంటే, వేమనను ఒక విద్యావేత్తగా చూడటం. అనుమాండ్ల భూమయ్య రాసిన ‘వేమన అనుభవ సారం'(2012), యలవర్తి భానుభవాని రాసిన ‘వేమన తాత్వికత'(2016) గ్రంథాల గురించి మాట్లాడుతూ నేను ఈ అంశం మీద వివరంగా రాసాను.

కొండవీడు-3

ఒక విద్యావేత్త

వేమన గురువు అంటే సాంప్రదాయిక అర్థంలో గురువు మాత్రమే కాదు. ఇప్పుడు మనకి అత్యవసరమైన జీవనవిద్యను ప్రతిపాదిస్తున్న గురువు అని కూడా. అంటే, చాలా మనకి సుపరిచితంగా, ఇంక వాటిల్లోంచి కొత్తగా ఏ అర్థాలూ స్ఫురించడానికేమీ లేదనే పద్యాల్లో కూడా వేమన మనకి సరికొత్తగా వినిపిస్తున్నాడు. ఉదాహరణకి మొన్న సమావేశంలో ప్రసాదరెడ్డిగారు తన ప్రసంగం లో పేర్కొన్న సుప్రసిద్ధమైన ఈ పద్యం చూడండి:

తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా

ఇది మామూలు నీతి పద్యం కాదు. మన సమాజానికి ఈ తెలుగు పద్యం గతంలోకన్నా ఇప్పుడే మరింత అవసరమనిపిస్తున్నది. రెండు అంశాల్లో. మొదటిది, తల్లిదండ్రుల్ని పట్టించుకోని పరిస్థితి మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడే ప్రచలితంగా ఉంటున్నందువల్ల. రెండోది, వేమన పుత్రిక గురించి కాదు, పుత్రుడి గురించి మాట్లాడినందువల్ల. (‘తల్లి తండ్రి మీద దయలేని సంతతి’ అన్నా ‘దయలేని బిడ్డలు’ అన్నా ఛందస్సుకి సరిపోతుంది. కానీ కవి ‘దయలేని పుత్రుండు’ అన్నాడు) బహుశా మనది ప్రధానంగా పుత్రప్రాధాన్య సమాజం కాబట్టి వేమన కాలంలో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉండేది కాబట్టి ఆయన తన పద్యంలో కూడా పుత్రుణ్ణే ప్రస్తావించాడని అనవచ్చు. కాని కాలాన్ని దాటి బతికే కవిత్వం ఎప్పటికి తగ్గ సందేశాన్ని అప్పటికిస్తూ ఉంటుందనడానికి ఈ పద్యమే ఒక నిరూపణ. ఈ రోజు తల్లిదండ్రుల్ని పుత్రులు పట్టించుకోకుండా పోవడం ఎంత యథార్థమో, పుత్రికలు పట్టించుకుంటూ ఉండటం కూడా అంతే యథార్థం. నేనొక క్షణం పాటు నేనింతదాకా చదివిన తెలుగు కవిత్వాన్ని గుర్తుచేసుకున్నాను. ‘తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలు పుడితే ఏమిటి, గిడితే ఏమిటి’ అని ఇంత సూటిగా, ఇంత పదునుగా, ఇంత తేటతెల్లంగా చెప్పిన మరొక కవిగాని, మరొక పద్యంగాని లేదా మరొక హితవాక్యం గానీ నాకేదీ గుర్తుకు రావడం లేదు. ఈ కాలానికి ఎంతో అవసరమైన ఈ మాట చెప్పినవాడు అప్పటికీ, ఇప్పటికీ వేమన ఒక్కడే.

ఇలా సుప్రసిద్ధమైన ఏ పద్యాన్ని చూసినా ప్రతి ఒక్కటీ మనకి కొత్తగా, మన కాలానికీ, మన సమాజానికీ ఎంతో అవసరమైన జీవనవిద్యని బోధించేదిగా కనిపిస్తున్నదనడంలో అతిశయోక్తి లేదు. వేమన పేరుమీద ప్రచారమైన సప్తసూత్రాలు,  జె.డి.బి.గ్రిబిల్ కడప జిల్లా మాన్యువల్ లో పేర్కొన్నవి, (చూ. వేమన, మరుపూరు, 2005, పే.46) దాదాపుగా అన్ని మతాలూ బోధించే నైతికసూత్రాలే. కాని వాటిని తేటతెలుగులో, అనితరసాధ్యమైన economy of wordsలో, మనసుకి నేరుగా హత్తుకునే సాదృశ్యాలతో, స్మరణీయ పద్యాలుగా కూర్చినవాడు మాత్రం వేమననే. తెలుగువారికి ఒక తిరువళ్ళువర్, ఒక భర్తృహరి, ఒక బసవన్న, ఒక కబీరు, ఒక సర్వజ్ఞుడు వేమననే.  

కాబట్టి వేమన పద్యాల్లో ఎవరికి వారు తమకు నచ్చిన వేమననే ఎంచుకుంటూ  ఉన్నప్పటికీ, వేమన పద్యాలుగా మనం చిన్నప్పణ్ణుంచీ పాఠ్యపుస్తకాల్లో చదువుతూ వస్తున్న నీతి పద్యాలు కూడా సామాన్యమైనవి కావని నాకు అనిపిస్తున్నది. అవి కాలం తాలూకు ప్రాధాన్యతలను దాటి నిలబడుతూ వస్తున్నవి. వేమన దర్శనాన్ని పాయలు పాయలుగా విడదీసి చూసి వాటిలో ఒక పార్శ్వాన్ని మాత్రమే ఎత్తిచూపడం అప్పటి శ్రోతల్ని సంతృప్తిపరచడానికి సరిపోతుందేమోగాని, తన కృత్రిమ విభజనల్ని దాటుకుని వేమన ఎప్పటికప్పుడు సర్వోన్నత దార్శనికుడిగా ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. అందుకని వేమన గురించి గ్రిర్ సన్ రాసిన ఈ వాక్యమే ఇప్పటికీ మనం చెప్పుకోగలిగిన చివరి వాక్యం అనిపిస్తున్నది:

మానవ స్వాతంత్ర్యము, సమానత్వము, ప్రతిష్ఠను ఆకాంక్షించే ప్రపంచ దార్శనిక మహాకవులలో వేమన సర్వోత్తముడు.

21-1-2025

6 Replies to “సర్వోత్తమ దార్శనికుడు”

  1. వేమన కూ, వీరభద్రన కూ జేజేలు. జేజేలు.జేజేలు.

  2. మా పెరట్లో నందివర్ధనం చెట్టు నిండా పూలే.
    కావలసినన్ని ఏరుకొని మిగతావి చెట్టు కే వొదిలేస్తాం.
    అలాంటి వ్యక్తి చినవీరభద్రుడు గారు.అపార మేధో సంపద.ఎన్నని తోడుకుంటాం.అందుకే అలా వింటూనే వుంటాం.

  3. వేమన సాహిత్యం గురించి నాలాటి సామాన్యులకు తెలియని ఎన్నో విషయాల గురించి వివరంగా వ్రాసినందుకు ధన్యవాదాలు!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading