రూపాన్వేషి, మార్గదర్శి

తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రకారులు బి.ఎ.రెడ్డిగారి కళాయానాన్ని వివరిస్తూ శ్రీమతి ఎన్.వి.పి.ఎస్.యెస్.లక్ష్మిగారు 2007 లో గోల్దేన్ పేలట్ అనే ఒక పుస్తకం వెలువరించారు. ఆ రచనకు ఒక ముందుమాట రాసే భాగ్యం నాకు లభించింది. ఆ పుస్తకం సమయానికి కనబడక నేను ఇంతకుముందు వెలువరించిన పుస్తకాల్లో ఆ వ్యాసం పొందుపరచలేకపోయాను. అందుకని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. శ్రీ బి.ఎ.రెడ్డి సంస్కృతి ఆర్ట్ స్కూల్ పేరిట అత్తాపూర్ లో ప్రతి ఆదివారం పిల్లలకు ఆర్ట్ క్లాసులు నిర్వహిస్తుంటారు. ఆయన ఫేస్ బుక్ మాధ్యమంలో యాక్టివ్ గా ఉన్నారు కూడా. ఇక్కడ ఫీచర్ ఫొటోగా పొందుపరిచింది ఆయన చిత్రించిన వర్ణచిత్రమే.


చిత్రలేఖనంలో ఒక అనూహ్య లక్షణముంది. అది నన్నెప్పుడూ సమ్మోహపరుస్తూ ఉంటుంది. అదే ఒక కవిత పలకడం విషయానికొస్తే ఆ కావ్యవస్తువుకంటూ మన మనసు పొరల్లో అస్పష్ట ఆధారమంటూ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. శివజటాజూటం నుండి విడివడిన వెంటనే కావ్యగంగ తన ఒడ్డుల్ని ఒరుసుకుంటూ నిశ్చితగతిలో ముందుకు పరుగులిడుతుంది. కాని, చిత్రలేఖనంలో నేను అనుసరించే ప్రక్రియ అందుకు విరుద్ధం. అక్కడ నేను మొదట దర్శించేది ఒక రేఖని, ఆ తర్వాతనే ఆ రేఖ ఒక ఆకృతి మరింత స్పష్టమయ్యేకొద్దీ నేను చిత్రించబోతున్న చిత్రమేమిటో నాకు స్పష్టం కావడం మొదలవుతుంది. ఆకృతిని సృజించడం నాకెప్పుడూ అంతంలేని ఆశ్చర్యకారకమే.

రవీంద్రనాథ టాగోర్

జీవితమంతా కవిగా, దార్శనికుడిగా జీవించి జీవితపు మలిమలుపులో చిత్రకారుడిగా మారిన టాగోర్ తన చిత్రలేఖన కుతూహలాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో నిజాయితీగా చెప్పుకున్నమాటలివి. కాని ఇవి ఏ చిత్రకారుడికైనా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రతి చిత్రకారుడూ ఒక రూపాన్వేషకుడే. టాగోర్ గీతాంజలిలో ఓ చోట అన్నట్టుగా ప్రతి చిత్రకారుడూ ‘రూపజలధి’ లో దూకి అరూపరత్నాన్ని అన్వేషించే సాధకుడే.

ఈ పుస్తకంలో బి.ఎ.రెడ్డి చేస్తూ వస్తున్న జీవిత ప్రయాణం, ఆయన సాగిస్తూ వస్తున్న చిత్రలేఖన ప్రస్థానం ఆయన అన్వేషణకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా గత శతాబ్దంలో భారతీయ చిత్రకారుడు సాహిత్య, కళారంగాలకు చెందిన తక్కిన సాధకులవలె గొప్ప సంఘర్షణకు, ఆత్మాన్వేషణకు లోనయ్యాడు. తక్కిన సామాజిక, తాత్త్విక రంగాలను ప్రభావితం చేసినట్లే ఐరోపీయ చిత్రకళా పాశ్చాత్య చిత్రరీతులూ భారతీయ చిత్రకారుల్ని కూడా సంభ్రమానికి గురిచేసాయి.ఆ సంభ్రమంలో మొదట అతడు ప్రాచ్యచిత్రరీతిని అనుసరిస్తూ తాను ఆధునికుడిగా మారుతున్నానని భావించేవాడు. కాని చిత్రకళను ఆధునికం చేసిన పికాసో ఆదిమ ఆఫ్రికా చిత్రకారుణ్ణి తన గురువుగా భావించుకున్నాడని తెలియగానే భారతీయ చిత్రకారుడు కూడా తన మూలాలు, తన సంకృతి, తన దేశీ కళారీతిని అన్వేషించడం మొదలుపెట్టాడు. ఈ మధ్యలో సాహిత్యాన్ని ప్రభావితం చేసిన సామాజిక స్పృహ, సామ్యవాదం, ప్రజాపక్షపాతం చిత్రకళని కూడా వదిలిపెట్టలేదు. చిత్రకారుడు కూడా తన కళ్ళ ఎదుట కనిపిస్తున్న సామాజిక వాస్తవాన్ని, వ్యవస్థాగత వైరుధ్యాల్ని చిత్రించడం తన బాధ్యత అనుకున్నాడు. ఈ ఆటుపోట్లు, ఈ సంఘర్షణ, ఆ ఆత్మసంవాదమంతా రెడ్డిగారి చిత్రలేఖనయాత్ర పొడుగునా మనకి కనిపిస్తూ ఉంది.

ప్రతి కళాకారుడూ తన కళాసృజనని నలుగురూ చూసి హర్షిస్తే చాలనుకోడు. మరొకరెవ్వరూ దర్శించనిదేదో తాను దర్శించాలని, మరొకరెవ్వరూ వ్యక్తం చేయలేనిదేదో తాను మాత్రమే వ్యక్తీకరించాలని కోరుకుంటాడు. ఆ తపనను, సాధనను ప్రపంచం గుర్తించాలని కోరుకుంటాడు.

ఆ విధంగా చూసినప్పుడు బి.ఎ.రెడ్డి ఒక చిత్రకారునిగా, ఒక ఉపాధ్యాయునిగా సాధించిన అద్వితీయత విశిష్టమైంది. అందులో ఆయన చిత్రకారునిగా చూపిన అద్వితీయత ప్రశంసించదగ్గది. ఉపాధ్యాయునిగా చూపిన అద్వితీయత ప్రస్తుతించదగ్గది.

చిత్రకారునిగా ఆయన కవితాత్మకతకకూ, వాస్తవికతకూ మధ్య సమన్వయాన్ని సాధించడానికి ప్రయత్నిచారనిపిస్తుంది. వాస్తవికతలోని పారుష్యానికీ, కాఠిన్యానికీ, కవితాత్మకతలోని సౌకుమార్యానికీ, సంగీతానికీ మధ్య ఆయన సామరస్యంకోసం ప్రయత్నించాడు. అందుకనే ఆయన చిత్రించిన ఆకృతులు నిశ్చయ నిశ్చలాలు కావు. వాటిలో చలనముంది. ఆ చలనం కూడా సంగీతాత్మక చలనం. ఈ సమన్వయం ఆయన తనకై తాను సాధించుకున్నది. నాకు తెలిసి, ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ చిత్రకారుల్లో బహుశా ఒక కె.కె.హెబ్బర్, ఒక అంజలీ ఇలా మీనన్, ఒక బి.ఎ.రెడ్డి అంతే.

ఇక ఉపాధ్యాయుడిగా వృత్తిజీవితంలోనూ, విశ్రాంతజీవితంలోనూ కూడా ఆయన ఎందరో చిన్నారులకు మార్గగర్శిగా ఉన్నారు, ఉంటున్నారు. స్పర్థాత్మకమైన ప్రస్తుత ప్రపంచంలో స్పర్థమీద మాత్రమే ఆధారపడి వికసిస్తున్న ప్రస్తుత విద్యావ్యవస్థలో, తన పిల్లలు చిత్రకారులు కావాలని దీవించడానికి ఏ తండ్రీ సిద్ధంగా లేడు. ఆ పిల్లల కలలకు రంగులద్దడానికి ఏ గురువూ లేడు. ఇటువంటి నిష్ఠురవాస్తవం మధ్య బి.ఎ.రెడ్డి నిర్వస్తున్న ‘యంగ్ ఎన్వాయిస్ ఇంటర్నేషనల్’ ఒక ఒయాసిస్సులాగా కనిపిస్తుంది.

జీవితాన్ని గెలుపు-ఓటమి అనే రెండు రంగుల్లో మాత్రమే చూడటానికి అలవాటు పడిన అసంఖ్యాక పాఠశాలన్నిటి నడుమ రంగురంగుల జీవితాన్ని పిల్లల ముందుకు ఇంద్రచాపంలా వికసింపచేస్తున్న ‘యంగ్ ఎన్వాయిస్ ఇంటర్నేషనల్’ నాకెప్పుడూ ఒక చిలకలు వాలిన చెట్టులా కనిపిస్తుంది. ఈ ప్రపంచం ఇంకా ఎండిపోలేదనీ, శీతజలాన్ని స్రవిస్తున్న మహనీయ హృదయాలింకా కొన్ని మనమధ్యనే సంచరిస్తున్నాయనీ ఈ చిత్రశాల నాకు అభయాన్నిస్తుంటుంది.

నా బాల్యంలో తాడికొండ గురుకుల పాఠశాలలో నన్ను చేరదీసి తల్లిగా, తండ్రిగా,అన్నగా, చెల్లిగా నన్నాదరించిన ఆర్ట్ మాష్టారు వారణాసి రామ్మూర్తిగారు నాకీ క్షణాన్న గుర్తొస్తున్నారు. నా తల్లిదండ్రులిద్దరూ ఈ ప్రపంచాన్ని ఒదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నా చుట్టూ పరుచుకున్న శూన్యంలో మళ్ళీ తిరిగి రంగులూ, రేఖలూ, బొమ్మలూ నన్నాదరించేయి. వాటి రూపంలో ఆ ఆత్మీయుడైన బాల్యకాలమిత్రుడే తన చేతుల్తో నన్ను కాచి రక్షించేడు.

ప్రఖ్యాత చిత్రకారులు డా. బి. ఎ. రెడ్డిగారి కళా యానాన్ని వివరించే ‘గోల్డెన్ పేలట్’ కేవలం ఒక చిత్రకారుడి జీవితరేఖాచిత్రణ కాదు. ఈ ప్రపంచంలో పిల్లలు కేవలం ఇంజనీరులుగా, డాక్టరులుగా మారడానికి మాత్రమే పుట్టడం లేదనీ, వారు తమ కలల్నీ, కల్పనల్నీ బహుళవర్ణరాగరంజితం చేసుకునే చిత్రకారులు కూడా కాగలరనీ, కావొచ్చుననీ తల్లిదండ్రులు తెలుసుకోడానికి ఈ పుస్తకం ఒక అవకాశం. బంగారు సూర్యకాంతి మన ఇంటిగదుల్లోకి ప్రసరించడానికి తెరిచిన ఒక గవాక్షం.


Featured image: Sankranti, a painting in acrylic by B.A.Reddi, 2007

24-4-2007

2 Replies to “రూపాన్వేషి, మార్గదర్శి”

  1. ఇప్పటి కాలం పిల్లలు కొందరు భాగ్యవంతులు. నేర్చుకోడానికి అనేక అవకాశాలు తలుపులు తీసి ఉంచాయి. నా మేనల్లుడు సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి కూడా తన కళాభిరుచిని వదులుకోలేక JNTU లో BFA చేస్తున్నాడు. విప్రో లో వచ్చిన ఉద్యోగాన్ని, విదేశాల్లో PG చేసే అవకాశాన్ని వదిలేసుకున్నాడు. మరి ఈ చిత్ర లేఖన విద్య తనని ఏ దరికి చేరుస్తుందో చూడాలి….

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading