
ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ అన్నదానికన్నా కూడా, విజయసారథి జీడిగుంట కానుక చేసారు కాబట్టి, Days at the Morisaki Bookshop (2023) చదవడం ఒక బాధ్యత అనుకుని మరీ చదివాను. చిన్న పుస్తకం. గట్టిగా చదివితే ఒక పూటలో చదివేయవచ్చు.
కాని ఆ చిన్నపుస్తకం మొదటిపేజీల్లోనే మనకి మన మనసు చాలా తేలికపడ్డ ఫీలింగ్ కలుగుతుంది.
మనకి కూడా పాపులర్ సాహిత్యం ఉందికాని, ఆ పుస్తకాలు నేను చదవలేను. ఆ రచయితలకి జీవితం పట్ల ఒక దృక్పథమంటూ లేకపోవడమొక్కటే కారణం కాదు. అసలు ముందు వాళ్ళకి తమ జీవితానుభవాల పట్ల తమకే నిజాయితీ ఉండదు. వాళ్ళ రచనమొదలవుతూనే ఏదో ఒక మానసిక కృత్రిమత్వంలోకి మనల్ని లాగుతున్నారన్న భావన కలుగుతుంది. అందుకనే తెలుగులో సుప్రసిద్ధులైన పాపులర్ రచయితల పుస్తకాలేవీ ఒక్కటికూడా నేను పది పదిహేను పేజీలు మించి చదవలేకపోయాను. కాబట్టే వాళ్ళ రచనలకు రీడబిలిటీ ఉంటుందనే మాట కూడా నా వరకూ నమ్మదగ్గదిగా అనిపించదు. రీడబిలిటీ కూడా స్పష్టంగా ఒక సాపేక్ష పదమే.
అలాగని మన సీరియస్ రచయితల రచనలు తెరిచి చూస్తే మొదటిపేజీలనుంచే మనమేదో గాలిచొరబడని గదిలో అడుగుపెట్టినట్టు ఫీలవుతాం. అక్కడ మనకి ఊపిరాడదు. ఎవరో మన గుండెమీద అదిమిపెట్టి మనల్ని ఒక గోడవైపుకు నెట్టేస్తున్నట్టు ఉంటుంది. ఒకప్పుడు చదవగలిగేనోమోగానీ, ‘అసమర్థుని జీవయాత్ర’, ‘అల్పజీవి’, ‘చివరకు మిగిలేది’, ‘చదువు’ లాంటి నవలల్ని ఇప్పుడు ఏ మాత్రం చదవలేనని నాకు తెలుస్తూనే ఉంటుంది. ‘వేయి పడగలై’తే ఇప్పటిదాకా నేను పూర్తిగా చదవలేకపోయిన రచన అని చెప్పుకోడానికి నాకేమీ సంకోచం లేదు. ‘నారాయణరావు’, ‘రాజశేఖర చరిత్రము’ మాత్రమే కాదు, ఇటీవల తెలుగు సాహిత్యంలో చాలా ప్రశస్తికెక్కి ఇంటా బయటా పురస్కారాలు సంపాదించుకున్న నవలల్ని తెరవడానిక్కూడా నా మనసు సంసిద్ధంగా ఉండదు.
కానీ కొన్ని నవలలుంటాయి. ఒక ‘జమీల్యా’, ఒక ‘సంసార సుఖం’, ఒక ‘బీళ్ళు దున్నేరు’, ఒక ‘బనగర్ వాడి’, ఒక ‘కవి’, ఒక ‘పాతుమ్మా మేక’, ఒక ‘చిన్ననాటి చెలి’ లాంటివి, అనువాదాలే, కాని తెలుగులో వచ్చిన ప్రశస్తమైన నవలలు. వాటిని ఎప్పుడు తెరవడానికేనా నా మనసు ఉత్సాహపడుతూనే ఉంటుంది.
ఇక విస్పష్టమైన దృక్పథాన్ని చూపిస్తూనే పాఠకుణ్ణి చేయి పట్టుకుని వదలకుండా నడిపించగలిగే ‘మాలపల్లి’, ‘అగ్నిధార’, ‘ముక్తి’, ‘అమృత సంతానం’ ల గురించి ప్రత్యేకంగా ఏమని చెప్పేది! బైరాగి ‘పాప పోయింది’ కూడా.
ఇప్పుడు ఇదుగో ఈ Days at the Morisaki Bookshop కూడా అటువంటి నవల. ఇది జపనీస్ లో సీరియస్ ఫిక్షనో లేదా పాపులర్ నవలనో నాకు తెలియదుగాని, ఈ పుస్తకం నన్ను చదివించింది. అయితే మరోసారి చదవాలని అనిపించిందని చెప్పలేను. కాని ఇలాంటి నవల ఒకటి రాస్తే బాగుంటుంది కదా అనిపించింది. మురియెల్ స్పార్క్ రాసిన The Prime of Miss Jean Brodie (1961) చదివినప్పుడు కూడా నాకిలానే అనిపించింది. అంటే ఈ నవలలు నా మనసులో ఏదో ఒక ప్రాంతాన్ని నేరుగా చేరుకోగలిగేయన్నమాట.
Days at the Morisaki Bookshop లో ఇతివృత్తమూ, కథా ఏమంత చెప్పుకోదగ్గవి కావు. కాని ఆ సెట్టింగ్ ఉందే, అది నీ జీవితంలో నువ్వంతగా గుర్తుపెట్టుకోని ఎన్నో వీథుల్ని, ఎన్నో స్థలాల్ని, ఎన్నో ఉల్లాసభరిత క్షణాల్ని నీకు గుర్తు తెస్తుంది. నీ బాల్యం దాటి నవయవ్వనంలో అడుగుపెట్టినప్పుడు నువ్వు ఒక వ్యక్తిగా రూపొందే క్షణాల్లో నీకు తెలీకుండానే నీ మానసిక పార్శ్వాల్ని తీర్చిదిద్దిన గ్రంథాలయాలూ, కళాశాలలూ, మిత్రబృందాలూ గుర్తొస్తారు. ఒకప్పుడు నిన్నెంతో ఉత్తేజితుల్ని చేసి ఇప్పుడు నువ్వు మర్చిపోయిన ఎన్నో పుస్తకాలు నీకిప్పుడు గుర్తురావడం మొదలుపెడతాయి. ఉదాహరణకి ఇందాకా ‘అసమర్థుని జీవయాత్ర’ గురించి ప్రస్తావించేను కదా. ఇప్పుడు నన్ను ఆ పుస్తకం కదిలించలేకపోవచ్చు. కానీ నా ఇంటర్మీడియేటు రోజుల్లో ఒక రోజు గుంటూరు బస్ స్టాండ్లో ఆ పుస్తకం కొనుక్కుని సాగర్ బస్సెక్కి ఆ ప్రయాణం ముగిసేలోపు ఆ పుస్తకం పూర్తిచేసిన అనుభవం మర్చిపోలేనిది. ఆ పుస్తకానికి రాసిన ముందుమాట చదివే నేను ఆర్.ఎస్.సుదర్శనంగారికి శిష్యుడిగా మారిపోయేను. అలానే ఆ ఇంటర్మీడియేటు దినాల్లోనే కాకినాడ నుంచి గుంటూరు దాకా చేసిన ఒక పాసెంజరు రైలు ప్రయాణంలోనే నేను ‘శ్రీకాంత్’ నవల చదవడం పూర్తి చెయ్యడం నాకు గుర్తొస్తోంది. ఒక మధ్యాహ్నవేళ రాజమండ్రి నుంచి మా ఊరు వెళ్తో ఆ బస్సు ప్రయాణంలో ‘గోదాన్’ చదవడం ముగించినప్పటికి ఆ అడవి దారుల్లోంచి బస్సులోకి ప్రసరిస్తోన్న ఆ సాయంకాలలు నారింజ సూర్యకాంతిని నేనెప్పటికీ మరవలేను.
అవును కదా, నేను కూడా ఇలాంటి ఒక పుస్తకం రాసి ఉండవచ్చు కదా. ఎందరో రచయితలు వారి పుస్తకాలతో నా జీవితంలోకి ఎలా అడుగుపెట్టారో, ఆ రోజుల్లో చుట్టూ మసిలిన మనుషుల కన్నా ఆ రచయితలే నాకెందుకంత ముఖ్యమనిపించేవారో ఆ ఆత్మీయగాథని రాసుకోవచ్చు కదా. చిన్నప్పుడు మా వీథరుగు, రాజమండ్రిలో గోదావరి గట్టు, సమాచారం పత్రికాఫీసు, తాడికొండలో మా స్కూలు వెనక పత్తిచేలు, హైదరాబాదులో సివికృష్ణారావుగారు నెలనెలా వెన్నెల సమావేశాలు జరిపే అంజయ్య ఆడిటోరియం పక్కనుండే ఇంపాలా టీషాపు- ఇటువంటి అరుగులు, అడ్డాలు, వీథులు- ప్రతి ఒక్క సాహిత్యాభిమాని జీవితంలోనూ ఉంటాయి. కాని వాటిని సెలబ్రేట్ చేసుకోవచ్చని మనకెందుకు ఇప్పటిదాకా తట్టలేదు?
ఈ పుస్తకం చదివేక నాకు తేటతెల్లమయింది. మన చుట్టూ రెండు రకాల రచయితలున్నారు. ఒకరు, దృక్పథంలేని రచయితలు. మరొకరు, దృక్పథాల బరువుకింద నలిగిపోతున్న రచయితలు. కాని ఇప్పటి యువతరానికి కావలసింది, మూడో రకం రచయితలు. అంటే వారికొక దృక్పథం ఉండాలి. కాని తమ రచనల్లో ఆ బరువు పాఠకుడి నెత్తిన పడేయకూడదు. అందుకుబదులు, తమ రచనలోకి అడుగుపెట్టగానే, పాఠకుడి చుట్టూ కిటికీలు తెరిచినట్టుగా ఉండాలి. గాంధీగారు చెప్పారే, ‘నా ఇంటి కిటికీలు తెరిచిపెట్టుకుంటాను, కానీ ఆ గాలి నన్ను కిందపడేయకుండా చూసుకుంటాను’ అని. అదిగో, అలాంటి రచనలు కావాలిప్పుడు.
కాళిందీ చరణ పాణిగ్రాహి ‘మట్టిమనుషులు’ అటువంటి నవల, శరత్ ‘దేవదాసు’ అటువంటి నవల. తకళి శివశంకర పిళ్ళై ‘చెమ్మీన్’ అటువంటి నవల. విభూతి భూషణుడి ‘పథేర్ పాంచాలి’ అటువంటి నవల. కేశవరెడ్డి ‘సిటీ బ్యూటిఫుల్’ అటువంటి నవల. మధురాంతకం మహేంద్ర రాసిన ‘స్వర్ణ సీమకు స్వాగతం’ అటువంటి రచన.
సరే, మళ్ళా ఈ నవల విషయానికి వస్తే, ముందుగా ఒక ప్రశ్న.
రెండు తెలుగు రాష్ట్రాల జనాభా, జపాన్ జనాభా, దాదాపుగా ఒక్కటే. కాని జపాన్ కి బయట జపనీయ సాహిత్యానికి ఎంతమంది పాఠకులున్నారు? తెలుగు రాష్ట్రాల ఆవల ప్రవాసాంధ్రులు కాకుండా ఎంతమంది తెలుగు సాహిత్యం చదువుతున్నారు?
ఇరవై యేళ్ళ కిందట నాకు ఎం.ఆర్. బుక్ స్టాల్లో A Reader’s Guide to Japanese Literature (1988) అనే పుస్తకం దొరికింది. అందులో రచయిత జపనీస్ సాహిత్యానికి చెందిన ఇరవై ప్రాచీన గ్రంథాల్ని, ముప్ఫై ఆధునిక గ్రంథాల్ని పరిచయం చేసాడు. నేను ఆ పుస్తకం కొనుక్కుని కుతూహలంగా పేజీలు తెరిచి ఆ ఇండెక్సులో నేనప్పటికే ఎన్ని పుస్తకాలు చది ఉన్నానా అని చూస్తే, ప్రాచీన సాహిత్యంలో పదమూడుదాకా, ఆధునిక సాహిత్యంలో ఏడుదాకా లెక్కతేలాయి. అంటే యాభైకి, ఇరవై. నలభై శాతం మార్కులు. జపనీయ సాహిత్యంలో పరీక్ష పెడితే, నేనా రోజుకే పాసై పోయానని చెప్పవచ్చు.
ఇప్పుడు ఈ మొరిసకి బుక్ షాపులో ప్రధానంగా ఆధునిక సాహిత్యంలో స్పెషలైజ్ చేసిన షాపు అని చెప్తూ, రచయిత తన కథానాయిక తకకొ ద్వారా కఫూ నగయి, జునిచిరో తనిజకి, సోసెకి నత్సుమె, హరువొ సటో, ర్యూనుసుకె అకుతగవ, కోజి ఉనొ, నవొయ షిగ, ఓగయి మొరి, సకునొసుకె ఒద, తరుహొ ఇనగకి వంటి రచయితల్నీ, ఒసము దజయి రాసిన Schoolgirl, సైసెయి మురో Until the Death of the Girl, మొతొజిరొ కజియి Landscapes of the Heart, నవొయె కినొషిత Confessions of a Husband, సనెయిత్సు ముషనకోజి Friendship పుస్తకాల్నీ, దొప్పొ కునికిద ఆసిన Musashino అనే కథనీ పేర్కొన్నాడు.
ఈ రచయితల్లో అకుతగవ కథలు నేను చదవడమే కాదు, అతడు రాసిన సుప్రసిద్ధ కథ ‘రొషొమొన్’ ను అనువాదం చేసాను కూడా. సొసెకి నత్సుమె రాసిన ‘కొకొరొ’ ను రాజమండ్రి రోజుల్లోనే చదివాను. (దాన్నెప్పుడో యాభై ఏళ్ళ కిందటే దక్షిణ భారత పుస్తక సంస్థవారు తెలుగులోకి అనువదింపచేసారంటే, ఈ యాభై ఏళ్ళల్లో మనం ఎంత వెనకపడ్డామో తెలుస్తూనే ఉంది కదా!) ఈ రచయితల్లో అయిదుగురు A Readers’Guide లో కూడా ఉన్నారు. అంటే నేను ఆ పుస్తకం కొనుక్కున్నప్పుడే ఆధునిక జపనీయ సాహిత్యం కూడా చదవడం మొదలుపెట్టి ఉంటే, ఈ పాటికి కనీసం ఈ అయిదుగుర్నయినా చదివి ఉండేవాణ్ణి కదా అనిపించింది. కాని ఒకటి మాత్రం ఆశ్చర్యం కలిగించింది. జపనీయ సాహిత్యానికి మొదటి నోబెల్ సంపాదించిన యసునరి కవబత పేరు రచయిత ఈ నవలలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. కారణం ఏమై ఉంటుందో? కాని కవబత రాసిన Snow Country మాత్రం నన్ను నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. అలానే కెంజొబురొ ఓయె, హరుకి మురకమిల పేర్లు కూడా ప్రస్తావనకు రాకపోవడం గమనించదగ్గది.
విజయసారథి ఈ పుస్తకం నాకు కానుక చేస్తూ ‘మీరు ఇటువంటి ఒక పుస్తకం ఒకటి తెలుగులోకి తేగలరని నాకనిపించింది. అందుకనే ఈ పుస్తకం మీరు చదవాలనుకున్నాను’ అని అన్నారు. అవును, పట్టుమని రెండు వందల పేజీలు కూడా లేని ఈ పుస్తకం చదువుతున్నప్పుడే పుస్తక ప్రేమికుల గురించిన మరొక రెండు వందల పేజీల నవల ఒకటి నా మనసంతా అల్లుకుంటూనే ఉంది!
Featured image: Jimbocho Book Town, Tokyo
23-12-2024


అద్భుతః.. నా మిషన్ అకంప్లిష్ అయ్యింది . ఆ పుస్తకానికి మీ నుంచి నేనాశించిన సమీక్ష రావడం.. ఎంత సంతోషంగా వుందో.. ఈ సమీక్ష కచ్చితంగా పుస్తకప్రేమికుల చేత ఈ పుస్తకం , దీని సీక్వెల్ చదివించి తీరుతుంది . అంతే కాదు జపనీస్ రచయితల కొన్ని పుస్తకాల గురించి తెలుసుకునేలా కూడా చేస్తుంది. యసునరి కవబత పేరు సీక్వెల్ లో ప్రస్తావించారనుకుంటా.. సరిగ్గా గుర్తు లేదు. ఈ పుస్తకం చదివినప్పుడు నేను ఆ యూజ్డ్ బుక్ షాప్ లున్న వీధులన్నీ గూగుల్ మ్యాప్స్ లోనూ, గూగుల్ ఎర్త్ లోనూ నావిగేట్ చేస్తూ భలే థ్రిల్ ఫీలయ్యాను. మొత్తానికి మా పుస్తక ప్రేమికుల కోసం మీరు మీ మనసులో ఒక రెండు వందల పేజీల పుస్తకానికి అంకురార్పణ చెయ్యడం గొప్ప శుభ సూచకం.
ధన్యవాదాలు సార్
గాంధీగారు చెప్పారే, ‘నా ఇంటి కిటికీలు తెరిచిపెట్టుకుంటాను, కానీ ఆ గాలి నన్ను కిందపడేయకుండా చూసుకుంటాను’
ఎంత బాగుంది!
ఈ మాట నా జీవితంలో ఈ రోజుని సుసంపన్నం చేసిన మాట!
కృతజ్ఞతలు, సర్.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
మేము ఆశిస్తున్నది అదేగద.రష్యన్ అనువాదాలలో కూడా ఆ దేశ రచయితల ప్రస్తావనలు చదివాను.
అవును సార్!
ఎన్ని ప్రయాణాలు, ఎన్ని మజీల్లీలు, ఎన్ని మూటల పుస్తకాలు, ఎన్ని జ్ఞాపకాలు. మనస్సు నిండా మధుర ఊహల పరిమళం. నెమరు వేసుకున్న మొహాలు, మోహం, రసవత్తర సంఘటనల కొలువుగా సమాహారం. 👌🏿👌🏿💐💐💐🙏🏿🙏🏿🙏🏿
ధన్యవాదాలు సార్
జపనీయ సాహిత్య పరిచయం పేరుతో మంచి పుస్తకాల పలవరింత బాగుంది . ఎప్పుడో జనప్రియ సాహిత్యం మీద కత్తిగట్టిన పలమనేరు బాలాజీ గారి వ్యాసానికి కౌంటర్ రాసి పత్రికకు పంపలేదు నా పాత కాయితాల పొత్తులో అలాగే నలుగుతున్న సంగతి గుర్తొచ్చింది. ముఖ్యంగా జీడిగుంట విజయసారథి గారు ఆశించినట్లు ఒక నవల రాయాలని కోరుకునే వారిలో నేనొకణ్ణి. తొలి దశలో నవలా ప్రియత్వం ఇప్పుడు సాహిత్య ప్రేమికుడిగా చేసింది. నిజమే. విశ్వనాథ వేయిపడగలు కన్నా సజీవపాత్రలతో యధార్థ కథను నవల గా రాసిన మ్రోయుతుమ్మెద నవల చాలా బాగనిపించింది. అది చదివి మూడు దశాబ్దాలకు పైనే అయినా కథాంశం మనసులో పాత ఫోటోల ఆల్బంలా ఉంది. ఈనాటి యువతరానికి ఎలాంటి కథలు నచ్చుతాయో. చదివింపజేస్తాయో ఆలోచించ వలసిన విషయం
ధన్యవాదాలు సార్
మీ అనువాద రచన కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
అనువాదం కాదు నేను ప్లాన్ చేస్తున్నది స్వీయరచననే.
మీరు తిరుప్పావై మొత్తాన్ని పాటల రూపంలో తెనిగిస్తే చూడాలని ఆశ sir
ఎలాగూ కృష్ణశాస్త్రి గారి కీర్తనలు దొరకడం లేదు…,🙏🙏🙏
అందుకు కృష్ణశాస్త్రి లాంటి కవినై ఉండాలి!
మీ అనుభూతి మరింత పవిత్రమైనదని నా భావన sir
ధన్యవాదాలు మిత్రమా!
గాంధీ గారి కొటేషన్ ఆలోచింప చేసింది.ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు సార్
బాగా రాశారు
ధన్యవాదాలు సార్