
ఇవాళ నేను మళ్ళా బుక్ ఫెస్టివల్ కి వెళ్ళాను. అక్కడ ఉన్న వేలాది పుస్తకాల మీద నా దృష్టి లేదు. ఆ బుక్ ఫెస్టివల్ వేదిక మీద ఒక వక్త ధారాళంగా ఉపన్యసిస్తున్నాడు. కానీ ఒక్క వాక్యం కూడా నా మనసులో చొరబడడం లేదు. నేను శ్రీనివాస గౌడ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అతణ్ణుంచి ఫోన్ వచ్చింది. తాను ఎంట్రన్స్ గేటు దగ్గర ఉన్నానన్నాడు. పరుగుపరుగున వెళ్ళాను. గేటు దగ్గర నాకోసం వేచి ఉన్న ఆ కవి నన్ను చూడగానే తన బాగులోంచి ఆరుపుస్తకాల పాకెట్టు తీసి చేతుల్లో పెట్టాడు. చీనా కవుల్లో అగ్రేసరుడని చెప్పదగ్గ దు-పు కవిత్వానికి ఆయన చేసిన సరికొత్త అనువాదం. ఆ పుస్తకం కోసమే నేను ఎదురుచూస్తున్నది. ఎంత ఆశ్చర్యం! నా జీవితకాలంలోనే దు-పు కవిత్వానికి తెలుగులో ఒక పూర్తిస్థాయి అనువాదాన్ని చూస్తానని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆ పుస్తకం చేతుల్లోకి తీసుకోగానే ప్రాచీన చాంగాన్, లొయాంగ్ నగరాల మీంచి ప్లమ్ పూల పరిమళం నన్ను ముంచెత్తింది. శ్రీనివాస గౌడ్ ఆ పుస్తకాన్ని గాలి నాసరరెడ్డికి కానుక చేయడం నాకు మరింత నచ్చింది. ఆ పుస్తకానికి నేనొక బ్లర్బ్ రాశాను. ఇక్కడ పంచుకుంటున్నాను చూడండి.
మూడువేల ఏళ్ళ చీనాకవిత్వచరిత్రలో దు-ఫు (712-770) అగ్రేసరుడు. యుగాలు గడిచేకొద్దీ కవిగా అతడి యశస్సు నానాటికీ బలపడుతూనే ఉంది. చివరికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో కూడా కన్‌ఫ్యూసియస్ అయినా తన ప్రాధాన్యాన్ని పోగొట్టుకున్నాడేమోగాని దు-ఫు ప్రకాస్తి ఏ మాత్రం సన్నగిల్లలేదు. అత్యున్నతకవిగా మాత్రమే కాదు, పరిపూర్ణమానవుడిగా కూడా అతడు నీరాజనాలు అందుకుంటూనే ఉన్నాడు.
అతడి జీవితాన్నీ, కవిత్వాన్నీ ఆమూలాగ్రం పరిశీలించిన విలియం హుంగ్ ‘దు-ఫు ఒక విధేయుడైన కొడుకు, అనురాగపూరితుడైన తండ్రి, ఉదారుడైన సోదరుడు, నమ్మకస్తుడైన భర్త, విశ్వసనీయుడైన స్నేహితుడు, బాధ్యతకలిగిన అధికారి, దేశభక్తుడైన పౌరుడు’ అని అభివర్ణిస్తూ ‘అతడు సజ్జనుడు మాత్రమే కాదు, జ్ఞాని’ అని కూడా అన్నాడు.
అటువంటి మహోన్నతుడైన ఒక పొరుగుదేశపు కవి గురించి తెలుగువాళ్ళకి తెలిసింది చాలా చాలా స్వల్పం. ఇన్నాళ్ళకు ఆ లోటు తీరుస్తూ పి.శ్రీనివాస్ గౌడ్ ఈ పుస్తకం వెలువరించడం తెలుగు కవిత్వానువాదచరిత్రలో ఒక ముఖ్యసంఘటన అని చెప్పవచ్చు.

శ్రీనివాస్‌గౌడ్ కవి, అనువాదకుడు. అన్నిటికన్నా ముఖ్యంగా చీనా, జపాన్ కవుల భావోద్వేగాలకీ, సౌకుమార్యాలకీ, సంతోషవిచారాలకీ దగ్గరగా ఉండే హృదయం కలిగినవాడు. దు-ఫు పేరు మీద లభ్యమవుతున్న దాదాపు పధ్నాలుగు వందల కవితల్లోంచి శ్రీనివాస్ గౌడ్ ఎంపిక చేసి, అనువదించిన ఈ నలభై కవితలూ దు-ఫు జీవించిన కాలాన్నీ, సుఖదుఃఖాల్నీ తెలుగుపాఠకులకు కొంతేనా పరిచయం చెయ్యగలవు. ఈ చిన్నపుస్తకంతో దు-ఫు తెలుగుహృదయాల్లోకి చొరబడగలడని నమ్మవచ్చు.
(ఎన్నెల పిట్ట ప్రచురణలు. వెల. రూ.120/- పుస్తకం కావలసిన వారు 78995 46568 ని సంప్రదించవచ్చు.)
21-12-2024


Greatful to u Sir..Awaiting for this
ఇద్దరు అద్భుతమే.
దు ఫు ని తెలుగు వారికి పరిచయం చేస్తున్న
గౌడ్ అన్నకు మంగడీలు!?