వేసవి ముగిసింది

ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కవి నన్ను పట్టుకుంటూ ఉంటాడు. అతడు నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. నాకు కొత్త చూపునిస్తాడు. నాలోపలకీ నన్ను చూసుకునేలాగా చేస్తాడు. మరీ ముఖ్యంగా, నా చుట్టూ ఉండే సాహిత్యవాతావరణం నాలో కల్పించే అనిశ్చితినుంచీ, సంశయాత్మకతనుంచీ తనే నా చెయ్యి పట్టుకుని దాటిస్తాడు.

అటువంటి ఒక కొత్త కవి, అతడెప్పటివాడైనప్పటికీ, నాకు పరిచయమైన కాలం కొన్నేళ్ళు పోయేక వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు నా చుట్టూ పరుచుకున్న పరిమళాల్తోపాటే అతడు కూడా నా స్మృతుల్లో భాగమైపోతాడు. మచాడో అటువంటి కవి. అతడి కవిత ఒకటి పరిచయం చేస్తూ చెస్లామీవోష్ ‘అతడు స్పానిష్ కవుల్లో మరీ చీనా తరహా కవి’ అన్న ఒక్క వాక్యం పట్టుకుని నేనతణ్ణి వెతుక్కుంటూ పోయేను. నా అన్వేషణ వృథా కాలేదు. మచాడో రాసిన The Border of a Dream నన్నెంత ఆవహించిందింటే, నా నుంచి ఆ మత్తు మంత్రాల నరసింహశర్మగారికి కూడా ప్రసరించింది. ఈ మధ్య ఆయన తన కవితల్ని ‘సెలయేరు’ (2024) అనే పేరిట సంపుటిగా వెలువరించారు. మచాడోని తనకు పరిచయం చేసినందుకుగాను ఆ కవిత్వసంపుటి నాకు అంకితమిస్తున్నట్లుగా రాసారాయన ఆ పుస్తకంలో!

రేనర్ మేరియా రిల్క అటువంటి కవి. యూజీనియో మొంటాలె అటువంటి కవి. ఇషికవ తకుబొకు అటువంటి కవి. ఒకప్పుడు నా నవయవ్వన దినాల్లో కమలాదాస్ నాలో కలిగించిన కల్లోలాన్ని నేనిప్పటికీ మర్చిపోలేను. నా జీవితం నడివయసు దాటేవేళల్లో నాకు పరిచయమైన సాల్వటార్ క్వాసిమొడొ, లాంగ్ స్టన్ హ్యూస్, జార్జ్ ట్రాకల్ నన్నట్లానే లోబరచుకున్నారు. ఇక హేరీ మార్టిన్ సన్ గురించి చెప్పనక్కరలేదు.

ఇది యూరపియన్ కవులకీ, ఆధునిక కవులకీ మాత్రమే వర్తించే మాట అనుకుంటే పొరపాటే. దిలీప్ చిత్రే పరిచయం చేసిన తుకారాం, రామానుజన్ పరిచయం చేసిన బసవన్న, మా మాష్టారు అనువాదం చేసిన లల్ల వచనాలు, మూడేళ్ళ కిందట నాకు మొదటిసారిగా పూర్తిగా తెలుగు అనువాదంలో లభ్యమైన నమ్మాళ్వారు కూడా నన్నట్లా వదిలిపెట్టనివాళ్ళే. కొందరు కవులు ముప్ఫై ఏళ్ళుగా, నలభయ్యేళ్ళుగా నాతోనే జీవిస్తున్నారు. ప్రతి రాత్రీ నేను నిద్రలోకి జారుకునేముందు నా మంచం పక్కన కూచుని తమ కవితల్ని గుర్తు చేస్తూనే ఉంటారు. ఎమిలీ డికిన్ సన్, దు-ఫు, కబీరు, కృష్ణశాస్త్రి- వీళ్ళని స్మరించని రోజు ఒక్కటేనా ఉందా నా జీవితంలో?

ఇప్పుడు అలా నన్ను పట్టుకున్న కవి జోసెఫ్ స్టాన్లీ కునిజ్ (1905-2006). అమెరికన్ కవి. నిండు నూరేళ్లకు అదనంగా మరొక్క ఏడాది జీవించిన కునిజ్ జీవితం మొత్తం కవిత్వం చదువుకుంటూ, తోటపనిచేసుకుంటూ గడిపేడు. అపారమైన పఠనానుభవం, విస్తృత అధ్యయనం, సుదీర్ఘ జీవితంలో అతడు రాసిన కవితలు కొన్ని మాత్రమే. ఒక్కో కవిత పూర్తికావడానికి అతడికి ఏళ్ళు పట్టేది. అంటే కనీసం ఇరవయ్యేళ్ళు. నాకు తెలిసి తెలుగులో అజంతా గురించి ఈ మాట చెప్తారుగాని, కవిత్వ సాంద్రతలో, బిగింపులో, గాఢార్థస్ఫురణలో, పొరలుపొరలుగా అనుభూతిని పూతచుట్ట చుట్టడంలో అజంతాకీ, అతడికీ పోలికలేనేలేదు.

అతడు మొదట్లో కవిత్వం ఛందోబద్ధంగా రాసేడు. తర్వాత తర్వాత ఆ కవితల నిర్మాణాన్ని కొంత సడలించి పాఠకుడు సంచరించడానికి కొంత జాగా వదిలిపెట్టేడుగానీ, అప్పటికీ, అతడి కవిత్వం ఒక విమర్శకుడు అన్నట్టుగా, clear and cryptic గానే ఉంటుంది. ఆ కవితల్లోకి ఒకపట్టాన చొరబడలేం. అలాగని అవి మనల్ని దాటివెళ్ళిపోవు కూడా. మనం అప్పుడప్పుడు కలుసుకునే కొందరు మిత్రులుంటారు. వాళ్ళని చూడగానే మనకొక స్నేహస్పర్శ లభిస్తుంది, కాని వారి అంతరంగం ఒక పట్టాన అంతుబట్టదు. కునిజ్ కవిత్వం అటువంటిది. ఆ కవిత్వంతో నేనిప్పుడే నా స్నేహం మొదలుపెట్టానుకాబట్టి, దాని గురించి ఇదీ అని చెప్పుకోడానికి మరికొంత కాలం ఎలానూ పడుతుంది.

ఆయన కవిత్వం కన్నా ఆయన ఇంటర్వ్యూలు మనల్ని మరింత ప్రకాశంగా పలకరిస్తాయి. అక్కడ మనం కూర్చోవచ్చు. ఒక కృష్ణమూర్తి లాంటి తత్త్వవేత్త మాట్లాడుతుంటే వినడమెలా ఉంటుందో కవిత్వం మీద కునిజ్ మాట్లాడుతుంటే వినడం కూడా అలా ఉంటుంది. అతడి మాటలు వింటున్నప్పుడు మనకి కవిత్వం గురించి, కవిత్వ ప్రయాణం గురించీ, ప్రయోజనం గురించీ ఎంత తెలుస్తుందో, జీవితం గురించీ, జీవితం నుంచి మనం ఎంత పొందగలమో, పొందినదాన్ని ఎలా గుర్తుపట్టగలమో కూడా తెలుస్తుంది. కృష్ణమూర్తి సంభాషణల్లానే కునిజ్ సంభాషణలు కూడా commentaries on living.

ఉదాహరణకి 1982 లో అయ్యప్ప పణిక్కర్ చేసిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకి జవాబిస్తూ ఆయనంటాడు కదా:

I like a poem to end not with the slamming of a door, but with the opening of a window, so that we are moving out into space.

అని

ఈ వాక్యం దగ్గర నేను చాలా సేపు ఆగిపోయేను. ఒక కవిత ముగించినప్పుడు అది ధడాలున తలుపు మూసినట్టుగా కాక, సున్నితంగా ఒక కిటికీ తెరిచినట్టుగా ఉండాలట! ఇది కవిత్వానికి మాత్రమే వర్తించే వాక్యమా? మన ప్రతి ఒక్క కలయికకీ, ఆ కలయిక ముగించి మనం సెలవు తీసుకునే ప్రతి ఒక్క క్షణానికీ కూడా వర్తించే వాక్యమే కదా.

ఆరేడేళ్ల కిందట ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మేమొక ట్రయినింగులో పాల్గొన్నప్పుడు మాకు పాఠాలు చెప్పిన ఒక ప్రొఫెసరు పదే పదే residue అనే మాట వాడేవాడు. మనమెవరినైనా కలుసుకుని, కొంతసేపు మాట్లాడుకుని వచ్చేసాక మనం అక్కడ ఎటువంటి residue వదిలిపెడుతున్నామో చూసుకోవాలని చెప్పాడాయన. కొందరు మనల్ని కలిసివెళ్ళినతరువాత కూడా ఎంతోకాలం పాటు చెదిరిపోని ఒక పరిమళాన్ని మనదగ్గర వదిలిపెట్టి వెళతారు. అలానే చాలామంది మనం గుర్తుచేసుకోడానికి ఇష్టపడని అయిష్టాన్ని కూడా వదిలిపెడతారు.

ఒక కవితకి ఎత్తుగడ సరే, నిర్వహణ సరే, ముగింపు కూడా అంతే ముఖ్యం. సాధారణంగా కవులకి ఎక్కడ ఆగాలో తెలియదు, ఎక్కడ ఆపాలో తెలియదు. ఈ అశక్తత కవులది మాత్రమే కాదని చాలాకాలం తర్వాత తెలిసింది. మరీ ముఖ్యంగా నీటిరంగుల చిత్రకారుల విషయంలో. చాలాసార్లు వాళ్ళు గియ్యాలనుకున్న బొమ్మ పూర్తయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఇంకా పూర్తి కాలేదనుకుని ఆ బొమ్మ మీద మళ్ళా మళ్ళా పూతలు పూస్తూనే ఉంటారు. మన కలయికలకి కూడా ఈ రహస్యం తెలియాలి. నువ్వొకర్ని కలుస్తావు. కొంతసేపు మాట్లాడుకుంటారు. కాని ఒక క్షణం వస్తుంది. ఇంక పంచుకోడానికేమీ ఉండదు. మనం అక్కణ్ణుంచి సెలవు తీసుకుని వచ్చేస్తే, అప్పటిదాకా మనం గడిపిన సంతోషాన్ని నెమరువేసుకునే అవకాశం మిగుల్చుకుంటాం, వాళ్ళూ, మనమూ. కానీ ఆ క్షణాలు కూడా ఆవిరైపోయేదాకా, మనకు తెలీకుండానే ఆ కలయిక మొహం మొత్తేదాకా మనమక్కడే తచ్చాడుతుంటాం.

కాబట్టి ఒక కవితని ముగించే మెలకువ తెలియడమంటే, అది ఒక నిర్మాణవ్యూహం మాత్రమే కాదు. జీవనరచనారహస్యం కూడా.

కునిజ్ ఇంటర్వ్యూల్లో చాలా చాలా విషయాలు ప్రస్తావించేడు. చాలా సంగతులు మనం మాట్లాడుకోదగ్గవి. మళ్ళీ మళ్ళీ మననం చేసుకోదగ్గవి. వాటి గురించి మళ్ళా మళ్ళా ఎలానూ మీతో పంచుకోబోతున్నాను. ఇప్పటికైతే, ఆయన కవితల్లో సుప్రసిద్ధమైన ఒక కవిత End of Summer (1953) ని ఇక్కడ తెలుగులో అందిస్తున్నాను. ‘నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో…’ అని మహాకవి అన్నట్లుగా, కునిజ్ రాసే ప్రతి కవితలోనూ సకలేంద్రియాలూ పాలుపంచుకుంటాయి. కాబట్టే ఆ కవిత, ఒకసారి చదివేక, మనల్ని వదిలిపెట్టదు.

ఈ కవిత తనకి కళ్ళమ్మట నీళ్ళు తెప్పించిందని ఒక భావుకుడు రాసుకున్నాడు. Poems that make Grown Men Cry (2014) అనే సంకలనంలో Nicholson Baker అనే రచయిత ఈ కవిత గురించి రాస్తూ ‘మనల్ని ఒక కవిత ఏడిపించిందని ఎప్పుడు చెప్పగలం? ఒక కవిత మనల్ని ఏడిపించిందని మనం చెప్తున్నప్పుడు నిజంగా మనం చెప్తున్నదేమిటి? దాని అర్థమేమిటంటే, ఆ కవితకీ మనకీ మధ్య మన అంతరంగంలో ఒక ఏకీభావం కుదరడం మనల్ని నిశ్చేష్టుల్ని చేస్తున్నదని చెప్పడం’ అని అన్నాడు.

అవును, ఇలా మనల్ని ఏడిపించగల కవితలూ, వాక్యాలూ మనకి కూడా ఎదురయ్యే ఉంటాయి. టాగోర్ గురించి రాసిన కవితలో ‘అక్కడితో బాల్యం అంతమైంది’ అని ఇస్మాయిల్ గారు రాసిన ఒక వాక్యం నాకు తెలిసిన మహావిషాదభరితవాక్యాల్లో ఒకటి. ఈ ‘వేసవి ముగిసింది’ కూడా అటువంటి వాక్యమే. అయితే కునిజ్ ఈ కవితరాసినప్పటి కనెక్టికట్ వేసవికీ, మన ఉష్ణమండల దేశాల వేసవికీ పోలికలేని మాట నిజమే. కాని చిన్నప్పుడు మన వేసవి సెలవులు ముగిసినప్పటి మన అనుభూతికీ, ఈ అనుభూతికీ మాత్రం ప్రాయికంగా ఏమీ తేడా లేదు.


వేసవి ముగిసింది

గాల్లో సన్నగా మొదలైన ఆందోళన
కాంతిలో కనవస్తున్న తొట్రుపాటు
ధుమధుమలాడుతూనే ఈ సంవత్సరం
ఈ రాత్రికి పక్కకి తిరగనున్నది.

నిరాసక్తంగా నిలబడి ఉన్నాను పొలంలో
చుట్టూ గడ్డిదుబ్బులు, గులకరాళ్ళు.
నా ఎముకల్లోంచి వినబడే సంగీతం
ఆశ్చర్యం! ఆ కీటకం నోట ముద్దుముద్దుగా.

వేసవి నీలంలోకి  కురుస్తున్న నీలం.
మేఘరహిత గగనంపైన ఒక డేగ ప్రత్యక్షం
ధాన్యపుగాదె పైకప్పు తళతళ్లాడుతున్నది
నా జీవితంలో ఈ భాగం ముగిసిపోయింది.

కిర్రుమంటూ తెరుచుకుంటున్న ఉత్తరద్వారపు
ఇనపతలుపులు : విస్తరించడం మొదలింక-
పక్షులూ, పారుటాకులూ, హిమపాతాలూ
అది చాలదన్నట్టు క్రూరంగా వీస్తున్న గాలి.


End of Summer

An agitation of the air,
A perturbation of the light
Admonished me the unloved year
Would turn on its hinge that night.

I stood in the disenchanted field
Amid the stubble and the stones,
Amazed, while a small worm lisped to me
The song of my marrow-bones.

Blue poured into summer blue,
A hawk broke from his cloudless tower,
The roof of the silo blazed, and I knew
That part of my life was over.

Already the iron door of the north
Clangs open: birds, leaves, snows
Order their populations forth,
And a cruel wind blows.


Featured image: Watercolor painting with ai on imagine.art

Image courtesy: https://stanleykunitz.yolasite.com/the-art-of-poetry-no-29—an-interview.php

9-12-2024

18 Replies to “వేసవి ముగిసింది”

  1. శుభోదయం సర్..మీరు రాసిన వాక్యాలలో రోజును ప్రారంభించడం, కవిత్వాన్ని పరామర్శించడం రెండూ బాగుంటాయి.

  2. కవుల అంతరంగ తరంగాలలో ఒలలాడాలంటే మీలాంటి ఒక నావ, నావికుడు కావాల్సిందే… మీకు నా సహస్రకోటి ధన్యవాదములు …🙏🙏🙏🙏🙏

  3. Beautiful and beautiful!
    ఎంత బాగున్నాయో మీ మాటలు, కవిత సరే సరి.

    Poems that make grown up men cry లో ఉందా ఇది? చదివాను కానీ ఇలా రిజిస్టర్ కాలేదు, మళ్ళీ చదవాలి. ఇట్లా మీ మాటల వెలుగులో.

    సర్, I am your fan! ❤️❤️😊

  4. తలుపు మూసినట్టు కాకుండా కిటికీ తెరిచినట్టు వుండాలి
    ఎంత గొప్ప మాట
    కవితలకు కలయికలకు మాత్రమేనా
    జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది కదా అనిపించింది సార్
    Thanks for sharing 🙏

    1. అవును విజయ్ కుమార్! ఆయన ఇంటర్వ్యూల్లో మాట్లాడే మాటలన్నీ అలానే ఉంటాయి.

      మీ స్పందనకు ధన్యవాదాలు.

  5. నిత్యనూతన సాహిత్య పాఠం బోధించే బోద్ధలు మీరు. కునిజ్ కవిత్వ పరిచయం , అతని ముఖాముఖి విశేషాలు సరళసాంద్రం .
    “మనం అప్పుడప్పుడు కలుసుకునే కొందరు మిత్రులుంటారు. వాళ్ళని చూడగానే మనకొక స్నేహస్పర్శ లభిస్తుంది, కాని వారి అంతరంగం ఒక పట్టాన అంతుబట్టదు.” ఒక జీవిత సత్యం.

    నిత్యం ఉదయిస్తున్నా
    మిత్రుని పొడ విసుగెత్తదు
    నవచైతన్యపు కాంతుల
    శక్తికి కాలం చెల్లదు

    మూలనున్న కవులెందరొ
    మరల జన్మమెత్తుచుంద్రు
    మీ నిరతన కవి చింతన
    వలన వారు బ్రదుకుచుంద్రు

    కవితాశ్వాసనకెల్లలు
    ఉండబోవు ఉర్విపైన
    తలపులలోనే పరిధులు
    గీతలేవి? పుడమి పైన

    పూలతోట ఎటనున్నా
    పరిమళాలు ప్రసరించును
    సత్కవి ఎక్కడనున్నా
    సరసమతిని వెలిగించును

  6. తలుపు మూసినట్టు కాక కిటికీ తెరిచినట్టు వుండాలి.
    గొప్ప మాట. గొప్ప కవులు. మీది గొప్ప వాఖ్యానం.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading