కుంచించుకుపోయిన సమాధులు

ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నది రెండు రోజులకిందట వెళ్ళగలిగాను కుతుబ్ షాహీ సమాధులు చూడటానికి. ఎన్నాళ్ళుగానో అని కదా అన్నాను. కాదు, ఎన్నేళ్ళుగానో అనాలి. ఎప్పుడో నలభయ్యేళ్ళకిందట హైదరాబాదు వచ్చినప్పుడు ఊరంతా తిప్పి చూపిస్తూ మా అన్నయ్య కుతుబ్ షాహీ సమాధుల సముదాయాన్ని కూడా చూపించాడు.

కానీ తీరా మొన్న వెళ్ళేటప్పటికి మా అమృత కారు స్లో చేసి, ‘ఇదుగో వచ్చేసాం’ అని అంటే ‘ఎక్కడా’ అని చూసాను. సమాధులు కనబడటం లేదు. మొత్తం మార్కెట్ కనిపిస్తోంది. ఏళ్ళ కిందట ఊరిపొలిమేరల్లో ఎకరాలమేరకు పరుచుకున్న విశాల మైదానంలో అక్కడొకటీ, అక్కడొకటీ కనిపించిన ఆ కట్టడాలకి బదులు జనసమ్మర్దం, విద్యుద్దీపాలు, వెయ్యి హారన్ మోతలు- బహుశా నాకు తెలిసి ఒక నగరం నెక్రొపోలిస్ లోకి ఇలా చొచ్చుకుపోయింది ఇక్కడే అనుకుంటాను.

అయిదారేళ్ళ కిందట కొల్లేరు చూద్దామని వెళ్ళినప్పుడు నాకెలాంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పుడూ అలానే అనిపించింది. సముద్రంలాంటి ఒక సరసుని చిన్న చెరువుస్థాయికి కుదించిన మనుషులు సమాధి ప్రాంగణాన్ని కుదించకుండా ఉంటారా!

ఇప్పుడు గాని కుతుబ్ షాహీలు ఒకసారి హైదరాబాదు వచ్చి మా జాగా ఏది ఎక్కడుంది అనడిగితే స్థానిక తహసీల్ దారు బహుశా ఆన్ లైన్ లో ఫిర్యాదు నమోదు చేసుకోమని చెప్తాడేమో! తాను కట్టబోతున్న నగరంలో మనుషులు చేపల్లాగా కలకల్లాడాలని కులీ కుతుబ్ షా కోరుకున్నాడని ఎక్కడో చదివాను. కానీ ఈ చేపలు చెరువునే మింగేసేట్టుగా వర్ధిల్లగలవని ఆయన ఊహించి ఉండడు.

కారు ఒక పక్కన పార్కు చేసుకుని సన్నని ఇరుకు తోవగుండా ఆ ప్రాంగణంలోకి వెళ్తుంటే నాకు నిజంగానే ఒక స్మశానంలోకి అడుగుపెడుతున్నట్టు అనిపించింది. కానీ ఆ ఊహ కూడా తప్పే. నగరంలో తాము నిర్మించిన మాడర్న్ ఎలక్ట్రికల్ క్రెమటోరియా గురించి జి.ఎచ్.ఎం.సి కమిషనరు ఒకాయన నాకెంతో గర్వంగా చెప్పాడు. దాన్నొక ఇన్నొవేషన్ గా చెప్పుకోవచ్చన్నాడు. అంతేకాదు, పక్కరాష్ట్రాలనుంచి కొందరు ఐ ఏ ఎస్ అధికారులు వస్తే వారిని తీసుకుపోయి చూపించాడు కూడా.

కాని ఇప్పుడు టాంబ్స్ ని మనం గ్రేవ్ యార్డుగా భావించం. అవి మన సంస్కృతిలో, వారసత్వంలో భాగం. ఆ నిర్మాణ శైలి, ఆ గుమ్మటాలు, ఆ బావులు, ఆ ఉద్యానాలు, ఆ ప్రాంగణం, ఆ ప్రార్థనాలయాలు- అదొక విశిష్టమైన సాంస్కృతిక ప్రాంగణం. కానీ ఇండో-సారసనిక్ వాస్తు అన్నిటికన్నా ముఖ్యంగా కోరుకునేది విశాలమైన జాగాని. సువిశాలమైన ప్రాంగణాల్ని. ఆ జాగానే కుదించిపోయాక, ఆ లోపల గుమ్మటాలు కూడా కుదించుకుపోయినట్టే అనిపిస్తుంది నా వరకూ.

మహ్మదీయ చక్రవర్తులు సమాధిప్రాంగణాల్ని ఫారోల పిరమిడ్లలాగా giant verticals గా ఊహించలేదు. వాటిని horizontal గానే దర్శించారు. నలువైపులా ఒక ఉద్యానవనం లేకుండా మధ్యలో ఒక సమాధి మాత్రమే ఉంటే, చూపరుల సంగతి సరే, ముందు ఆ మరణించినవాళ్ళకే ఊపిరాడదని వాళ్ళ ఊహ. మనిషి జీవించి ఉండగా ఏ కల్మషం మధ్యనైనా నడవక తప్పని రోజులు ఉంటాయి, యుద్ధభూమిలోనో, రోగశాలలోనో గడపవలసిన రోజులూ ఉంటాయి. కాని మరణించేకైనా గులాబీల పరిమళం మధ్యనే కాలం గడపాలన్న ఆ కోరికలో ఎంత అందం దాగి ఉంది! ఎంత అమరత్వకాంక్ష దాగి ఉంది!

కాని ఇప్పుడు ఆ ఏడుగురూ కుతుబ్ షాహీలకీ, వారి పరివారానికీ అదే కరువైంది. పొరపాటున కూడా అక్కడ ఏ పూల పరిమళమూ వీయడంలేదు. గంభీరమైన నిశ్శబ్దంలో గడపవలసిన వారి మరణానంతరజీవితం పొద్దస్తమానం ఆటోల, బస్సుల ఆగని రొద మధ్యనే గడపవలసి వస్తోంది.

‘కొద్దిగా వాళ్ళని హారన్ మెల్లగా మోగించమని చెప్పరూ!’ అని ఎవరో ఒక కుతుబ్ షా నా చెవిలో మెల్లగా చెప్తున్నట్టే ఉంది నాకు అక్కడ నడుస్తున్నంతసేపూ.

ఆక్రమించవలసినంత జాగా ఆక్రమించేసాక, నగరం ఇప్పుడు ఆ మిగిలిన గుమ్మటాల్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఉంది. తాము ఆ గుమ్మటాల్నీ, ఆ లట్టిసుల్నీ, ఆ బావుల్నీ, ఆ మెట్లనీ, ఆ అరుగుల్నీ ఎలా పునరుద్ధరిస్తున్నారో ఎక్కడికక్కడ వివరంగా బోర్డులు పెట్టారు. కొన్ని పునరుద్ధరణ ప్రయత్నాలకి అవార్డులు వచ్చినట్టుగా కూడా అక్కడ రాసి ఉంది.

ఇండో పర్షియన్ వాస్తు తాజ్ మహల్లో అత్యున్నత వికాసం సాధించిందని మనకి తెలుసు. కాని సమాధి వాస్తుకి మొదటి ఉదాహరణ ఢిల్లీలో హుమయూన్ టాంబ్. తాజ్ మహల్ కి అదే నమూనా. హుమయూన్ సమాధి అనగానే ఇప్పుడు నా కళ్ళముందు కదిలేది విశాలమైన పచ్చికబయళ్ళూ, గులాబీతోటలూను. కాని ఇక్కడ ఈ ప్రాంగణంలో సమాధికీ, సమాధికీ మధ్య ఏదేనా జాగా మిగిలి ఉంటే అక్కడ చెట్లు నాటేసారు. బహుశా పూలతోట పెంచడంకన్నా పండ్లతోట పెంచడంలో మెయింటెన్స్ ఖర్చు ఎక్కువ ఉండదని నిర్వాహకులు భావించి ఉండవచ్చు. కానీ కుతుబ్ షాహీలు తమ జీవితకాలాలపాటు మొగల్ చక్రవర్తుల అభిరుచితో పోటీ పడ్డారనీ, వారికన్నా మెరుగైన సౌందర్యదృక్పథాన్ని సాధన చేసారనీ గుర్తుపెట్టుకుంటే కుంచించుకుపోయిన ఈ సమాధులు మనకి జాలికలిగించక మానవు.

అయినా కూడా వాటిలో ఇంకా ఒక ఠీవి, ఒక గాంభీర్యం పూర్తిగా చెరిగిపోలేదు. సమాధులన్నిటిలోనూ తలమానికం అని చెప్పదగ్గ ఆరవ కుతుబ్ షా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాహ్ సమాధిని చూస్తే మనకి ఆ చక్రవర్తిని నిండు దర్బారులో చూస్తున్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఆ గుమ్మటానికి మరమ్మత్తులు చేస్తున్నారు. చుట్టూ స్కాఫోల్డింగ్ కట్టిపెట్టారు. ఒకవైపు గుడ్డతో కప్పేసారు. అయినా కూడా సాయంసంధ్య కాంతి ఆ గుమ్మటమంతా పరుచుకుని ఉండగా, వందలాది పావురాలు దానిపై వాలి ఉండగా, నాలుగువందల ఏళ్ళ కిందటి ఆ కట్టడం శోభలో కాంతి ఇంకా మిగిలే ఉందనిపిస్తున్నది. రంగు వెలిసి, జరీ ఊడిపోతున్నప్పటికీ వన్నె తగ్గని పట్టు వస్త్రంలాగా ఉంది ఆ సమాధి సౌధం. నాలుగు శతాబ్దాల కిందట దాన్ని చూసిన ఒక ఫ్రెంచి యాత్రీకుడు ఆ నిర్మాణాన్ని ప్రశంసల్తో ముంచెత్తాడని అక్కడ రాసి ఉంది. ఆ యాత్రీకుడు ఇప్పుడు వచ్చినా కూడా నిరాశ చెందడని చెప్పగలను.

మేం వెళ్ళేటప్పటికే చీకటి పడిపోతూ ఉంది. కనీసం గంట ముందేనా వచ్చి ఉండవలసింది అనుకున్నాం. అసలు చూడాలనుకున్నది కులీ కుతుబ్ షా సమాధిని. కానీ అప్పటికే ఆ నిర్మాణం మీద చీకటి ముసుగు కప్పుతూ ఉంది. నాకు అమీర్ ఖుస్రో సుప్రసిద్ధ ద్విపద గుర్తొచ్చింది.

గోరీ సోవై సేజ్ పర్
ఔర్ ముఖ్ పర్ డారే కేస్
చల్ ఖుస్రూ, ఘర్ ఆప్నే
రైన్ భయీ చహు దేస్.

(ఆ సుందరి శయ్యపై నిదురిస్తున్నది. ఆమె వదనాన్ని కేశరాశి కప్పివేసింది. నడు, ఖుస్రూ నీ ఇంటికి, నలుదిశలా రాత్రి కమ్మేసింది.)

20-11-2024

8 Replies to “కుంచించుకుపోయిన సమాధులు”

  1. అప్పట్లో అంటే సుమారు యాభై యేళ్ళ క్రితం నేనూ చూశాను ఆ
    ‘ విశాల ప్రశాంత సౌధాలు’ !
    సుల్తానులవి కాబట్టి అవైనా మిగిలున్నయ్.వేరేవాళ్ళవైతే ఈసరికి ‘ మనుజులే దనుజులై మట్టిపాల్జేసి’ వుండేవారు!

  2. “అయిదారేళ్ళ కిందట కొల్లేరు చూద్దామని వెళ్ళినప్పుడు నాకెలాంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పుడూ అలానే అనిపించింది.”

    – కొల్లేటికి వెళ్ళినప్పుడు నా అనుభవమూ ఇలాంటిదే. దారిపొడుగుతా రొయ్యల చెరువులుగా మారిన పంటపొలాలు, కొల్లేట్లో ఎకరాలు,ఎకరాలుగా పరచుకున్న గుర్రపుడెక్క కలుపు… ఏడుపొచ్చింది.

  3. ఔదార్యం కుంచించుకొనిపోతోంది. మరి.‌ఎక్స్పైరీ తేదీలు మరీ తగ్గించేస్తున్నారు. అవసరమా అనవసరమా ..ఇదే ప్రామాణికం. గతించిన చరిత్ర ఎవరికి అవసరం మనం కొత్త చరిత్ర వ్రాసేసుకొంటున్నాం కదా .
    అదే విషాద వైచిత్రి.

  4. శయ్యపైన సుందరి పడుకున్నది(నిద్రిస్తున్నది)
    మోమును కప్పెను కేశములు
    కదలుము నీ ఇంటికి ఖుస్రూ
    వరలెను చీకటులెల్లెడలా

    చెట్లగుబుర్లలో అందమైన సమాధులన్నీ నిద్రిస్తున్నట్లుగా పూరించే చక్కని కవితతో కుతుబ్ షాహీల సమాధుల సందర్శనానుభవాన్ని చక్కగా
    రాసారు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading