
మొన్న సాయంకాలం మా ఇంటికి జీడిగుంట విజయసారధిగారు వచ్చారు. ఆయన నాకు పరిచయమై ఇప్పటికి రెండేళ్ళు కావొస్తున్నది. కాబట్టీ ఈ మా సమావేశం ద్వితీయ వార్షికోత్సవం అని చెప్పవచ్చు.
రెండేళ్ళ కిందట మొదటిసారి ఆయన్నుంచి ఫోన్. అప్పుడు జయతి ‘మనం కలుసుకున్న సమయాలు ‘పుస్తకం ఆమె కుటీరంలో ఆవిష్కరణ పెట్టుకున్నారు. విజయసారధి తాను అమెరికానుంచి వస్తున్నాననీ, ఆ ఊరు వెళ్ళాలనీ, వాళ్ళని కలుసుకోవాలనీ ఉందనీ, అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పగలరా అనీ అడిగేరు. నాకు ఆశ్చర్యమనిపించింది. సంతోషంగా కూడా అనిపించింది. జయతిలాంటి వాళ్ళని వెతుక్కుంటూ ప్రపంచం నలుమూలలనుంచీ మనుషులు రావడంలో ఆశ్చర్యంలేదనిపించింది.
ఆ రోజుల్లోనే కాకినాడలో క్రియ పిల్లలపండగ కూడా జరుగుతోంది. ఆ బృందం కూడా ఆ పుస్తకావిష్కరణకి వెళ్ళాలని అనుకుంటున్నారని విన్నాను. కాబట్టి జగన్నాథరావుగారిని సంప్రదించమని విజయసారధిగారికి చెప్పాను. తీరా నేను కాకినాడ వెళ్ళేటప్పటికి ఆయన అప్పటికే ఆ పిల్లలపండగలో తాను కూడా ఒక భాగ్గంగా కనబడ్డారు.
జయతి పుస్తకం ఆవిష్కరించినప్పుడే నా పుస్తకం ‘నీ శిల్పివి నువ్వే’ కూడా ఆవిష్కరించేం. మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ మీద నేను రాసుకున్న మెడిటేషన్స్ అవి. పుస్తకం ఎలానూ ఇ-బుక్ నా బ్లాగులో పెడుతున్నాను కాబట్టి ఆవిష్కరణ కోసమని ఆరు కాపీలే ప్రింటు చేయించాను. ఆ ఆరుకాపీల్లో ఒకటేనా తనకి ఇవ్వాలని విజయసారధిగారు అక్కడక్కడే తచ్చాడుతున్నారు. చిన్నప్పుడు పిల్లలు చాక్లెట్లకోసం తచ్చాడినట్టు. పుస్తకాల మీద ఆ రోజు ఆయన చూపించిన ఆ ఇష్టం నన్ను ముగ్ధుణ్ణి చేసిందని నేను ఆయనకు చెప్పలేదు. ఒక పుస్తకమైతే జయతిని అడిగి ఆయన చేతుల్లో పెట్టాను.
ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మళ్ళా హైదరాబాదులో కలుసుకున్నాంగానీ, ఈ సారి కలయిక మరింత విశేషంగా అనిపించింది, కనీసం నా వరకూ.
వాల్ట్ విట్మన్ రాసిన Song of Myself ని నేను ‘ఆత్మోత్సవ గీతం’ పేరిట తెలుగులోకి అనువదించి, దాన్ని ఒక పుస్తక రూపంలో రెండుమూడు నెలలకిందట నా బ్లాగులో పెట్టాను. ఆ గీతం మొత్తం చదివామని గానీ, లేదా కొంతేనా చదివామని గానీ నాతో ఎవరూ చెప్పలేదు. నా యవ్వనదినాల్లో నాకెవరేనా ఆ గీతాన్నిలా తెలుగులోకి అనువదించారని తెలిస్తే, వాళ్ళెక్కడున్నా, నడుచుకునేనా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి.
కాని నిన్న విజయసారధిగారు మా ఇంట్లో అడుగుపెడుతూనే అన్నిటికన్నా ముందు Walt Whitman Poetry Collection అనే పుస్తకం నా చేతుల్లో పెట్టారు. CSA Publishing అనేవాళ్ళు మొన్న అక్టోబరు నాలుగో తేదీన విడుదల చేసిన పుస్తకం అది!
‘మీ ఆత్మోత్సవ గీతం చదివాక నాకు వాల్ట్ విట్మన్ మీద గొప్ప ఇష్టం పుట్టుకొచ్చింది. ఆయన పుస్తకాలు మొత్తం చదివేసాను. అంతేనా! ఆయన వల్లా, మీరు రాసిన పరిచయ వ్యాసం వల్లా మరో పదిపదిహేను పుస్తకాలేనా కొత్తగా పరిచయం అయ్యాయి. అవి కూడా చదివేసాను’ అన్నారాయన.
ఆశ్చర్యపోకుండా ఎలా ఉంటాను?
అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం కాబట్టి అమెరికాలో ఉంటున్న మిత్రులు అక్కడి సాహిత్యం గురించీ, మూజియా ల గురించీ, గ్రంథాలయాల గురించీ, గ్యాలరీల గురించి, అరణ్యాల గురించీ, నదుల గురించీ, సంగీత సమారోహాల గురించీ రాస్తే బాగుణ్ణని ఎదురుచూస్తాను. ఇక్కణ్ణుంచి ఎవరేనా కవులు, రచయితలు అమెరికా వెళ్తే ఒక వివేకానందుడిలాగా వారు గొప్ప వెలుగుని ఆ దేశవాసులకి పరిచయం చేస్తారనే ఒక అమాయకమైన ఊహకల నన్నెప్పటికీ వీడదు.
ఆ ఎదురు చూపులు అలా నడుస్తుండగా, అమెరికాలో ఉంటున్న మిత్రులొకరు, నేనొక అమెరికన్ మహాకవి మీద రాసిన పుస్తకం చదివాననీ, ఆ పుస్తకం వల్ల తనకు మరికొన్ని పుస్తకాలు పరిచయమయ్యాయనీ చెప్తూ నా కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకం తేగానే, నాకు అమెరికామీదా, ఇండియా మీదా కూడా మళ్ళా గొప్ప ఆశ చిగురించింది.
‘గత ఆరునెలలుగా నేను ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా పక్కన పెట్టి పుస్తకాలు చదువుతూనే ఉన్నాను. ఎన్ని పుస్తకాలు. మీరీ పుస్తకం చూసారా?’
అని ఆయన Used and Rare, Travels in the Book World (1997) అనే పుస్తకం ఒకటి చూపించారు.

‘ఇది మీకోసమే తెచ్చాను. Lawrence and Nancy Goldstone అనే దంపతులు రాసిన ఈ పుస్తకం లాంటి పుస్తకం తెలుగులో కూడా వస్తే బాగుంటుందనిపించింది. అది రాస్తే మీలాంటి వాళ్ళే రాయాలి. అందుకే ఇదుగో మీకు కానుకగా ఈ పుస్తకం’ అని ఆ పుస్తకం కూడా నా చేతుల్లో పెట్టారు.
భాగ్యమంటే ఇది! ఒక పుస్తకం రాస్తే రెండు పుస్తకాలు కానుకగా రావడం. కాని అక్కడితో ఆగలేదు.
‘మీరు Days at the Morisaki Bookshop చదివారా?’
ఆ ప్రశ్నకు నా దగ్గర జవాబులేదు. ఆయన చూసిన, చదివిన పుస్తక ప్రపంచం ముందు నాది చాలా చిన్న ప్రపంచమని నిమిషాల్లోనే అర్థమైపోయింది. కానీ ఆ పుస్తకం గురించి ఆయన చెప్తున్న మాటలు వింటున్నాక కూడా ఆ పుస్తకం చదవాలని అనుకోకుండా ఎలా ఉండను? ఆయన ఎదటనే ఆమెజాన్ యాప్ తెరిచి వెంటనే బుక్ చేసాను. ఇదుగో, ఈ మాటలు రాస్తుండేటప్పటికి ఆ పుస్తకం కూడా నా టేబుల్ మీదకు వచ్చి చేరింది.

మూడు పుస్తకాలు!
‘పుస్తకాల గురించి మాట్లాడుకోడానికీ, ఒకరికొకరం పరిచయం చేసుకోడానికీ ఏదన్నా ఏర్పాటు ఉంటే బాగుంటుంది కదా! వారం వారం జూమ్ మీటింగులో మరొకటో’అని అంటున్నారు విజయసారధిగారు.
నలభయ్యేళ్ళ కిందట ఒక సాయంకాలం గౌతమీ గ్రంథాలయంలో కూచుని ముగ్గురు మిత్రులం ఈ మాటలే మాట్లాడుకున్నాం. అప్పుడు నెత్తురు వేడిగా ఉండే రోజులు కాబట్టి వెంటనే ‘రాజమండ్రి రీడర్స్ క్లబ్’ ప్రారంభించేసాం కూడా!
కాని ఇప్పుడు విజయసారథి మాటలు విన్నప్పుడు నేను నిట్టూర్చడం మినహా మరేమీ చెయ్యలేకపోయాను. 1984 తో పోలిస్తే 2024 లో ప్రపంచం ఎంత సుసంపన్నంగా ఉంది. ఒక్క బటన్ నొక్కితే కొన్ని వేల పుస్తకాలు ప్రత్యక్షమయ్యే కాలం ఇది. కాని 1984 నుంచి 2024 కి వచ్చేటప్పటికి నాకు తెలీకుండానే నా చుట్టూ ఎంత నెగటివ్ ఎనర్జీ గూడుకట్టుకుంది!
కాని ఎంతపాటి పొగమంచునేనా ఒక్క సూర్యకిరణం క్షణంలో మటుమాయం చెయ్యగలిగినట్టు, ఒక్క పాఠకుడు, నిజమైన పాఠకుడు, నువ్వొక పుస్తకం డిజిటల్ కాపీ షేర్ చేస్తే అది చదివి వందపుస్తకాల గురించి నీతో మాట్లాడటానికి నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేడంటే అది చాలదా, పూర్వమహాకవులంతా మళ్ళా మేల్కోడానికి!
19-11-2024


అవును సర్ ఆ అనుభూతి చెప్పడానికి ఏ పదాలు సరిపోవు.
మీరు పొందిన అనుభూతిని అందరి కి పంచడం
Great sir
ధన్య వాదాలు
మణి వడ్లమాని
ధన్యవాదాలు మేడం
అద్భుతం. ❤️❤️ విజయ్ గారికి మా తరఫున కూడా థాంక్స్.
ఎందుకంటే ఆయన మూడు మీ చేతుల్లో పెడితే, మీరు నాకు మూడు నెలలకు సరిపడా ఆ ప్రపంచపు విశేషాలు చెప్తారు కనుక. ❤️
నిన్నంతా మీరు ఎక్కడా కనపడలేదని వెదుక్కున్నాను. ఇదన్నమాటా కొత్త ప్రేమ!🙃
ధన్యవాదాలు మానసా!
విజయసారథిగారికి కృతజ్ఞతలు మా చరఫునా. ఎంత మంచి బహుమతి తీసుకెళ్ళారు మీకు.
ధన్యవాదాలు మేడం
సమస్యా ఏమిటంటే మాలాంటి మీ అభిమానులు చాలా మందిమి రాయిని భాస్కరులం
మీ వంటి వారి స్ఫూర్తినే నాతో రాయిస్తున్నది.
Bhadrudu Garu,
You Have Made My Day By Penning Such A Wonderful. Note For Me. I Have Absolutely No Words To Express My Affection And Gratitude Towards Your Very Kind Gesture. ఆ పుస్తకాలు మీకు ఇవ్వడంలో నా స్వార్థం కూడా ఉంది. ముఖ్యంగా Used and Rare పుస్తకం లాంటి పుస్తకం మీ ద్వారా తెలుగులో కూడా తప్పకుండా రావాలనే ఆశ తో పాటు వస్తుందనే గట్టి నమ్మకం. ఆ పుస్తకం మీద మీ విశ్లేషణాత్మక సమీక్ష అయినా సరే నాలాంటి పాఠకులకి గొప్ప బహుమతి. మరో విషయం. నిన్న నే తెలుసుకున్నా ఆ దంపతులు ఈ పుస్తకానికి కొన సాగింపుగా మరో రెండు పుస్తకాలు కూడా ప్రచురించారని.. కుదిరితే అవి కూడా చదివి త్వరలోనే మీకు అంద చేస్తాను.
ధన్యవాదాలు, I Just Can’t Thank You Enough.
విజయసారథి జీడిగుంట,
నవంబర్ 20, 2024
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
దీప్ సె దీప్ జగాతె చలో
ప్రేమ్ కి గంగా బహాతే చలో పాట గుర్తుకు వచ్చింది
పుస్తకరశ్మి ప్రభావం అంతటిది. విజయసారథి గారు 2017 హ్సూస్టన్లో సభాముఖంగా పరిచయమయ్యారు.నా పుస్తకావిష్కరణ నోచుకున్న సభానంతరం వారి ప్రసంగం విన్నాను. వారు గొప్ప పాఠకులని అప్పుడే అనిపించింది. తరువాత ఎఫ్బీ లో వారితో పరిచయం కొనసాగుతుంది. మీ పరిచయాలు కొత్తదారులకు మార్గదర్శకాలు
ధన్యవాదాలు సార్!
వారిలాగే కొన్నిరోజులు ఎఫ్ బి కి దూరమై,పుస్తకాలు చదవాలని!
మీరు దూరంగా ఉంటే ఆ పుస్తకాల గురించి ఎవరు చెబుతారు?
No words… I am spellbound after reading about two great book lovers.
Thank you Sir!
అన్నమయ్య ‘పిండంతే నిప్పటి’ అంటూ ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన ఏడుకొండలవాడిని అంత మాత్రమే అందుకోగలుగుతారని చెప్పాడు. అవే ఇరవై నాలుగు గంటలు ఎవరికైనా. మీలాంటి వారు, మీకు పుస్తకం బహూకరించి వెళ్లిన మిత్రులవంటి వారు, ఆ ఇరవై నాలుగు గంటల్లోనే ఎంతో సాహిత్యాన్ని సొంతం చేసుకుంటూ ఎందరికో పంచుతూ ఉంటారు. గొప్ప విషయం.
ధన్యవాదాలు సోదరీ మీ మంచిమాటలకు 🎉
నమస్తే.
మీరు ఇంత బాగా ప్రపంచ సాహిత్యాన్ని మాకు పరిచయం చేస్తూ వుంటే.. అందుకు కృతజ్ఞతగా మీ కేమి ఇవ్వగలమా అని ఎప్పుడూ అనిపిస్తుంది నా బోటి వారికి కూడా!
విజయసారథి గారి వంటి ఉత్తమ పాఠకులు మిమ్మల్ని కలవడం.. పుస్తకాల ప్రస్తావన బాగున్నాయి. త్వరలో నే మంచి సాహిత్యపు విందు మీ బ్లాగ్ ద్వారా లభిస్తుంది అన్నమాట. అభినందనలండీ.
ధన్యవాదాలు మేడం!
సాహితీ సృజనకు ఇది గొప్ప ఫలశృతి..గొప్ప ఆశ కలిగింది..’ఒక వాక్యం అలా వదిలేస్తా ‘ అనే కవితా వస్తువు ఇదే..ఎవరో ఒకరు ఒక వాక్యాన్నో..ఒక పుస్తకాన్నో పట్టుకొని ఎదురవుతారు. మీకు ఎదురయ్యారు..ఆహాఁ..
ధన్యవాదాలు శ్రీనివాస్! ఆ కవితని ఇక్కడ షేర్ చేయగలరు.
ఒక వాక్యం
—————- — పి.శ్రీనివాస్ గౌడ్
ఒక వాక్యం రాసి అలా వదిలేస్తా –
గాలిలోనో..
కాలంనదిలోనో..
మట్టిలో పాతిన గింజలానో..
ఒక వాక్యం రాసి అలా వదిలేస్తా –
కాశీలో వదిలేసే ఇష్టవస్తువులానో..
గూడులోంచి తోసేసిన పక్షిపిల్లలానో..
ఒక వాక్యం రాసి అలా వదిలేస్తా –
ఈ క్షణమో..రేపో..ఎల్లుండుకో..ఏడాదికో..
పదేళ్లకో..వందేళ్లకో..వెయ్యేళ్లకో..
గాలిలో తేలివచ్చే పదాలపరిమళం పూసుకునేవాడు..
నదిలో కొట్టుకొచ్చే ప్రతీకలను వలేసి నిలేసేవాడు..
మట్టి కింద పద్యగింజలో ఊహమొలకను తట్టి లేపేవాడు…
ఒకడుంటాడు – నాలాగ –
ఎప్పటి పురాతన వాక్యాన్నో పట్టుకొని
కళ్లకద్దుకొని..లోన దీపం వెలిగించుకొని
బతుకుదారిని పులకింతలో పొదువుకొని –
ఒకడుంటాడు – ఒక్కడయినా వుంటాడు.
ఒక వాక్యం రాసి అలా వదిలేస్తా –
రక్తమాంసాల మజ్జతో రంగరించి
ఒక వాక్యం రాసి అలా వదిలేస్తా –
ఒకడుంటాడని –
ఒక వాక్యంతో మొదలయి
మానవాళి మహాకావ్యం కల కంటాడని –
ఒక వాక్యం రాసి అలా వదిలేస్తా –
ఆదివారం ఆంధ్రజ్యోతి 15-01-2023
చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు.
చాలా చాలా బాగుంది మీ కవిత శ్రీనివాస్ గారు.
మీ రచనలు చదివేకొద్దీ అక్షరాల మీద, మనుషుల మీద అపారమైన ప్రేమ కలుగుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇంతలా ప్రేమ కలగడానికి ఎంత పెట్టి పుట్టాలో కదా సర్! నమస్సులు.🌷🙏
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!