
మొన్న సన్నిధానం నరసింహ శర్మగారు మా ఇంటికొచ్చారు. రేపు డిసెంబరు ఏడో తేదీతర్వాత ఆయన ఎనభై ఒకటవ ఏట ప్రవేశిస్తారు. కాని నలభయ్యేళ్ళ కిందట నేను రాజమండ్రిలో మొదటిసారి చూసినప్పుడు ఎలా కనిపించేరో ఆయన ఇప్పుడూ అలానే ఉన్నారు. అదే ఉత్సాహం. అదే ధారణ. ఏదన్నా చెప్పబోతే ఎన్నో జ్ఞాపకాలు ఆయన గళందగ్గర గుమికూడిపోయి అన్నీ ఒక్కుమ్మడిగా బయటపడాలన్న కలకలమూ అప్పటిలానే ఉంది.
తెలుగు సాహిత్యం గురించీ, గ్రంథాలయాల గురించీ, సాహిత్య పరిశోధన గురించీ తెలిసినవాళ్ళకి సన్నిధానం నరసింహశర్మగారిని కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. రాజమండ్రితో ఏ మాత్రం పరిచయం ఉన్నవాళ్ళకేనా ఆ ఊర్ని తలుచుకోగానే గుర్తొచ్చేవాళ్లల్లో శర్మగారు కూడా తప్పనిసరిగా ఉంటారు. ‘నేనెప్పుడేనా కొన్నాళ్ళు రాజమహేంద్రవరం నుంచి బయటికి వెళ్ళి మళ్ళా తిరిగి రాగానే నరసింహశర్మని చూస్తే రాజమహేంద్రవరం మొత్తం కళ్ళకి కనిపిస్తుంది’ అని రాసారు మా మాష్టారు శరభయ్యగారు ఆయన గురించి.
కావటానికి వృత్తిరీత్యా ఆయన లైబ్రేరియన్. దాదాపు నలభై అయిదేళ్ళకు పైగా గౌతమీ గ్రంథాలయానికి ఏదో ఒక రూపంలో సేవలు అందిస్తూ వచ్చారు. కాని ఆయన్ని కేవలం లైబ్రేరియన్ గా మాత్రమే చూడలేం. ఇంతకీ లైబ్రరీ అంటే ఏమిటి? గ్రంథాలయం. అక్కడ పుస్తకాలుంటాయి. కానీ పుస్తకాలకీ, చదువరికీ మధ్య ఒక అనుసంధాన కర్త ఉండాలి కదా. నువ్వు ఆ లైబ్రరీలో అడుగుపెట్టినప్పుడు ఎక్కడ ఏ పుస్తకం ఉందో, అక్కడికి గతంలో ఎవరు వచ్చారో, ఏ పుస్తకాలు తీసుకునేవారో, ఆ మేడమీద బాబాయమ్మ మెమోరియల్ హాల్లో ఎటువంటి సాహిత్య సమావేశాలు జరిగేయో, ఎవరెవరు అక్కడ మాట్లాడే అవకాశం రావడం తమకి గౌరవంగా భావించేరో అవనీ చెప్పే ఒక మనిషి అక్కడ ఉన్నాడనుకోండి, అప్పుడు ఆ మనిషీ, ఆ గ్రంథాలయం ఒక్కలాంటివే అనిపిస్తుంది కదా. ఇంకా చెప్పాలంటే, ఆ గ్రంథాలయం కన్నా ఆ మనిషినే మనకి ఇంచుక ఎక్కువ కావలసినవవడనిపిస్తాడు కదా! శర్మగారు అటువంటి ఆత్మీయుడు.
తెలుగు నేలమీద రాజమండ్రికి ప్రత్యేక స్థానం ఉంది. తూర్పు చాళుక్యులు మొదట్లో పిఠాపురం రాజధానిగా పరిపాలన చేసినతర్వాత, వేంగిని రాజధానిగా మార్చుకున్నారు. ఆ తర్వాత రాజరాజనరేంద్రుడి కాలంలో రాజధాని రాజమహేంద్రవరానికి మారింది. పల్లవ, చోళ, చాళుక్య, రాష్ట్రకూట రాజ్యాల మధ్య ఎడతెగని దండయాత్రలమధ్య నలిగిపోతున్న తూర్పు చాళుక్యులు తమ అస్తిత్వాన్ని నిర్ధారించుకుని బలపరుచుకునే క్రమంలో తెలుగు భాషని నెత్తికెత్తుకున్నారు. తూర్పు చాళుక్యులు మొదట్లో జైనం పట్ల అభిమానం చూపించారు. ఆ తర్వాత వైదిక ధర్మాన్ని అనుసరించడం మొదలుపెట్టాక, జైన, సంస్కృత మార్గ సాహిత్యాలకు ప్రతిగా దేశిసాహిత్యాన్ని ప్రోత్సహించే క్రమంలో తెలుగులో శాసనాలు వేయించడం మొదలుపెట్టారు. ఆ శాసనశైలి నమూనాగా నన్నయ దానికి అక్షరరమ్యతనీ, సూక్తినిధినీ, ప్రసన్నకథా కలితార్థయుక్తినీ జోడించి తెలుగుని కావ్యభాషగా మార్చేసాడు. తెలుగు భాష మేలిమి సాహిత్యభాషగా మారిన ఆ తొలిఘట్టం నుంచి ఆధునిక యుగంలో తెలుగు వచనం వికసించినప్పుడు దాన్ని సాంఘిక చైతన్య సాధనంగా మార్చుకున్న వీరేశలింగం దాకా రాజమండ్రి చరిత్ర నడిచింది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో కూడా తెలుగు భాషను పరిపుష్టం చేసిన కవులు, రచయితలు- చిలకమర్తి, తిరుపతివెంకటకవులు, చలం, కృష్ణశాస్త్రి, గిడుగు, శ్రీపాద, కవికొండల వంటివారెందరికో రాజమండ్రి ఒక వేదికగా ఉంటూ వచ్చింది. అటువంటి వెయ్యేళ్ళ చరిత్ర గురించి ఎవరి ముఖతానేనా వినాలనుకుంటే, ఆ ఉజ్వల ఘట్టాల్ని ఒళ్ళు పులకించేలా తలుచుకోవాలనుకుంటే, మన సమకాలికుల్లో నరసింహశర్మగారిని మించినవారు మరొకరు లేరు.
రాజమండ్రి చరిత్రలో ఆయన కూడా ఒక భాగం. దాంతోపాటు పూర్వమహాకవుల, రచయితల జీవితాల గురించీ, సాహిత్య కృషి గురించీ ఎన్నో విశేషాలు ఆయన తన పూర్వతరం వాళ్ళు మాట్లాడుకోగా ఎంతో ఆసక్తిగా విన్నాడు. ఇంకా చెప్పాలంటే శుశ్రూష చేసాడు. ఎవరేనా ఇద్దరు పెద్దలు సాహిత్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటే, అక్కడే ఒక గోడకి అతుక్కుపోయి కూచుని వినేవాడు. సగం అర్థమయ్యీ, అర్థం కాకపోయినా, ఆ విన్నదంతా తన హృదయమంజూషలో భద్రపరుచుకునేవాడు.
అందుకని మొన్న ఆయన కలిసినప్పుడు ఆ ముచ్చట్లే ఆయనతో చెప్పించాలనుకున్నాను. మొదటి ప్రశ్న వెయ్యడం వరకే నేను చేసింది. ఆ తర్వాత ఒకదాని వెనక ఒకటి ఆ సంగతులన్నీ గోదావరి ప్రవాహంలాగా ఆయన్నుంచి పొంగిపోతూనే ఉన్నాయి.
‘ఒకసారి విశ్వనాథ సత్యనారాయణగారు శరభయ్యగారి ఇంటికి వచ్చారు. ఆయన్ని రిసీవ్ చేసుకుని ఆయన తిరిగివెళ్ళేదాకా ఆయన్ని కనిపెట్టుకుని ఉండే పని మాష్టారు నాకు అప్పగించారు. వారిద్దరూ శరభయ్యగారి ఇంట్లో గదిలో కూచుని కవిత్వం చదువుకోడం మొదలుపెట్టారు. కల్పవృక్షంలో సీతాదేవికి సంబంధించిన ఘట్టమేదో చదువుకుంటున్నారు. నేను పక్కనే కిందన గోడకి ఆనుకుని కూచున్నాను. కొంతసేపటికి విశ్వనాథ నా వైపు చూస్తూ ‘ఈ అబ్బాయి..’ అని అన్నారు మాష్టారితో. అంటే మన ఏకాంతానికి మధ్యలో ఇతడుండాలా అన్నట్టు. పర్వాలేదు, ‘నరసింహశర్మ అలానే కూచుంటాడు లెండి, మీరు కానివ్వండి’ అన్నారు మాష్టారు ఆయనతో. మళ్ళా కావ్యపఠనం మొదలయ్యింది. ఇద్దరి కళ్ళమ్మటా అశ్రువులు ధారలు కడుతున్నాయి. సీతాదేవి అంత శోకించిందో లేదో మనకి తెలియదుగాని, వారిద్దరూ మాత్రం విలపిస్తున్నారనే చెప్పాలి. ఇంతలో ఏదో తీసుకురాడానికి శరభయ్యగారు ఇంట్లోకి వెళ్ళారు. అప్పుడు విశ్వనాథ నా వైపు తిరిగి ‘అది సరేగానీ, అబ్బాయి, నువ్వెందుకేడుస్తున్నావు?’ అనడిగారు నన్ను.
‘అయ్యా, మీరిద్దరూ ఎందుకేడుస్తున్నారో తెలియక ఏడుస్తున్నాను. మీరేదో గొప్ప విషయం మాట్లాడుకుంటున్నారని తెలుస్తోందిగానీ, అదేమిటో అర్థం కాక ఏడుపొస్తోంది’ అని అన్నాను.
ఇంతలో మాష్టారు వచ్చారు. విశ్వనాథ ఆయనతో ‘చూడు, శరభయ్యా, ఈ పిల్లవాడు మనం మాట్లాడుకునేది అర్థం కాక ఏడుస్తున్నాడు. రేపు పెద్దయ్యాక, అర్థమయ్యాక మళ్ళా ఏడుస్తాడు’ అని అన్నారు.
అని చెప్తూ శర్మగారు-
‘సార్, ఆ రోజు ఆయన అలా అన్నమాటలు నాకు గొప్ప ఆశీర్వచనం అనిపించాయి’అని అన్నారు. ఆ మాటలు చెప్తున్నప్పుడు మళ్ళా ఆయన గొంతు గద్గదమైంది. కళ్ళల్లో నీటిపొర కమ్మింది.
కవుల గురించీ, వారు రాసిన పద్యాల గురించీ, వాళ్లను కలుసుకున్నప్పటి ముచ్చట్ల గురించి ఇలా పరవశిస్తూ మాట్లాడతారు కాబట్టే శర్మగారిని ఒకసారి చూసినవాళ్ళు కూడా మళ్ళా మళ్ళా కలుసుకోవాలనుకుంటారు.
ఆయన రాజమండ్రి సాహిత్యవేత్తల గురించి చెప్పేటప్పుడు విషయపరిజ్ఞానం మనతో చాలానే పంచుకుంటారుగానీ మనల్ని చప్పున ఆకర్షించేది అది కాదు. ఆయన ఆ సంగతులు చెప్తున్నప్పుడు, గతించిపోయిన ఆ ఘట్టాల్ని నెమరేసుకుంటున్నప్పుడు, తిరిగి వాటిని enact చేస్తారు. అందుకని ఆయన చెప్పే ప్రతి ఒక్క ముచ్చటా ఒక రూపకంలాగా మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. మనం ఆ రోజుల్లోకి, ఆ వీథుల్లోకి, ఆ గాలుల్లోకి వెళ్ళిపోతాం. చరిత్రకారులంటే ఇటువంటివాళ్ళు.
ఆరోజు ఆయన నాళం కృష్ణారావుగారి గురించి చెప్పిన ముచ్చట కూడా అలానే ఉండింది. మధురకవి నాళం కృష్ణారావు అంటే చాలామందికి తెలియకపోవచ్చుగాని, నా తరంవాళ్ళకి, చిన్నప్పుడు తెలుగు పాఠ్యపుస్తకంలో చదివిన ‘ఊరి వెలుపల పాడుకోనేరు చెంత పసిడిదాచెను పిసినారి ముసలి యొకడు’ అనే పద్యాలు నాళం కృష్ణారావుగారివే అని గుర్తుచేయగలను. కృష్ణారావుగారు తొలిరోజుల్లో వీరేశలింగంగారికి వీరశిష్యుడు. ఆయన పేరుమీద ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. అదే తర్వాత రోజుల్లో గౌతమీ గ్రంథాలయంగా మారింది. అలా మార్చింది కూడా కృష్ణారావుగారే. వీరేశలింగంగారి జీవితం మలిదశలో ఆయన వ్యక్తిత్వం మీద ఆరోపణలు వచ్చినప్పుడు కృష్ణారావుగారు వీరేశలింగానికి వీరవిమర్శకుడిగా మారిపోయేడు. వీరేశలింగం పేరుమీద తాను ప్రారంభించిన గ్రంథాలయానికి పేరు కూడా మార్చేసాడు. మళ్ళా తరువాత రోజుల్లో వీరేశలింగంగారి పట్ల తన అపోహలనుంచి బయటపడి ఆయనకు పూర్వంలాగా సన్నిహితుడు కావాలని ఎంతో తపించేడు. కాని వీరేశలింగం అతణ్ణి తన ఇంటి గడప కూడా తొక్కనివ్వలేదు. ఆ రోజుల్లో తన బాధని వర్ణిస్తూ ఆయన ‘అనుతాపం’ అనే కావ్యం రాసాడని శర్మగారు చెప్తే తప్ప రాజమండ్రికి కూడా గుర్తులేదు.
‘భద్రుడుగారూ, కవులు తమని పొగుడుకుంటూ కవిత్వాలు రాసుకుంటారు. కాని నేను అల్పుణ్ణి, బుద్ధిహీనుణ్ణి, వీరేశలింగం అభిమానానికి దూరమయినవాణ్ణి అని తనని తాను తిట్టుకుంటూ కవిత్వం రాసుకున్నాడు కృష్ణారావుగారు. నాకు తెలిసి సాహిత్య చరిత్రలో తనని తాను తిట్టుకుంటూ, శపించుకుంటూ వేదనవెళ్ళగక్కిన కవి ఆయన ఒక్కరే అనుకుంటాను’ అని కూడా అన్నారు.
‘ఆ కావ్యం కోసం చాలా కాలం వెతికాను. రాజమండ్రిలో ఎక్కడా దొరకలేదు. చివరికి ఎప్పుడో అది వకుళాభరణం రామకృష్ణగారి దగ్గర దొరికింది. దాన్ని మళ్ళా పునర్ముద్రించే అవకాశం కలిగింది’ అని అన్నారు శర్మగారు.
నరసింహశర్మగారు స్వయంగా కవి, రచయిత, పరిశోధకుడు. ఆయన రాసిన ‘ప్రాణహిత’,’ ప్రమేయ ఝరి’ , ‘బ్రౌను ఉదాహరణకావ్యం’ బాగా ప్రసిద్ధి పొందాయిగాని, మొత్తం 84 పుస్తకాలు రాసేరాయన.
‘కానీ మా పిల్లల్తో చెప్తుంటాను. మీ నాన్న అది రాసాడు ఇది రాసాడు అని కాదు, నిజంగా మీ నాన్న ఘనత చెప్పవలసి వస్తే, తెలుగులో అచ్చయిన మొదటి గ్రంథాన్ని వెతికి పట్టుకుని పునర్ముద్రించినవాడు అని నలుగురికీ చెప్పండి అని చెప్తుంటాను మా పిల్లల్తో’ అని అన్నారాయన.
ఇప్పుడు ఎంతమందికి తెలుసో తెలియదో గాని, తెలుగులో అచ్చయిన మొదటిపుస్తకం బైబిలు. (తెలుగులో అచ్చయిన మొదటి పుస్తకం ఏమిటని అడిగితే, ఇంటర్నెట్, రాజశేఖర చరిత్ర అని జవాబిస్తోంది!) 1747 లో షుల్జ్ అనే ఒక జర్మన్ బైబిలును తెలుగులో అనువదించి అచ్చువేయించాడని వినడమేగాని ఆ పుస్తకం నేనెప్పుడూ చూడలేదు. చివరికి గూటెన్ బర్గ్ అచ్చువేయించిన తొలిపుస్తకాన్నైనా చూడగలిగానుగాని తొలి తెలుగు అచ్చుపుస్తకం నేను చూడలేకపోయాను. కానీ దాన్ని శర్మగారు సంపాదించి తెలుగులో అచ్చువేయించారు. ఆయన దానికోసం చేసిన అన్వేషణ హనుమంతుడు చేసిన సీతాన్వేషణ లాంటిదే. ఎక్కడో కలకత్తా దగ్గర సిరాంపురం అనే చోట ఒకప్పుడు దేశభాషల్లో ముద్రితమైన తొలి పుస్తకాలు ఉన్నాయని తెలిసి ఆయన అక్కడికి వెళ్ళారు. తీరా అక్కడ ఆ పుస్తకం లేదన్నారు. కాని ఆయన ఎందుకేనా మంచిదని తొలి తమిళ అచ్చుపుస్తకాలు చూపించమని అడిగితే, ఆ తమిళపుస్తకాల వెనక తెలుగు పుస్తకాలు కూడా కుట్టేసి కనబడ్డాయి! తెలుగులో అచ్చువేసిన మొదటి బైబిలు పుస్తకాలు అయిదు. కాని ఆయనకి ‘నూరు జ్ఞానవచనాలు’ మాత్రమే దొరికింది. అది కూడా వాళ్ళ ప్రత్యేకమైన ఆస్తిలాంటిది కాబట్టి మొత్తం పుస్తకం జిరాక్సు తీసుకోడానికి అంగీకరించకపోతే ఆయన ఎలాగో ఒకలాగా వాళ్ళని ఒప్పించి ఆ పుస్తకం మొత్తం పట్టుకొచ్చారు. అందుకోసం ఒకసారి కాదు, రెండుసార్లు వెళ్లవలసి వచ్చింది. అందుకు సరిపడా ఆర్థిక వనరులున్న మనిషి కాకపోవడంతో అక్కడ ఉన్నన్నాళ్ళూ ఒక పూట మాత్రమే తిని, రెండోపూట ఇన్ని మంచినీళ్ళు తాగి గడిపేరు. ఒక భాషకి సేవ చెయ్యడమంటే ఇది.
ఆ రోజు మా గోష్ఠిలో కాలం తెలీకుండా గడిచిపోయింది. నాకు మళ్ళా ఆ గౌతమీ లైబ్రరీలో బొగడచెట్టు నీడన మాట్లాడుకున్న రోజులూ, ఆ విక్రమహాల్లో సాహిత్యసమావేశాలు జరిగిన రోజులు, ఆ సమాచారం ఆఫీసులో రాత్రి పొద్దుపొయ్యేదాకా మాట్లాడుకుని, ఇంక వెళ్ళిపోదామని బయటకు వచ్చి, ఆ బయటనే మళ్ళా మరో రెండుమూడు గంటలు మాట్లాడుకుంటూనే ఉండిపోయిన రోజులు గుర్తొచ్చాయి. వచ్చింది ఒక్క శర్మగారే అని ఎలా అనుకోను? నా గురువులు వచ్చారు, గౌతమీ గ్రంథాలయం వచ్చింది, ఏకంగా గోదావరినే నేనున్నచోటకి ప్రవహిస్తూ వచ్చింది.
14-11-2024


మధురం.. సన్నిధానం శర్మ గారు లాంటి వారు చాలా అరుదు. వారు మీరు కలుసుకుని కలబోసుకున్న ముచ్చట్ల గోదారి మా వరకు ప్రవహించింది. మధురం సర్..
ధన్యవాదాలు సార్
🙏🙏🙏
అంటే, మీరు ఇంకో భగీరథుడు ….
గోదావరిని మా దాక తీసుకొచ్చారు….. 🙏🙏🙏
ధన్యవాదాలు సార్
వీ భ గారికి నూటొక్క దండాలు. శ శ గారికి పాదాబి
వందనాలు. ఎవరు చెప్పాలి ఈ అద్భుత ఘట్టాల గురించి మహనీయుల నిస్స్వార్థ సేవల గురించి.
భూసారం
ధన్యవాదాలు సార్
గొప్ప జ్ఞాపకాలు సర్
బాలుడిగా గోడనానుకుని కూర్చుని మహాకవుల సంభాషణ వింటున్న శర్మ గారు కళ్లముందు నిలిచిపోయారు. అర్ధమయాక మళ్లీ ఏడుస్తాడు అన్న విశ్వనాథ వారి మాట మనసులో నిలిచి పోయింది. అమాయకపు బాల్యంలో ఇతరుల దుఖానికి స్పందించే పసివాడు, జీవితపు ఎత్తు పల్లాలు, ప్రేమని పొందడం కోల్పోవడం గురించిన అవగాహన ఏర్పడిన పరిణత వయస్సులో సీతమ్మ దుఖపు లోతు తెలిసి తానూ దుఖిస్తాడన్న మాట దానికదే ఒక కావ్యంలా తోచింది!
మీకు ధన్యవాదాలు. మీరు పెట్టిన ఈ సాహితీ కదంబవనం అద్భుతంగా ఉంది!
ధన్యవాదాలు మేడం
మీ మాటలు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను.
మొన్న శర్మ గారు మా ఇంటికి వచ్చినట్టు భ్రమించి పోనీ కలగని ఆయనలోని శక్తి యుక్తుల్ని తలుచుకుని అక్షరాల్లో
చూసుకున్నానండి.
ధన్యవాదాలు సార్
🙏🏽🙏🏽🙏🏽
Truly a great essay. My childhood was also spent in Rajahmundry. My father Kolluri Surya Prakasa Rao guru used to conduct Pandita Sabha each year. We did not understand their poem recitals but always enjoyed the jokes between Bhamidipati Kamesara Rao garu and Mokkapati Narasimha Sastry garu. It was a great time for us. Thank you for sharing this information.
Thank you Sir!
ఆయన రాసిన బ్రౌను ఉదాహరణ కావ్యం ఆవిష్కరణ జయధీర్ తిరుమలరావుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో జరిగి చాన్నాళ్లే అయింది. ఆ సందర్భంగా జయధీర్ గారు ఆ కావ్యపఠనం నా చేత సంకల్పించారు. ఆయన నేను ఆయన చదువుతారో వినాలి అంటే జయధీర్ గారింట్లో ట్రయల్ రెసిటేషన్ నాడు వారిని మొదటి సారి చూసాను. చదివి వినిపిస్తే సరే అన్నారు. అలా వారి కావ్య పఠనం పొత్తూరి వెంకటేశ్వర్రావు , రమణాచారి వంటి వారి ముందు
పద్యాలన్నీ చదవటం జీవితంలో మరచిపోలేని విషయం పొత్తూరి వారి దీవెనలందుకోవటం
మరీ సంతోషదాయక. ఇటీవల రవీంద్ర భారతి లో ఏదో సభలో మళ్లీ కలుసుకున్నాం. ఒక సామాన్యంగా కనిపించే మహనీయుని ప్రస్తావన ఆనందకరం.
ధన్యవాదాలు సార్!
తెలుగు సాహిత్య పుస్తక కవుల చరిత్ర పుటలు ఎంత విలువైనవో “ గోదావరి మా ఇంటికొచ్చింది “ మీ వ్యాసం తెలిపింది భద్రుడుగారు ..ధన్యవాదాలు
ధన్యవాదాలు మేడం
02.12.2024 వ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో బ్రహ్మశ్రీ సన్నిధానం నరసింహ శర్మగారి పై వ్యాసం చదివి ఓ అరుదైన జ్ఞాపకం ఆ మహానుభావునికి ఆరు సంవత్సరాల క్రితం సరిగ్గా డిసెంబర్ నెలలో 09.12.2018 తేదీన “బ్రహ్మశ్రీ సన్నిధానం నరసింహ శర్మగారికి, బ్రహ్మశ్రీ సన్నిధానం శర్మగారు, మారిషస్ సాహితీ వేత్త, తెలుగుతేజం బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారు, మా ఆత్మీయ బంధువు ఐ.ఐ.టి.రిజిస్ట్రార్ వోలేటి వెంకట్రావు గారి కుటుంబం, ప్రముఖ పాత్రికేయులు శ్రీ పట్నాయకుని వెంకటేశ్వరరావు గారి గృహంలో శ్రీ విస్సా నిలయం ఆధ్వర్యంలో ఘన సన్మాన సత్కారం” ఓ అరుదైన జ్ఞాపకం
ధన్యవాదాలు సార్
తెలుగు సాహిత్య కవుల గురించి తెలుసుకోవడం…… కూడా……. తెలుగు సాహిత్యంలో భాగమే
ధన్యవాదాలు మేడం