
మొదటి అధ్యాయం
1
ఈశ్వరుడి దయ వల్ల మాత్రమే మనుషులకి
తానుకాక వేరొకటి లేదనే భావన కలుగుతుంది.
ఒక సారి ఆ సత్యం బోధపడ్డాక అది
వాళ్ళని గొప్ప భయం నుంచి బయటపడేస్తుంది.
2
దేనివల్ల ఇదంతా ఆత్మలో ఆత్మగా నిండిఉన్నదో దానికన్నా
వేరొకటికాని ఆ నిరాకార శివస్వరూపానికి ఎలా నమస్కరించేది?
3
పంచభూతాలతో కూడుకున్న ఈ విశ్వం ఎండమావిలాంటిది
ఉన్నది ఒకణ్ణే, మరకలు అంటనివాణ్ణీ, నేనెవరికి నమస్కరించేది?
4
ఉన్నదంతా నేనే, నాకన్నా వేరొకటి లేనప్పుడు, ఉండనప్పుడు
ఉందనిగాని లేదనిగాని ఎలా చెప్పడం? ఆశ్చర్యం కలుగుతోంది.
5
వేదాంతసారం మొత్తం నేనే, జ్ఞానమూ, విజ్ఞానమూ నేనే
అంతటా వ్యాపించి ఉన్న ఆ నిరాకార సత్యాన్నీ నేనే.
6
సర్వాత్మకుడైన దేవుణ్ణి, నిష్కళుణ్ణి, ఆకాశంలాంటివాణ్ణి
స్వభావనిర్మలుణ్ణి, శుద్ధుణ్ణి, సందేహంలేదు, అతడు నేనే.
7
తుదీ, తరుగూ లేనివాణ్ణి, తేటపడ్డ ఎరుకలాంటి వాణ్ణి
ఎవరైనా సుఖదుఃఖాలని చెప్తుంటే అవేమిటనుకుంటాను.
8
నా తలపులకి శుభాశుభాల్లేవు, నా చేతలకి శుభాశుభాల్లేవు
నా మాటలకి శుభాశుభాల్లేవు. సత్యం తెలిసినందువల్ల
నాకు మరణం లేదు, అటువంటి జ్ఞానం కలిగినందువల్ల
ఇంద్రియాలు నన్ను కలతపెట్టవు, కలుషితం చెయ్యవు.
9
మనస్సు ఆకాశంలాంటిది, అన్నిదిక్కులా అల్లుకునేది,
మనసు మనసుని దాటిన ఆ సత్యంలో మనస్సే లేదు.
10
రోదసిని కూడా దాటి వ్యాపించిన ఈ మొత్తం నేనే కాగా
మరొకటి కనిపిస్తోందనిగాని లేదనిగాని ఎలా చెప్పగలను?
11
ఉన్నది నువ్వొక్కడివే. మరి అన్నిటా ఉన్నది నేనే అని
ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నీలో పగులు లేదు,
చీలిక లేదు, నిత్యం ఉదయిస్తూనే ఉంటావు, ప్రభో,
ఎందుకని ఇది రాత్రి ఇది పగలు అని తలపోస్తున్నావు?
12
ఎప్పటికీ ఎన్నటికీ అన్నిచోట్లా ఉన్నది నువ్వే, తెలుసుకో
తలపూనేనే, తలుచుకునేదీ నేనే. వాటిమధ్య తేడా ఎక్కడ?
13
నువ్వు పుట్టలేదు, చావబోవు, నీకంటూ ఒక దేహం లేదు
ఉన్నది ఆ సత్యమొక్కటే అని కదా శ్రుతులు ఘోషిస్తున్నది.
14
బయటా లోపలా ఉన్నది నువ్వే, అన్నిచోట్లా శివస్వరూపుడివి
అయినా ఎందుకని దెయ్యంలాగా అటూ ఇటూ తిరుగుతున్నావు?
15
నీకుగాని నాకు గాని కలయికలు లేవు, విడిపోడాలు లేవు, నువ్వు
లేవు, నేను లేను, ఈ జగత్తు లేదు. ఉన్నది కేవలమొక్క ఆత్మనే.
16
మాటలూ, స్పర్శ, రుచి, రూపం, గంధం ఏవీ నువ్వు కాదు
వాటిని దాటినవాడివి, అయినా ఎందుకని పరితపిస్తున్నావు?
17
నీకు పుట్టుకలేదు, మృత్యువులేదు, చిత్తం లేదు,
బంధం లేదు, మోక్షం లేదు, శుభాశుభాల్లేవు
అయినా ఎందుకని విలపిస్తున్నావు? బిడ్డా!
నామరూపాలు నీకూ లేవు, నాకూ లేవు.
18
అయ్యో! మనసా! ఎందుకని దెయ్యంలాగా తిరుగుతున్నావు?
నువ్వు కాక మరొకరంటూ లేనప్పుడు ఇంకెవరని ఇష్టపడతావు?
19
ఉన్నది నువ్వే, వికారాలు వదిలిపెట్టిన రూపానివి
ఆందోళనలు వదిలిపెట్టిన విముక్తస్వరూపానివి
నీకు రాగం లేదు, అలాగని విరాగమూ లేదు
ఇంక కోరికలు నిన్నెట్లా దహించగలుగుతాయి?
20
అసలైన ఆ సత్యం నిర్గుణం, శుద్ధం, అవ్యయం
అంటున్నాయి శ్రుతులు, నాకంటూ ఒక
దేహంలేక సమస్తాన్నీ సమానంగా చూసే
ఆ సత్యం నేనేనని తెలుసుకో, ఇక సందేహించకు.
సంస్కృత మూలం
అథ ప్రథమోధ్యాయః
1
ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసనా
మహద్భయపరిత్రాణాద్విప్రాణాముపజాయతే.
2
యేనేదం పూరితం సర్వమాత్మనైవాత్మనాత్మని
నిరాకారం కథం వన్దే హ్యభిన్నం శివమవ్యయమ్.
3
పంచభూతాత్మకం విశ్వం మరీచిజల సన్నిభమ్
కస్యాప్యహో నమస్కుర్యామహమేకో నిరంజనః
4
ఆత్మైవకేవలం సర్వం భేదాభేదో న విద్యతే
అస్తి నాస్తి కధం బ్రూయాం విస్మయః ప్రతిభాతి మే.
5
వేదాన్తసార సర్వస్వం జ్ఞానం విజ్ఞానమేవ చ
అహమాత్మా నిరాకార స్సర్వవ్యాపీ స్వభావతః
6
యోవై సర్వాత్మకో దేవో నిష్కలో గగనోపమః
స్వభావ నిర్మలశ్శుద్ధ స్స ఏవాహం న సంశయః
7
అహమేవావ్యయోనన్తః శుద్ధవిజ్ఞాన విగ్రహః
సుఖం దుఃఖం న జానామి కథం కస్యాపివర్తతే.
8
న మానసం కర్మ శుభాశుభం మే న కాయికం కర్మ శుభాశుభం మే
నా వాచికం కర్మ శుభాశుభం మే జ్ఞానామృతం శుద్ధమతీంద్రియోహమ్.
9
మనోవై గగనాకారం మనోవై సర్వతోముఖం
మనోతీతం మనస్సర్వం న మనః పరమార్థతః
10
అహమేక మిదం సర్వం వ్యోమాతీతం నిరన్తరం
పశ్యామి కథమాత్మానం ప్రత్యక్షం వా తిరోహితమ్.
11
త్వమేవమేకం హి కధం న బుధ్యసే సమం హి సర్వేషు విమృష్టమవ్యయమ్
సదోదితోసి త్వమఖండితః ప్రభో దివా చ నక్తం కధం హి మన్యసే.
12
అత్మానం సతతం విద్ధి సర్వత్రైక నిరన్తరం
అహం ధ్యాతా పరం ధ్యేయమఖండం ఖండ్యతే కధమ్.
13
నజాతో నమృతోసి త్వం న తే దేహః కదాచన
సర్వం బ్రహ్మేతి విఖ్యాతం బ్రవీతి బహుధా శ్రుతిః
14
స బాహ్యాభ్యంతరోసి త్వం శివః సర్వత్ర సర్వదా
ఇతస్తతః కధం భ్రాన్తః ప్రధావసి పిశాచవత్.
15
సంయోగశ్చ వియోగశ్చ వర్తతే న చ తే న మే
న త్వం నాహం జగన్నేదం సర్వమాత్వైవ కేవలం.
16
శబ్దాది పంచకస్యాస్య నైవాసి త్వం న తే పునః
త్వమేవ పరమం తత్వ మతః కిం పరితప్యసే.
17
జన్మమృత్యుర్నతే చిత్తం బన్ధమోక్షౌ శుభాశుభౌ
కధం రోదిషి రే వత్స నామరూపం న తే న మే.
18
అహో చిత్తం కధం భ్రాన్తః ప్రధావసి పిశాచవత్
అభిన్నం పశ్య చాత్మానం రాగత్యాగత్సుఖీ భవ.
19
త్వమేవ తత్త్వం హి వికారవర్జితం
నిష్కమ్పమేకం హి విమోక్ష విగ్రహమ్
న తే చ రాగో హ్యధవావిరాగః
కధం హి సంతప్యసి కామకామతః
20
వదన్తి శ్రుతయః సర్వా నిర్గుణం శుద్ధమవ్యయమ్
అశరీరం సమం తత్వం తన్మాం విద్ధి న సంశయః
28-10-2024


🙏🙏🙏
జయజయశంకర హరహర శంకర
నమః
నమోనమః
ధన్యవాదాలు
సత్యమే ఈశ్వరుడు 🙏
ధన్యవాదాలు సోదరీ!
Thank you so much, sir
ధన్యవాదాలు సార్