
సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ కి నా తెలుగు అనువాదాన్ని ప్రతిరోజూ నా బ్లాగులో పోస్టు చేస్తున్నప్పుడు ఒక మిత్రుడో మిత్రురాలో ‘అర్థమవుతున్నట్టే ఉందిగానీ, అర్థం కావడం లేదు కూడా’ అని రాసారు. సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ లో సహజంగానే ఒక అస్పష్టత ఉంది. ఎంతో సుస్పష్టంగానూ, సరళంగానూ, సహజంగానూ తన కవితని ప్రకటిస్తున్నానని అనుకున్నప్పటికీ, తన కవితలో వైరుధ్యాలున్నాయా అని విట్మన్ కే అనుమానమొచ్చింది.
మొదటి వైరుధ్యం, వైరుధ్యాల గురించే. అంటే తాను చెప్తున్నమాటల్లో ఒక స్వవచో వ్యాఘాతముందా అనే అనుమానం. కాని తాను విస్తారమైన జీవితాన్ని, పరస్పర విరుద్ధాలుగా కనిపించేవాటినీ సమన్వయం చేయడంకోసం కవిత్వం చెప్తున్నాడు కాబట్టి తన మాటలు తనే ఖండించుకుంటున్నట్టు కనిపించడంలో ఆశ్చర్యంలేదని ఆయన భావించాడు. అందుకనే ఈ కవితలో ఒకచోట ఆయన చెప్పుకున్న ఈ మాటలు జగత్ప్రసిద్ధాలయ్యాయి:
నా మాటలు నేనే ఖండించుకుంటున్నానా
కానివ్వండి, నా మాటలు నేను ఖండించుకుంటూనే ఉంటాను,
(నేను మరీ విస్తారం, నాలో అపారబాహుళ్యాలున్నాయి)
ఇక రెండో వైరుధ్యం, ఈ కవితలో నేను ఒకరా ఇద్దరా అనేది. ‘నా గురించి పాడుకున్న పాట’ అని అంటున్నప్పుడు వర్ణనీయ వస్తువుగా, ఇతివృత్తంగ ఉన్న నేనూ, వక్తగా మాట్లాడుతున్న నేనూ ఒకరు కాదేమోననీ, ఆ ఇద్దరి మధ్యా కించిత్ భేదముందేమోననీ అనిపించే తావులు చాలానే కనిపిస్తాయి. ప్రసిద్ధ సాహిత్య వేత్త హెరాల్డ్ బ్లూమ్ మరికొంతకు ముందుకు పోయి, ఈ గీతంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నేనులున్నారన్నాడు. ఒకటి, ఆత్మ, రెండోది నేను, మూడోది వాస్తవమైన నేను అని చెప్తూ అందులో ఆత్మ అంటే మనకి పరిచితమైన అర్థంలో కాకుండా, తనలో తనకే తెలియని ఒక అస్పష్ట, అవ్యక్త పార్శ్వానికి ప్రతినిధి అని చెప్తాడు. తన ఆత్మని ఉద్దేశించి కవిత్వం చెప్తున్న ‘నేను’ లో మళ్ళా రెండు పార్శ్వాలున్నాయన్నాడు. ఒక పార్శ్వం ఆ అస్పష్ట, అవ్యక్త పార్శ్వాన్ని గుర్తించడానికి ఒక రూపంగా కనిపించే నేను. దాన్ని విట్మన్ లోని స్త్రీత్వపు పార్శ్వంగా ఊహిస్తూ విట్మన్ కవిత్వంలో రాత్రి, సముద్రం, తల్లి, మృత్యువు అనే ప్రతీకలద్వారా ఆ పార్శ్వాన్ని గుర్తుపట్టవచ్చంటాడు. ఇక ఆ ‘నేను’ లోని రెండో నేను వాల్ట్ విట్మన్, అమెరికన్, పురుషుడు, మనందరికీ తెలిసిన కవి అంటాడు బ్లూమ్.
ఈ గీతంలో కనిపించే పై రెండు వైరుధ్యాలూ కాక, మూడో వైరుధ్యం కావ్యశిల్పానికి సంబంధించింది. కవిత్వం గొప్ప వాక్ప్రవాహంగానూ, విద్యుత్ స్రవంతిగానూ ఉన్నంతమాత్రాన మహాకావ్యంగా మారదు. గొప్ప కవిత్వాలు చాలామంది చెప్పగలరు, కానీ గొప్ప కావ్యాలు అందరూ రాయలేరు. మహాకావ్యాలు యుగానికి ఒక్కటి మాత్రమే ప్రభవిస్తాయి. సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ ని అమెరికా దేశపూ అధునిక మహాకావ్యంగా ప్రస్తుతించాలంటే దానికొక కావ్యశిల్పం ఉందని అంగీకరించాలి. కాని నిజంగా ఆ గీతానికొక శిల్పైక్యం ఉందా?
ఈ ప్రశ్న 1855 నుంచీ అమెరికానీ, విట్మన్ ఆరాధకుల్నీ కలవరపరుస్తూనే ఉంది. అసలు అందరికన్నా ముందు ఈ ప్రశ్న విట్మన్ నే వేధించిందనాలి. కాబట్టే ఆయన ఒకసారి, రెండు సార్లు కాదు, ఆరుసార్లు, తన జీవితపర్యంతం ఆ గీతాన్ని సరిదిద్దుతూనే ఉన్నాడు. అలాగని ఆ గీతంలో ఏకత్వమే లేకపోతే, అది ఒక ప్రబంధం కాకపోయి ఉంటే, తన పాఠకుల్ని నూట డెబ్భై ఏళ్ళకు పైగా అలరిస్తూ ఉండటం సాధ్యం కానే కాదు. అందులో ఒక అమరిక ఉంది, ఒక కథనం ఉంది, ఒక ప్రయాణం ఉంది, ఒక ముగింపుకు చేరుకోవడమూ ఉంది. కాని ఆ నిర్మాణం తక్కిన ఇతిహాసాల్లోలాగా ఇదీ అని స్పష్టంగా తేల్చి చూపించగలిగింది కాదు. అది ఎవరికి వారు తమకై తాము అన్వేషించుకుని విశ్లేషించుకోదగ్గది.అంటే ఆ గీతాన్ని సునిశితంగా చదివిన ప్రతి సుశిక్షిత పాఠకుడికీ అందులో ఒక కావ్యం సాక్ష్త్కరిస్తూనే ఉంటుందన్నమాట! ఒక రకంగా ఇది కూడా మహాకావ్య లక్షణమే! ఎందుకంటే గొప్ప కావ్యాలు బహుళ వ్యాఖ్యానాల్ని అపేక్షిస్తాయి. భారతాన్ని తెలుగు చేయడానికి పూనుకుంటూ నన్నయ దాన్ని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రమనీ, అధ్యాత్మవిదులు వేదాంతమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు పురాణమనీ అంటారని చెప్పినమాట ఉండనే ఉంది కదా.
అలానే విట్మన్ సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ మీద కూడా ఎన్నో వ్యాఖ్యానాలు వస్తూనే ఉన్నాయి. ఒక కావ్యంగా, ఆధ్యాత్మిక ప్రయాణంగా, మోదాంత నాటకంగా, ఇతిహాసంగా, భవిష్యవాణిగా పండితులు తామెలా దర్శిస్తే అలా ఆ గీతాన్ని వివరిస్తో ఉన్నారు. జేమ్స్ ఇ మిల్లర్ జూనియర్ అనే విట్మన్ పండితుడు అటువంటి వ్యాఖ్యానాల్లో ఆరు వ్యాఖ్యానాల్ని ఎంపిక చేసి వాటిని వివరిస్తో Whitman’s ‘Song of Myself’- Origin, Growth, Meaning (1964) అని ఒక పుస్తకం కూడా రాసాడు. ఆ ఆరువ్యాఖ్యానాల్లో ఒకటి తన వ్యాఖ్యానం కూడా.
వాటిని స్థూలంగా పరిచయం చేస్తాను.
మొదటి వ్యాఖ్యానం Carl F Strauch అనే పండితుడు ఈ గీతంలోని కావ్యనిర్మాణం గురించి చేసిన విశ్లేషణ. గొథే అన్నాడట, ఒక మహాకవిని మామూలు కవుల్నించి వేరుచేసే సామర్థ్యం కావ్యనిర్మాణ సామర్థ్యమేనని. మహాకవికి ఉండవలసిన ముఖ్యలక్షణం అతడు తానేది చెప్తున్నాడో దాని పట్ల స్పష్టత కలిగి ఉండటమే కాక, దాన్ని స్పష్టంగా చెప్పే శక్తి ఉండటం కూడా అని బోదిలేర్ అన్నాడట. విట్మన్ సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ లో ఈ రెండు లక్షణాలూ ఉన్నాయంటాడు స్ట్రాచ్. ఆ కావ్యానికి ఒక స్పషటమైన నిర్మాణం ఉందని చెప్తూ దాన్నిట్లా వివరించాడు. అందులో 1నుంచి 18 సర్గలదాకా సెల్ఫ్ గురించిన ఆధ్యాంతిక వివరణ ఉందనీ, 19-25 సర్గల్లో ఆ సెల్ఫ్ ని చుట్టూ ఉన్న సమాజంలో కనుగొనడం ఉందనీ, 26 నుంచి 38 సర్గల్లో తన అనుభవం, తన దర్శనం ఆధారంగా తనని తాను పునర్నిర్వచించుకోవడం ఉందనీ, 39-41 సర్గల్లో తానొక అధిమానవుడిగా మారడం ఉందనీ, ఇక 42-52 సర్గల్లో జీవితపు మహాప్రశ్నలైన మతం, విశ్వాసం, భగవంతుడు, మృత్యువు, అమరత్వం, ఆనందాల విచికిత్స ఉందనీ ఆ పండితుడు వివరించాడు. ఏ విధంగా చూసినా ఈ గీతంలో విట్మన్ కేవలం ద్రష్టగామాత్రమే కాక, ఒక ప్రకృష్ట కావ్యనిర్మాతగా కూడా కనిపిస్తాడని తీర్మానిస్తాడు.
సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ లో కవిత్వం గురించి రాస్తూ Randall Jarrell పందొమ్మిదో శతాబ్ది అమెరికా ప్రసాదించిన ఇద్దరు మహాకవులు విట్మన్, మెల్విల్లీ మాత్రమేనని చెప్తూ టెన్నిసన్ తో పోల్చి చూస్తే విట్మన్ తననీ, తన ప్రపంచాన్నీ ఎంతో అద్భుతంగా వ్యక్తీకరించుకోగలిగాడంటాడు.
ఇక Richard Chase అనే విమర్శకుడు సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ ని ఒక కామెడీగా అభివర్ణించాడు. కామెడీ అంటే మనకి తెలిసిన హాస్యనాటకం అనే అర్థంలో కాదు, గ్రీకులకి తెలిసిన జీవితోత్సవం అనే అర్థంలో. ప్రాచీన సంస్కృత లాక్షణికులు మంగళప్రదమని దేన్ని భావించారో ఆ అర్థంలో. విట్మన్ వ్యక్తిత్వంలోని స్వేచ్ఛాప్రియత్వం, ప్రజాస్వామికగుణం అతని కవితను యాంత్రికం కాకుండా కాపాడేయనీ, ఆ మొత్తం గీతాన్ని ఒక డయొనీషియన్ జీవితోత్సవంగా మార్చాయనీ అంటాడు. విట్మన్ కవిత్వంలో ఆధ్యాత్మిక కోణాన్ని చూసేవాళ్ళు అందులోని క్రైస్తవ, వేదాంత పార్శ్వాల్ని చూసినట్టుగా డయొనీషియన్ లక్షణాల్ని చూడరనీ, కాని ఆ కవితలో ఒక ఆదిమ, మౌలిక, అసీమిత జీవశక్తి ఉప్పొంగుతూ ఉంటున్నదనీ, అది ప్రధానంగా డయొనీషియన్ లక్షణమనీ ఈ పండితుడు చెప్తున్నాడు. ఇది నిజంగానే ఒక విలక్షణ వ్యాఖ్యానం.
సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ ని ఇతిహాసంగా చూస్తూ Roy Harvey Pearce అనే విమర్శకుడు ఆధునిక ఇతిహాసం ప్రాచీన ఇతిహాసాల్లాగా ఉండదనీ, అది ప్రధానంగా ప్రజాసామాన్యపు అవసరాలకు తగ్గట్టుగా ఉంటుందనీ చెప్తాడు. ఆ గీతం తనకి ఒక సుస్పష్టమైన, సమగ్రమైన అమెరికన్ ఇతిహాసంగా కనిపిస్తుందంటాడు.
ఇక ఈ జేమ్స్ మిల్లర్ జూనియర్ రాసిన Song of Myself as Inverted Mystical Experience (1957) అనే వ్యాసం ఈ గీతం పైన వచ్చిన వ్యాఖ్యానాలన్నిటిలోనూ చాలా లోతైనది, ప్రశస్తమైందీ, ప్రసిద్ధమైందీ కూడా. సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ ఒక ఆధ్యాత్మిక అనుభవం తాలూకు అత్యంత నాటకీయమైన చిత్రణ అంటాడు మిల్లర్. ఆ అనుభవాన్ని ప్రకటించడంలో ఏడు దశలున్నాయంటాడు. అవి సర్గల వారీగా:
1-5 ఒక ఆధ్యాత్మిక స్థితిలోకి ప్రవేశం
6-16 తనలోకి తాను మేల్కోవడం
17-32 తనని తాను పరిశుద్ధపరుచుకోవడం
33-37 జ్ఞానోదయం, అజ్ఞాన తిమిరంతో సంఘర్షణ
38-43 ఆత్మైక్యం (శ్రద్ధారూపంలో, ప్రేమరూపంలో ఆత్మసాక్షాత్కారం)
44-49 ఆత్మైక్యం (ఆత్మదర్శనం)
5052 తన ఆత్మైక్య దశనుండి విడివడి ప్రపంచంలోకి మరలి రావడం.
ఈ ఆరు వ్యాఖ్యానాలతో పాటు, హెరాల్డ్ బ్లూమ్ రాసిన Walt Whitman as Center of the American Canon (1994) రాసిన వ్యాసం కూడా చదవదగ్గది. అందులో ఆయన విట్మన్ అమెరికాకి కొత్త మతాన్ని ప్రసాదించాడంటాడు. ఆ మతానికి సాంగ్ ఆఫ్ మైసెలో సువార్త అని చెప్తూ, ఆ గీతం ప్రధానంగా పునరుత్థానికి చెందిన గీతమంటాడు. మొత్తం గీతంలో 38 వ సర్గ కీలకమనీ, అక్కణ్ణుంచి చివరి పదిహేను సర్గల్లోనూ కవి ఒక పునరుత్థాన మానవుడి వాక్కుతో మాట్లాడుతున్నాడనీ వివరిస్తాడు. యేసు లానే ఈ విట్మన్ కూడా ఒక వడ్రంగి కొడుకేనని గుర్తుచేస్తూ, అతడు ప్రవచిస్తున్న నవ్య అమెరికన్ మతానికి అతడే మెస్సయ్యా అని కూడా అంటాడు. విట్మన్ ని ఒక షామాన్ గా, ఒక కబ్బలిస్టుగా అభివర్ణిస్తూ లారెన్స్ రాసిన ఈ మాటలు గుర్తుచేసుకుంటాడు. విట్మన్ ఆరాధకుల్లో మొదటి వరసలో ఉండటానికి ఉవ్విళ్ళూరే డి.ఎచ్.లారెన్స్ ఇలా అన్నాడట:
మహాకవి విట్మన్ నాకెంతో ఎక్కువ. ముందుకు దారిచేసుకుంటూ పోయే విట్మన్. ప్రాతఃపథగామి విట్మన్, ఒకే ఒక్క విట్మన్. ఇంగ్లీషు మార్గదర్శులుకారు, ఫ్రెంచి వాళ్ళు కారు, యూరపియన్ మార్గదర్శులు కారు. యూరోప్ లో మార్గదర్శులు కావాలనుకున్నవాళ్ళు కేవలం కొత్త దారులు వెతుక్కునేవాళ్ళు మాత్రమే. అమెరికాలో కూడా అంతే. విట్మన్ కన్నా ముందు అంతా శూన్యం. తక్కిన కవులందరికన్నా ముందు, తన ముందు అజ్ఞాతంగా విస్తరించిన ఉన్న కీకారణ్యంలో తానొక్కడే దారిచేసుకుంటూ ముందుకు పోయాడు విట్మన్. అతణ్ణి దాటి మరెవరూ లేరు.
ప్రపంచ సాహిత్యచరిత్రలో గొప్ప యోగానుభవంలోంచి పలికిన కవిత్వాలు, ఉపనిషత్తులు, సువార్తలు, డావో డెజింగ్, బుద్ధుడి సంభాషణలు మనకి ఏ ఆత్మానుభవాన్నీ, ఏ సత్యసాక్షాత్కారాన్నీ పరిచయం చేస్తాయో సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ కూడా అటువంటి అత్యున్నత ఆత్మానుభవాన్నే పరిచయం చేస్తుంది. ఈ కవి తాను మాట్లాడుతున్న, వివరిస్తున్న అనుభవానికి నిజంగానే లోనయ్యాడనీ, తనూ, ప్రపంచమూ అంటూ రెండు విడివిడిగా లేని ఐక్యస్థితికి చేరుకోగలిగాడనీ గీతం మొత్తం మనకి సాక్ష్యమిస్తుంది. కాబట్టే ప్రజల్ని ప్రేమిచేవాళ్ళకీ, ప్రజాస్వామ్యం వర్థిల్లాలనుకునేవాళ్ళకీ, అన్ని రకాల దాస్యాల్నీ ద్వేషించేవాళ్ళకీ ఈ గీతం ఒక మంత్రంగా పనిచేస్తుంది.
6
చల్లా వేణుమాధవ్ నాగార్జున్ సాగర్ గురుకుల కళాశాలలో నా సహాధ్యాయి. ఇంటర్ చదివేనాటికే అతడు ఇంగ్లిషులో సాధించిన అభినివేశం మమ్మల్ని అబ్బురపరిచేది. అతడు ఉద్యోగంలో చేరిన తొలిరోజుల్లో ఒక బ్రిటిషర్ దగ్గర పనిచేసేవాడు. ఒకరోజు ఆ బ్రిటిషర్ ఒక ఇంగ్లిషు పదం స్పెల్లింగు తప్పురాస్తే ఎత్తిచూపించి అతడి ఆగ్రహానికి గురై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కాని నా మిత్రుడు బ్రిటిష్ వాళ్ళకే ఇంగ్లిషు పాఠాలు నేర్పేడని గర్విస్తుంటాను. ఉద్యోగవిరమణ తర్వాత వేణు గొప్ప ఫొటోగ్రాఫరుగా మారాడు. పక్షిప్రేమికుడిగా ఎక్కడెక్కడి పక్షుల్నీ ఫొటోల్లో బంధిస్తుంటాడు. నెత్తిన టోపీ పెట్టుకుని, నెరిసిన గడ్డంతో, కెమేరాతో పక్షుల్ని వెతుక్కుంటూ పోయే వేణుని చూసినప్పుడల్లా నాకు వాల్ట్ విట్మన్ ని చూసినట్టే ఉంటుంది. అతడి శ్రీమతి నాగిని నా సాహిత్యానికి అభిమాని.

ఆ దంపతులు ఇండియా వచ్చేటప్పుడల్లా తామే స్వయంగా మార్కెట్ కి పోయి నా కోసం రంగులూ, కుంచెలూ, కాగితాలూ కొని తీసుకొస్తుంటారు. ఆ ఋణాన్ని కొంతేనా తీర్చుకుందామని ఇదుగో ఈ అనువాదం వారికి కానుకచేస్తున్నాను.
22-9-2024


ప్రతి అనువాద కావ్యానికి ఇలాంటి కావ్యవిశ్లేషణ అవసరమని ఇవన్నీ చదువుతుంటే అర్థమౌతుంది. కావ్యావగాహనకు, కావ్యానందానికి
పైవన్నీ పాఠకుడిని కావ్యం చేరువకు చేరుస్తాయి. కవి గురించీ , కవి జన్మస్థలి, వాసస్థలి, కావ్య స్థలి
రచనా నేపథ్యం ఇవన్నీ మననం కాబడి కావ్యరచన లోని విశేషాలు గ్రహించడానికి దోహదపడుతాయి.ఇతర అనువాదకులు కూడా ఇలా అనువాదకావ్యాలను వెలువరిస్తే పరిశ్రమ ఫలవంతమౌతుంది. మీకు అభినందలు ఎన్ని సార్లు చెప్పినా సరిపోదు.
ధన్యవాదాలు సార్
సర్!! మీ ప్రసంగం తర్వాత తేనీటి పుస్తకం చదివాను. ఎంతో తెలుసుకున్నాను. 🙏🏽
మీ ఈ ఆత్మోత్సవ గీతం మూడు posts చదివి పెట్టుకున్నాను మీ ప్రసంగానికి ముందుగా.
Whitman పేరు వినడమే గా ఏమీ చదవలేదు.
His “ Leaves of Grass” poetry book plays a key role in the series “Breaking bad”.
ఆ పుస్తకం గురించి అలా తెలిసినందుకు బాధపడాలో, అలా అయినా తెలిసినందుకు సంతోషపడాలో తెలియడం లేదు. 😬
మాధవీ! మీరు ఆదర్శ విద్యార్థి. మీలా వినే వాళ్ళుండాలే గాని నేను చదివిన పుస్తకాలన్నిటి గురించీ మాట్లాడాలనిపిస్తుంది.