
కుమార్ కూనపరాజు ప్రవరలో ముగ్గురు ఋషులున్నారు. ఒకరు చెహోవ్, రెండోవారు ప్రేమ్ చంద్, మూడోవారు రావిశాస్త్రి. ఆ గురు ఋణం తీర్చుకోవడమెలా అన్నదొక్కటే కుమార్ కూనపరాజు ఆలోచించేది అనుకుంటాను. చెహోవ్ కథల్ని తెలుగులోకి అనువదింపచేసే పెద్ద ప్రయత్నం తలకెత్తుకుని ఇప్పటికే రెండు సంపుటాలు వెలువరించారు. ప్రేమ్ చంద్ కథలు కూడా తెలుగులోకి తేవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇక రెండేళ్ళ కిందట రావిశాస్త్రి శతజయంతి ఉత్సవం హైదరాబాదులో పెద్ద ఎత్తున నిర్వహించారు. అక్కడితో ఆగిపోతారేమో అనుకుంటే కిందటేడాది మళ్ళా 101 వ జయంతి నిర్వహించి, ఆ సందర్భంగా ‘ఉదయిని’ అనే ఆన్ లైన్ పత్రిక ప్రారంభించారు. ముచ్చటగా మూడో సారి ఈ ఏడాది మళ్ళా రావిశాస్త్రి 102 వ జయంతి విశాఖపట్టణంలో నిర్వహించారు.
ఈ పనులు చెయ్యడమే గొప్ప విశేషం అనుకుంటే, రావి శాస్త్రి పురస్కారం ఒకటి ఏర్పాటు చేసి మొదటిసారి ఇద్దరు రచయితలకి, రెండో సారి ముగ్గురు కథకులకీ ఇవ్వడమే కాక, ఈసారి మరో ముగ్గురు కథకులకు కూడా ఆ పురస్కారాన్ని అందించారు. రావిశాస్త్రికి కుటుంబవారసులున్నారు. సాహిత్య వారసులు కూడా ఒకరిద్దరు ఉండవచ్చు. కాని శాస్త్రిగారికి కుమార్ కూనపరాజు లాంటి వారసుడు మాత్రం మరొకరు లేరని ఇప్పటికి నాకు పూర్తిగా నిశ్చయమయింది.
కుమార్ కూనపరాజుకి నా పట్ల ఎందుకు అభిమానం ఏర్పడిందో తెలియదుగానీ ఈ మూడేళ్ళుగానూ ఆయన తాను నిర్వహిస్తున్న సమావేశాల్లో నన్ను ఏదో ఒక రూపంలో భాగస్వామిని చేస్తూనే ఉన్నారు. ఈసారి విశాఖపట్టణంలో జరిపిన సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
రావిశాస్త్రిగారి గురించి మళ్ళా కొత్తగా మాట్లాడుకునేదేముంటుంది అనుకుంటాంగాని, ఆయన రచనా సర్వస్వం వెలువడ్డాక, ఆయన చిన్నప్పటి డైరీలూ, 1954 లో రాసుకున్న నోట్సూ, గల్పికలూ, ఉత్తరాలూ లాంటివి ఒక్కచోట లభ్యమయ్యేక శాస్త్రిగారి గురించి మాట్లాడుకోవలసింది చాలానే ఉందనిపించింది. మొన్న విశాఖపట్టణంలో జరిగిన సమావేశంలో కీలకోపన్యాసం చేసిన వృద్ధుల కల్యాణరామారావుగారూ, శాస్త్రి గారి చిన్న కుమారుడు ఉమాకుమార శాస్త్రిగారూ పంచుకున్న జ్ఞాపకాలు విన్నాక, శాస్త్రి గారిగురించి మనకి ఇంకా పూర్తిగా తెలియవలసింది చాలానే ఉందని ప్రతి ఒక్కరికీ అనిపించింది.
ఈసారి రావిశాస్త్రి పురస్కారాన్ని అందుకుంటున్న యువరచయితలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కథకులు మాత్రమే కాక స్త్రీలకీ, దళితులకీ, గిరిజనులకీ ప్రతినిధులైన కథకులు కూడా కావడం విశేషం. అంతేకాదు, వారు రావిశాస్త్రి స్ఫూర్తికి వారసులని కూడా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే, వారు రావిశాస్త్రికన్నా ఒక అడుగు ముందున్నారని చెప్పవచ్చు. అంటే ఒకవేళ రావిశాస్త్రి ఇప్పుడు మనమధ్య ఉండి ఉంటే, ఇంకా కథలు రాస్తూ ఉండి ఉంటే, ఈ యువకథకుల్లాగా రచనలు చేస్తూ ఉండేవారని అనుకోవడానికి నాకేమీ సంకోచం లేదు.
ఉదాహరణకి ఈసారి పురస్కారం అందుకున్న శీలం సురేంద్ర కథాసంపుటి ‘పార్వేట’ (2022) లో ‘ఓడిపోయిన వాన’ కథ చదివినవెంటనే రావిశాస్త్రిగారి ‘వర్షం’ కథ గుర్తురాకుండా ఉండదు. రావి శాస్త్రిగారు తాను రాసిన కథల్లో తనకి ఇష్టమైన మూడు కథల పేర్లు చెప్పారని కల్యాణరామారావుగారు తన ప్రసంగంలో చెప్పారు. వాటితోపాటు తనకి ఇష్టమైన మరొక ఏడు కథలు చేర్చి రావిశాస్త్రిగారివి మొత్తం పది కథల జాబితా ఒకటి కల్యాణరామారావుగారు చెప్పారు. ఆ పదింటిలోనూ వర్షం లేదుగాని, రావి శాస్త్రి కథలన్నిటిలోనూ నాకు చాలా ఇష్టమైన ఒక కథ పేరు చెప్పమంటే మాత్రం వర్షం కథనే చెప్తాను. అది సార్వకాలికమైన, సార్వజనీనమైన కథ. శీలం సురేంద్ర కథలో కూడా ఇతివృత్తం అదే. కాని అంతకన్నా మరింత గ్రాఫికల్ గా, ఒక షార్ట్ ఫిల్మ్ చూపిస్తున్నంత ఉత్కంఠభరితంగా ఓడిపోయిన వాన కథ మనల్ని చదివిస్తుంది.
సురేంద్ర పూర్వపు కర్నూలు జిల్లాలో ఇప్పుడు నంద్యాల జిల్లాలో భాగమైన ఆళ్ళగడ్డ, కోయిలకుంట్ల ప్రాంతానికి చెందిన యాసలో కథలు చెప్పాడు. తెలుగులో కళింగాంధ్ర మాండలికంలో సాహిత్యం 1892 లోనే వచ్చిందిగాని, కర్నూలు జిల్లా మాండలికంలో కథలు రావడానికి ఇన్నేళ్ళు ఆగవలసి వచ్చింది. పశ్చిమ కర్నూలు జిల్లా దక్షిణ ప్రాంత మాండలికంలో కొన్నేళ్ళ కిందట నాగప్పగారి సుందర్రాజు రచనలు చెయ్యగా, ఉత్తరప్రాంతంలోని ఎమ్మిగనూరు మాండలికంలో మారుతి పౌరోహితం ఈ మధ్య కథలు రాస్తున్నారు. కాని నంద్యాల ప్రాంతపు మాండలికంలో ఒక కథాసంపుటి రావడం సురేంద్రతోనే మొదలు అని వెంకటకృష్ణ పార్వేట పుస్తకానికి ముందుమాటలో రాసేడు. ఇద్దరు పిల్లలు ఒక పార్కులో కూచుని నంద్యాల ప్రాంతపు యాసలో మాట్లాడుకుంటున్న ఒక వీడియో క్లిప్పు ఒకటి, ఆ మధ్య, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఆ వెనువెంటనే అమెరికాలో తెలుగువాళ్ళ ఒక వేడుకలో ఆ యాస మాట్లాడుకున్న పిల్లల్ని అనుకరిస్తూ ఒక ఫాన్సీ డ్రెస్ పోటీ జరిగిందని కూడా విన్నాను. మనుషులకి మాతృభాష పట్ల ఎంత మక్కువ ఉంటుందో, తల్లి యాస పట్ల అంతకన్నా మించిన పేగుబంధం ఉంటుంది. కాబట్టే ఏ ప్రాంతం నుంచైనా ఆ యాసలో సాహిత్య సృష్టి చేసిన రచయితని మాత్రమే మనం ఆ ప్రాంతానికి నిజమైన ప్రజాప్రతినిధి అని చెప్పుకోవలసి ఉంటుంది.
శీలం సురేంద్ర పార్వేట సంపుటిలో మొత్తం పన్నెండు కథలున్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ వారిని ధిక్కరించి, తొలి స్వాతంత్య్ర వీరుడిగా ప్రసిద్ధి పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నడిచిన నేల కి చెందిన కథలు అవి. ఆ ప్రాంతం నెమ్మదిగా ఒక రెడ్డిస్తాన్ గా మారిపోయిందని బాలగోపాల్ అన్నాడని వెంకట కృష్ణ తన ముందుమాటలో రాసాడు. సురేంద్ర కథల్లో ఆ ఫ్యూడల్ నీడలూ, అత్యాచారాల జాడలూ లేకుండా ఎలా ఉంటాయి? కాని నా దృష్టి వాటిమీద లేదు. ఆ కథలన్నిటి వెనకా ఒక అపురూపమైన శైశవం కనిపిస్తూ ఉంది. ఒక పసిపిల్లవాడికి మాత్రమే సాధ్యంకాగల నిర్మల నేత్రాల్తో సురేంద్ర తన చుట్టూ ఉన్న లోకాన్ని పరికిస్తూ, పరిశీలిస్తూ ఆ కథలు రాసాడనిపించింది నాకు. ఆ శైశవం ఒక విధంగా ఆ ప్రాంతంలోని మనుషుల మనసుల్లోని పసితనం కూడా. లోకం తాలూకు మాలిన్యం ఇంకా అలవాటుపడని, నిష్ఠుర వాస్తవాలతో మనసు రాజీపడని లోకం నుంచి వచ్చిన కథలు అవి. ఆ కథకుడు స్వయంగా దళితుడైనప్పటికీ, దళిత జీవితాల్లోని సంఘర్షణను కళ్ళారా చూస్తో, అనుభవిస్తో, వాటిని మనతో పంచుకోకుండా ఉండలేకపోయినప్పటికీ, ఇంకా అతని శైశవం నష్టం కాలేదనీ, ఇంకా అతడు ప్రపంచం పట్ల నమ్మకం పూర్తిగా కోల్పోలేదనీ అనిపించింది నాకు. ఈ పార్శ్వంలో కూడా రావిశాస్త్రికి అతడు వారసుడే. ఎందుకంటే, సురేంద్ర రాసిన ‘సూరిగాడునల్లకోడి’, ‘మాయన్నగాడు’ లాంటి కథల్ని రావిశాస్త్రి ‘పువ్వులు’ కథతో పోల్చి చూడండి. నా మాటలు అతిశయోక్తికాదని మీకు తప్పకుండా అనిపిస్తుంది.
పురస్కారం పొందిన మరొక రచయిత శ్రీ ఊహ ‘ఇసుక అద్దం’ (2023) కథాసంపుటికి ఇప్పటికే చాలా పురస్కారాలు లభించాయి. ఆ సంపుటిలో ఉన్నవి పదిహేను కథలే అయినప్పటికీ వాటి ప్రపంచం చాలా పెద్దది. మొగల్రాజపురం గుహలనుంచి డౌన్ టౌన్ దుబాయిదాకా రచయిత్రి ఒక విస్తృత ప్రపంచాన్ని చాలా దగ్గరగా చూసినట్టుగా కథలు మనకి సాక్ష్యమిస్తాయి. కిందటి శతాబ్దంలోని గొప్ప తెలుగు కథకుల కన్నా ఇప్పుడు కథలు రాస్తున్న ఇటువంటి యువకథకులు ఒక అడుగు ముందున్నారని చెప్పడానికి ఈ కథల్లో కనిపించే వస్తువైవిధ్యం ముఖ్యకారణం. పూర్వపు రచయితలు గొప్ప కథలే రాసి ఉండవచ్చుగాని, వారు చూసిన ప్రపంచం చాలా చిన్నది. వారికి తెలిసిన వాస్తవాలకి చాలా పరిమితులున్నాయి. కాని ఇప్పటి కథకులు తమ చుట్టూ ఒక గిరిగీసుకుని కూచోడానికి ఇష్టపడటం లేదు. తమ కథలు ఒక మూస జీవితాన్ని చిత్రిస్తూనే ఉండాలని వాళ్ళు కోరుకోవడం లేదు. చిత్రకారులు చిత్రలేఖనాలు గీయడంకోసం కొత్త కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా ఈ రచయితలు తమ కథకోసం కొత్త ఇతివృత్తాల్ని, ఇప్పటిదాకా ఎవరూ చూసి ఉండని, స్పృశించి ఉండని వాస్తవాల్ని అన్వేషించుకుంటూ పోతున్నారు. ఇటువంటి వస్తు వైవిధ్యమే ఝాన్సీ పాపుదేశి ‘దేవుడమ్మ’ కథాసంపుటిలో నాకు కనిపించింది. ఇప్పుడు ఈ ‘ఇసుక అద్దం’ కథల్లో కూడా. చెరువుల్లో దూకి శవాల్ని బయటకు లాగే శవాల శివ మొదలుకుని, సూపర్ వుమన్ గా కాకుండా స్మార్ట్ వుమన్ గా మారాలనుకునే సాఫ్ట్ వేరే ఉద్యోగినుల దాకా శ్రీ ఊహ చూసిన ప్రపంచం చాలా పెద్దది.
ఈ కథలన్నిటి సారాంశాన్నీ ఒక్క మాటలో చెప్పమంటే ‘ఇజ్జత్’ అంటాను. ‘ఇసుక అద్దం’ కథలో కథానాయిక తనని ప్రేమించిన పిల్లవాడితో తనకి అతడంటే ఇష్టమేగాని తనని ‘ఇజ్జత్ తో తీస్కపో ‘ అంటుంది. ఈ ఇజ్జత్, స్వాభిమానం కాదు, స్వాతిశయంకాదు. సాధికారికత వల్ల మాత్రమే సిద్ధించే ఆత్మగౌరవం అది. ఆత్మగౌరవం వల్ల మాత్రమే సిద్ధించే సాధికారికత అది. అందుకనే శ్రీ ఊహ కథలన్నిటిలోనూ ఒక assertive personality కనిపిస్తుంది. తమ జీవిత ప్రాధాన్యాల పట్ల అటువంటి వక్కాణింపు స్త్రీలకి మాత్రమే కాదు, అసలు ప్రతి ఒక్క మనిషికీ అవసరమే. ఈ ప్రపంచంలో మనుగడ కొనసాగించడం ఎంత అవసరమో, ఎప్పటికప్పుడు నీ విలువల్నీ, నీ మానవత్వాన్ని నొక్కి వక్కాణించుకుంటూ కొనసాగించడం అంతకన్నా ఎక్కువ అవసరం. ఒకప్పుడు అభ్యుదయ రచయితలు మనుషులు సామాజికంగానో లేదా ఆర్థికంగానో సమస్యలనుంచి బయటపడితే చాలనుకున్నారు. కాని ఇప్పటి తరానికి సమస్యలనుంచి బయట పడితే చాలదు, అది ‘ఇజ్జత్ ‘ తో బయటపడేదిగా ఉండాలి. పదేళ్ళ కిందట స్త్రీవాదులు స్త్రీల జీవితాల గురించి కథలు రాసినప్పుడు వాటిని రాజకీయకథలుగా సరిగానే నిదానించారు. కాని ఇప్పటి స్త్రీలు రాస్తున్న కథలు కేవలం రాజకీయ కథలు కావు. ఇవి ఆత్మగౌరవరాజకీయ కథలని చెప్పాలి.
శ్రీ ఊహని కూడా రావిశాస్త్రి, కొ.కుల వారసురాలిగా చెప్పడానికి ఆట్టే ఆలోచించనవసరం లేదు. ఉదాహరణకి ఆమె రాసిన ‘వడ్డాణం’ కథ స్పష్టంగా కొ.కు తరహా కథ. కాని అది ఇప్పటి రచయిత్రిమాత్రమే రాయగల కథ. యాభై ఏళ్ళ కిందట కొ.కు చూసిన మధ్యతరగతికి చెందిన కథనే ఈ కథ కూడా అయినప్పటికీ ఈ యాభై ఏళ్ళల్లో సంభవించిన పరివర్తన లేకుండా ఈ కథలో పాత్రలు అలా మాట్లాడలేవని మనం చెప్పవచ్చు. అలానే ‘ఎర్రచీర’ అనే కథని రావిశాస్త్రిగారి ‘కార్నర్ సీటు’ కథతో కలిపి చదివి చూడండి. కథకుడు అన్నిటికన్నా ముందు తనలోని మానవత్వాన్ని సాక్షాత్కరింపచేసుకోడానికే కథలు రాస్తాడేమో అనిపిస్తుంది.
కాని పురస్కారం పొందిన ముగ్గురు కథకుల్లోనూ కూడా రావిశాస్త్రికి పూర్తి వారసుడని చెప్పదగ్గ రచయిత మల్లిపురం జగదీశ్. ఇప్పటి మన్యం జిల్లాలోని పి.ఆమిటి గ్రామానికి చెందిన జగదీశ్ సవర గిరిజనుడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ‘శిలకోల’ (2011), ‘గురి’ (2018) కథాసంపుటాల ద్వారా, ‘దుర్ల’ కవితాసంపుటి ద్వారా తెలుగు పాఠకలోకాన్ని ఆకట్టుకున్నాడు. ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నాడు. కాని ఈసారి పురస్కారం పొందిన ‘అడవిపూల దారుల్లో’ (2023) సంపుటిలో ద్వారా ఆయన తనని తాను అధిగమించుకున్నాడు. ఈ సంపుటిలో ఉన్న 34 రచనలూ కథలు కావు, కవితలు కావు, వ్యాసాలు కావు, ముచ్చట్లు కావు. ఏ ఒక్క ప్రక్రియలోనూ ఇమడని జీవితచిత్రాలూ, జీవితసత్యాలూను. ఒకప్పుడు రావూరి భరద్వాజ ‘జీవన సమరం’ పేరిట వెలువరించిన జీవితచిత్రాలతో వీటిని కొంతవరకూ పోల్చవచ్చు. పుస్తకం మన మనసులో కలిగించే అనుభూతిలో వీటిని ‘అమరావతి కథల’ తో పోల్చవచ్చు. కాని ఈ రచనలో జగదీశ్ ఎలుగెత్తి వినిపించిన ఆక్రోశం, ఆవేదనలకు మాత్రం పోలికలేదు. ఇంతకు ముందు ఆయన వెలువరించిన ‘గురి’ కథాసంపుటిలో గిరిజనుల జీవితాన్ని చిత్రించిన కథలు కొన్ని నలభై, యాభై ఏళ్ళ కిందటివి, కొన్ని ఇటీవలి కాలానివి. అందుకని ఆ కథల్లో కనవచ్చేది ‘గతవర్తమానం’ . కాని ఈ పుస్తకంలో కనిపిస్తున్న దృశ్యాలు పూర్తిగా ఇప్పటివి. మనం ఒకపట్టాన అరాయించుకోలేనివి. అంత తేలిగ్గా పక్కన పెట్టేయలేనివి. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో తాను కళ్లారా చూస్తున్న వాస్తవాల్ని మనకి చూపించడంలోనూ, వాటిపట్ల తన ఆవేదనను మనతో పంచుకోవడంలోనూ జగదీశ్ ఎక్కడా నీళ్ళు నమల్లేదు. ఉన్నది ఉన్నట్టుగా, చూసింది చూసినట్టుగా మనకి నివేదించడం మాత్రమే కాదు, వాటిపట్ల తాను వెలిబుచ్చే అభిప్రాయాల్లో ఆయనలో రావిశాస్త్రి, భూషణం, కాళీపట్నం రామారావుల కళింగాంధ్ర స్ఫూర్తి ప్రజ్వలంగా కనిపిస్తున్నది. ఆ పుస్తకం చదువుతున్నంతసేపూ ఎన్నో వాక్యాలు అండర్ లైన్ చేసుకోకుండా ఉండలేకపోయాను. అవి మామూలు వాక్యాలు కావు. ఉదాహరణకి, ఈ వాక్యం చూడండి. యుద్ధం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ ఇలా అంటున్నాడు:
‘భయపడినోడు బలప్రదర్శన సెయ్యడమే వుద్దం.’
ఇది ఒక రావిశాస్త్రి మాత్రమే రాయగల వాక్యం. కాని మరికొన్ని వాక్యాలున్నాయి. అవి రావిశాస్త్రి కూడా రాయలేని వాక్యాలు. ఉదాహరణకి, గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు కనీసం మందో, మాత్రనో దొరకని కారణం చేత గిరిజనులు చనిపోతూ ఉన్న దృశ్యాన్ని చూసినప్పుడు మనం ఇలా అనుకోవచ్చు:
‘ఇమానాల్లో సులువుగా ఎగురుతున్న కాలంలో మనకింకా మాత్ర అందక పోవడం విషాదం.’
రావిశాస్త్రిని ఈ వాక్యం రాయమంటే ఇలా రాస్తాడని ఊహించగలం:
‘ఇమానాల్లో సులువుగా ఎగురుతున్న కాలంలో మనకింకా మాత్ర అందక పోవడం పెద్ద కుట్ర.‘
కాని జగదీశ్ ఇలా రాస్తున్నాడు:
‘ఇమానాల్లో సులువుగా ఎగురుతున్న కాలంలో మనకింకా మాత్ర అందకపోవడం దండయాత్ర.‘
ఇక్కడ దండయాత్ర అన్నమాట వాడడంలో జగదీశ్ ఎంత మాత్రం పొరపడలేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడడం కోసం చత్తీస్ గఢ్ అడవుల మీద బాంబులతో విరుచుకుపడడం దండయాత్రగాక మరి ఏమిటి?
కాబట్టే అతడు పాలకుల్ని ఉద్దేశించి ఇలా కూడా అంటున్నాడు:
‘దండయాత్ర కన్నా సులభమైంది ప్రేమించడం. సులభమైనదాన్ని వదిలి కష్టమైన దాన్ని ప్రయోగిస్తున్నావు.’
బాగా రాయాలని అనుకుని కాదు, ఎలా రాయాలో, ఎలా చెప్పాలో తెలీని ఆవేదనతో రాసినప్పుడు మాత్రమే వాక్యాలు నిజంగా చురకత్తుల్లాగా మారతాయి. ఈ వాక్యాలు చూడండి:
‘తిరుగుబాటు లేకపోతే జరుగుబాటు లేదు.‘
‘ఒకడి అభివృద్ధిని మరొకడు నిర్వచించడమే పొగబెట్టడం.’
‘నగరం ఎంత ప్రమాదకరమైందో అంత అత్యవసరం కూడా.‘
వారం వారం ఈ భావాలు పంచుకుంటున్నప్పుడు జగదీశ్ ఉద్దేశ్యం ఒక్కటే:
‘ఒక కథ చెప్పాలి. ఆ కథ వాస్తవమై ఉండాలి. అది మనదై ఉండాలి. మననం చేయక తప్పనిదై ఉండాలి. రేపటికి దారి చూపేదై ఉండాలి.’
జగదీశ్ ఇంతకుముందు వెలువరించిన కథాసంపుటాల్లో గతం, వర్తమానం రెండే ఉన్నాయి. కాని ఈ కథల్లో గిరిజన జీవితానికి సంబంధించిన ముఖ్యపార్శ్వాలన్నీ ప్రతి ఒక్కటీ మూడు దశల్లో కనిపిస్తాయి. అప్పు, రోడ్డు, జీడిమొక్క, గురువు ప్రవర్తన-ప్రతి ఒక్కటీ డెబ్భైలకు ముందు ఎలా ఉండేవీ, ఈ యాభై ఏళ్ళల్లో ఎలా మారుతూ వచ్చేయీ, ఇప్పుడే కొత్త అవతారంతో కనిపిస్తున్నాయీ- వాటి రూపురేఖల్ని పోల్చుకోవడంలో జగదీశ్ ఎక్కడా పొరపడలేదు.
ఒకప్పుడు ఆఫ్రికాలో కలోనియలిజం వల్ల గిరిజన తెగల్లో సంభవించిన పరిణామాల్ని చినువా అచెబె మూడు నవలలుగా రాసాడు. Things Fall Apart (1958), No Longer at Ease (1960), Arrow of God (1964). ఆ మూడింటిలోనూ ప్రధానంగా కనవచ్చేది గిరిజనదేవతల మరణం. థింగ్స్ ఫాల్ అపార్ట్ చదువుతున్నప్పుడు నాకు నైజీరియాలోని ఇగ్బొ తెగ గురించి చదువుతున్నట్టు అనిపించలేదు. మా శరభవరంలో కొండరెడ్ల గురించే చదువుతున్నట్టు అనిపించింది. ఆ గిరిజనుల మాంత్రిక దేవతా ప్రపంచం నా కళ్ళముందే ముడుచుకుపోవడం చూసాన్నేను. జగదీశ్ ఈ పుస్తకంలో కూడా దేవతలు అదృశ్యం కావడం గురించి పదే పదే శోకిస్తూ ఉన్నాడు. ఇప్పమొగ్గల గురించి రాస్తూ ‘మొగ్గలు ఎండేసిన వీథి దేవుడు నడిచిన దారి’ అని రాస్తాడు. ఎన్నోసార్లు గుమ్మలక్ష్మిపురం అడవుల్లో ఇప్పపూల ఋతువులో ప్రతి ఇప్ప చెట్టూ కిందా సవరదేవతలు విడిది చేసి ఉండటం నేను కళ్ళారా చూసాను. కాని ఇప్పుడు ఆ చెట్లూ లేవు, ఆ దేవతలూ లేరు. ఒక మహోజ్వలమైన ఆదివాసి శకం అంతరించడాన్ని చూడవలసి రావడం జగదీశ్ దురదృష్టం. కాని ఆ కథలు అతడు చెప్తుంటే వినగలగడం మాత్రం మన అదృష్టం.
కుమార్ కూనపరాజుగారూ, ఉదయిని సంస్థా చేపడుతున్న ఈ కార్యక్రమాలు చిరకాలంపాటు జయప్రదంగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను.
30-7-2024


రావి శాస్త్రి ని చదవడం కోస్తా ఆంధ్ర వాళ్లకి అప్పట్లో ఓ ఫాషన్…. నాట్ paassion
రావిశాస్త్రిగారి, వారి సాహితీవారసుల రచనల గురించి ఇంత విలువైన సమాచారం, బంగారానికి తావి అద్దనట్లున్న మీ వ్యాఖ్యానం, విశ్లేషణ మనసుని ఆకట్టుకున్నాయి, ఆహ్లాద పరిచాయి. ఇన్ని మంచి పుస్తకాలు పరిచయం కావడం అదృష్టం కూడా. తెలుగు పాఠకలోకం మీకు ఋణపడి ఉంటుంది. అభివందనాలు.
ధన్యవాదాలు సార్!
గొప్ప విశ్లేషణ. మనస్సుకు హత్తుకుంది. ఆ పుస్తకాలు నవోదయ లో దొరుకుతాయో..ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు సార్!
గొప్ప వ్యాసం. ధన్యవాదాలు సార్.
ధన్యవాదాలు సార్!
రావిశాస్త్రి అనగానే రత్తాలు రాంబాబు అనే బడుగ జీవుల శీర్షిక గుర్తొస్తుంది. పత్రికల ప్రభ ప్రసరించిన సమయంలో ఎందరో రచయితలు తమ ప్రభావాన్ని పాఠకులపై కలిగించగలిగారు. ముగ్గురు పురస్కార గ్రహీతలను వారు ఏవిధంగా పురస్కారాలకు అర్హులో , ఏ విధంగా రావిశాస్త్రి వారసులో చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు. మీ కితాబు వారి పురస్కారాలకు కలికి తురాయివంటిది. అభినందనలు మీకూ వారికీ.
ధన్యవాదాలు సార్