అనిపిస్తున్నది అనిపిస్తున్నట్టుగా

చిత్రకారుడు ప్రధానంగా ఎదుర్కునే సమస్య కంటికి కనబడుతున్న దృశ్యాన్ని చిత్రంగా మార్చడం ఎలా అన్నది. మామూలుగా, బొమ్మలు వెయ్యడం సులభం అనే అనిపిస్తుంది, ఎంతో కొంత చేయి తిరిగిన చిత్రలేఖకుడికి అది మరీ సులభమనే అనిపిస్తుంది, కానీ తీరా కంటికి కనబడుతున్న దాన్ని బొమ్మగా గియ్యడానికి పూనుకునేటప్పటికి తెలుస్తుంది అదెంత కష్టమో. కంటికి కనబడేది గియ్యడం చాలా సులువనుకుంటాంగాని, కంటికి కనిపించేది గియ్యడం కన్నా కష్టమైన పని మరొకటి లేదు.

చిత్రలేఖనం నేర్చుకునేటప్పుడు సాధారణంగా చెప్పే పాఠం ఏమిటంటే నువ్వు కంటికి ఏమి కనిపిస్తోందో అది గియ్యి, అక్కడ ఏమి ఉందనుకుంటున్నావో అది కాదు అని. ఎందుకంటే మనం గీసిన బొమ్మ వాస్తవంగా ఉందనిపించాలంటే మనం దృగ్భ్రమ మీద ఆధారపడవలసిందే. ఉదాహరణకి మన ఎదట రోడ్డుకి అటూ ఇటూ చెట్లవరసలు ఉన్నాయనుకోండి. మనం చూసినప్పుడు దగ్గరగా ఉన్న చెట్లు పొడుగ్గానూ, దూరంగా ఉన్న చెట్లు పొట్టిగానూ కనిపిస్తాయి. కాని అది వాస్తవం కాదని మనకు తెలుసు. అలాగని మనం చెట్లు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా ఒకే ఎత్తులో ఉన్నట్టుగా గీసామనుకోండి, చూసేవాళ్ళకి ఆ బొమ్మ వాస్తవంగా అనిపించదు. చిన్నపిల్లవాడు గీసినబొమ్మలాగా ఉందనుకుంటారు.

అయిదు వందల ఏళ్ళ యూరపియన్ చిత్రలేఖనం ఈ సూత్రాన్ని పట్టుకునే ప్రయాణం చేసి, చివరికి, దీన్ని ఉల్లంఘిస్తే తప్ప, చిత్రకారుడు తాను నేర్చుకున్న దంతా మర్చిపోయి మళ్లా చిన్నపిల్లవాడిలాగా బొమ్మలు గీస్తే తప్ప చిత్రకారుడు స్వతంత్రుడు కాలేడని గుర్తుపట్టింది. ఒక దృగ్విషయాన్ని ఉన్నదున్నట్టుగా కాక, కనిపిస్తున్నది కనిపిస్తున్నట్టుగా చిత్రించడానికి దారి చూపే ఈ సూత్రాన్నే perspective అని అంటారని మనకు తెలుసు. పందొమ్మిదో శతాబ్దం చివరిరోజులనుంచే యూరపియన్ చిత్రకారుడు ఈ పెర్ స్పెక్టివ్ తాలూకు సంకెళ్ళనుంచి బయటపడటానికి పెనగులాడటం మొదలుపెట్టాడు. కాని రినైజాన్స్ యూరోప్ కన్నా కొన్ని వేల ఏళ్ళ ముందే గుహల్లో జంతువుల్ని చిత్రించిన ఆదిమానవుల మొదలుకుని, పిరమిడ్లలో వర్ణచిత్రాలు గీసిన ఈజిప్షియన్ చిత్రకారులు మొదలుకుని, ప్రాచీనా చీనా, జపాన్ నీటిరంగుల చిత్రకారుల్తో పాటు, భారతదేశంలో భీం బేట్క నుంచి అజంతా దాకా, బెంగాల్ పటచిత్రకారులనుంచి చోళకాలం నాటి కుడ్యచిత్రకారుల దాకా చిత్రకారులెవరూ perspective ని పట్టించుకోలేదు. వాళ్ళు తమ కళ్ళు చూస్తున్నదాన్ని కాక, మనసు చూస్తున్నదాన్ని చిత్రించడం మీదనే దృష్టిపెట్టారు.

ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో పారిస్ లో ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు వచ్చిన ఆఫ్రికన్ మాస్క్ ల్ని చూసేదాకా యూరపియన్ చిత్రకారుడికి ఈ సంగతి తెలియదు. కాని ఒకసారి ఆఫ్రికన్ ఆదిమ చిత్రకళని చూడగానే అతడు పూర్తి ఆధునిక మానవుడిగా హటాత్పరిణామానికి లోనయ్యాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనకి తెలుసు.

ఆధునిక చిత్రకళ గురించి మీకందరికీ తెలిసిన ఈ కథనాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సత్యం కూడా మనకొక సంకెలగా మారిపోయిందనీ, మనం మళ్లా దీన్నుంచి బయటపడక తప్పదనీ. నిజానికి, మనసు చూసింది చిత్రించాలంటే, బాహ్యదృశ్యం నుంచి దూరంగా జరిగిపోడం కాదనీ, నువ్వు చూస్తున్నదాన్ని, నీ భాషలో అనువదించి నలుగురికీ వినిపించడమేననీ చెప్పడానికి.

చూసింది చూసినట్టుగా చిత్రించేదాన్ని perceptual art అనీ, కళ్లతో చూసింది కాక, అంతర్నేత్రంతో సంభావించేదాన్ని చిత్రించడం conceptual art అని అంటారనీ తెలిసిందే. బాహ్య దృశ్యం నుంచి చిత్రకారుడు ఎంత దూరంగా జరిగితే అతడు అంత కళాతపస్వి అని భావించే ధోరణి ఒకటి ఇరవయ్యవశతాబ్దమంతా బలంగా నడిచింది. దానికి విరుద్ధంగా, బాహ్యదృశ్యాన్ని ఒక icon గా, motif గా, pattern గా, అలంకారంగా చిత్రించే ధోరణి కూడా ఒకటి అంతే బలంగా వర్ధిల్లుతూ వచ్చింది. యూరప్ కి బయట దేశాలకు చెందిన చాలామంది చిత్రకారులకు అంతర్జాతీయంగా లభించిన commercial success, వారికి లభించిన ప్రకాస్తి ప్రధానంగా ఈ ధోరణి వల్లనే లభిస్తూ వచ్చింది. కాని నా దృష్టిలో వాళ్ళు నిజమైన చిత్రకారులు కానే కారు.

నిజమైన చిత్రకారుడి చిత్రలేఖనంలో అపారమైన సంఘర్షణ ఉంటుంది. అది సదా తన కంటిముందు కనిపిస్తున్నదానికీ, అది తన మనసులో కలిగిస్తున్న సంవేదనలకీ మధ్య ఒక సమన్వయం సాధించుకోవడమెలా అని తపిస్తూ ఉంటుంది. ‘తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం’ అని చలంగారు అన్నారని మనకు తెలుసు. కాని ఆ వాక్యంలో ఒక ముఖ్యమైన clause ని మర్చిపోతూ ఉంటాం. ‘ సామరస్యం కుదిరిందాకా’ అన్నది ఆ నిబంధన. సామరస్యం కుదిరిన తర్వాత ఇక కవిత్వంతో పనే ఉండదు. సామరస్యం కుదిరిన తర్వాత కూడా కవిత్వం రాస్తే అతడిని ఋషి అంటాం గాని కవి అనం. ఈ క్లాజు చిత్రలేఖనానికి కూడా వర్తిస్తుంది.

నిజమైన చిత్రలేఖకుడి చిత్రాల్లో ఈ tension ప్రస్ఫుటంగా ఉంటుంది. అతడు చిత్రిస్తున్నది బయటిదృశ్యంలాగా కనిపిస్తుందిగాని, నిజానికి అతడు దాని వ్యాఖ్యానాన్ని చిత్రిస్తున్నాడు తప్ప, ఆ దృశ్యాన్ని కాదు. అలా తన కంటిముందు కనిపిస్తున్న దృశ్యాన్ని తాను వ్యాఖ్యానించుకుంటున్నప్పుడు అతనిలో బుద్ధి, హృదయం, వాటి పిలుపుని అందుకోలేక ఇంద్రియాలు పడే అవస్థా, ఆ సంచలనం మొత్తం మనకి ఆ చిత్రలేఖనంలో కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మాత్రమే ఆ చిత్రలేఖనం చూపరులని వెంటాడుతుంది.

ఉదాహరణకి వాన్ గో చిత్రించిన Starry Night చూడండి. మనకు తెలిసిన ఆ నక్షత్రనిశీథి కూడా అలా ఉండదు. ఏ రాత్రీ అలా ఉండదు, ఏ చుక్కలూ అలా ఉండవు, ఏ ఇళ్లూ అలా ఉండవు. కానీ ఆ నక్షత్రనిశీథిని చూడగానే మనకు ఆ రాత్రి చిరపరిచితమనే అనిపిస్తుంది. మనం ఎన్నో ఏళ్ళుగా చూస్తూ వస్తున్న ప్రతి ఒక్క చుక్కల రాత్రిలోనూ మన మనసు చూస్తున్న నక్షత్రనిశీథి అదేనని మనకి ఎవరూ చెప్పకుండానే స్పష్టంగా తెలిసిపోతున్నట్టు ఉంటుంది.

అందుకనే, ఒక్కసారన్నా ఆరుబయటకు పోయి బొమ్మలు వెయ్యాలని ప్రతి రోజూ అనిపిస్తూంటుంది. అలాగని నేనొక గొప్ప చిత్రకారుణ్ణని కాదు. అలా బయటకి పోయి నా ఎదట కనిపిస్తున్న దృశ్యాన్ని నాకై నేను వ్యాఖ్యానించుకోవడం నా మటుకు నాకొక ప్రార్థనలాగా అనిపిస్తుంది. ఇంద్రియాలకు పట్టుబడని ఒక కైవల్యసౌందర్యాన్ని ధ్యానంలో దర్శించడానికి ప్రయత్నించినట్టే, నేను చూస్తున్న దృశ్యాన్ని, ఉన్నది ఉన్నట్టుగానో, కనిపిస్తున్నది కనిపిస్తున్నట్టుగానో కాక, అనిపిస్తున్నది అనిపిస్తున్నట్టుగా పట్టుకోవాలని పట్టలేనంత కోరిక పుడుతుంది.

అదిగో, అలాంటి కోరికలోంచే, ఈ మాన్ సూన్ సాయంకాలం, కొత్వాలు పేట ఫారెస్టు నర్సరీలో నిలబడి మబ్బుపట్టిన ఆకాశాన్ని చిత్రించడానికి ప్రయత్నించాను.

చిత్రించడానికి కాదు, వ్యాఖ్యానించడానికి.

29-6-2023

7 Replies to “అనిపిస్తున్నది అనిపిస్తున్నట్టుగా”

  1. అద్భుతంగా చిత్రించారు మీ మనో భావాలను అని అనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.
    నేను urban sketchers Hyderabad వారితో కలిసి ఆదివారాలు ఏదో ఒక చోటికి వెళ్ళి చిత్రలేఖనం చేస్తూవుంటాను. నాకు నచ్చే పని. ఎదుటి దృశ్యాన్ని చూశాక మనసులో కలిగే స్పందనను గీతల్లోకి రంగుల్లోకి మలచడం కష్టమైన పనే గాని ఏదో ఒక రోజు అది సాకారమవుతుందన్న నమ్మకముంది.
    ప్రస్తుతం న్యూయార్క్ లో అమ్మాయి దగ్గరకు వచ్చా.సరంజామా అంతా వెంట తెచ్చుకున్నా నగరాన్ని చిత్రించాలని..

  2. చిత్రలేఖన పాఠాలు తెలియని నాలాంటి వారికి ఇది చక్కని సోదాహరణ పాఠం. కనిపించింది కాకుండా అనిపించింది చిత్రించే ముందు ఆ అనిపించడం అనుభవంలోకి రావాలి. మీకు కృతజ్ఞతలు.

  3. ఎంతో అద్భుతంగా ఉన్నాయి చిత్రాలు. నాకో అలవాటు ఉంది. ఉన్నది జన్నట్టు అనేయ్యడం. కేవలం రచనలు, కవిత్వాలలో. నాకు ఏదో వచ్చని కాదు. ఒక చిన్న పదమేనా సరే టక్కున హృదయానికి హత్తుకునేదయి ఉండాలి. నిజంగా అనిపిస్తున్నది అనిపిస్తున్నట్టుగా అనడం.
    నేను కూడా ఎప్పటిలాగే ఆరుబయట మీకు కనిపించకుండా మీ ఆవిష్కరణ ని చూస్తూనే ఉన్నాను.
    మీరు రాస్తున్న వాక్యాల, పదాల సొంపు ఎలాంటిదో చదువుతుంటేనే ఒక చల్లని గాలి వచ్చి వీచి మళ్లీ వస్తానని చెపినట్టు… మీరు వేస్తున్న చిత్ర రాజం ఊహకు అందినట్టే ఉండి చూడగానే ఆకట్టుకుంది.
    సర్. ఊరికే పొగిడితే తెలిసిపోతుంది.
    మనసారా అనే మాటల్లో నిజం అర్థమయిపోతుంది.
    నమోనమః

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading