ఋతుపవనాల అడుగుజాడల్లో

సాధారణంగా వసంతకాలం రంగుల కాలమని అనుకుంటాం గానీ, నెమ్మదిగా పరికించినప్పుడు ఋతుపవనకాలంలో కనిపించే రంగులు కూడా తక్కువేమీ కాదనిపిస్తుంది. నిన్నా, మొన్నా శ్రీశైలం వెళ్ళివస్తూన్నప్పుడు దారిపొడుగునా దివిటీలు పట్టినట్టుగా ధగధగలాడే తురాయిచెట్లు, వాటినిండుగా పూసిన ఎర్రనిపూలగుత్తుల చుట్టూ అల్లుకున్న ఆకుపచ్చని నీడలు, ఆ నీడల్లో వడగడుతున్న వింతవెలుగు, కనుచూపుమేరంతా నేలపొడుగునా తొలివానలకి పరుచుకుంటున్న పచ్చిక, కొంతసేపు మబ్బుల నల్లని పారదర్శకపు కాంతిలోనూ, మబ్బులు తొలగిపోయాక, మిగిలిన మేఘాలు దూదిపింజల్లాగా తేలుతుంటే, వాటిమధ్య తళుకులీనే నీలాకాశం, సాయంకాలమవుతుండగా, కొండలమీదా, దారులమీదా, దారి పక్క గ్రామాల మీదా అల్లుకుంటున్న పసిడివెలుగు-భూమ్మీద ఋతుపవనం విసిరే రంగులవలలో ఇంద్రచాపంలోని ఏడురంగులూ కనిపిస్తాయని అర్థమయింది.

ఇంతలోనే ఎక్కణ్ణుంచి వస్తాయో, ఆకాశమంతా అల్లుకుని కురిసేపోయే కారుమబ్బులు, ఇంతలోనే ఎక్కడికి వెళ్లిపోతాయో తెలీదు. ఒకప్పుడు ఆ మబ్బుల్ని చూసి ఒక ప్రాచీన కవి ‘మార్గం తావత్ శ్రుణు కథయత స్తత్వ్ప్రయాణానురూపం’ అని మేఘం ఏ దారిన ప్రయాణించాలో కూడా చెప్పాడు. కానీ మనం కూడా ఆ మబ్బులవెంబడే అవి పయనించే దారిలోనే ప్రయాణిస్తో పోతే ఎలా ఉంటుంది! ఆ మబ్బులు ఏ దారుల్లోంచి, ఏ గ్రామాలమీంచి, ఏ కొండలమీంచి, ఏ అడవులమీంచి, ఏ నగరాలమీంచి ప్రయాణిస్తాయో, మనం కూడా ఆ దారుల వెంబడి ఆ మబ్బులనీడలో ఆ మేఘవేగంతో పయనిస్తే ఎలా ఉంటుంది! ఒక కొత్త ద్వీపాన్నో, ఒక శిఖరాన్నో, ఒక కొత్త సముద్రాన్నో వెతుక్కుంటో ప్రయాణాలు చేసిన సాహసికుల గురించి విన్నాంగాని, ఋతుపవనాల వెంబడి అవి సాగే దారిన తాను కూడా సాగాలని కోరుకున్నవాళ్ళెవరయినా ఉంటారా?

కిందటేడాది నేను When Peacocks Dance పుస్తకం తెప్పించుకున్నప్పుడు, అందులో జూహీ సిన్హా సంకలనం చేసిన రచనల్లో, అటువంటి ప్రయాణకథనం ఒకటి కనిపించి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. Alexander Frater అనే ఒక బ్రిటిష్ విలేఖరి, యాత్రాకథకుడు, భారతీయ ఋతుపవన ప్రేమికుడు భారతీయ ఋతుపనాల దారి వెంబడే ప్రయాణించాడని తెలిసినప్పుడు నాకెంతో ముచ్చటవేసింది. అతడు అక్కడితో ఆగకుండా తన యాత్రాకథనాన్ని Chasing the Monsoon  (1990) అని ఏకంగా ఒక పుస్తకంగా వెలువరించాడని తెలిసినప్పుడు, ఆఘమేఘాల మీద ఆ పుస్తకం తెప్పించుకోకుండా ఉండలేకపోయాను.

తన యాత్రని అతను  A Modern Pilgrimage through India అని కూడా అభివర్ణించుకున్నాడు. ఆ మాటలు అక్షర సత్యం. ఎందుకంటే అతడు ఋతుపవనాల పేరుమీద, భారతదేశాన్ని, మనం రోజూ చూసే దేశాన్నే, కానీ మనకు తెలియని కొత్త కళ్ళతో, కొత్త రంగుల్లో చిత్రించేడు. మనకి ఇంతదాకా ఋతుపవనాల గురించి తెలిసిన సత్యం కవులూ, రచయితలూ, చిత్రకారులూ, సంగీతకారులూ పరిచయం చేసిన రంగుల్లోనూ, రాగాల్లోనూ మాత్రమే పరిచయం. కాని ఈ పుస్తకంలో వాతావరణ శాస్త్రజ్ఞుల, భూగోళ శాస్త్రజ్ఞుల, మొదటి తరం కలొనియల్ పర్యాటకుల, ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ అధికారుల, వైమానికుల, నావికుల, వెయిటర్ల, డ్రైవర్ల, ఇండియన్ సివిల్ సర్వెంట్ల కళ్లతో మనం ఋతుపవనాల్ని చూడటం మొదలుపెడతాం. ఋతుపవనాలు రాడానికి ముందు భారతదేశం మొత్తం ఎంత తీవ్రంగా ఎదురుచూస్తూంటుందో, ఆ వేడిమి, ఆ ఉక్క, ఆ చెమట, ఆ నిస్పృహ మనం కూడా అనుభవిస్తాం. ఎండకి కాగిపోయిన భారతీయ గ్రామాల్లో, నగరాల్లో మొదటి మేఘం కనబడ్డప్పుడు ప్రజల్లో కనవచ్చే ఉత్కంఠ, స్వస్థత మనకి కూడా అనుభవంలోకి వస్తుంది. మొదటి వానజల్లుని చూసి ‘అదుగో మాన్ సూన్ వచ్చేసింది’ అని అనుకోవడమూ, కాదు, ఇది మొదటి వాన మాత్రమే, మాన్ సూన్ ఇంకా రాడానికి రెండురోజులు పడుతుందనుకోడమూ- ఈ పుటల్లో కనవచ్చేటంత నాటకీయత మనకి భారతదేశంలో ఎన్నికలో, క్రికెట్ మాచ్ లో జరిగేటప్పుడు కూడా కనిపించదు.

అలెగ్జాండర్ ఫ్రాటర్ బ్రిటిష్-ఆస్ట్రేలియన్ రచయిత. ఆయన తండ్రి పసిఫిక్ సముద్రంలోని ఒక చిన్న దీవిలో క్రైస్తవ మిషనరీగా పనిచేసాడు. అతడికి మేఘాలయలో చిరపుంజిలో నివాసముండే మరొక మిషనరీతో స్నేహముండేది. వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరప్రత్యుత్తరాలు నడిచేవి. అలా ఫ్రాటర్ చిన్నప్పుడు మొదటిసారిగా చిరపుంజి పేరువిన్నాడు. అతడి తండ్రికి చిరపుంజి వెళ్ళాలనే కోరిక బలంగా ఉండేది. కాని అతడి జీవితకాలంలో ఆ కల నెరవేరలేదు. తన తండ్రి ఎంతో కలగన్న ఆ చిరపుంజిని తానొక్కసారేనా దర్శించాలన్న కోరిక ఫ్రాటర్ లో ఒక బలమైన జీవితకాలపు ఆకాంక్ష గా రూపుదిద్దుకుంది. గంగని భూమికి దింపాలన్న తన తండ్రి తాతల కోరిక నెరవేర్చడం కోసం భగీరథుడు తపస్సు చేసినట్టుగా ఫ్రాటర్ చిరపుంజి దర్శించాలనుకున్నాడు. అదేమంత పెద్ద విషయమని ఇప్పుడనిపించవచ్చు. కానీ 1987 లో, ఇంకా భారతదేశ పాలన ఇంకా లిబరలైజేషన్ యుగంలోకి ప్రవేశించని కాలంలో ఒక విదేశీయుడికి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని గ్రామాన్ని సందర్శించడానికి అనుమతి దొరకడం అసాధ్యమైన కాలంలో, ఫ్రాటర్ చిరపుంజి ప్రయాణం నిజంగానే ఒక సాహసయాత్ర. నిజానికి అందులో సాహసం కన్నా అదృష్టం పాలే ఎక్కువ. భారతీయ బ్యురోక్రేటిక్ లాబీరింత్ లోంచి అతడికి ఆ అనుమతి ఎలా దొరికిందో చదవడం మాత్రం అత్యంత ఉత్కంఠభరితమగా ఉంటుంది.

ఫ్రాటర్ చిరపుంజి వెళ్ళాలనుకోవడం ఒక ఎత్తైతే, అది ఋతుపవనాల కాలంలో వెళ్ళాలనుకోవడం మరొక ఎత్తు. అందుకోసం అతడు ఋతుపవనాల మీద వచ్చిన సమస్తసమాచారాన్నీ చదువుకున్నాడు. లండన్ లోని ఇండియా ఆఫీసు లైబ్రరీలో రీసెర్చి డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా తిరగేసాడు. ఇండియన్ మాన్ సూన్ స్టడీస్ లో ఆజానుబాహువుగా చెప్పదగ్గ వై.పి.రావు రాసిన Southwest Monsoon పుస్తకాన్ని బైబిలు పఠించినట్టు పఠించాడు. నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన డా.పి.కె.దాస్ రచన The Monsoons ని ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు.అన్నిటికన్నా ముఖ్యంగా Jay S Fein, Pamela L Stephens సంకలనం చేసిన Monsoons గ్రంథం మొత్తం కంఠోపాఠం చేసుకున్నాడు. ఈ లోపు 1986 లో అతనికి యాక్సిడెంట్ అయ్యి మెడపట్టేసింది. కఠినమైన దారుల్లో ప్రయాణాలు చేస్తే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు. కానీ, ఋతుపవనాల వెంట భారతదేశానికి అడ్డం పడిపోవాలన్న కోరిక మాత్రం అతణ్ణి వదల్లేదు. ఏమైంతేనేం, ఋతుపవనాలకి స్వయంగా స్వాగతం పలకడానికి 1987 మే చివరివారానికి ట్రివేండ్రం చేరుకున్నాడు. ఇక మే 31 నుంచి ఆయన ఋతుపవన యాత్ర మొదలయ్యింది.

ఋతుపవనాలకి రెండు బాహువులున్నాయి. ఒక బాహువు అరేబియా సముద్రమ్మీంచి మలబారు తీరం మీదుగా దేశంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అది రెండు పాయలుగా చీలి ఒక పాయ పడమటి కనుమల మీదుగా వాయవ్య భారతం వైపు ప్రయాణిస్తుంది. మరొక పాయ దక్కన్ పీఠభూమి, మధ్యభారతదేశం, ఉత్తరాది మీదుగా ప్రయాణిస్తుంది. కాళిదాసు మేఘసందేశంలో వర్ణించింది ఈ దారినే. మరొక బాహువు బంగాళాఖాతం మీంచి బెంగాల్, అస్సాం, ఈశాన్యభారతదేశం మీదుగా ఉత్తరభారతంవైపు ప్రయాణిస్తుంది. ఈ రెండింటినీ నైరుతి ఋతుపవనాలు అని అంటారని మనకు తెలుసు. వాటిలో ఈశాన్యం వైపు ప్రయాణించిన పవనాలు తిరిగి మళ్ళా తూర్పుకనుమల మీంచి దక్షిణభారతదేశం మీదుగా ప్రయాణిస్తాయి. అయితే ఇవి శీతాకాలపు ఋతుపవనాలు. భారతీయ వర్షపాతంలో నైరుతి ఋతుపవనాలది దాదాపు 75 శాతం కాగా, ఈశాన్య ఋతుపవనాలది 11 శాతం మాత్రమే.

నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో ప్రయాణిచేటప్పుడు వాటికొక కేలండర్ ఉంది. అవి సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళలో అడుగుపెడతాయి. జూన్ అయిదవతేదీనాటికి తెలంగాణాలో, ఎనిమిదో తేదీనాటికి ఆంధ్రప్రాంతంలో అడుగుపెడతాయి. జూన్ ఇరవైనాటికి మాళవప్రాంతాన్ని తాకుతాయి. అప్పటికి ఆషాఢమాసం మొదలవుతుంది. కాబట్టే కాళిదాసు మేఘసందేశంలో ఋతుపవనమేఘం ఆషాఢ ప్రథమదివసం నాడు కనబడిందని రాసాడు. ఋతుపవనాలు ఢిల్లీకి చేరుకునేటప్పటికి జూన్ నెలాఖరవుతుంది.

అలెగ్జాండర్ ఫ్రాటర్ ఋతుపవనాల్ని వెంబడించినప్పుడు కేరళ, కర్ణాటక, గోవా మీదుగా ముంబై చేరుకుని అక్కణ్ణుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళాడు.

Route followed by Alexander Frater

చిరపుంజి చేరుకోడానికి అతనికి పర్మిషన్ ఢిల్లీ నుంచి రావాలి కాబట్టి అతడు ఆ దారి ఎంచుకున్నాడు. కాని అతను అనుకున్నట్టుగా, ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అతనికి చిరపుంజిలో అడుగుపెట్టడానికి అనుమతి దొరకలేదు. అందుకని ప్రయాణం మధ్యలో ఆపి లండన్ వెళ్ళిపోయాడు. కాని మళ్ళా అనుకోకుండా కొందరు స్నేహితుల చొరవతో అతనికి అనుమతి దొరకడంతో ఈసారి నేరుగా ఢిల్లీనుంచి కలకత్తా, షిల్లాంగ్ ల మీదుగా చిరపుంజి చేరుకున్నాడు. చిట్టచివరికి ఎలాగైతేనేం, తన కలనీ, తన తండ్రి కన్న కలనీ కూడా నిజం చేసుకోగలిగేడు.

ఫ్రాటర్ ప్రయాణించిన భారతదేశం ప్రధానంగా పడమటికనుమలూ, ఢిల్లీ, ఖాసీ, గారో కొండలూ మాత్రమే. కానీ తాను తిరిగినంతమేరా అతడు చూసిన దేశం, ఆ దేశం పొడుగునా అతడు మనకి చూపించే దృశ్యాలు భారతదేశంలో ఎక్కడైనా, ఏ మూలనైనా తటస్థపడేవే. కాని అతడు వాటిని చూసిన తీరు, వర్ణించిన పద్ధతి మనకి మన దేశాన్ని మొదటిసారి చూస్తున్నట్లనిపిస్తుంది. కానీ అతని యాత్ర చదివేక, ఋతుపవనాల వెంబడి మనం చేయదగ్గ పూర్తి యాత్ర ఒకటి ఇంకా మిగిలే ఉందని నాకనిపించింది. అది జూన్ ఒకటో తేదీన కేరళలో మొదలై, కర్ణాటక, తెలంగాణా మీదుగా, ఉత్తరాంధ్ర దాటి ఒరిస్సా, బెంగాల్ మీదుగా అస్సాం దాకా చేపట్టదగ్గ యాత్ర. తెలుగువాళ్ళల్లో సాహసయాత్రీకులు చాలామందే ఉన్నారు. వాళ్ళల్లో ఎవరినైనా ఈ ప్రతిపాదన ఉత్తేజపరిస్తే అంతకన్నా కావలసిందేముంది?

కాని ఫ్రాటర్ కథనం దానికదే సాటి. ఆసక్తికరంగానూ, ఉత్కంఠభరితంగానూ ఉండే ఆ కథనాన్ని ఎవరికి వారు చదివి ఆస్వాదించవలసిందే. అయితే ఆ రుచి ఎలా ఉంటుందో చూపడానికి కొన్ని వాక్యాలిక్కడ మీతో పంచుకుంటున్నాను.


1

జూన్ 2… అతడు కమలాదాస్ కలెక్టెడ్ పొయెమ్స్ మొదటి సంపుటం నా చేతుల్లో పెట్టాడు. అప్పటికే మసకబారుతున్న వెలుగులో నేనా పుస్తకం పేజీలు తిప్పి చూసాను. ఆ కవితలు నన్ను స్పందింపచేస్తున్నట్టుగా నేను గుర్తుపట్టాను. ఒక దిగులుకీ, గతం పట్ల అస్పష్టమైన ఒక తలపోతకీ, సౌకుమార్యానికీ ఒక ప్రతీకగా ఆ పద్యాల్లో ఋతుపవనం కనిపించింది. ‘కరువుకాలంలో’ అనే ఒక కవితలో ఆమె ఇలా అంటున్నది:

ప్రతి రాత్రీ నా చిన్నబిడ్డ నిద్రలోంచి మేల్కొని
నన్ను చుట్టుకుపోతున్నప్పుడు, కురవలేని కన్నీటితో
నేను బరువెక్కిపోతుంటాను. తొలకరి పడేముందు
కారుచీకటి వన్నె తిరిగిన నింగిలా..

అలానే మరొక కవితలో ఇలా రాస్తున్నది:

ఎన్ని సార్లు అనుకోలేదు!
చాన్నాళ్ళుగా గోడకి అంటిపెట్టుకున్న వాల్ పేపర్ లాంటి
రాత్రిని పీకి పోగులుపెట్టాలని,
ఋతుపవనవేళ గాయపడ్డ గాలుల్ని నా బాహువుల మధ్య
అదుముకుని జోలపాడాలని..

తర్వాత నేనీ విషయాన్నే ఆమె దగ్గర ప్రస్తావించినప్పుడు ఆమె దాన్ని చటుక్కున తుంచిపారేసింది. ‘నాన్సెన్స్’ అందామె. ‘ఋతుపవన ఆగమనవేళ కన్నా అందమైన కాలం మరొకటి కనిపించదు! ఋతుపవనమంటే పునరుజ్జీవనం. పునర్వికాసం. జీవితాన్ని మరోసారి మనకందించే వాగ్దానం అది.’

పెద్ద గది. నీలిరంగు గోడలు. గదినిండా పుస్తకాలు. మేమా గదిలో కూచుని టీ తాగుతూ ఉన్నాం. ఆ గది చాలా కులాసాగా ఉంది. తోటలో వానకి తడుస్తున్న చెట్లమీంచి నీటిబొట్లు కిందకి రాలడం తెరిచి ఉన్న గదితలుపుల్లోంచి వినిపిస్తూ ఉంది. పదహారేళ్ళ యువతుల్లో కనవచ్చే పసిమిఛాయతోనూ, కళ్ళద్దాలతోనూ, చిక్కటి నీలం రంగు చీరలో, ఆకుపచ్చని ఉత్తరీయంతో కనిపిస్తున్న కమలాదాస్ ని చూస్తుంటే ఈమె ఒకప్పుడు నిస్సందేహంగా మహాసౌందర్యవతి అయిఉండాలనుకున్నాను.

‘ఋతుపవన ఆగమనంలో గొప్ప వైభవం ఉంది. అది ఒక వాద్యబృంద కచేరీలాగా మిమ్మల్ని చేరవస్తుంది. అందుకనే దూర అశనిపాతాల్నీ, వర్ష విద్యుల్లయనీ మనలో జాగృతం చేసేలాగా ఋతుపవనాలు అత్యంత మోహనమయసంగీతానికి ప్రాణం పొయ్యడంలో ఆశ్చర్యం లేదనుకుంటాను. శతాబ్దాలుగా మన చిత్రకారులు ఋతుపవనాల్ని వర్ణచిత్రాలుగా చిత్రిస్తూ ఉన్నారు. మన కవులు గీతాలు ఆలపిస్తో ఉన్నారు. నేను కూడా ఆ పాదులో పుట్టినదాన్నే’ అని అందామె. ‘నిజానికి నేనిప్పుడు మీతో అడవులగురించి మాట్లాడాలనుకుంటున్నాను. అడవుల గురించి, ఇంకా చెప్పాలంటే అడవులు అంతరించిపోడం గురించి. కొంతసేపట్లో మా మిత్రులు కొందరిక్కడికి రాబోతున్నారు. అడవుల గురించి నా ఆవేదనలో పాలుపంచుకోడానికి. వాళ్ళ మాటలు వినండి. అడవులు అంతరించిపోతుండటానికీ, ఋతుపవనాలకీ చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మా మాటలు మీ పరిశోధనకు ఎంతో కొంత తోడ్పడతాయనే అనుకుంటున్నాను’ అంటో ఆమె నాకేసి నిశితంగా చూసింది. ‘మీరు ఋతుపవనం వెంబడే భారతదేశంలో పర్యటించబోతున్నట్టున్నారు కదా’ అని కూడా అంది.

‘అవును, నా ఉద్దేశ్యం అదే’ అని అన్నాను.

‘అయితే మీరు జట్టుకట్టబోతున్న నేస్తురాలు ఎంతమాత్రం నమ్మదగ్గదికాదు, ఇంకా చెప్పాలంటే మోసకారి కూడా. ఆమె ఇట్టే చేతికందినట్టే అంది తప్పించుపోగలదు కూడా. ఈ రోజుల్లో ఆమె రావడమే ఆలస్యంగా వస్తోంది. అడవులు అంతరించిపోవడం కూడా ఇందుకు ఒక కారణం. చెట్లు వానకి పిలుపులు. నింగిలో మేఘాల్ని జారవిడిచేది చెట్లే. చెట్లు మరీ ఇలా నరికేస్తూపోడానికి ముందటికాలంలో ఆమె క్రమం తప్పకుండా వస్తూ ఉండేది. మా అమ్మమ్మ వాన వచ్చే రోజుల్ని గుర్తుపెట్టుకుని తక్కినపనులన్నీ అందుకు తగ్గట్టుగా చేసిపెట్టుకునేది. గుడ్డలుతుక్కోడం, ధాన్యం ఆరబెట్టుకోడం, చుట్టపక్కల్ని పలకరించిరావడం లాంటివన్నమాట. ఆ పనులన్నీ ఎలా చేసుకునేదంటే, వాన ఫలానారోజుకి తప్పకుండా రాబోతున్నదన్నట్టే చేసిపెట్టుకునేది. ఆ రోజుల్లో వానలు కూడా గట్టిగా పడేవి. వాన అలా పడిందో లేదో నిమిషాల మీద మా ఇళ్ళచుట్టూ కాలువలు కట్టేసేవి. మేం చిన్నపిల్లలం ఆ నీళ్లల్లో కాగితం పడవలు వదిలిపెట్టేవాళ్ళం. రోజూ నిద్రలాగా ఋతుపవనాలు కూడా మా జీవితంలో విడదీయరాని భాగంగా ఉండేవి. వాన పడుతూ ఆ వర్షం నీళ్ళు ఒకవైపు మా ఇళ్ళపునాదుల్లోకీ చొచ్చుకుపోతో అక్కడ నెర్రెలు విచ్చి పగుళ్ళుబారుతుండగా మా చుట్టూతా ప్రపంచం మళ్ళా కొత్తగా తలెత్తుతూండటం మేం కళ్లారా చూస్తుండేవాళ్ళం.  జూలై రెండో వారానికల్లా వానకి పడెలు కట్టిన ఆ చిత్తడిలో పెరిగే పదిపన్నెండు మూలికలు గుర్తుపట్టి వాటిని ఏరుకుని ఇంట్లో దాచుకునేవాళ్ళం’ అని కూడా చెప్పుకొచ్చింది ఆమె.

2

జూన్ 9. అపొలో బందరుదగ్గరున్న తాజ్ మహల్ హోటల్లో గుమస్తా మాన్ సూన్ రేపటికి తప్పకుండా వస్తుందని గట్టిగా చెప్పాడు. కాని వెదర్ బ్యూరో వాళ్ళు అంతకు ముందే నాకిచ్చిన సమాచారం ప్రకారం రాబోయేవి గట్టిజల్లులే తప్ప ఋతుపవనాలు కాదు.

‘వాళ్ళ మాటలూ, మీ మాటలూ అన్నీ వింటుంటే నాకంతా అయోమయంగా ఉంది’ అని అన్నాను.

‘సార్, అసలు ఈ ఋతువే చెప్పలేనంత అయోమయం’ అని అన్నాడతను…

3

అక్కణ్ణుంచి నేను ప్రితిష్ నందిని కలుసుకోడానికి వెళ్ళాను. అతడు కవి, దాదాపు నలభై కవితాసంపుటాలు వెలువరించాక బాగా జనాదరణపొందిన ఒక పత్రికకు సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రజాపక్షాన పోరాడడం కోసమే తాను ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా కి ఎడిటర్ గా ఉంటున్నానని చెప్పాడు నాతో..

తన బాల్యంలో ఋతుపవనాలెలా ఉండేవో ఆ జ్ఞాపకాలు పంచుకోగలరా అనడిగాను నంది ని.

‘అది ఋతువులన్నింటిలోనూ అత్యంత సుందర, మనోహర కాలం అని చెప్పొచ్చు’ అని అన్నాడతను. ‘మధ్యాహ్నాల వేళ నిద్రపోతున్నప్పుడు వానపడుతుంటే హటాత్తుగా మెలకువ వస్తే ఎంతో బెంగగా అనిపించేది. బయట నీళ్ళు నిలిచిపోయిన వీథుల్ని, మా ఇంటికుండే ఇనపకటకటాల్లోంచి, చూస్తూ ఉంటే ఏదో చెప్పలేని దిగులు, అస్తిత్వభయం లాంటిది నాలో మేల్కొనేవి. అదంతా నా కవిత్వంలో నా కవిత్వంలో మీరు చూడొచ్చు. కానీ ఇప్పుడదంతా గతం’ అని కూడా అన్నాడాయన.

‘మరి మీకు మాన్ సూన్ లో ఎటువంటి రొమాన్స్ కనిపించడం లేదా?’

‘లేదు. ముఖ్యంగా ఈ మహానగరాల్లో. ఈ బురదలో, ఈ చిత్తడిలో, ఈ వరదల్లో, ఈ ఎలకల కలుగుల్లో రొమాన్స్ కి తావెక్కడుంది చెప్పండి? వీథుల్లో నిరాశ్రయులుగా బతుకుతున్నవారిని చూస్తుంటే కలిగే ఆవేదనలో సంతోషం ఎక్కడుంటుంది చెప్పండి? కొన్నిసార్లు ఆ నిరాశ్రయుల్ని, ఆ హృతాశ్రయుల్ని, ఆ హతాశయుల్ని చూస్తుంటే, వాళ్ళట్లా ఇంత గూడుకోసం, నీడకోసం కొట్టుమిట్టాడుతూ కనిపిస్తుంటే, వాళ్ళ కష్టం చూడలేక వాళ్ళు చచ్చిపోతే బాగుణ్ణు కదా అనిపిస్తుంటుంది. కాని వాళ్ళు నశించరు. ఆ కష్టాలకు ఎదురీది వాళ్లలా మనుగడ సాగించగల ధైర్యం నాకుందా అని అనుకుంటాను. కాని ఈ దేశంలో నిలవడానికి ఇంత నీడ దొరికిన అతి కొద్ది మంది అదృష్టవంతుల్లో నేను కూడా ఒకణ్ణని మీకు తెలియడం లేదూ! ఉండటానికి ఒక కప్పు, పడుకోడానికి ఒక శయ్య, ఒక కారు. నేనుంటున్న పరిస్థితుల్లోంచి ఋతుపవనం గురించి మాట్లాడమంటే ఏదైనా చెప్పగలను. కానీ అసంఖ్యాకులైన నా దేశవాసులకి ఋతుపవనకాలమంటే దుర్భరమైన జీవితం, కడగండ్లు తప్ప మరేమీ కాదు.’

‘పోనివ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్న దృష్టితో చూసినా కూడా ఋతుపవనాల గురించి మంచిగా చెప్పడానికి మీదగ్గరేమన్నా మాటలున్నాయా?’ అనడిగాను.

‘దానికేముంది! కొరడా మోతలాగా వేసవి తాపం మనల్ని దహించివేసాక, తొలివానలు కురవడంలో ఎంతో తీయదనముంది. అదొక సాక్షాత్కారం లాంటింది’ అని అంటో, క్షణం పాటు తటపటాయించి, ‘ఋతుపవనాల్లో నాకు అత్యంత ఇష్టమైన పార్శ్వం అవి భారతదేశానికి తిరిగి తీసుకొచ్చే రంగులు. మరకతం వన్నె తిరుగుతో తలూపుతుండే ఆకుపచ్చని మైదానాలు, ఊదారంగు కొండలు, బూడిదరంగు ఆకాశాలు, అంతటా మెత్తగా పరుచుకునే ఆ అద్భుతమైన వెలుతురు. ఇంక ఆ క్రమంలో ఋతుపవనం మీలో కూడగట్టే గొప్ప ప్రశాంతి. ఆ ప్రశాంతివల్ల మీరు భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా గొప్ప విశ్రాంతమనఃస్థితిలోకి జారిపోతారు.’

ఆ మాటలు చెప్తుండగా ఆయన కంఠంలో స్వప్నాల జీర కదలాడింది.

4

దేశమంతటా ప్రతి ఒక్కచోటా ప్రజలు విపరీతమైన ఆందోళనతో ఋతుపవనాల కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్ కోట లో 28 కేజీల పాదరసం శివలింగాన్ని ప్రతిష్ఠించారని టైమ్స్ పత్రిక రాసింది. శనివారం నుంచి వారం రోజుల పాటు వరుణదేవుడి అనుగ్రహంకోసం పూజలూ, జపాలూ నడుస్తాయట. లాల్ బహదూర్ శాస్త్రి గ్రౌండ్ దగ్గర ఒక యజ్ఞం కూడా నిర్వహించబోతున్నారు. ఆ నిర్వాహకుల్లో సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం ప్రొ-వైస్ ఛాన్సెలర్ లాలూభాయి త్రివేది కూడా ఉన్నారు. ‘వైదిక సూత్రాల ప్రకారం పాదరసాన్ని లింగంగా ఘనీభవింపచేసాం’ అని చెప్పాడాయన.

అయితే రోజూ వరుణదేవుణ్ణి శాంతిపంచెయ్యడం కోసం చేసే ఈ హై-టెక్ మంత్రజాలం చూడటానికి సామాన్యపౌరులకి అవకాశం లేదు. కొన్ని చోట్ల ఇటువంటి పూజలు ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. రెండేళ్ళ కిందట కర్ణాటకలో వ్యవసాయ శాఖ వారే రాష్ట్రమంతా ఇటువంటి పూజలు నిర్వహించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే అందుకయ్యే ఖర్చు తగ్గించడం కోసం వాళ్ళు రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలనుంచీ, మసీదుల నుంచీ, చర్చిలనుంచీ టెండర్లు ఆహ్వానించేరట. తీరా చేసి ఆ పూజల వల్ల ఏదో అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే పడి ఊరుకున్నాయట.  ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు తక్కువ ధర కి ఎవరు ముందుకొచ్చారో వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చారనీ, అలా కాకుండా పూజలూ, జపాలూ చెయ్యడంలో ఎవరు నిష్ణాతులో వాళ్ళకిచ్చి ఉంటే వానలు పడి ఉండేవనీ ప్రతిపక్షాలు విమర్శించాయట.

వరుణున్ని తృప్తిపరచడం కోసం తమిళనాడులో గాడిదలకు పెళ్లి చేసారు. ఆ మొత్తం క్రతువంతా ఎంతో హంగూ ఆర్భాటంతో చేసారు. ఆ పెళ్ళిలో ‘పెళ్ళికూతురు’ రంగురంగుల పట్టుచీర తొడుక్కోగా, ‘పెళ్ళికొడుకు’ చక్కటి పట్టు వస్త్రం ధరించాడు. ఆ పెళ్ళి మొత్తం పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

1986 ఆగస్టు ఒకటో తేదీన జామ నగర్ లో స్థానిక మతపెద్దల పూనిక మీద పొద్దున్న పదకొడింటికి ఒక సైరన్ మోగించారు. దాంతో ఎక్కడిపని అక్కడే ఆపేసారు. ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. మొత్తం 30,000 మంది కలిసికట్టుగా వానకోసం ప్రార్థించేరు. ‘ఆ సందర్భంగా మొత్తం పట్టణజనాభా అంతా ఒక్కతాటిమీద నిలబడింది. వరుణదేవుడు మా ప్రార్థనలు విన్నాడనీ, సాగునీటికీ, తాగునీటికీ మేము అనుభవిస్తున్న కటకట ఆయన తప్పక తీరుస్తాడనీ మేము నమ్ముతున్నాం’ అని ఒక పట్టణప్రముఖుడు ఆశాభావం వ్యక్తం చేసాడు.

ఆ మర్నాడు హైదరాబాదులో బోనాలు పండగ సందర్భంగా అమ్మవారు పూని భవిష్యవాణి వినిపించింది..

5

ఆ రాత్రి పదిగంటల వేళ వానకురవడం మొదలయ్యింది. ఉరుముల్తో కూడిన నిజమైన ఋతుపవన వర్షం. నేను ఆ వాన చూడ్డానికి గుమ్మం దగ్గరికి పోయాను. ఆ వానలో హోటల్ వైపు వస్తున్న వాహనాల హెడ్ లైట్లు చమురుదీపాల్లాగా కాంతివిహీనంగా కనిపిస్తున్నాయి. వాననీరు పెద్ద పెద్ద పడెలు కడుతూ ఉంది. వాటి అంచుల్లో చిన్న చిన్న అలలు తలెత్తుతున్నాయి. వాటికి ఒక్కింత ఎత్తులో వానచినుకులు వెండి వస్త్రం పరుస్తున్నట్టుగా గాల్లో వేలాడుతున్నాయి. ఆ వస్త్రం ఒక కొస చేతుల్తో పట్టుకుని ఆ గొడుగు కిందకి చేరుకోవచ్చు అన్నట్టుంది.

ఢిల్లీలో కురిసిన చిరుజల్లుల్ని పక్కనపెడితే గడచిన ఆరు వారాలుగా నేను చూసిన మొదటి వాన అది. ఆ క్షణాన నాలో ఏదో చెప్పలేని సంతృప్తికరభావన తలెత్తింది. ఎట్టకేలకు నేను ఋతుపవనాల ప్రాచ్యబాహువుని అందుకోగలిగానని అర్థం కావడంతో ఆ సంతృప్తి మరీ అధికమవుతూ ఉంది. నాకూ, ఋతుపవనానికీ మధ్య ఎట్టకేలకు లంకె కుదిరింది. ఆ వర్షం థాయిలాండ్, బర్మాలమీదుగా ప్రయాణిస్తో వచ్చినప్పటికీ దానిలో ఇసుమంత కూడా అలసట గోచరించడం లేదు. పైపెచ్చు అది మరింత వేగంతోనూ, మరింత ఉత్సాహంతో కురుస్తో ఉంది. ఈ క్షణాన్న, అది, ఇంతకన్నా పదింతల ఉధృతితో మరింత ప్రచండంగా చిరపుంజిలో కురుస్తూ ఉంటుందని నాకు తెలుసు.

19-6-2024

13 Replies to “ఋతుపవనాల అడుగుజాడల్లో”

  1. కాలానుగుణంగా సమాచార వ్యాసాలు రాయడంలో మన ఆత్మీయులు వాడ్రేవు చినవీరభద్రుడు గారిది అందెవేసిన చెయ్యి.

  2. చాలా బాగుంది పరిచయం. రుతువులకు అనుగుణంగా కవిత్వాన్ని,కథలనూ పాఠకులకు అందిస్తారు.. గొప్ప విషయం.
    నేను నేర్చితి భాగ్యవశమున- కవుల కృపగొని-
    అంటే అది ప్రకృతి పట్ల ప్రేమే!

    వాన రాక కోసం ఒక రైతు, ముఖ్యంగా వర్షాధారిత పంటలే వేయగల ప్రాంతాల రైతు ఎంత ఎదురు చూస్తాడో కళ్లారా చూసాను. మీ వంటి చిత్రకారులైతే చిత్రం గీసేవారు.. తొలకరి జల్లులు పడినప్పుడు.. రైతు నారుమడి సిద్దం చేసుకుంటూ- బురద కొట్టుకుని పోయిన నీరు కావి పంచె పైకి కట్టి- చెదరని నవ్వుతోను.. ఆశతోను – నాకా రైతు ప్రతి వానాకాలం లో తలపుకు వస్తాడు‌.
    ప్రితీష్ నంది చెప్పినట్లు పట్టణాల్లో వాన నిరుపేదలకి శాపమే. కమలాదాస్ నేపథ్యం వేరు..
    మొత్తానికి వాన విశ్వరూపం చూడడానికి,రచయిత భారతదేశాన్ని ఎంపిక చేసుకోవడం బాగుంది.

  3. ముందుగా మీకు తల వంచి వినమ్రత తో నమస్కరిస్తున్నాను.
    చదువుతున్నప్పుడు ఒక్క సెకండ్ ఎక్కడైనా , ఎందుకైనా ఆగానా? లేనే లేదు. మొదట అంతా మైమరపించే పదాల కవనం, తరువాత ఎన్నో విషయాల్ని ఎక్కడివో ఒక దగ్గరికి కూర్చిన సమన్వయం, లోకం లో జరిగేది పుస్తకాల్లో ఎందరెందరో రాస్తున్న వారి వారి అనుభవాలు, కీన్ గా చూసి రాసే వారి అమోఘమైన పద సంపద ని మీ చల్లని చూపులతో విసదీకరించి, వాటిని చదవకపోతే జీవితం గురించి ఏమి తెలుస్తుందన్న హెచ్చరిక లో పుస్తకాల వల్ల మనిషికి జ్ఞానోదయం కలుగుతుందని చెప్పిన వయనం ఈ పొద్దున్నే నన్ను ఆనందాతిరేకం తో ఒకేసారి ఏకకాలంలో కన్నీటిని, , హాయిగొలిపే ఆనందాన్ని కలిగించిందని అతి త్వరగా బయలుదేరి మీ ముందు చేతులు కట్టుకుని నిలబడి చెప్పాలని ఉంది.
    నా ఊహలకి మాత్రమే రెక్కలున్నాయని తమరు దయతో అంగీకరిస్తే మీముందు అత్యానందం తో నిలబడి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

    మేఘాల దారిలో రాగమాలికలల్లి
    గమకాల స్మృతులనే
    వెదకి చూచేవేళ
    చెలిమి ఎంత మధురమో కదా…
    మనసున, మైమరపులా
    వెన్నెలా… నీ తలపు సిరిమల్లె చినుకు

    ఈ పాట ఇంకా ఉంది. నేను రాసి ట్యూన్ కట్టినది. తమకు అంకితం.నమోనమః

  4. మొదట పేరాలో మీ వర్ణన, తరువాత ఆ అనువాదం..ముఖ్యంగా 5 లో వాక్యాలు…జడివాన ఇప్పుడే శాంతించిన ఈ నగరంలో, ఈ గాలిలో ఇలా మీ వాక్యాలు చదవడం – జీవించడం మీద ఆశనీ ప్రేమనీ పెంచుతుంది అంటే, మీరు నమ్ముతారు కదా! ❤️

  5. మొదటగా ఋతుపవనాలను అనుగమిస్తూ పయనించాలనే ఒక పరదేశీయుడు, అదీ భారతదేశంలోని అత్యధిక వర్షపాతం కలిగిన చిరపుంజిని నెరవేరని తండ్రి కోరికను తీర్చాలనే తహతహతో ఎంచుకోవడం. దానికోసం భారతీయ ఋతుపవనాల సమాచారమంతా క్షుణ్ణంగా అధ్యయనం చేయటం లోకో భిన్నరుచిః అనిపించింది. ఈ భిన్న రుచే లేకపోతే మనకు ఒక కొత్త తొలికారు లోకం ఆవిష్రించబడేది కాదు.
    కాళిదాసు మేఘసందేశం యక్షుని ప్రియ రాయబారానికి చెప్పబడినా , మన దేశం కవుల్లో
    ప్రకృతిని పరవశంతో చూసి రచనలు గుప్పించారని
    అనేక మంది ప్రబంధ కవులు తమ అష్టాదశ వర్ణనల్లో వర్షం గురించి , వర్షామేఘం గురించి, ఋతువుల గురించి వర్ణించకుండా ఉండలేదు.
    ఆయితే ఆధునిక జనజీవనంలో , కమలాదాస్ , ప్రితిష్ నందిని వంటి కవుల మనోగతాలను ఋతుపవనాల నేపథ్యంలో తెలుసుకోవడం, పలుచోట్ల వర్షాగమనానికి స్వాగత సన్నాహాల ను
    గమనించడం, ఫ్రాటర్ కళానురక్తికి , ముఖ్యంగా జీవితంలో అన్వేషణనయినా , అధ్యయనాన్నైనా
    కళాత్మకంగా దర్శించడం, ఇంకా చెప్పాలంటే సవ్యాత్మక దృక్పథంతో దర్శించడం నిదర్శన మనిపిస్తుంది. ఇలాంటి కొత్త పుస్తకలోకాలను
    దర్శింపజేసే మీకు ధన్యవాదాలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading