
మేడమీద మొక్కలకి నీళ్ళు పడుతూ తలెత్తి చూస్తే, ఆకాశంలో పూర్ణచంద్రుడు. మండుటెండల్ని కూడా ధిక్కరించి వికసిస్తున్న విరజాజిపూల తావిమధ్య వైశాఖచంద్రిక నా మనసుకి మృదువుగా చందనం అద్దుతుండగా సాయంకాలం సాయిబాబా గుళ్ళో విన్న హారతి గీతం నా మనసులో మోగుతూనే ఉంది.
‘రుసో మమ ప్రియాంబికా మజవరీ పితాహీ రుసో.’
ముప్ఫై ఏళ్ళ కింద విన్నాను మొదటిసారి ఈ స్తోత్రాన్ని. సంస్కృతంతో సహా, ప్రపంచ భక్తిసాహిత్యాల్లో నేను చదివిన, విన్న సకల స్తోత్రాల్లోనూ, ఈ స్తోత్రంలాంటిది నేనిప్పటిదాకా వినలేదు. ఒక మనిషి నిజంగా దేవుణ్ణో, ఒక దేవతనో, ఒక గురువునో, ఒక సత్యాన్నో, చివరికి ఒక సిద్ధాంతాన్నో దేన్ని నమ్ముకున్నా, ఇలా నమ్ముకోవాలి. సమస్త ప్రపంచం, గ్రహతారకలు, నిఖిల విశ్వం తనని వదిలిపెట్టనివ్వు, తాను నమ్ముకున్నదొక్కటీ తనను వదిలిపెట్టకపోతే చాలు అనే ఈ భావన- నిజంగా నమ్మితే ఇలా నమ్మాలి, ప్రార్థిస్తే ఇలా ప్రార్థించాలి, పాదాలు పట్టుకుంటే ఇలా పట్టుకునిచుట్టుకుపోవాలి.
ఈ గీతాన్ని రాసిన బాలకృష్ణ విశ్వనాథ్ దేవ్ థానే జిల్లాకి మామల్త దారుగా పనిచేసేవాడు. నానా సాహెబ్ చందోర్కర్ ద్వారా 1910 లో మొదటిసారి బాబాను చూసాడు. ‘బాబాచే బాల్’ (బాబా బిడ్డ) అనే పేరుతో బాబాతో తన అనుభవాలు చాలా వ్యాసాలు రాసాడు. బాబాతో ఆయనకి లభించిన అనుభవాలు సాయి సచ్చరిత్ర 40-41 అధ్యాయాల్లో చూడవచ్చు.
కానీ, ఈ గీతం, ఇది మామూలు గీతం కాదు. జ్ఞానేశ్వరుడు, నామదేవ్, తుకారాం, ఏకనాథుడు లాంటి మహాభక్తకవిపరంపర ఆయన్ని ఆవేశించి ఈ గీతం రాయించారా అనిపిస్తుంది. ఎటువంటి గీతం ఇది! భావానికి భావం సరే, ఆ భాష! ఈ రూపంలో షిరిడీలో గంగావతరణం సంభవించిందా అనిపిస్తుంది ఆ గీతం విన్నప్రతిసారీ!
అన్నిటికన్నా కూడా ఆ ‘సాయీ మా’ అనే ఆ పిలుపు చూడండి. ‘అమ్మై అప్పన్’ అన్నాడు ఒక తమిళభక్తి సర్వేశ్వరుణ్ణి. ఇక్కడ ఈ కవి మరింత ముందుకుపోయి ‘దత్తగురు- సాయి-మా’ అని పిలిచాడు. అంటే తల్లీ, తండ్రీ, గురువూ ముగ్గుర్నీ ఒక్కరిలోనే కలిపేసి చూసుకున్నాడు.
నిజంగానే చెప్పలేనంత దుఃఖంలో ఉన్నప్పుడు, నీ చేయి పట్టుకుని నీకు తోడుగా నేనున్నానని చెప్పడానికి నీకు తెలిసినవాళ్ళు ఒక్కరు కూడా కనిపించనప్పుడు, చలాచలాలన్నీ కూడా నీ పట్ల మౌనం వహించినప్పుడు, ఆ మౌనం చూడబోతే, సమస్త శక్తులూ నీ పట్ల ఆగ్రహం కురిపిస్తున్నాయా అని అనుమానం కలుగుతున్నప్పుడు, ఫర్వాలేదు, ఎవరు కలిసిరానీ, రాకపోనీ, ఆయన ఒక్కడూ నా మీద ఆగ్రహించకపోతే చాలు అని అనిపించడముందే, అంతకన్నా గొప్ప అభయం, ఆనందం మరేముంటాయి?
ఒక్కసారి చదివి చూడండి, మీలో ఎట్లాంటి విద్యుత్తు ప్రవహిస్తుందో, మీకే అనుభవంలోకి వస్తుంది.
రుసో మమ ప్రియాంబికా మజవరీ పితాహీ రుసో
రుసో మమ ప్రియాంగనా, ప్రియసుతాత్మజాహీ రుసో
రుసో భగిని బంధుహీ, శ్వసుర సాసుబాయీ రుసో
న దత్తగురు సాయి మా, మజవరీ కథీఁ హీ రుసో.
(నా తల్లి నా పట్ల కినుక వహించనివ్వు, నా తండ్రి నా పట్ల ఆగ్రహించనివ్వు, నా ప్రియసఖి నా పట్ల కలత చెందనివ్వు, నా కొడుకూ, కూతురూ కూడా మనస్తాపం చెందనివ్వు, నా అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తమామలు కూడా నా పట్ల విసుగుచెందనివ్వు కానీ, నా తల్లీ, నా సాయినాథా, నా దత్తగురూ, నువ్వు మాత్రం నా మీద కోపగించకు.)
పుసో న సునబాయీ త్యా, మజ న భ్రాతృజాయా పుసో
పుసో న ప్రియ సోయరే ప్రియ సగే న జ్ఞ్తాతీ పుసో
పుసో సుహృద నా సఖా, స్వజన నాప్తబంధూ పుసో
పరీ న గురు సాయి మా, మజవరీ కథీఁహీ రుసో.
(దగ్గరవాళ్ళు, దూరంవాళ్ళు కూడా నా గురించి పట్టించుకోకపోనివ్వు, అయినవాళ్ళు సైతం నన్ను మర్చిపోనివ్వు, నా శ్రేయోభిలాషులు నా యోగక్షేమాలు విచారించకపోనివ్వు, నా స్నేహితులు, నా స్వజనం, నా ఆప్తబంధువులు కూడా నన్ను మర్చిపోనివ్వు, కానీ, నా తల్లీ, నా సాయినాథా, నా గురువా, నువ్వు మాత్రం నా మీద కోపగించకు.)
పుసో న అబలా ములేఁ తరుణ వృద్ధహీ నా పుసో
పుసో న గురు ధాకుటేఁ , మజ న థోర సానే పుసో
పుసో నచ భలేబురే, సుజన సాధుహీ నా పుసో
పరీ న గురు సాయి మా, మజవరీ కథీహీఁ రుసో.
(నా మీద ఆధారపడ్డ స్త్రీలూ, పిల్లలూ కూడా నా మంచిచెడ్డలు పట్టించుకోకపోనివ్వు, పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ కూడా నా గురించి ఆలోచించకపోనివ్వు, అనుభవజ్ఞులూ, అనుభవం లేనివాళ్ళూ కూడా నన్ను నిర్లక్ష్యం చెయ్యనివ్వు, మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ కూడా నా గురించి విచారించకపోనివ్వు, సుజనులూ, సాధువులూ కూడా నా మీద శీతకన్ను వెయ్యనివ్వు, కానీ, నా తల్లీ, నా సాయినాథా, నా గురువా, నువ్వు మాత్రం నా మీద ఎప్పటికీ ఆగ్రహించకు.)
రుసో చతుర తత్త్వవిత్, విబుధ ప్రాజ్ఞ జ్ఞానీ రుసో
రుసోహి విదుషీ స్త్రియా, కుశల పండితాహీ రుసో
రుసో మహిపతీ, యతీ భజక తాపసీహీ రుసో
పరీ న గురు సాయి మా, మజవరీ కథీహీఁ రుసో.
(చతురులూ, తత్త్వం తెలిసినవాళ్ళూ, పండితులూ, ప్రాజ్ఞులూ, జ్ఞానులూ కూడా నా మీద కోపం తెచ్చుకోనివ్వు, బాగా చదువుకున్న స్త్రీలూ, గొప్ప పండితులైన స్త్రీలు కూడా ముఖం చాటెయ్యనివ్వు, రాజులూ, యతులూ, భక్తులూ, తాపసులూ కూడా నా మీద కోపగించనివ్వు, కానీ, నా తల్లీ, నా సాయినాథా, నా గురువా, నువ్వు మాత్రం ఎప్పటికీ నా మీద ఆగ్రహించకు.)
రుసో కవి ఋషీ మునీ, అనఘసిద్ధయోగీ రుసో
రుసో హి గృహదేవతా, ని కులగ్రామదేవీ రుసో
రుసో ఖల పిశాచ్చహీ, మలిన డాకినీహీ రుసో
న దత్త గురు సాయి మా, మజవరీ కథీహీఁ రుసో.
(కవులూ, ఋషులూ, మునులూ కూడా నా మీద కోపం తెచ్చుకోనివ్వు, పుణ్యాత్ములూ, సిద్ధులూ, యోగులూ కూడా నా మీద ఆగ్రహించనివ్వు, నా ఇంటిదేవత, కులదేవత, గ్రామదేవత కూడా నామీద కినుక వహించనివ్వు, దుష్టపిశాచాలూ, మలిన డాకినులూ కూడా నా మీద ఆగ్రహించనివ్వు, కాని, నా తల్లీ, నా సాయినాథా, నా దత్తగురూ, నువ్వు మాత్రం నా మీద ఎప్పటికీ ఆగ్రహించకు.)
రుసో మృగ ఖగ కృమీ, అఖిల జీవజంతూ రుసో
రుసో విటప ప్రస్తరా, అచల ఆపగాబ్ధీ రుసో
రుసో ఖ పవనాగ్ని వార అవని పంచత్తవేఁ రుసో
న దత్త గురు సాయి మా, మజవరీ కథీహీఁ రుసో.
(పశువులూ, పక్షులూ, కీటకాలూ, సకల జీవజంతువులూ కూడా నా మీద ఆగ్రహించనివ్వు, వృక్షాలు, అచలాలూ, నదులూ, సముద్రాలూ కూడా నా మీద కోపం తెచ్చుకోనివ్వు, ఆకాశమూ, అగ్నీ, వాయువూ, జలాలూ, భూమీ, పంచతత్త్వాలూ కూడా నా మీద విరుచుకుపడనివ్వు, కానీ నా తల్లీ, నా సాయినాథా, నా దత్తగురూ, నువ్వు మాత్రం నా మీద ఎప్పటికీ ఆగ్రహించకు.)
రుసో విమల కిన్నరా అమల యక్షిణీహీ రుసో
రుసో శశి ఖగాదిహీ గగని తారకాహీ రుసో
రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో
న దత్త గురు సాయి మా, మజవరీఇ కథీహీఁ రుసో.
(విమల చిత్తులైన కిన్నరులూ, నిర్మల హృదయులైన యక్షిణులూ కూడా నామీద కోపగించుకుంటే కోపగించుకోనివ్వు, చంద్రుడూ, సూర్యుడూ, గ్రహాలూ, గగనమండలంలోని తారకాదులూ నా మీద కోపం తెచ్చుకోనివ్వు, దేవేంద్రుడూ, యమధర్మరాజూ కూడా నా మీద ఆగ్రహించనివ్వు, కానీ నా తల్లీ, నా సాయినాథా, నా దత్తగురూ, నువ్వు మాత్రం నా మీద కోపగించకు.)
రుసో మన సరస్వతీ, చపలచిత్త తేఁహీ రుసో
రుసో వపు దిశాఖిలా కఠిణ కాల తోహీ రుసో
రుసో సకల విశ్వహీ మయి తు బ్రహ్మగోలం రుసో
న దత్త గురు సాయి మా, మజవరీ కథీహీఁ రుసో.
(నా మనస్సూ, వాక్కూ, చివరికి నా చపలచిత్తం కూడా నామీద కోపం తెచ్చుకోనివ్వు, నా దేహమూ, దశదిశలూ, కఠినాతికఠినమైన కాలం కూడా నాకు సహకరించకపోనివ్వు, ఈ సకలలోకం, చివరికి ఈ బ్రహ్మాండమండలమంతా నా మీద ఆగ్రహించనివ్వు, కానీ, నా తల్లీ, నా సాయినాథా, నా దత్తగురూ, నువ్వు మాత్రం నామీద ఎప్పటికీ కోపగించకు.)
విమూఢ మ్హణునీ హంసో, మజ న మత్సరహీ డసో
పదాభిరుచి ఉళసో, జననకర్దమీఁ న ఫసో
న దుర్గ ధృతిచా ధసో, అశివభావ మాగేఁ ఖసో
ప్రపంచి మన హేఁ రుసో, దృఢ విరక్తి చిత్తీ ఠసో.
(నన్నొక పిచ్చివాడికింద జమకట్టి ప్రజలు నవ్వుకోనివ్వు, అయినా కూడా నా మనసు ఈసుతో కలతచెందనివ్వకు. ఈ సంసారపంకంలో నేను కూరుకుపోకుండా నీ పాదాల పట్ల నా కున్న ప్రేమ ఒక్కటే నా ఉల్లాసం కానివ్వు. నా ధృతి చెక్కుచెదరకుండా నాలో అమంగళభావాలు కుప్పకూలిపోనివ్వు. ఈ ప్రాపంచిక విషయాల నుంచి నా మనసుని విముఖం కానివ్వు, నా చిత్తంలో విరక్తి బలపడనివ్వు.)
కృణాచిహీ, ఘృణా నసో, న చ స్పృహా కశాచీ అసో
సదైవ హృదయీ వసో, మనసి ధ్యానిఁ సాయీ వసో
పదీఁ ప్రణయ వోరసో, నిఖిల దృశ్య బాబా దిసో
న దత్త గురు సాయి మా, ఉపరి యాచనేలా రుసో.
(నా మనసులో ఎవరిపట్లా ద్వేషం తలెత్తకూడదు, దేనిపట్లా ధ్యాసలో తగుల్కోకూడదు. నా హృదయంలో సదా సాయినాథుడు నివసించాలి, ఆయన గురించి మాత్రమే నా తలపులు నిలబడాలి. నీ పాదాలపట్ల నా ప్రణయం నిరాఘాటంగా ప్రవహిస్తుండాలి, నా కంటికి కనబడుతున్న ప్రతి దృశ్యంలోనూ సాయిబాబా ఒక్కడే నాకు కనిపిస్తుండాలి. నా తల్లీ, సాయినాథుడా, నా దత్తగురూ, నేనిట్లా అడుక్కుంటున్నందుకు నా మీద ఎప్పటికీ కోపగించకు)
22-5-2023


అబ్బ…
ఏం విద్యుత్తు ఆ మూల రచనలో!
ఎంతటి విద్వత్తు ఆ అనువాదం లో…!
ఒక గీతం తాలూకు అనుభవం అంటే ఇది!
ఏం అనుభూతి అది.
మీకెలా చెప్పేది!?
సర్… తవ చరణం.
మీరు మాకు వరం.
ధన్యవాదాలు, నమస్సులు.
కొంచం మరాఠీ తెలియడం పాట / భక్త గ్యానం ఆస్వాదించే దారి సుగమం చేస్తుంది.! మంచి విషయం అనుభూతి తో పంచారు!
ధన్యవాదాలు సార్!
ఒక మనిషి నిజంగా దేవుణ్ణో, ఒక దేవతనో, ఒక గురువునో, ఒక సత్యాన్నో, చివరికి ఒక సిద్ధాంతాన్నో దేన్ని నమ్ముకున్నా, ఇలా నమ్ముకోవాలి. సమస్త ప్రపంచం, గ్రహతారకలు, నిఖిల విశ్వం తనని వదిలిపెట్టనివ్వు, తాను నమ్ముకున్నదొక్కటీ తనను వదిలిపెట్టకపోతే చాలు అనే ఈ భావన- నిజంగా నమ్మితే ఇలా నమ్మాలి, ప్రార్థిస్తే ఇలా ప్రార్థించాలి, పాదాలు పట్టుకుంటే ఇలా పట్టుకునిచుట్టుకుపోవాలి.
అవును కదా?
ధన్యవాదాలు మేడం
ప్రస్తుతం నేనున్న నా మానసిక పరిస్థితికి ఆ సాయినాధుడు పంపిన సందేశం….🙏🙏🙏
ధన్యవాదాలు
ఓం సాయి రాం
🙏
ధన్యవాదాలు
పరిమళాయిత సుప్రభాత సుందరగీతం
ధన్యవాదాలు సార్
అర్థ పర్థాలు ఏవీ తెలియని నా పన్నెండు పదమూడేళ్ళ వయసులో ఈ గీతాలు నాలో ప్రవేశించాయి
నిజంగానే మీరన్న ఆ విద్యుత్తు అప్పట్లోనే నా నరనరానా ప్రవహించేది
ఇప్పటికీ ఎక్కడన్నా విన్నా ఏదన్నా పనిలో వున్నప్పుడు ఆలాపనగా ఆ గీతాలు అలా మదిలో మెదిలినా కూడా అదే విద్యుత్తు
అదే తన్మయత్వ హృదయాస్వాదన
నమస్సులు మీకు
మాకు దొరికిన ఆణిముత్యం మీరు
ధన్యవాదాలు మేడం
ఇంతగా ఆధారపడి, శరణు జొచ్చి, ఇంత గొప్పగా నమ్మి ప్రేమించడానికి ధైర్యం కావాలి కదా, మోసపోతామన్న భయం ఉండదా, ఒక వేల మోసపోతే ఆ బాధను ఎలా తట్టుకోగలం
మరొక ఆలోచనకీ, భయానికీ, అనుమానానికీ తావులేని అటువంటి నమ్మకం సాధ్యమైతే ఆ నమ్మకమే అన్నీ చూసుకుంటుంది.
Vaisakhi pournami, guruvaram sayamkalam, poddunnunchi devudini smaristu unna naku, ayana Prasadam Ila dorikindi. Aa pata chadhava ledu, padukunnanu. Gurtu chesi anduke 🙏
ధన్యవాదాలు దీపా!
Very touching sir. For the first time I read a translation on This Harathi, Dhoop harathi that is so heartly like “in one saltuation to thee” in Tagore Geethanjali.
Thank you Sir!