
మిత్రురాలు పంపించిన పుస్తకాల్లో అన్నిటికన్నా ముందు ఏ పుస్తకం చేతుల్లోకి తీసుకుని ఉంటానో మీరు ఊహించగలరు. చీనా కవిత్వానికీ నాకూ ఏదో జన్మాంతర సంబంధం ఉందనుకుంటాను. ఆ కొండలూ, ఆ లోయలూ, ఆ సుదీర్ఘమైన మట్టిబాటలూ, ఆ ఎర్రపూల చెట్లూ, ఆ పిల్లంగోవి పాటలూ- నేను ప్రాచీన చీనా కవిత్వం చదివినప్పుడల్లా, ఆ పాటలు నా చిన్నప్పుడు మా ఊళ్ళో విన్నవే అని అనిపిస్తూంటుంది. కాని ఆ మాట ఆధునిక చీనా కవిత్వం గురించి అనుకోలేనేమో అనే సంకోచంతో ఇన్నాళ్ళూ ఆధునిక చీనా కవితకి ఒకింత ఎడంగానే గడిపాను. కాని ఇదుగో, Michelle M Yeh సంకలనం చేసిన A Century of Modern Chinese Poetry (2023) తెరవగానే నాకొక విశాలమైన ఆకాశం దొరికినట్టు అనిపించింది.
మిషెల్లి యూనివెర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తూర్పు ఆసియా భాషావిభాగంలో ఆచార్యులు. ఆమె 1992 లో మొదటిసారిగా వెలువరించిన ఈ సంకలనాన్ని ఇప్పుడు మరింత సమగ్రపరిచి మళ్ళా వెలువరించారు. చైనా, తైవాన్, హాంక్ కాంగ్, మలేషియా, సింగపూర్ లకు చెందిన దాదాపు 85 మంది కవులు రాసిన 280 కవితల సంకలనం ఇది. ఇందులో ఆరు విభాగాల్లో ఆమె ఒక శతాబ్ది పొడుగునా వికసించిన చీనా కవిత్వాన్ని, ముఖ్యమైన కవుల్నీ మనకు పరిచయం చేస్తూ వారి కవితలు కొన్ని అనువాదం చేసి అందించారు.
అందులో మొదటిభాగం 1910-20 మధ్యకాలంలో Formative period. రెండవ భాగం1930-40 మధ్య The First Flowering of Modern Poetry. నేను ఇప్పటికీ ఇంకా ఆ రెండవభాగం దగ్గరే ఆగిపోయాను. దాదాపుగా మన భావకవుల్లాంటి ఆ రెండవ తరం చీనా కవుల్ని చదువుతుంటే నాకెప్పణ్ణుంచో బాగా తెలిసిన ఒక మనోహర ప్రపంచంలో మళ్ళా అడుగుపెట్టినట్టుంది. ఆ కవుల కవిత్వం మరింత చదవాలనే దాహంతో The Flowering of Modern Chinese Poetry (2016) పుస్తకం మొత్తం ఆవురావురమంటూ చదివేసాను. ఆ పుస్తకం గురించి రేపో మర్నాడో మీతో ఎలానూ పంచుకోకుండా ఉండలేను. ఇప్పటికి మాత్రం, ఈ Modern Chinese Poetry నుంచి He Qifang (1912-77) రాసిన రెండు కవితలు మీకోసం.
సంతోషం
సంతోషం ఏ రంగులో ఉంటుందో చెప్పవా
పావురాల రెక్కల్లాగా తెలుపా లేక చిలకముక్కులాగా ఎరుపా
సంతోషం సవ్వడి ఎలా ఉంటుంది?
పిల్లంగోవి పాటలానా? పైన్ చెట్ల గలగల్లానా
లేక ప్రవహిస్తున్న జలాల మర్మరధ్వనిలానా?
ఒక వెచ్చని చేతిని తాకినట్టు
దాన్ని చేతుల్లోకి తీసుకోగలమా?
దాని చూపు
ప్రేమతో ప్రకాశిస్తుందా?
హృదయాన్ని సున్నితంగా వణికిస్తుందా?
మౌనవిషాదాశ్రువులు ఒలికిస్తుందా?
సంతోషం ఎలా అడుగుపెడుతుంది చెప్పు?
ఎక్కణ్ణుంచొస్తుంది?
సంధ్యవేళ మినుకుమనే మిణుగురులానా
గులాబీరేకల సుగంధంలానా?
తన పాదాలకు మువ్వలు కట్టుకు మరీ
ఆమె మన ఇంట్లో అడుగుపెడుతుందా?
సంతోషం గురించి తలుచుకోగానే
నా గుండె కలవరపడుతున్నది
ఒక్కమాట చెప్పు, ఆనందం కూడా
నా విచారంలానే అందంగా ఉంటుందా?
హేమంతం
మంచుపట్టిన ప్రభాతవేళ
కొండకిందలోయలోంచి
కట్టెలు కొట్టేవాడి గొడ్డలి చప్పుడు
ప్రతిధ్వనిస్తున్నది.
పండిన వరిపొలాల సుగంధానికి
మత్తెక్కి కొడవలి కునుకు తీస్తున్నది
కుప్పబోసిన గుమ్మడిపండ్ల
గంపలమధ్య
ఒక రైతు ఇంట్లో నివాసానికి
నేడు హేమంతం అడుగుపెట్టింది
పొగమంచు కమ్ముకున్న కొండవాగుమీద
పరిచిపెట్టిన వలలో
నీలం రంగు చేపలు
ఉసిరిచెట్టు ఆకుల్లాగా ముసురుకున్నాయి
రాత్రంతా మంచుకు తడిసిన
చెక్కపడవని మెల్లగా
తెడ్లు ఇంటివైపు లాక్కుపోతున్నాయి
చేపలు పట్టేవాడి పడవలో చేరి
ఇప్పుడు హేమంతం మురిసిపోతున్నది.
చిమ్మటల సంగీతంతో
మైదానం మరింత విశాలమవుతున్నది
వానలు వెనకబట్టిన కాలంలో
ఇసుకతిన్నెలు మరింత బయటపడ్డాయి
పసులు కాచుకునేవాడి ఆ పిల్లంగోవి
రాగమెక్కడ?
దానిలోంచి పొంగిప్రవహించే
ఆ నడివేసవి నునువెచ్చని పరిమళమెక్కడ?
ఇప్పుడు హేమంతం
ఒక గొల్లపిల్ల కళ్ళల్లో
తీరిగ్గా కలలు గంటున్నది.
Featured image: Autumn Landscape, 17th century, Wikimedia commons
17-5-2024


కవితల పరిచయం, కవితలూ, landscape painting అన్నీ too beautiful sir.
“ విశాలమైన ఆకాశం దొరికినట్టు”
Thank you 🙏🏽
ధన్యవాదాలు మాధవీ! చాలాకాలం తర్వాత మీ పలకరింపు.
అద్భుతమైన కవితలు..అద్భుతమైన పరిచయం..అద్భుతం
ధన్యవాదాలు శ్రీనివాస్!
మీ మనసు వినే ఆ పాటలు మాటలు పంచుకొనే భాగ్యం మాకు కలిగించారు … నమస్సులు మీకు
ధన్యవాదాలు మేడం
ఎంత ఇష్టంగా మనసులో నింపుకున్నారో కానీ ఎక్కడా అనువాదమని అనుమానం కలుగలేదు.
ఏ దేశపు కవిత్వమైనా
ఎదమీటే వీణారవమే
రవిగాంచని చోటును వెదికే
కవి ఎదలో నాదస్వరమే
అనిపించింది
ధన్యవాదాలు సార్
ఒక్క మాట చెప్పు… ఆనందం కూడా నా విచారం లానే అందంగా ఉంటుందా? ఇది నేనెప్పుడూ అనుకుంటున్న మాటే సర్ . ఎంత ఆశ్చర్యం కలిగిందో? మనుషుల భావాలు అప్పుడప్పుడు కలగలిసి ఉంటాయనుకుంటా. ఇలా ఎన్నో సార్లు జరుగుతూ ఉంటుంది. చైనా కవిత్వం ఒక తెలుగు అనువాద పుస్తకం చదివాను. మన దేశ సంస్కృతిని ని పోలి ఉండే ఎన్నో సంగతులు ఉన్నట్లు అనిపించింది. మీరు చెప్పే విధానం ఎంతో ఆసక్తిగా, ఇంకా వినాలనేట్టు ఉంటుంది సర్.
గొల్లపిల్ల కళ్ళల్లో హేమంతం చూసాను.
ధన్యవాదాలు మేడం