చదవడం, రాయడం

పుస్తకాలు చదవడం వల్ల అన్నిటికన్నా ముందు కలిగే మెలకువ, మనం చూస్తున్నది మాత్రమే జీవితం కాదనీ, మనకు తెలిసింది మాత్రమే ప్రపంచం కాదనీ, మనకి తటస్థిస్తున్న అనుభవాలు మనకి మాత్రమే మొదటిసారిగా కలుగుతున్నవి కావనీ. ఆ మెలకువ వల్ల మన ఆలోచనలకొక లోతూ, స్తిమితం చేకూరుతాయి. మనం మరింత నిదానంగా జీవితాన్ని సమీపించగలుగుతాం.

అదంతా ఒక అదృశ్యయుగం

ఇప్పుడు నెమ్మదిగా కనుమరుగవుతున్న మండువా పెంకుటిళ్ళు. ఆ గోడల మీద ఆ చిత్రాల్ని చూస్తున్నప్పుడు మనం నలభై యాభై ఏళ్ళు వెనక్కిపోతాం. అది గతించిన కాలం. సమష్టికుటుంబాల కాలం. మనుషులూ, మనసులూ దగ్గరగా బతికిన కాలం. ఇంకా చెప్పాలంటే అదంతా ఒక అదృశ్యయుగం.

మనం మరిచిన దారులు

ఒకసారి బాట పాతపడ్డాక, జీవితం కూడా తప్పనిసరిగా పాతబడుతుంది. నడిచిన దారుల్లో నడిచినంతకాలం ఎన్ని ప్రభాతాలు ఉదయించినా అవి సుందరప్రభాతాలూ, సుప్రభాతాలూ కావడం అసాధ్యం.