
ఎప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక చిత్రలేఖనానికి ప్రాణం పోసేది ఏది? రంగులా, గీతలా? చిత్రలేఖకుడి సామర్థ్యమా? ఏళ్ల తరబడి చేపట్టిన సాధననా? ఒక చిత్రాన్ని చూడగానే భాషతో, వ్యాఖ్యానంతో, చివరికి మన ఆలోచనతో కూడా నిమిత్తం లేకుండా నేరుగా మన హృదయంలోకి చొచ్చుకుపోయే ఆ అహ్లాదానుభూతి కి ఏది కారణం? ఏం చేస్తే నా చిత్రాలు కూడా, చూపరులకు సరే, ముందు నాకే అటువంటి ఒక ఆహ్లాదానుభూతిని అందివ్వగలుగుతాయి?
ఇదుగో, ఈ చిత్రలేఖనం చూడండి, Evelyn Cheston గీసిన Betchworth Lane, October, 1917.

ఈ చిత్రాన్ని చూడగానే మన మీంచి ఒక తొలిహేమంతకాలపు కాంతి కురుస్తున్నట్టుందే, అది దేనివల్ల సాధ్యపడింది? ఈ చిత్రాన్ని విశ్లేషించిన రచయిత, దీనిలోని ఊదా, పసుపు రంగుల మేళనం వల్ల ఆ ఇంద్రజాలం సాధ్యపడిందని చెప్పాడు. ఊదారంగూ, పసుపూ పరస్పర పూరకాలు. ప్రత్యక్షపూరకాలు కాబట్టి ఊదారంగులో గీసిన ఆకృతులు ఒక పసుపురంగు after-image ని సృష్టించుకుంటాయనీ, అలాగే పసుపురంగు ఆకృతులు ఊదాఛాయాకృతుల్ని కల్పిస్తాయనీ, రెండింటి మిలనపునర్మిలనాలతో మనసులో ఒక సంగీతరూపకం నడుస్తుందనీ ఆయన వ్యాఖ్యానం.
కానీ ఈ చిత్రంలో సౌందర్యం కేవలం రంగులకి మాత్రమే పరిమితం కాదు. అంతకుమించింది ఏదో ఉందందులో. సంగీతాత్మకంగా ఉండే ఒక వచనకవితలో లాగా ఇందులో ఎంత అమరిక ఉందో అంత స్వాతంత్ర్యం కూడా ఉంది. స్వేచ్ఛాభివ్యక్తిలోని అవిరళమైన ఆకాశం, గాలీ, వెలుతురూ ఈ చిత్రమంతటా వెల్లివిరుస్తున్నాయి.
నేననుకుంటాను, ఇది ఆ దృశ్యాన్ని మొదటిసారి చూసినప్పుడు ఆ చిత్రకారిణి మనసులో అనుభూతి చెందిన freedom లో ఉందనుకుంటాను. ఆ క్షణాన ఆమె తన మానసిక బంధాలు వేటినుంచో బయటపడింది. ఆ అపురూపమైన విముక్తానుభూతిని కాగితం మీదకు తేవడంలో ఆమె తనను తాను కళకి సంబంధించిన కట్టుబాట్లతో నిర్బంధించుకోలేదు. చూసింది చూసినట్టుగా కాగితం మీద పెట్టడానికి ప్రయత్నించింది.
నీటిరంగుల చిత్రకారుడికి అన్నిటికన్నా ముందు కావలసింది boldness అని instruction manuals పదే పదే చెప్తాయి. ఆ సాహసం, నిర్భీతి ఎటువంటివో ఇదుగో ఇలాంటి చిత్రాల్ని చూసినప్పుడు తెలుస్తుంది. మనిషి స్వాతంత్య్రానికి అన్నిటికన్నా పెద్ద శత్రువు పిరికితనం అని చెప్పగలనుగాని, తీరా దాన్ని వదుల్చుకుందాం అనుకునేటప్పటికి అది ఎన్ని సూక్ష్మరూపాల్లో మనల్ని అంటిపెట్టుకుని ఉంటుందో బొమ్మలు వెయ్యడానికి కూచుంటే తప్ప తెలియదు.
అయినా ప్రయత్నించాను, ఆ బ్రిటిష్ చిత్రకారిణి స్ఫూర్తితో ఒక చిత్రాన్ని. పోయిన నవంబరులో వికారాబాదు దగ్గర అనంతగిరి కొండ ఎక్కినప్పటి ఒక దృశ్యం. పిరికితనం పూర్తిగా పోయిందని చెప్పలేనుగాని, ఎంతోకొంత ధైర్యం చిక్కిందని మాత్రం తెలుస్తూనే ఉంది.

15-2-2024


Stunning!! విముక్త క్షణం మాక్కూడా!
ధన్యవాదాలు మానసా!
చిత్రమైన విషయం ఏమిటంటే ప్రతిరోజూ మీరు రాసే ఆర్టికిల్ కు ముందు ఒక బొమ్మ పెడతారు .ఆ బొమ్మ గురించి కూడా చివరిలో చెప్పాలనుకుని మరచి పోవడం జరుగుతుంది.ఇవాళ ఆర్టికిల్ దేన్ని గురి రాసి ఉంటారో అనుకుంటూ ఇవాళ ఒక వాక్యమైనా రాయాలి అని బొమ్మల్ని తేరిపార చూస్తే
అస్పష్టంగా ఉండి ఒక మార్మిక అనుభూతి కలిగింది. వెంటనే సినారె వాక్యం కప్పిపెడితే కవిత్వం విప్పి చెబితే విమర్ష అని గుర్తుకు వచ్చింది.
ఆహా కవిత్వం లాంటి చిత్రలేఖనం అనుకుని తీరా ఆర్టికిల్ చదివితే మీరు అదే విషయాన్ని చెప్పడం భలే అనిపించింది.
ఎంతో ప్రేమతో ఆదరంగా మీరు రాసే ఈ స్పందనలకు నేను ఎప్పటికీ ఋణగ్రస్తుణ్ణి.
బొమ్మలు వెయ్యడానికి కూచుంటే తప్ప తెలియదు… absolutely true sir.
దృశ్యం చిక్కింది.
ధన్యవాదాలు సార్