
231
చెట్టుచెట్టుని
రాచుకున్నాక
చిచ్చు పుట్టి
ఆ చెట్టునే
కాల్చకుండా
ఉంటుందా?
మహానుభావుల
సాంగత్యం వల్ల
జ్ఞానాగ్ని పుట్టి
నా తనుగుణాన్నంతా
కాల్చకుండా
ఉంటుందా?
ఈ కారణానికి
కూడలసంగమదేవా
మహానుభావుల్ని
చూపించయ్యా ! (883)
232
తెలుసుకున్నదానిని
తెలుసుకోదు.
అదెలాగయ్యా?
మరచిపోయినదానిని
మరచిపోదు.
అదెలాగయ్యా?
తెలిసి
మరచిన
మనసును
కూడలసంగయ్య
తానే ఎరుగు. (884)
233
పాలు
దూడ ఎంగిలి.
నీళ్ళు
చేప ఎంగిలి.
పూలు
తుమ్మెద ఎంగిలి.
ఎలా పూజించాలయ్యా
శివశివా
దేంతో పూజించాలయ్యా?
ఈ ఎంగిలి
దాటడం
నా వల్ల కాదు.
నీదాకా ఏదొస్తే
కూడలసంగమదేవా!
అదే తీసుకోవయ్యా. (886)
234
కళాబిందు వటాముఖి
అనే అమ్మాయి చేతిలో
జలకారమనే
కుండ ఉంది.
ఆ కుండలో
చెన్నబసవన్న
నీళ్ళు తెచ్చాడు.
మడివాలయ్య
వంటసామగ్రి
తెచ్చాడు.
ఇంక,
దీనికింద
కూడలసంగమదేవా
పొయ్యి ముట్టించు. (891)
235
స్థిరమని నమ్మి
పూజించానా
అస్థిరమని
పక్కకి తోసేస్తావు.
అస్థిరమని నమ్మి
పూజించానా
స్థిరమంటూ
పక్కకి నెట్టేస్తావు.
ఏమనాలి?
ఎంతనాలి?
వెలుగు కోసం
వెలిగించిన దీపం
ఇల్లు మొత్తం
తగలబెట్టినట్టు
నేను చేసిన పూజ
నాకిలాగయ్యింది
కూడలసంగయ్యా! (891)
236
ఎనభై ఎనిమిది
మహిమలు
మెరిపించి
చివరికి
పగటివేషం
కట్టినట్టుంది
నా భక్తి!
తనువులో
మనసు
చిక్కక
మనసులో
తనువు
చిక్కక
తనువు
అల్లమునిలో
చిక్కుకుంది.
మనసు
చెన్నబసవనిలో
చిక్కుకుంది.
నిన్నే విధంగా
తలచుకునేది
కూడలసంగమదేవా! (892)
237
భక్తుణ్ణి
అనిపించుకుంటానయ్యా
మెల్లమెల్లగా.
యోగ్యుణ్ణి
అనిపించుకుంటనయ్యా
మెల్లమెల్లగా.
చేరి
శరణుణ్ణి
అనిపించుకుంటానయ్యా
మెల్లమెల్లగా.
అడ్డుపడే గుట్టలు దాటి
మెల్లమెల్లగా
లింగైక్యుణ్ణి
అనిపించుకుంటాను.
కూడలసంగమదేవా
నీకంటే
అధికుణ్ణి
అనిపించుకుంటాను. (894)
238
‘రావయ్యా
బసవయ్యా
మర్త్యలోకంలో
భక్తులున్నారా?
చెప్పవయ్యా.’
‘భక్తుణ్ణి
నేనొక్కణ్ణే.
మరెవరూ లేరయ్యా
ఇంకెవరూ లేరయ్యా
వేరెవరూ లేరయ్యా
మర్త్యలోకంలో ఉన్న
భక్తులంతా
నువ్వేనయ్యా!
జంగమలింగ!
కూడలసంగ!’ (895)
శరణుని మాహేశ్వర స్థలం
239
మెల్లమెల్లగా
భక్తుణ్ణీ
మాహేశ్వరుణ్ణీ
ప్రసాదినీ
ప్రాణలింగినీ
శరణుణ్ణీ
అవుతున్నానని
చెప్పడానికి
నేనేమన్నా
వజ్రదేహినా?
నేనేమన్నా
అమృతం
తాగానా?
సంజీవకరణి
సేవించానా?
నేనొక
మాట మాట్లాడితే
అందులో
షట్-స్థలాలూ
వచ్చి చేరి
నా మనసుకి
సంతోషం
కలిగించకపోతే
ఈ తనువుని
కూడలసంగమదేవా
తగలబెట్టేస్తాను! (898)
240
తాకేదేదో
ఆపేదేదో
అయ్యేదేదో
పొయ్యేదేదో
తెలియదు.
శరణుని
చరిత్ర
చూసి చూసి
ఆచ్చెరువు
కలిగిందయ్యా!
అతడు
కూడలసంగమదేవునిలోనే
జాగరూకుడై
ఉన్నందున. (904)
241
అయ్యా
జగాన్ని
చుట్టుకుంది
నీ మాయ.
నిన్ను
చుట్టుకుంది
నా మనసు.
నువ్వు జగానికి
బలాధికుడివి.
చూడయ్యా!
నేను
నీకంటే
బలాఢ్యుణ్ణి.
ఏనుగు
అద్దంలో
ఒదిగిపోయినట్టు
నువ్వు
నాలో
ఒదిగిపోయావుకదయ్యా
కూడలసంగయ్యా! (905)
శరణుని ప్రసాది స్థలం
242
నాకు
గురుని
ప్రసాదం.
నీకు
చెన్నడి
ప్రసాదం.
నాకూ
నీకూ
సమయాచారమే
సరి.
కూడలసంగమదేవా
నువ్వు
నాకు
చిన్నతమ్ముడివి. (906)
243
శుద్ధాత్మా
పరమాత్మా
ఇద్దరూ
ఒక రత్నం కోసం
పెనగులాడారు.
ఆ పెనగులాట
చూసి
ఆ రత్నాన్ని
నేను
లాక్కుంటే
అది కూడలసంగమదేవుడికి
నైవేద్యమైపోయింది. (907)
244
మగవాళ్ళంతా
వేటకు పొయ్యారు
నువ్వెందుకు
వెళ్ళవు
మగరాయా?
చచ్చింది తేకు
చేయెత్తి చంపకు.
మాంసం తేకుండా
ఇంటికి రాకు.
దేవుడిదయవల్ల
ఒక వేట దొరికిందా
కూడలసంగమదేవుడికే
అర్పిద్దామో
ప్రియతమా! (908)
శరణుని ప్రాణలింగి స్థలము
245
గ్రహం వచ్చి
పట్టుకోగానే
మనల్ని మనం
మర్చిపోయేలా
చేస్తుంది.
మరొకటి మనకి
రుచించకుండా
చేస్తుంది.
కూడలసంగమ జ్ఞానం
పోలికలేనిది.
అది
మనల్ని
ప్రపంచ వ్యవహారంలో
మననివ్వదు. (910)
12-12-2023


“పాలు
దూడ ఎంగిలి.
నీళ్ళు
చేప ఎంగిలి.
పూలు
తుమ్మెద ఎంగిలి.
ఎలా పూజించాలయ్యా
శివశివా
దేంతో పూజించాలయ్యా?
ఈ ఎంగిలి
దాటడం
నా వల్ల కాదు.
నీదాకా ఏదొస్తే
కూడలసంగమదేవా!
అదే తీసుకోవయ్యా. “
These verses reminded me of
“ఏమి సేతురా లింగా”
Thank you sir!🙏🏽🙇🏻♀️
ధన్యవాదాలు మాధవీ!
వెలుగు కోసం
వెలిగించిన దీపం
ఇల్లు మొత్తం
తగలబెట్టినట్టు
ఇది ఆ తరువాత ఒక్క అక్షరం కనబడలేదు తరువాత చదవాలి మళ్లీ
నమస్సులు.
🙏మా కుాడలసంగమదేవా
మీ కుటీరంలో చేరి
మీ అనుగ్రహముతో
మీకంటే
అధికలము
అనిపించుకుంటాము ✍️😊
మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ వంటి మిత్రుల వల్లనే నాకు నాలుగు వాక్యాలు రాయాలని స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది.
మమ్మల్ని
గ్రహంలా పట్టారు
మీ కుటీరంలోని
మకరందాన్ని గ్రోలుత్తుా
మమ్మల్ని మేము
మరిచిపోయేలా చేశారు
మరొకటి మాకు
రుచించకుండా చేశారు
మీ జ్ఞానసంగమము
వేలకటలేనిది
అది మమ్మల్ని
ప్రపంచ వ్యహోరంలో
మననివ్వడం లేదు 🙏
ఈ మాటలు వినడానికి ఎంత మధురంగా ఉన్నాయి!
మరొకటి రుచించకుండా
చేస్తుంది…
నమః