బసవన్న వచనాలు-17

ప్రసాది ఐక్యస్థలం

201

అతని నడత చక్కన
అతని మాట చక్కన
ఎటు చూసినా చక్కన.

ప్రమథుల్లో చక్కన
పురాతనుల్లో చక్కన.

అంబలి తాగి చూసి
రుచిగా ఉందని
కూడలసంగముడికి కావాలని
చెయ్యి వెనక్కి తీసుకున్నాడు
చెన్నుడు (795)

202

దైవం పట్ల వ్యామోహం ఉన్నవాడికి
దేహం పట్ల వ్యామోహమనేది ఉండదు.
భక్తుడి పట్ల అనురాగం ఉన్నవాడికి
ధనం పట్ల వ్యామోహమనేది ఉండదు.
అనుగ్రహం కోసం తపిస్తున్నవాడికి
మనసుకల్పించే వికారమనేది ఉండదు.

ఈ మూడూ తెలుసుకున్నవాడే
కూడలసంగమదేవా!
నిజంగా నిన్ను చేరుకున్నవాడు. (797)

ప్రాణలింగి జ్ఞాన స్థలం

203

పలుకు పలికితే
ముత్యాలసరంలా ఉండాలి.

పలుకు పలికితే
మాణిక్యదీప్తిలా ఉండాలి.

పలుకుపలికితే
స్ఫటికపుతునకలాగా ఉండాలి.

పలుకు పలికితే
దైవం మెచ్చి అవును, అవుననాలి.

నుడికి తగ్గట్టు నడతలేకపోతే
కూడలసంగదేవుడెలా
మెచ్చుకుంటాడయ్యా? (804)

204

ప్రకృతినియమం ఫలించే
ఒకానొక సుముహూర్తంలో తప్ప
ముత్యం నీరు కాదు
నీరు ముత్యం కాదు.

సద్గురువు కరుణవల్ల తప్ప
చిత్తం ఎరుకపడదు.

కూడలసంగమదేవుడు కర్త.
ఆయన దయ ప్రసరించి
చిత్తాన్ని చేజిక్కించుకుంటే తప్ప
శివతత్త్వసాహిత్యం దొరకదు. (808)

205

దేహం గురించి లెక్క
కొంతమందికి.
జీవం గురించి లెక్క
కొంతమందికి.
భావం గురించి లెక్క
కొంతమందికి.
వచనం గురించి లెక్క
కొంతమందికి.

ప్రాణలింగం గురించి లెక్క
ఎవరికీ లేదు
కూడలసంగన శరణుల్లో
తంగటూరు మారయ్యకు తప్ప. (808)

ప్రాణలింగి ప్రాణలింగ స్థలం

206

వెలుగులోపల
గొప్పవెలుగై
శివశివా!

తానే పరమాశ్రయంగా

శతపత్రకమలకర్ణికా
మధ్యంలో
స్వతఃసిద్ధుడై
ఉన్నాడు
మా కూడలసంగమదేవుడు. (818)

207

తమకు తామే నొసటకన్నుల వారు
తమకు తామే నందివాహనులు.

తమకు తామే
ఖట్వాంగం, త్రిశూలం, భిక్షాపాత్ర
చేతపట్టుకున్నవారు.

ఎవరు దేవుడో
ఎవరు భక్తులో
చెప్పండయ్యా!

కూడలసంగమదేవా!
నీ శరణులు స్వతంత్రులు.

నన్ను మాత్రం
అసలైన
బసవడనిపించయ్యా! (820)

208

ఉన్నవాళ్ళు
శివాలయం కడతారు
లేనివాణ్ణి
నేనేమి చెయ్యగలనయ్యా?

నా కాళ్ళే
స్తంభాలు.
దేహమే
దేవళం.
శిరసే
కలశం.

కూడలసంగమదేవా
వినవయ్యా
నిలబెట్టింది కూలుతుందిగాని
నడిచేది కూలదయ్యా! (822)

ప్రాణలింగ భక్తస్థలం

209

నువ్వు నాకు పరిచయం కాకముందు
నువ్వెక్కడున్నావో?

నాలో ఉండి
నిన్ను గుర్తుపట్టడానికి
రూపంధరించావు.

కూడలసంగమదేవా!
ఇంక మీదట
జంగమే లింగమని
నమ్ముతాను. (824)

210

గురువుకోపించాడా
ఒకరోజు తాళగలను.

దైవం కోపించాడా
అరదినం తాళగలను.

జంగం కోపించాడా
క్షణమాత్రం సహించినా
నా ప్రాణం పోతుందయ్యా
కూడలసంగయ్యా! (825)

211

భూతం పట్టుకుని
ఆత్మని ఆక్రమించాక
భూతంగుణాలే
ఉంటాయిగాని
ఆత్మగుణాలుంటాయా?

గురువు దయతలిచి
నా శిరసు తాకాక
గురులింగమజంగములే
నాకు గతి సంగన్నా! (828)

212

ఆకలి, నిద్ర, దప్పికల్ని
మరచాను
నీ వల్ల.

కామం, కోపం,లోభం, మోహం
మదం మాత్సర్యం మరిచాను
నీ వల్ల.

పంచేద్రియాలు, సప్తధాతువులు
అష్టమదాలు మరిచాను
నీ వల్ల.

కూడలసంగయ్యా
నీ శరణులకి
ఏది తృప్తి కలిగిస్తుందో
అదే నాకు సంతృప్తి. (829)

ప్రాణలింగి మాహేశ్వర స్థలము

213

దొంగలు ఆవుల్ని ఎత్తుకుపోయారని
అనకండి, మీకు పుణ్యముంటుంది.

బొబ్బలు పెట్టకండి
మీకు పుణ్యముంటుంది.

ఆరళ్ళు పెట్టకండి
మీకు పుణ్యముంటుంది.

అక్కడ తిన్నా సంగడే
ఇక్కడ తిన్నా సంగడే

కూడలసంగమదేవుడు
ఎక్కడున్నా ఒక్కడే. (831)

214

నీ కరుణ
లేకపోతే
చేసేవాణ్ణి
నేను కాను.
ఇచ్చేవాణ్ణి
నేను కాను.
వేడుకునేవాణ్ణి
నేను కాను

ఓ దేవా

పనిమనిషి
అలిసిపోయాక
ఇల్లాలు
ఇంటిపని
చేసుకున్నట్టు
నీకు
నువ్వే చేసుకో
కూడలసంగమదేవా (833)

ప్రాణలింగి ప్రసాదస్థలము

215

చేసేవాళ్ళు లేరు,
నువ్వు చెయ్యకపోతే నిలవలేను.

వేడుకునేవాళ్ళు లేరు,
నువ్వు వేడకపోతే నిలవలేను.

కూడేవాళ్ళు లేరు,
నువ్వు కూడకపోతే నిలవలేను.

నీ అంతట నువ్వు
చూడకపోతే

కూడలసంగమదేవా
నేనిట నిలబడలేను. (848)

9-12-2023

4 Replies to “బసవన్న వచనాలు-17”

  1. బసవన్న తత్త్వం అలవడిన వారికే ఆయన వచనాలు మనసుకెక్కుతాయి. (207,209,214)
    ఆ తపన తీవ్రతనే కదా గోదాదేవిలో,మీరాలో , కబీరులో, బసవన్న ఉట్టంకించిన పలువురు శివభక్తులలో ఇంకా ఎందరో అలాంటి సంత్ లలో . పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు ఆ అనుగ్రహం కలిగేది ఏ కొందరికో.

    1. “పలుకు పలికితే
      దేవుడు అవును,అవుననాలి

      నుడికి తగినట్టు
      నడత లేకపోతే
      కూడల సంగమ దేవుడెలా
      మెచ్చుతాడయ్యా ”

      ఆదర్శాలు వల్లించే కన్నా
      ఆచరణ ముఖ్యం
      కూడలసంగముడు మెచ్చాలంటే
      కూతలతో పనిలేదు
      కాయికమే కారణం.

      ధన్యవాదాలతో …

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading