హెసియోదూ, పార్మెనిడిసూ దేవతల కార్యకలాపం గురించి చెప్పినమాటలు నిజమే అనుకుంటే, అవన్నీ దేవతలు అవసరం కొద్దీ చేసినవి తప్ప, ప్రేమతో చేసినవి కావనిపిస్తుంది. ఆ రోజుల్లో ప్రేమదేవత ఉండిఉంటే, దేవతలు సంకెళ్ళలో తగులుకుని ఉండేవారు కాదు, వికృతరూపులయ్యేవారు కాదు. లేదా ఇంకా అలాంటివే హింసాత్మక చర్యలుండేవి కావు. వాటి బదులు, ప్రేమ సామ్రాజ్యం మొదలయ్యాక ఇప్పుడు స్వర్గంలో కనవస్తున్నట్టే, అప్పుడు కూడా శాంతీ, మాధుర్యమూ వెల్లివిరిస్తూ ఉండేవి.
