ఒక యాత్ర మొదలుపెట్టారు

సర్వ శిక్షా అభియాన్ బాధ్యతలు స్వీకరించి రెండునెలలయ్యింది. నెమ్మదిగా ఒక్కొక్క పథకాన్నీ అర్థం చేసుకుంటూ వస్తున్నాను. పాతిక ముప్పై ఏళ్ళ కింద ఊహకు కూడా అందని ఎన్నో కలలూ, కల్పనలూ ఇప్పుడు సర్వశిక్షా అభియాన్ వార్షిక ప్రణాళికలో తప్పనిసరిగా అమలు పరచవలసిన కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయి. వాటిని అర్థం చేసుకోడానికి, వాటిని ఇప్పుడున్నదానికన్నా మరింత మెరుగ్గా అమలుపరచడానికి అవసరమైన మెలకువలు తెలుసుకోవడానికి వీలైనప్పుడల్లా ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూనే ఉన్నాను.

అటువంటి ప్రయత్నాల్లో భాగంగా నిన్న కొన్ని మదర్సాలు సందర్శించాను. మదర్సాలు, మక్తబ్ లు, వేదపాఠశాలలు ధార్మికవిద్యని బోధించే ప్రైవేటు పాఠశాలలు. అక్కడ చదువుకునే విద్యార్థులు ప్రధానంగా ఆరబిక్, సంస్కృతం నేర్చుకుని, ఆ భాషల్లో ఉండే మతగ్రంథాల్ని అధ్యయనం చేస్తుంటారు. వారిలో కొందరు మతాచార్యులుగా స్థిరపడాలనుకుంటారు. కాని వారందరికీ కూడా కొంత ఆధునిక విద్యకూడా అందించాలన్న ఉద్దేశ్యంతో సర్వశిక్షా అభియాన్ ఆ పాఠశాలల్లో ఇంగ్లీషు, గణితం, సైన్సు బోధించడానికి ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేస్తున్నది. ఏ ధార్మికవిద్యాలయాలైతే తమ పిల్లలకి ఆధునిక విద్య కూడా అవసరమని గుర్తిస్తాయో, అటువంటి సహకారం కావాలని కోరుకుని ఐచ్ఛికంగా ముందుకు వస్తాయో అటువంటి వారికి మాత్రమే ఈ సదుపాయం అందిస్తున్నది.

ఆ కార్యక్రమం ఏ విధంగా అమలు జరుగుతున్నాదో చూద్దామని నిన్న కృష్ణా జిల్లాలో ఉయ్యూరు, మచిలీపట్నం, పెడన పట్టణాల్లో కొన్ని మదర్సాలు చూసాను. నేను చూసిన నాలుగు మదర్సాల్లో ఉయ్యూరులోనూ, పెడనలోనూ ఉన్న మదర్సాల్లో ధార్మిక విద్యతో పాటు ఆధునిక విద్యకూడా పూర్తిస్థాయిలో నడుస్తోంది. పెడనలో ఉన్న మర్కాజ్ దారుల్ బిర్ మదర్సా కళాశాల స్థాయిదాకా నడుస్తున్నది. మచిలీపట్నంలో చూసిన రెండు మదర్సాలూ పూర్తిస్థాయి ధార్మిక పాఠశాలలు. అక్కడ మా వాలంటీర్లు నెమ్మదిమీద ఆ పిల్లలకి తెలుగు, ఇంగ్లీషు బోధించగలుగుతున్నారు.

నేను చూసిన నాలుగు మదర్సాల్లోనూ మూడు బాలికల మదర్సాలు. ఆ బాలికల విద్యాభ్యాసం చూసి నాకు అపారమైన సంతోషం కలిగింది. ఆ పిల్లలు ఆరబిక్, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు-నాలుగు భాషల్లోనూ చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. వాటిలో రెండు కుడినుంచి ఎడమకి రాసే భాషలు, రెండు ఎడమనుండి కుడికి రాసే భాషలు. కాని ఒక భాష నుండి మరొక భాషకు మారి రాయడంలోగాని, చదవడంలోగాని వారిలో ఎట్లాంటి తొట్రుపాటూ కనిపించకపోగా, ప్రతి ఒక్క భాషలోనూ వారి ఉచ్చారణ ఎంతో స్పష్టంగానూ, నిర్దుష్టంగానూ ఉండటం నన్నెంతో సంతోషపరిచింది. ఒక మదర్సాలో ఒక బాలిక ఆరబిక్ లో రాసుకున్న నోట్సు చూసి నాకు మతిపోయింది. కంప్యూటరు లో ఆరబిక్ టైపు చేసినా కూడా అంత ముత్యాలకోవలాగా ఉండదని చెప్పగలను. మరొక మదర్సాలో ఒకటవతరగతి (నిజానికి అలా తరగతులుగా విభజించడం మన సౌకర్యం కోసం మాత్రమే. మత విద్యకి సంబంధించిన శ్రేణీ విభజన వేరేలా ఉంది) చదువుతున్న బాలిక ముందు పవిత్ర కొరాన్ రంగుల పుస్తకం ఉంది. ఆమెను ఆ పుస్తకం చదవగలవా అనడిగాను. ఆమె చాలా అలవోకగా, కాని ఎంతో శ్రద్ధగా, కొరాన్ లోని మొదటి సురా ‘అల్ ఫాతిహా’ను వయోవృద్ధుడైన ఒక మతాచార్యుడు ఎంత నిర్దుష్టంగా చదువుతాడో అంత స్పష్టంగానూ చదివింది.

నేను చూసిన నాలుగు మదర్సాల్లో పెడనలోని పాఠశాల కాలంతో పోటీ పడటమే కాక, కాలం కన్న ఒకడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తున్నది. ఆ పాఠశాలలో అడుగుపెట్టేముందు బయట గేటు దగ్గర ఒక ప్రకటన చూసాను. తమ పాఠశాలలో xseed పద్ధతిలో బోధన జరుగుతున్నదనీ, 21 వ శతాబ్దానికి అవసరమైన విద్యని అందించడానికి తాము అయిదు అంచెల్లో బోధన చేపడతామనీ అక్కడ రాసి ఉంది. మతసంస్థలు మధ్యయుగాల నాటి విద్యని బోధిస్తాయని మనకు తెలీకుండానే మనమేర్పరుచుకునే అపోహ ఎంత అర్థరహితమో నాకు మరోసారి బోధపడింది. xseed వారు చెప్తున్న ఆ అయిదంచెల పద్ధతిగురించి మరికొంత తెలుసుకోవాలనుకున్నాను. ఒక ఉపాధ్యాయుడు తన మొబైలు తెరిచి xseededucation.com చూపించాడు. తాము తమ పిల్లలకి మంచి బోధన అందించడానికి ఎటువంటి పద్ధతులూ, వనరులూ లభ్యమవుతాయా అని వెతుకుతుంటే ఈ పద్ధతి కనిపించిందనీ, ప్రయోగాత్మకమైన ఈ నవ్యపద్ధతిని తమ పాఠశాలలో ప్రవేశపెట్టడానికి తాము కర్చుకి వెనకాడలేదనీ ఆ పాఠశాల అధిపతి నాకు వివరించాడు.

బోధన, అభ్యసనాలకు సంబంధించి మదర్శాలలో హెచ్చు తగ్గులున్నాయిగానీ, క్రమశిక్షణ, సదాచారాల్లో మాత్రం నేను చూసిన నాలుగు పాఠశాలలూ ఒక్కలానే ఉన్నాయి. అంతేకాదు, లౌకిక విద్యను బోధిస్తున్న ఆధునిక పాఠశాలలకన్నా ఎంతో ఎత్తులో ఉన్నాయని చెప్పడానికి కూడా నాకేమీ సంకోచం లేదు. అన్నిటికన్నా ముందు నన్ను ఆకర్షించింది, చాలా తరగతి గదుల్లో కింద చాపలు వేసుకుని, పిల్లలతో పాటే ఉపాధ్యాయుడు కూడా వారితో పాటే కూచుని పాఠాలు చెప్పడం. ఆధునిక పాఠశాలల్లో, ఎన్నో ప్రాథమిక పాఠశాలల్లో, పిల్లలు నేలమీద కూచుంటారు, ఉపాధ్యాయుడు తళతళలాడే బూట్లు వేసుకుని వాళ్ళ ఎదట కుర్చీ మీద కూచుంటాడు. అతడికీ, ఆ పిల్లలకీ మధ్య దీర్ఘచతురస్రాకారపు బల్ల ఒకటి అడ్డుగా ఉంటుంది. పిల్లలు తమ ఎదట ఉన్న authority ని నిస్సహాయంగా గౌరవించక తప్పని వ్యవస్థ అక్కణ్ణుంచే మొదలవుతుంది. అలాకాక, ఉపాధ్యాయుడు కూడా పిల్లల్లో ఒకడిగా, పిల్లలతో ఒకడిగా, వారిని తన చుట్టూ కూచోబెట్టుకుని పాఠాలు చెప్తుంటే, అతడికి వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనిపిస్తాయి. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడగలుగుతాడు. ఆ చిన్నారులు అతడితో భయరహితంగా, ఆత్మీయంగా మాట్లాడగలుగుతారు.

ముస్లిం సమాజం స్త్రీలను గౌరవించదనీ, వారికి విద్యావకాశాలు అందించదనీ మనందరినీ నమ్మించే ఒక ప్రక్రియ పాశ్చాత్య సమాజం ఏళ్ళ తరబడి నమ్మిస్తూ వచ్చిన ఒక అపోహ. కాని చరిత్ర చెప్తున్నది మరోలా ఉంది. యూరోప్ కి అరబ్బులతో సంపర్కమే ఘటించకపోయి ఉంటే, సాంస్కృతిక పునరుజ్జీవనం సాధ్యపడి ఉండేదే కాదు. సైన్సునీ, గణితాన్నీ, ఆస్ట్రానమీని యూరోప్ కి అరబ్బులే పరిచయం చేసారు. అవిసెన్న, అవిరోల వంటి తత్త్వవేత్తలు గ్రీకునుంచి అరిస్టాటిల్ ని అనువదించి ఉండకపోతే, మధ్యయుగాల యూరోప్ ఎప్పటికీ ఆధునిక కాలంలోకి అడుగుపెట్టి ఉండేదే కాదు.

ఒక మదర్సాలో నేనొక బాలికను ఆమె దినచర్య అడిగాను. తెల్లవారుజామున నాలిగింటికి లేస్తుంది ఆమె. రోజంతా చదువు, ఆటలు, కాలకృత్యాల మధ్య అయిదు సార్లు భగవత్ప్రార్థన చేస్తుంది. మూడు పూటలా ఆహారం స్వీకరించే ముందు ప్రార్థన తప్పని సరి. మనం మన జీవితాల్ని మతం పట్టునుంచి విడదీసుకునే ప్రయత్నంలో అన్నిటికన్నా ఎక్కువగా నష్టపోయింది ఈ ప్రార్థననే. మనం లౌకిక జీవితాన్ని ఆరాధిస్తున్నాం. మంచిదే, ప్రార్థన ఎవరికి వారికి వ్యక్తిగత వ్యవహారం, అదీ మంచిదే. కాని, పిల్లలూ, పెద్దలూ భోజనాల బల్ల దగ్గర కూచున్నప్పుడు, తొలి అన్నం ముద్ద తినడానికి ముందు, సర్వేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకపోతే మానే, కనీసం, ఆ ముద్దని మన నోటిదాకా తెచ్చిన రైతులు, కూలీలు, అన్నం వండిపెట్టిన తల్లులు, ఆ సమస్త హస్తాలనీ ఒక్కసారి స్మరించుకుని, అప్పుడు ఆ అన్నంముద్ద నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది? మతం నుంచి విడివడ్డ ఆధునిక ప్రపంచం మానవత్వం దిశగా ఎదగకపోవడమే నేటి మన జీవితాన్ని ఇంత అస్వస్థతకి గురిచేస్తున్నది!

కొరాన్ ని ఎంతో సుస్వరంతో పఠించిన ఆ చిన్నారి బాలిక పేరు అడిగాను. ‘రాహిలా’ అని చెప్పిందామె. అంటే ‘యాత్రీకురాలు’ అని అర్థం చెప్పారు అక్కడెవరో. ఆ పిల్లలంతా ఒక యాత్ర మొదలుపెట్టారు. ప్రాచీన,ఆధునిక ప్రపంచాలకు రెండింటికీ వారసులు కావాలని చేస్తున్న సుదీర్ఘ యాత్ర అది. తోవ దీర్ఘమే కాదు, కఠినం కూడా. కాని వాళ్ళు గమ్యం చేరాలన్నదే నా కోరిక.

24-8-2019

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading