అలా చూసినప్పుడు ట్రెవర్ ఛాంబర్లేను తన తరానికీ, తన తర్వాతి తరాలకీ కూడా సంతోషాన్నివ్వగల కొన్ని సౌందర్యశకలాల్ని సృష్టిస్తూ వచ్చాడని అర్థమవుతుంది. అతడు చిత్రించిన ప్రతి కాన్వాసులోనూ, ప్రతి కాగితం మీదా కాంతిని అద్దుకుంటూ పోయేడు. ఆ బొమ్మల్ని ఎవరు చూసినా అన్నిటికన్నా ముందు వాళ్ళు ఆ కాంతి తమమీద వర్షిస్తున్న అనుభూతికి లోనవుతారు.
ట్రెవర్ ఛాంబర్లేను
బ్రిటిష్ చిత్రకారుడు ట్రెవర్ ఛాంబర్లేను నా రోల్ మోడల్స్ లో ఒకరని చెప్పాక, ఆయన గురించి మరొక నాలుగు వాక్యాలు కూడా రాయాలనిపించింది.
ఛాంబర్లేను 1934 లో పుట్టాడు. చిన్నప్పణ్ణుంచీ చిత్రకళ మీద ఆసక్తి ఉన్నప్పటికీ, ఎవరిదగ్గరా చిత్రకళ నేర్చుకోలేదు. స్వయంకృషితోటీ, పూర్వ బ్రిటిష్ చిత్రకారుల్ని అధ్యయనం చెయ్యడంతోటీ తనంటన తను చిత్రకారుడిగా మారేడు.
