ఒక కావ్యంలోగాని, ఇతిహాసంలోగాని, పురాణంలోగాని వర్ణన కోసమే వర్ణన చేసేవాడు సాధారణ కవి. కాని మహాకవి ఆ వర్ణనని కథలో పొదుగుతాడు. కథాప్రయోజనానికి ఆ వర్ణనని కూడా ఒక ఆలంబనం చేసుకుంటాడు. కిష్కింధా కాండలోని ఈ వర్షర్తు వర్ణన ప్రయోజనం కేవలం నాయకుడి విరహాన్ని చెప్పడం కోసమే అయి ఉంటే ఇది భావుకుల్ని ఇంతగా ఆకర్షించి ఉండేది కాదు.
మొగలిపూలగాలి
నీళ్ళునింపుకున్న కడవల్లాంటి నల్లమబ్బులు నింగిలో కనబడగానే భారతీయకవులు లోనైన రసపారవశ్యంలో సంతోషం, దిగులు, ప్రేమించినవాళ్ళనుంచి ఎడబాటు, ఎడబాటు తీరుతుందన్న కోరిక-ఎన్నో భావాలు వ్యక్తం కావడానికి వాల్మీకి రామాయణంతోనే మొదలు.
