అందుకనే మంచికంటి, రవి కుమార్ అనే ఈ ఇద్దరు మిత్రులు గ్రంథాలయ ఉద్యమం పేరిట మొదలుపెట్టిన ఈ ప్రయత్నాలు కేవలం సాహిత్యానికో, రచయితలకో మాత్రమే సంబంధించినవి కావు. ఇవి సామాజిక ప్రక్షాళనా ప్రయత్నాలు అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం ముఖం లేని మనుషుల్తో నిండిపోకుండా ప్రతి ఒక్కరినీ ఒక చైతన్యవంతుడైన మానవుడిగా, మానవిగా తీర్చిదిద్దే దిశగా ఎంతో ప్రేమతో వేస్తున్న అడుగులు అనిపిస్తుంది.
మరో గ్రంథాలయ ఉద్యమం
ఒక స్వాతంత్య్రపోరాటానికి ఒక ప్రభుత్వం ఎప్పటికీ నాయకత్వం వహించలేదు. అది ప్రజలే నడుపుకోవలసిన ఉద్యమం. ఆ మాటే చెప్పాను ఆ రోజు- పుస్తకాల పట్లా, గ్రంథాలయాల పట్లా ఆసక్తి పునరుజ్జీవం కావాలంటే మనం చూడవలసింది ప్రభుత్వం వైపూ, ప్రభుత్వోద్యోగుల వైపూ కాదు, ప్రజలవైపు, ముఖ్యంగా తల్లిదండ్రులవైపు అని చెప్పాను.
