నిన్న మళ్ళా కృష్ణలీలా తరంగిణి మీద మాట్లాడటానికి కూచున్నప్పుడు గీతగోవింద కావ్యం లో కన్నా కూడా అందులో విస్తృతీ, వైవిధ్యం మరింత ఉన్నాయనిపించింది. ఆ మాటే చెప్పాను అక్కడ. గీతగోవింద కావ్యానికి జీవితకాల ఆరాధకుడిగా నేనా మాటలు చెప్పడం నాకే ఆశ్చర్యమనిపించింది. కానీ ఏం చెయ్యను? కృష్ణలీలాతరంగిణి మహిమను నేనిన్నాళ్ళూ గుర్తించవలసినట్టుగా గుర్తించలేదేమో అనిపించింది.
సంగీత రూపకం
గీతగోవిందం సంగీతం, కర్ణామృతం రూపకం మాత్రమే కాగా, శ్రీకృష్ణలీలా తరంగిణి సంగీత రూపకం కూడా. అంతేనా! జయదేవుడు సంస్కృతాన్ని సంగీతంగా మారిస్తే, నారాయణ తీర్థులు సంస్కృతాన్ని నృత్యంగా మార్చేసాడు. ఆయన వాక్కులో భాష ఆనందతాండవం చేసింది.
