ఇది రఘు తీసుకువచ్చిన తొమ్మిదవ సంపుటి అయినప్పటికీ నేను ఆయన కవిత్వం చదవడం ఇదే మొదటిసారి. కాబట్టి, ప్రధానంగా మూడు అంశాలమీద నా అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పాను. ..
నీరస తథ్యాల్ని తిరస్కరించడం
ఒక మనిషి తాత్త్వికంగా సత్యాన్వేషణకు పూనుకోవడమంటే 'నీరస తథ్యాల్ని' తిరస్కరించడం. 'నిశ్చల నిశ్చితాల' ని పక్కకు నెట్టేయడం. కాబట్టే, సత్యాన్వేషణ అన్ని వేళలా సంతోషానికీ, మనశ్శాంతికీ దారితియ్యకపోగా, నిరంతర ఆత్మశోధనకీ, సంశయగ్రస్తతకీ, ఆత్మవేదనకీ దారితియ్యడం ఆశ్చర్యం కాదు. అలాగని మనం సత్యాన్వేషణని ఆపలేం. పక్కనపెట్టేయలేం. 'నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం' అని తెలిసికూడా మన వివేచనని కట్టిపెట్టలేం.
జోర్బా ద గ్రీక్
జోర్బా లాంటి వ్యక్తులు ప్రాపంచిక సుఖాల్ని ప్రేమిస్తున్నట్టే కనబడతారుగాని, వాటిల్లో కూరుకుపోరు. పూర్తి సాంగత్యం మధ్య వాళ్ళల్లో నిస్సంగి మరింత తేటతెల్లంగా కనబడుతూనే ఉంటాడు. జీవితం జీవించు, కాని కూరుకుపోకు, ఎప్పటికప్పుడు జీవితం నీముందు సంధించే ప్రశ్నలనుంచి పారిపోకు, సరాసరి ఆ ప్రశ్నలకొమ్ములు పట్టుకుని వాటితో కలయబడు, కాని నీ ప్రవర్తనని సిద్ధాంతీకరించకు అన్నట్టే ఉంటుంది జోర్బా ప్రవర్తన.
