అయితే ఇలా సమన్వయించుకునే క్రమంలో ముఖ్య గ్రంథాలు, సంస్కర్తలు, సాధువులు, రెండు పరస్పర విరుద్ధ సంప్రదాయాల్ని సమన్వయించుకున్నట్టు మనకి పైకి కనిపిస్తుందిగానీ, నిజానికి వాళ్ల వాళ్ళ కాలాల్లో వాళ్ళు ఎన్నో సంప్రదాయాలతో సంఘర్షించి మరెన్నో సంప్రదాయాల నుంచి తామెంతో సంగ్రహించారనే చెప్పవలసి ఉంటుంది.
అవధూతగీత-1
ఇన్నేళ్ళు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో అంతర్వాహినులుగా ఉండి నన్ను నడిపిస్తున్న ప్రభావాలు మూడు కనబడ్డాయి. నేను పుట్టిన ఆ తాటాకు ఇంట్లో మా బామ్మగారు నాకు చిన్నప్పుడే వినిపించి కంఠస్థం చేయించిన పోతన భాగవత పద్యాలు. మా నాన్నగారు ఎంతో అపురూపంగా చూసుకునే మహాభక్తవిజయం పుస్తకం, మూడోది, ఆ ఇంట్లో ఈశాన్యమూలన మా అమ్మ ప్రాణప్రదంగా చూసుకునే దేవుడిగది.
