ఆ వెన్నెల రాత్రులు-29

దాన్ని అంటిపెట్టుకుని ఏకంగా ఒక అడవిమొత్తం నాదాకా ప్రయాణించి వచ్చింది. దానిమీద మాఘఫాల్గుణాల వెన్నెల కురిసి ఉంటుంది. నక్షత్రధూళి రాలి పడి ఉంటుంది. ఆ పువ్వు రంగులు పోసుకుంటున్నప్పుడు ఎంతో సూర్యరశ్మి దాని ఈనెల్లోకి ప్రవహించి ఉంటుంది. అప్పటికే సగం వాడిపోతూ ఉన్న ఆ పువ్వుని చేత్తో పట్టుకున్నాను. భగవంతుడా! అతని ఉత్తరాలు, మాటలు, చివరికి ఆ కవితలు కూడా చొరలేని ఏదో తావుని ఆ తేనెమరక స్పృశించింది. అది నా గుండె మీద సన్నని గాటుపెట్టింది.

ఆ వెన్నెల రాత్రులు-28

అచ్చం అలాంటి సంఘటననే మా జీవితాల్లోనూ సంభవించింది. ఆ వైశాఖమాసపు అపరాహ్ణం మేము ఆ కొండవార లోయలోకి వెళ్ళినప్పుడు వర్షం పడ్డప్పుడు మేమిద్దరమే ఆ అడవిలో ఒంటరిగా గడిపాం. అప్పుడు మా మధ్య ఏమీ జరగలేదు. కానీ ఇన్ని నెలల తర్వాత, నాకు తెలుస్తున్నది, ఆ పిల్లవాడు మరింత పిల్లవాడైపోయాడు, నేను మరింత పెద్దదాన్నైపోయాను.

ఆ వెన్నెల రాత్రులు-27

నా కళ్ళ ముందు ఆ ముఖం చెరిగిపోయింది. ఎటు చూసినా పొలాలు. పండిన వరిచేలు. వాటిమీద ఇంతలో ఎండ పడుతోంది, ఇంతలో మబ్బునీడ పడుతోంది. ఇద్దరు పిల్లలు ఆ పొలాల మధ్య గళ్ళకు గంతలు కట్టుకుని ఒకరినొకరు పట్టుకోడానికి పరుగెడుతున్నారు.  వాళ్ళిద్దరూ గంతలు కట్టుకున్నారు, లుక్, విమలా, ఇద్దరూ, అంటే నువ్వు కూడా, కళ్ళకి గంతలు కట్టుకున్నావు-