ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ నేను వెలువరించిన 'వికసించిన విద్యుత్తేజం' పుస్తకానికి ఇప్పటిదాకా ఒక్క సోమశేఖర్ నుంచి మాత్రమే ప్రతిస్పందన లభించింది. ఆ పుస్తకంలో మూడు నాలుగు కొత్త వ్యాసాలున్నాయి. కాబట్టి మిత్రులు వాటిని ఇక్కడైనా చదువుతారని ఇలా అందిస్తున్నాను.
వేసవి ముగిసింది
ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కవి నన్ను పట్టుకుంటూ ఉంటాడు. అతడు నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. నాకు కొత్త చూపునిస్తాడు. నాలోపలకీ నన్ను చూసుకునేలాగా చేస్తాడు. మరీ ముఖ్యంగా, నా చుట్టూ ఉండే సాహిత్యవాతావరణం నాలో కల్పించే అనిశ్చితినుంచీ, సంశయాత్మకతనుంచీ తనే నా చెయ్యి పట్టుకుని దాటిస్తాడు.
ఆత్మోత్సవ గీతం-3
ప్రపంచ సాహిత్యచరిత్రలో గొప్ప యోగానుభవంలోంచి పలికిన కవిత్వాలు, ఉపనిషత్తులు, సువార్తలు, డావో డెజింగ్, బుద్ధుడి సంభాషణలు మనకి ఏ ఆత్మానుభవాన్నీ, ఏ సత్యసాక్షాత్కారాన్నీ పరిచయం చేస్తాయో సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్ కూడా అటువంటి అత్యున్నత ఆత్మానుభవాన్నే పరిచయం చేస్తుంది
