ఆ రాతప్రతి చూడటం కోసమే ఒకరోజు విశాఖపట్టణంలో వాళ్ళింటికి వెళ్ళాను. అసలు రాతప్రతినో, జిరాక్సు కాపీనో గుర్తులేదుగాని, ఒక నాటకం రాయడానికి శ్రీ శ్రీ రాసుకున్న ప్రణాళిక అది. కాఫ్కా తరహాలో మధ్య మధ్య చిన్న చిన్న బొమ్మలు కూడా గీసుకున్నాడు. ఆ రాతప్రతి చదివే అవకాశమిచ్చినందుకు నేను ప్రసాద్ గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను.
చేరా
శ్రీ శ్రీలాగా , ఇస్మాయిల్ లాగా చేరా వాక్యం కూడా చాలా విశిష్టమైనది. కవిత్వస్పర్శలేని వచనం అది, అలాగని పెళుసుగానూ, చదువుతుంటే తునకలైపోయే పొడివచనం కాదు.మారుతున్న సమాజాన్ని చూస్తూ, అర్థం చేసుకుంటూ, ఆవేదన చెందుతూ, ఆ క్రమంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చెయ్యగల హృదయం ఆయనది.
మునిపల్లె రాజు
కవి, కథకుడు, సాహిత్యారాధకుడు, మహామనిషి మునిపల్లె రాజుగారు మొన్న రాత్రి ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారు. నిన్న ఆయన పార్థివదేహాన్ని దర్శించుకున్నప్పుడు అస్తిత్వనదపు ఆవలితీరానికి చేరుకున్న ఆ మానవుడు నిశ్చింతగా కనిపించాడు.
