కాబట్టి యుగయుగాలుగా తెలుగువాళ్ళు కూడబెట్టుకున్న ఆస్తుల్లో అన్నిటికన్నా ముందు పద్యాన్ని లెక్కగడతాను నేను. అమరావతి శిల్పాలూ, అజంతా చిత్రాలూ, త్యాగయ్య సంగీతమూ, కూచిపూడి నాట్యమూ ఆ తర్వాతనే.
మనసులో మాట
ఈ ప్రపంచంలో ఇంకా అమ్మకం సరుకుగా మారనిదంటూ ఉంటే అది కవిత్వం మాత్రమే. చదువుతారా, చదవరా, పుస్తకాలు కొంటారా, కొనరా లాంటి లెక్కల్తో పనిలేకుండా ఉన్నది ప్రస్తుతం కవిత్వం మాత్రమే. తన మనసులో మాట తాను ఎలాంటి మసకలూ లేకుండా చెప్పుకోగలిగేనా లేదా అన్నదానిమీదనే ఎప్పుడూ కవి దృష్టి ఉండాలి తప్ప, తన మాటలు ఎంతమంది ఆలకిస్తున్నారన్నదాని మీద కాదు.
ఆశ్చర్యకరమైన అధ్యయనం
సులభంగానూ, సరళంగానూ ఉండే శైలి, ఆసక్తికలిగించే కథనం, సంస్కారవంతమైన భాష, ఎక్కడా ఎవరి మీదా తీర్పులు తీర్చడానికి సిద్ధపడకపోవడం ఈ పుస్తకాన్ని విలువైన రచనగా తీర్చిదిద్దాయి. పుస్తకం ముగించేటప్పటికి డా.కాత్యాయనీ విద్మహేలోని పరిశోధకురాలిగా నేను పూర్తి అభిమానిగా మారాను.
