ఆ పాట వినిపిస్తున్నప్పుడు బ్రహ్మపుత్రమీంచి నామీద ప్రసరించిన సన్నని తీయతెమ్మెర, దూరంగా ఒడ్డున గౌహతి నగరదీపాలు, ఒకవైపు దూరంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న కామాఖ్యదేవాలయం. ఆ పాట పాడిన గాయకి ఎవరోగాని, ఆ స్వరం, ఆ ఈశాన్యభూమిలోని ఏ అడవుల్లోనో చందనతరువులమీద గూడుకట్టుకున్న తేనెపట్టుల తీపిదనాన్ని ఆ గాలుల్లోంచి తీసుకొచ్చి నా మీద కుమ్మరించిందనిపించింది.
కామరూప-2
ఆ తెలివెలుగులో దూరంగా చిన్న చిన్న కొండలు, మంచుముసుగు ఇంకా తొలగించని అవతలి వడ్డు, రేవులో లంగరు వేసుకుని నిద్రపోతున్న క్రూయిజులు-వీటిమధ్య బ్రహ్మపుత్ర ఒక నీలిరేఖలాగా గోచరించింది. సూర్యుడు ఉదయించినతర్వాత, ఆ నీటిపాయలు ఇసుకతిన్నెలమీద ఆరబెట్టిన చీనాంబరాల్లాగా కనిపించడం మొదలుపెట్టాయి.
కామరూప-1
ఈశాన్య భారతసంగీతమంటే నాకు తెలిసినపేర్లు ఎస్.డి.బర్మన్, భూపేన్ హజారికాలు మాత్రమే. కాని, ఆ మూజిక్ షాపులో కొందరు అద్భుతమైన గాయనీ గాయకుల పేర్లు మొదటిసారిగా విన్నాను.
