నన్ను వెన్నాడే కథలు -18

ప్రపంచ సాహిత్యాల్లో ఒక్కో భాషకి ఒక్కో కాలమూ, ఒక్కో ప్రక్రియా సొంతమైనట్టు ఉంటాయి. సంస్కృతనాటకం, పారశీక గజలు, గ్రీకు ట్రాజెడీ, జపనీయ హైకూ, ఇటాలియను ఒపేరాల్లాగా పందొమ్మిదో శతాబ్ది రష్యను నవల ఒక అద్వితీయ ప్రక్రియ. రాజకీయంగా జార్ నియంతృత్వంలోనూ, సామాజికంగా అనుల్లంఘ్యనీయమైన  అంతరాల్తోనూ, ఆర్థికంగా అపారమైన పేదరికంలోనూ గడిచిన ఆ కాలంలో నవలాకారులు చీకటిలో వెలుగు కోసం వెతుక్కోడంలోంచి పుట్టిన ప్రక్రియ అది. కాని ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి బాట పట్టిన సోవియేటు కాలంలో, రష్యను రచయితలు కాదు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది, అంతకు ముందు రష్యా అంచుల్లో ఉన్న చిన్ని చిన్ని జాతులు, రాజ్యాలు  సోవియేటు రిపబ్లిక్కులుగా మారేక ఆ సంస్కృతుల రచయితలు విశాల సోవియేటు రష్యా సాహిత్యానికి కొత్త జవసత్త్వాల్ని సమకూర్చారు. కిర్గిజ్ స్తాన్, కజకస్తాన్, అర్మీనియా లాంటి రిపబ్లికుల నుంచి రసూల్ గాంజతోవ్, చింగిజ్ అయిత్ మాతోవ్, కైసన్ కులియెవ్ లాంటి రచయితలు కొత్త సంతోషాల్నీ, కొత్త ఆశల్నీ, కొత్త నమ్మకాన్నీ సాహిత్యంగా మార్చేరు. ఇప్పుడు ఆ రిపబ్లిక్కులు సోవియేటు రష్యానుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డా, ఆ రోజుల్లో ఆ రచయితలు సృష్టించిన సాహిత్యాలు మాత్రం,  మానవ జాతి చరిత్రలోని ఒక ఉజ్జ్వల భర్మయుగాన్ని గుర్తుచేస్తూ శాశ్వతంగా మిగిలిపోయేయి. అటువంటి రచనల్లో, ‘కొండగాలీ, కొత్త జీవితం, ఆర్మీనియన్ కథలు’ (1979) ఒకటి.

పట్టుమని నూటముప్ఫై పేజీలు కూడా లేని ఈ సంపుటానికి తెలుగులో ప్రాణమిచ్చే అభిమానులకి తక్కువలేదు. వారిలో నామాడి శ్రీధర్ ఒకరు. ఇప్పుడు అనిల్ బత్తుల ఈ సంపుటాన్ని మళ్ళా పునర్ముద్రించే పనిలో ఉన్నాడు.

ఈ కథల్లో ప్రతి ఒక్క కథా హృదయంలో ఒక ముద్రగా మారిపోయిందనే చెప్పాలి. ఈ మధ్య రష్యన్ కథలు సంపుటి వెలువరించిన అనిల్ బత్తుల ఇందులోని మొదటి కథ ‘కడవభుజాన పెట్టి నీటికెళ్ళెను పడతి’ఎంపికచేసాడు. మిగిలిన ఎనిమిది కథల్లోనూ చివరి కథ ‘ఒంటెలు వెళ్ళిపోతాయి, పర్వతాలు ఉండిపోతాయి’ ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. ఈ కథ రాసిన నొరైర్ ఆదాల్యాన్ (1936-?) గురించి పుస్తకంలో ఉన్న అయిదారువాక్యాలకు మించి ఎంత గాలించినా ఇంటర్నెట్టు ఏమీ చెప్పలేకపోయింది. మూలకథలో ఏ మాధుర్యముందో గాని నిడమర్తి ఉమారాజేశ్వరరావు తెలుగు అనువాదంలో ఆ లాలిత్యం మనకు ఎంతో కొంత భద్రంగా అందుతున్నదనే భావన కలుగుతుంది, ఈ కథ చదువుతున్నంతసేపూ. మరీ ముఖ్యంగా ‘పురాతన ప్రాచ్య దీర్ఘగేయం లాగ ఒంటెల బిడారు’ – ఏం వాక్యమది!


ఒంటెలు వెళ్లిపోతాయి, పర్వతాలు ఉండిపోతాయి

రష్యన్ మూలం: నొరైర్ ఆదాల్యాన్

తెలుగు సేత: నిడమర్తి ఉమారాజేశ్వరరావు

అనగా, అనగా, చాలా కాలం క్రితం, ఈ భూమి మీద ఓడలూ, విమానాలూ, మోటారు కార్ల కన్న ఒంటెలు ఎక్కువగా ఉండేవి. పట్నం నుంచి పట్నానికీ, గ్రామం నుంచి గ్రామానికీ, దేశం నుంచి దేశానికీ కూడా ప్రజలు ఆ రోజుల్లో ఒంటెల పైనే ప్రయాణం చేస్తూండేవారు. వాళ్లు తమ ఒంటెల పైన అధిరోహించి తమ శత్రు వులతో పోరాటాలు జరిపేవారు, వాళ్ల ఒంటెలు వాళ్ల శత్రువుల్ని నేలనేసి మట్టుతూండేవి.

ఒంటెల వ్యాపారం ఆ రోజుల్లో గౌరవప్రదమైన వృత్తిగా ఉంటూండేది. ఒంటెల అమ్మకాలూ, కొనుగోళ్లూ విరివిగా జరుగుతూండేవి. ఒంటెలు ఒక దాని పై మరొకటి పురికొల్పబడుతూండేవి, అవి ధూళి మేఘాలు లేపుతూ పోట్లాడుతూంటే జనం సరదాగా వేడుక చూస్తుండేవారు.

క్రమంగా కొంత కాలానికి ఒంటెల ధర పడిపో నారంభించింది. ఒంటె గాడిద కంటె కూడా చౌక అయిపోయింది. త్వరలోనే ఓ బస్తా ధాన్యంతో, ఓ గంపెడు యాపిల్సుతో ఒక ఒంటెను కొనగలిగిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎవరికీ ఆశ్చర్యం కలిగించేది కూడా కాదు.

ఈ రోజుల్లో ఒంటె, దిక్కుమాలిన, చావు మూడిన ఒంటె సర్కస్లోనో, జంతు ప్రదర్శనశాలలోనో మాత్రమే కనిపిస్తుంది.

ఆధునిక బాలకునికో, బాలికకో ఒంటె ఎముకను కనక ఎవరైనా చూపిస్తే యిదేదో పూర్వకాలపు మహాగజానికో, లేక దినొసార్ కో  చెందిన ఎముక అనుకుంటారు, అంత అసాధారణంగా, వింతగా, విడ్డూరంగా ఉంటుందది.

ఒకానొక రోజున చాలా కాలంగా విస్మరింపబడి, మానవ స్మృతి పథం నుంచి చెరిపివెయ్యబడిన ఆ ఒంటెలు, పురాతన నైరీ రాజ్యపు తరుణ రాజధానీ నగర వీధుల్లో మరల నడవసాగాయి.

వాటి సాక్షాత్కారం పెద్ద సంచలనాన్ని రేకెత్తించింది. వాటి చుట్టూ ఓ పెద్ద జనసమూహం చేరింది. ఆ గుంపులోని ప్రతి ఒక్క వ్యక్తీ కూడా ఆశ్చర్యోద్వేగాలతో నిండి ఉన్నాడు.

ఆ ఒంటెలు మరి వేటిగానో మారిపోతాయేమోనని భయపడుతున్నట్లు “అవి ఒంటెలు!” అన్నారు కొందరు.

గూని లేకుండా తిన్నని నడుములున్న ఒంటెలు ఎన్నడైనా ఉన్నాయన్నట్లు “ఇవి గూని ఒంటెలు!” అన్నాడు మరొక ప్రబుద్ధుడు.

“ఇవి పిచ్చి జంతువులు!” అని గొణిగి, ఆ మాటనే తన స్నేహితులతోను, అపరిచితులతోనూ, తనకు తానూ వల్లించి వల్లించి, తన కల్పనను తానే నిజమని నమ్మే స్థితికి చేరుకున్నాడు యింకొకడు.

తను ప్రత్యక్షంగా చూసినంత ధీమాగా అన్నాడు నాల్గో వాడు: “ఎవరో గాని యీ ఒంటెల్లో ఒకదాన్ని, నీ మెడ యిలా వంకరగా ఎందుకుందని అడిగాడు. అప్పుడదేమందో తెలుసా: ‘నా ఆకారమే అంత’ అంది.”

“ఏమిటేమిటి, నిజంగానే?!” అంటూ ప్రతి ఒక్కడూ అబ్బురపాటు వ్యక్తం చేశాడు. వాళ్ల ఆశ్చర్య విభ్రమాలకు అంతే లేకపోయింది.

ఈలోగా, ఆ ఒంటెలు, మెచ్చికోలు కోలాహలం తమకేమీ పట్టనట్లు తాపీగా, గంభీరంగా ముందుకు సాగిపోయాయి, వాటి మెడలకున్న గంటలు గణగణ శబ్దం చేశాయి. ఎండ వేడికి రోడ్డు మీద తారు కరిగి చితచితలాడుతోంది. నిప్పులు చెరిగే ఎండలో పురాతన ప్రాచ్య దీర్ఘగేయం లాగ ఒంటెల బిడారు, దాని కెక్కడా అంతే లేదా అన్నట్లు సాగిపోతోంది.

నగర మధ్యభాగంలో వీధులన్నీ కలిసే చోట ఓ పెద్ద చౌకు ఏర్పడింది. ఈ వీధులను అదుపుచేసే నియమాలు అనుల్లంఘనీయాలు కదా. ఎర్రలైటు మారిపోయిన మరుక్షణమే, కాలి నడకన పోయే జనప్రవాహం వీధిని దాట నారంభించింది.

పచ్చలైటు మారగానే కార్ల బారు జంయ్మంటూ ముందుకు దూసుకుపోయింది.

పసుపు పచ్చవి, ఎర్రనివి, ఆకుపచ్చనివి లైట్లు వెలుగుతూ, ఆరుతూ వున్నాయి. అందరూ ఆ ట్రాఫిక్ లైట్ల. మిటకరింపులను పాలించారు.

అటుతర్వాత, తమ గంటలు గణగణ మ్రోగుతూండగా, ఒంటెలు చౌకుకి వచ్చాయి.

తన అయిదో అంతస్తు బాల్కనీ లోంచి ఒంటెల బిడారును చూసిన గాయిక్ సంభ్రమాశ్చర్యాలతో ఎగిరి గంతేసి, క్రిందకి పరుగెత్త నారంభించాడు. అప్పటికే వివిధ అంతస్తుల్లోని వాటాల తలుపులు దఢాలున మూసుకోవడం, మనుషులు పరుగిడుతున్నఅడుగుల సవ్వడీ అతనికి వినవచ్చాయి.

ఆ దృశ్యమెక్కడ కనుమరుగై పోతుందోనన్న భయంతో ప్రతి ఒక్కడూ హడా విడిగా పరిగెడుతున్నాడు.

పిల్లలైతే, యిళ్లల్లోంచి బయటకు దూసుకెళ్లి ఒకళ్లనొకళ్లు నెట్టుకుంటూ, ఒంటెల బిడారు వెంట పరిగెత్తుతున్నారు.

అవి సెలవు రోజులు. స్కూళ్లు మూతపడటంతో నగరంలో పిల్లలదే రాజ్యమన్నట్లుగా ఉంది.

బిడారు మధ్య ఓ క్షణకాలం గందరగోళం ఏర్పడింది. బిడారు అగ్రభాగాన నడుస్తున్న నార్ అనే ఒంటెకు ఏం కోపమొచ్చిందో ఏమోగాని, యిప్పుడది ససేమిరా కదలకుండా మొరాయించి నిలబడిపోయింది. బహుశా గత కొద్ది గంటలుగా తన పట్ల తన యజమాని ప్రదర్శించిన నిర్లక్ష్యం దాన్ని కోపఘూర్ణితురాలిని చేసినట్లుంది. వాళ్ల మధ్య యీ కోపతాపానికి బహుశా మరొకటేదైనా కారణమై యుండవచ్చు, ఏమో ఎవరికెరుక?

దీర్ఘమైన ఒంటెల బారు వలయాకారంగా మోహరించింది. ట్రాఫిక్ బందైంది. వేడి దుర్భరంగా ఉంది.

మనిషీ, ఒంటే నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లు ఒకళ్ల కళ్లలోకి మరొకళ్లు చూసుకున్నారు.

వాళ్ల కళ్లలో ఏదో తళుక్కున మెరిసి ఆరిపోయింది.

మనిషే జయించాడు.

గణగణమనే గంటల మ్రోతతో ఒంటెల బిడారు నగరంలోని వీధుల గుండా క్రింది కొస్తోంది. మనుషులనూ, ఆ జంతువులనూ కూడా, అస్పష్టమైన భావాలు వేధించాయి.

ఎత్తైన పలువాటాల భవనంలోని బాల బాలికలు త్వరలోనే గుంపుకు వెనక బడిపోయారు, ఇతర బాలబాలికలు వాళ్ల స్థానాన్ని ఆక్రమించుకున్నారు. గుంపు మాత్రం, ఎప్పుడూ తరక్కుండా, ఎప్పటికప్పుడు మారిపోతూ ఒంటెలబారు వెంట నడుస్తూనే ఉంది. జనం, ఆకురాలు కాలంలో చెట్లనుండి వేరుచెయ్యబడిన ఆకుల్లాగ, ఒకళ్లనొకళ్లు తాకుతూ, విడిపోతూ, వీధుల వెంటా, సందుగొందుల వెంటా అదృశ్యులవుతున్నారు.

వాళ్లందర్లోనూ గులాబి రంగు రిబ్బను కట్టుకున్న ఒక అమ్మాయి మాత్రం ఒంటెల బిడారుకెన్నడూ వెనకపడలేదు. ఆమె పరుగెత్తుతూ పరుగెత్తుతూ ఆగుతోంది; ఆగి, మళ్ళీ పరుగెత్తనారంభిస్తోంది. ఆశ్చర్యంతో విప్పారిన ఆమె కళ్లు సంతోషంగా మెరుస్తున్నాయి.

“నీ పేరేమిటి?” అని అడిగాడు గాయిక్.

అతని వైపు చూడనైనా చూడకుండా “అన్నా” అని ఆమె జవాబిచ్చి, “మరి నీ పేరో?” అని ప్రశ్నించింది.

“గాయిక్.”

వాళ్లు కలిసి నడవసాగారు.

“నీ కెన్నేళ్లు?” గాయిక్ అడిగాడు.

“పదమూడు” అందామె తన చూపును ఒంటెల బారు నుంచి మరల్చకుండా.

ఆ కుర్రాడికి పధ్నాలుగేళ్లు, కాని అతను తన వయస్సు పదమూడేళ్లే అని చెప్పాడు. వయస్సులో ఆమెను వెనక దిగవిడిచి తను ముందుకు దూసుకుపోవడం అతనికిష్టం లేకపోయింది.

ఒంటెలూ, కారూ ఒక రోడ్ల కూడలిలో శవయాత్ర సాగిపోయే దాకా నిలిచి పోవాల్సి వచ్చింది. ఇదే కనక శీతకాల మయ్యుంటే మనుషులు తమ టోపీలు పైకెత్తి గతించిన వ్యక్తికి గౌరవాభివందనం చేసేవారే, కాని యిది నడినెత్తి మాడ్చే వేసవి అయి పోయింది.

బిడారు యజమాని తన తెల్ల గొర్రెబొచ్చు టోపీని పైకెత్తడం మరచిపోయాడు. అతగాడు తన మాతృదేశపు ఆచారాలనూ, అలవాట్లనూ, మతాన్నీ చాల కాలంగా మరచి పోవడమే దీనిక్కారణమై యుంటుంది.

బ్యాండు మేళం విషాద గంభీరమైన పాట వాయిస్తోంది. అంతిమయాత్రలో ఉన్న కార్లు విచార సూచకంగా తమ హారన్లు మ్రోగించాయి. పలువురు ఏడ్చారు, శోకన్నాలు పెట్టారు, శోకన్నాలు పెట్టారు, ఏడ్చారు.

ఒక్క క్షణం పాటు ప్రతి ఒక్కడూ తను నిస్సహాయుడన్నట్లూ, తనేదో నేరం చేసినట్లూ భావించాడు. అయితే యీ శ్మశాన వైరాగ్యం మరుసటి క్షణానికే మటుమాయమైంది.

“జాగ్రఫీలో నీకెన్ని మార్కులొచ్చాయి?” అని అడిగాడు గాయిక్.

“ఎక్సలెంట్” అని జవాబిచ్చి అన్నా చిరునవ్వు నవ్వింది.

వాళ్లిద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎంతగా యిష్టాన్ని పెంచుకున్నారంటే, పరస్పరం మాట్లాడుకోవడానికి తడబడుతున్నారు.

“అన్నింటి కన్న ముందున్న ఒంటె అంటే నాకు బలే యిష్టం” అంది అన్నా.

“ముందున్న ఒంటె అంటే నాకు కూడా ఇష్టమే” అన్నాడు గాయిక్.

వాళ్లిద్దరి యిష్టాలూ ఒక్కటే, కాని అందుకని ఏం చెయ్యాలో వాళ్లకి బోధపడలేదు.

“మనం పోయి ఒంటెను కౌగలించుకుందాం!” అంది అన్నా.

“పోయి దాని కాళ్లముందు సాగిల పడదాం!” అన్నాడు గాయిక్.

కాని వాళ్లు, అదీ చెయ్యలేదు, ఇదీ చెయ్యలేదు, మామూలుగా ఇది మనుషులుచేసేపని కాకపోవడమే యిందుక్కారణం.

“నాకా ఒంటె యజమాని అంటే ఎంత ఈర్ష్య కలుగుతోందో నువ్వూహించలేవు.”

“నాకూను”

“కావాలంటే అతను తన ఒంటెను ముద్దు పెట్టుకోగలడు, లేక దానికి జీను కట్టగలడు, అదీ కాకపోతే దాన్ని ఆకాశపుటంచుదాకా నడిపించుకు పోగలడు.”

“అంతే అన్న మాటేమిటి, తను చెయ్యదలుచుకున్న దేదైనా చేసెయ్యగలడు!”

“ఇంత అందమైన ఒంటెని, యిన్ని చక్కని ఆభరణాలున్న దాన్ని నేనింతకు ముందెన్నడూ చూడలేదు” అంది అన్నా.

“జంతు ప్రదర్శనశాలలోనూ, సర్కస్ లోనూ కూడా ఇంత అందమైన ఒంటెని చూడలేదు” అన్నాడు గాయిక్.

క్షణకాలం వాళ్లిద్దరూ ఒకళ్ల అస్తిత్వాన్ని మరొకళ్లు మరచిపోయి, తమ తమ సొంత మానసికోద్వేగంలో కొట్టుకుపోయారు.

తర్వాత గాయిక్ నార్ దగ్గర కెళ్లాడు. అతనా ఒంటెని తడిమాడు, బొచ్చు ఒత్తుగా ఉన్న దాని పార్శ్వాన్ని నిమిరాడు, తనకే ఆశ్చర్యం గొలిపే విధంగా ఓ పిడికెడు బొచ్చు అతని చేతిలోకి ఊడివచ్చింది.

అతను చేసిన పనిని ఒంటె యజమాని గమనించి, గాయిక్ వంక నేరస్థుని చూసినట్లు తీక్షమైన దృక్కులు బరపాడు. దానితో ఆ కుర్రాడు నేరస్థునిలా కుంచించుకు పోయి, పాలిపోయాడు.

అంత మూల్యం వెచ్చించి తను సంపాదించిన ఆ సంపదలో సగాన్ని అతనా బాలికకు యిచ్చాడు. తన హృదయంలో సగభాగాన్ని ఆమెకిచ్చేస్తున్నంత బెరుకుగా ఊపిరిబిగపట్టి మరీ ఆ బహూకరణ చేశాడు.

ఆ అమ్మాయి కూడా అమూల్యమైన ఆ బహూకృతిని, అతని హృదయంలో సగభాగమన్నట్లు గానే అంత బెరుకుగానూ, అంతగా ఊపిరి బిగపట్టే స్వీకరించింది.

ముసలీ ముతకా పిల్లా పెద్దా అందరూ వాళ్లని చుట్టుముట్టి మాకివ్వండి మాకివ్వండంటూ, ఆ అర్థ హృదయంలో శతసహస్రాంశం కోసం ఎగబడ్డారు.

అలాగ వాళ్లిద్దరూ తమ భాగాలను వేలకొద్దీ భాగాలు చేసి పంచి యిచ్చారు. చివరికి వాళ్లకి ఒక్కొక్క కేశరాజం మాత్రమే మిగిలింది.

అంతలో అకస్మాత్తుగా యిద్దరు ముసలమ్మలు అక్కడికొచ్చారు. వాళ్లిద్దరూ వంగిపోయి ప్రశ్నార్థకపు గుర్తుల్లా ఉన్నారు. గాయిక్, ఆన్నాల దగ్గర మిగిలిన రెండువెండ్రుకలనూ ఆ యిద్దరు ముసలమ్మలూ ఊడలాక్కుపోయారు.

ఆ పిల్లలిద్దరూ గాభరాగా ఒకళ్ల వంక మరొకరు చూసుకున్నారు. జరిగినదంతా నిజమూ కలా కూడా అనిపించింది వాళ్లకి.

గంటలు టింగుటింగు మని మోగుతున్నాయి.

ఒంటెలు తరలిపోతున్నాయి.

గుంపు చెదిరిపోతోంది.

సూర్యుడు అస్తమిస్తున్నాడు.

వీధులూ, చౌకులూ ధూళిధూసరిత మయ్యాయి, ఇళ్లల్లోనూ, చెట్ల కిందా గాలి తేమగా తయారైంది. వందలాది యితర సాయంకాలాల్లాగే, ఆ సాయంత్రం కూడా నల్ల ముసుగు కప్పుకుంటోంది.

“ఒంటె వెండ్రుకే దొరికితే దానికి వంద రూబుళ్లైనా యిస్తాను!” అన్నాడు గాయిక్.

“ఒంటె వెండ్రుకే దొరికితే దానికి వెయ్యి రూబుళ్లిస్తాను!” అంది అన్నా.

“దాని కోసం ఏదైనా సరే యిచ్చేందుకు నేను సిద్ధం” అని గాయిక్ నిట్టూర్చాడు.

“నేను మాత్రం యివ్వనా!?” అని ఆన్నా నిట్టూర్చింది.

ఒంటె వెండ్రుకకి బదులుగా యిచ్చేందుకని తమ దగ్గర ఏమీ లేనందుకు వాళ్లిద్దరూ కుమిలిపోయారు.

ఒక సైనికదళం వీధి వెంట కవాతుచేసుకుంటూ పోతుంది.

ఇది కూడా ఆసక్తికరంగానే ఉంది.

ఒంటెలు వెళ్లిపోయాయి. బాల బాలికలిప్పుడు వీధికి అటూ యిటూ నిలబడ్డారు. వాళ్ల మధ్య తాత్కాలికంగా నిషిద్ధ ప్రాంతమొకటి ఏర్పడింది.

సైనికులు హుషారుగా పాట పాడుకొంటూ, చురుకుగా కవాతుచేస్తూ ముందుకు సాగిపోయారు. ఒక అమ్మాయి పూలగుత్తినొకదాన్ని వాళ్లపైకి విసిరింది. పువ్వులు వాళ్ల దాకా చేరకుండా పేవ్ మెంటు పక్క పడిపోయాయి.

పూలను చూసి, సైనికులు మందహాసం చేసి, వరుస తర్వాత వరుసగా ముందుకు సాగిపోయారు. ఆ విధంగా వందలాది సైనికులు ముందు కెళ్లారు. చివరివాడు, నీలి కళ్ల యువకుడు వంగి పువ్వులు ఏరుకొని, ముక్కు దగ్గర పెట్టుకొని వాటి సువాసన ఆఘ్రాణిస్తూ, తన కామ్రేడ్సు వెనక పరుగెత్తాడు.

దానితో యిప్పుడిక నిషిద్ధ ప్రాంతం ఖాళీ అయింది.

“సైనికులు ఎక్కడికి పోయారబ్బా?” అంటూ అబ్బాయి ఆశ్చర్యపోయాడు.

“ఒంటెలెక్కడికి పోయాయబ్బా?” అంటూ అమ్మాయి ఆశ్చర్యపోయింది.

వాళ్లింతకు ముందెన్నడూ యింతగా దిగులు చెందలేదు. వాళ్లు ఒంటెల్ని ప్రేమించారు, ఒంటెలు కూడా తమని ప్రేమించాయని ఊహించుకున్నారు, పైగా అవి ఎప్పుడూ అక్కడే ఉంటాయనుకున్నారు.

కాని, మొత్తంమీద వాళ్ల అంచనా ఎక్కడో తప్పింది:

పిల్లలు బాటసారులను “ఒంటెలు ఏ పక్కకెళ్లాయి?” అని ప్రశ్నించి, వాళ్లు సూచించిన దిశగా త్వరిత గతిని సాగిపోయారు.

ఆ విధంగా వాళ్లు నగరపు పొలిమేర దాటి, నిర్జనంగా వున్న శివార్లలో ప్రవేశించారు. సూర్యాస్తమయమై చాల సేపైంది. తలల పైగా ఆకాశం అల్లంత ఎత్తున కనిపిస్తోంది. నాలుగు పక్కలా నిశ్శబ్దం, శాంతీ తాండవిస్తున్నాయి.

పిల్లలు కొత్తగా దున్నిన పొలం దాటారు. అంత మట్టిని ఒక్క సారిగా, అటువంటి సిసలైన మట్టిని, పూల కుండీల్లోనూ, నగరపు చౌకుల్లోనూ ఉండే మట్టిని కాకుండా, అలాంటి సువాసనలెగజిమ్మే మట్టిని వాళ్లింతకు ముందెన్నడూ చూడలేదు.

రోడ్డు మూడు దిశలుగా చీలిన చోట ఒక ముసిలాడు నేల మీద కూర్చొని వున్నాడు. అతని కెంత వయస్సుంటుందో చెప్పడం కష్టమే. గాయిక్ మెల్లగా అతణ్ణి సమీపించి, “తాతా ఒంటెలెటెళ్లాయో చూశావా?” అని అడిగాడు.

“”ఆ.”

“ఎటెళ్లాయవి?” ఆన్నా ఆతృతగా ప్రశ్నించింది.

“మొదటి రోడ్డు వెంట వెళ్తే వాటి దగ్గరికి మీరు మరింత తొందరగా వెళ్తారు. రెండో రోడ్డు మరింత దీర్ఘమైనది. మూడో రోడ్డు ఎక్కడికీ వెళ్లదు” అని చెప్పాడు వృద్ధుడు.

“మొదటి రోడ్డేది?”

కాని, వృద్ధుడు జవాబుచెప్పలేదు. అప్పటికే అతను గుర్రుపట్టి నిద్రపోతున్నాడు.

అందుకని వాళ్లు, అది తమని తమ లక్ష్యానికి తీసుకెళ్లదని తెలియక, ఏదో ఒక రోడ్డు పట్టుకొని బయల్దేరారు. చివరకి వాళ్లు అలసిపోయి, చుట్టూ కలియజూశారు. వాళ్లకొక కొండ, ఒక పొద, ఒక వాగూ కనిపించాయి. అదిగో, దూరాన….

“ఒంటెలు!”

వాళ్లు సంతోషంతో ఒళ్లు మరచిపోయి, కేకలేసుకొంటూ, ముందుకి పరుగెత్తారు. కాని వాళ్లు కొన్ని అంగలు వేశారో లేదో అంతలోనే ఠక్కున నిలబడి పోయారు. అబ్బే, అవి ఒంటెలు కావు. పురాతన నైరీ దేశపు పురాతన పర్వతాలవి. ఓ పెద్ద పర్వతాల బారు దిఙ్మండలంలో యీ చివర నుంచి ఆ చివర దాకా పరుచుకొని వుంది.


Featured image: Photography by Marek Piwnicki via pexels.com

24-12-2025

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading