
విజ్ఞానం ఉచితవనరుగా మారాలి
ఈ మధ్య ట్రిపుల్ ఐటి హైదరాబాదు వారి ఓపెన్ నాలెడ్జి ఇనీటియేటివ్స్ వారు ‘బహుబాస-2025’ అనే కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం భారతదేశంలోనూ, ఉపఖండంలోనూ కూడా భాషావైవిధ్యాన్ని గుర్తిసూ, వివిధ భారతీయ భాషా మాధ్యమాల ద్వారా విజ్ఞానాన్ని నలుగురికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్ని సాకల్యంగా సమీక్షించుకోడం, ఆ దిశగా నిర్మాణశీలం కలిగిన భాగస్వామ్యాల్ని పెంపొందించుకోడం ఆ సదస్సు ఉద్దేశ్యం. రెండు రోజుల పాటు జరిగిన ఆ సదస్సులో మొదటిరోజు కీలక ప్రసంగం చెయ్యవలసిందిగా నన్ను ఆహ్వానించేరు.
ఓపెన్ నాలెడ్జి అంటే ఏమిటి?
ఓపెన్ నాలెడ్జి అంటే ప్రత్యేకమైన అనుమతులు అవసరం లేకుండా మనం ఉపయోగించుకోగల సమాచారం, సాఫ్ట్ వేరు, వివిధ విజ్ఞానగ్రంథాలు, చర్చలు, ఆ వనరుల అందుబాటూనూ. ఉదాహరణకి సమాచారం విషయంలో వికీమీడియా. పుస్తకాల విషయంలో ఇంటర్నెట్టు ఆర్కైవు. ఇలా ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండే ‘ఓపెన్ నాలెడ్జి’ని ‘ఫ్రీ నాలెడ్జి’, ఉచిత విజ్ఞానం అని కూడా అంటున్నారు. ఎటువంటి చట్టబద్ధమైన, సామాజికమైన లేదా సాంకేతికమైన అడ్డంకులు, ఆంక్షలు లేకుండా నలుగురూ స్వేచ్ఛగా విజ్ఞానాన్ని సేకరించుకోడానికి మానవాళి చరిత్రలో ఇంత విస్తృతమైన అవకాశం గతంలో ఎన్నడూ అందుబాటులోకి వచ్చి ఉండలేదు.
ఓపెన్ నెస్ అంటే ఏమిటి
విజ్ఞానం అనేది ప్రజలందరి ఉమ్మడి సొత్తు, ప్రజాశ్రేయస్సుకి సంబంధించిన ఉత్పత్తీ, పెట్టుబడీ అనే ఈ ఆలోచన యుగాలుగా మానవుణ్ణి ముందుకు నడిపిస్తూనే ఉంది. ఉదాహరణకి ప్రాచీన అలెగ్జాండ్రియాలో పదిమందీ ఉపయోగించుకునే ఒక వనరుగా ఒక మహాగ్రంథాలయం వర్ధిల్లిందని చెప్తారు. ఇప్పుడు ఇంటర్నెట్టు వచ్చిన తరువాత, ముఖ్యంగా, వెబ్ 2.0 కాలంలో, ఒకరు సముపార్జించుకున్న విజ్ఞానాన్ని తక్షణమే ప్రపంచంలో మరెవరితోనైనా సరే పంచుకునే అవకాశం చిక్కింది. అయితే అటువంటి విజ్ఞానం శకలాలుగా కాక, సాకల్యంగా, వీలైనంత ఉచితంగా పదిమందికీ అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం ఓపెన్ నాలెడ్జి అనగలుగుతాం. అలా స్వీకరించిన, సేకరించిన విజ్ఞానాన్ని తిరిగి తాము నలుగురితో పంచుకోడానికీ, తాము చేపట్టే విజ్ఞాన పరికల్పనలో భాగంగా దాన్ని తిరిగి ఉపయోగించుకోడానికీ ప్రతి ఒక్కరికీ అవకాశం ఉండాలి. అందులో ఎటువంటి వ్యాపారకోణంగాని, అంతర్గత వ్యాపార ప్రయోజనంగాని ఉండకూడదు. అయితే, తాము అలా ఒకరు నిర్మించి తమతో పంచుకుంటున్న ఆ విజ్ఞానాన్ని తిరిగి మళ్ళా పదిమందితో పంచుకుంటున్నప్పుడు, మొదటగా ఆ విజ్ఞానాన్ని సృష్టించినవారి పేరు తప్పకుండా అక్నాలెడ్జి చేయవలసి ఉంటుంది.
ఓపెన్ నాలెడ్జిని అహర్నిశలు నిర్మించుకుంటూపోవాలి
ఓపెన్ నాలెడ్జి దానికదే సులువుగా, ఉచితంగా మనకు అందుబాటులోకి వచ్చినట్టు కనిపించినా, దానివెనక, ఎందరో స్వార్ధత్యాగులు, మానవప్రేమికులు అహోరాత్రాలు చేస్తున్న కృషి ఉందని మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్క ఓపెన్ నాలెడ్జి రిసోర్సు వెనక అంకితభావంకలిగిన విజ్ఞానవేత్తల బృందం ఉంటుంది. అలాగే ఆ వనరుని వాడుకునే వారు కూడా ఒక బృందంగా రూపొందాలి. అంటే ఆ బృందం ఒకరికొకరు తెలిసి, ఒక సంఘటిత బృందంగానే ఏర్పడనక్కరలేదు. అది ఒక వర్చువల్ కమ్యూనిటీగా ఏర్పడవచ్చు. కాని తమకు అప్పటికే అందుబాటులోకి వస్తున్న ఒక వనరుని తాము తిరిగి తమ సమాజం కోసం లేదా తాము ఎవరికోసం పనిచేస్తున్నారో వారికోసం మరింత అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. ఉదాహరణకి వికీపీడియా చూడండి. అందులో ఏ అంశం మీదనైనా ముందు ఎవరో ఒకరు ప్రాథమిక సమాచారంతో ఒక చిన్న వ్యాసం పొందుపరుస్తారు. అప్పుడు ఆ అంశంలో ఆసక్తికలిగినవారు ఆ వ్యాసాన్ని మరింత విస్తరిస్తూపోతారు. అలాగే ఆ రాసిన వ్యాసాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరీక్షిస్తూ దానిలో ఏవైనా తప్పులుంటే వాటిని సరిచేస్తూ పోతుంటారు. మానవాళి చరిత్రలో సాహిత్యం, కళలు, విజ్ఞానం, నైపుణ్యాలు ఇలానే తరతరాల కృషి వల్ల మనకి అందుబాటులోకి వచ్చాయి. కాని ఒకప్పుడు అది శతాబ్దాల కాలంలో నడిచిన పని. ఇప్పుడు రియల్ టైములో అనూహ్య వేగంతో సంభవిస్తున్నది.
ప్రజలు కోరుకోవలసిన అతిపెద్ద ఉచితం విజ్ఞానం
ఇప్పుడిప్పుడే సార్వత్రిక అక్షరాస్యత దిశగా ప్రయాణిస్తున్న మన దేశంలాంటి దేశాల్లో ప్రజలు అన్నిటికన్నా ముందు కోరుకోవలసిన అతి పెద్ద ఉచితం ఉచిత విజ్ఞానం. ఎందుకంటే, మన గ్రామాల్లోనూ, పట్టణాల్లో కూడా గ్రంథాలయాల సంఖ్య చాలా చాలా స్వల్పం. ఉన్నవికూడా ఆధునీకరణకి దూరంగా ఉన్నవి. మన వార్తాపత్రికలు, మన సమాచార ప్రసార సాధనాలు, మన రాజకీయ చర్చలు అభిప్రాయాల్ని పంచుకోవడం మీదనే దృష్టిపెడుతున్నవి. ఒక అభిప్రాయం జ్ఞానంగా మారాలంటే సంబంధించిన విషయంలో సమాచారం విస్తృతంగా లభ్యం కావాలి. అలా లభ్యమవుతున్న సమాచారం కూడా వీలైనంత నిర్దుష్టంగా ఉండాలి. సరైన సమాచారంతో నిగ్గుతేల్చబడ్డ అభిప్రాయాలు మాత్రమే విజ్ఞానంగా రూపొందుతాయి. సమాచార బలం లేని అభిప్రాయాలు కేవలం భావోద్వేగ ప్రకటనలుగానే మిగిలిపోతాయి. అందువల్ల మన దేశంలో అన్నిటికన్నా ముందు విజ్ఞానాన్ని ఉచితంగా అందించడం ఒక ఉద్యమంగా మారాలి.
విజ్ఞానం ఒక ఫాక్టరీ సరుకు కాదు
21 వ శతాబ్దానికి ముందు విజ్ఞాన పరికల్పననీ, పంపిణీనీని రెండింటిని కూడా మనం ఫాక్టరీ నమూనాలో చూసేవాళ్ళం, అర్ధం చేసుకునేవాళ్ళం. అంటే విజ్ఞానాన్ని ఒక భౌతికసరుకులాగా ఉత్పత్తి చేయవచ్చుననీ, మూటలుగట్టి, స్టాకు రూములో నిలవచేయవచ్చుననీ, అంగడిలో సరుకులాగా అమ్మవచ్చుననీ, కొనుగోలు చేయవచ్చుననీ అనుకునేవాళ్ళం. ఉదాహరణకి, లైబ్రరీ అంటే మన దృష్టిలో అటువంటి సరుకును నిల్వచేసే ఒక గిడ్డంగి. పాఠశాల అంటే అటువంటి సరుకుని పంపిణీచేసే ఒక ఔట్లెట్. కాని ఇలా ఆలోచించడం ఎంత అసంబద్ధమో, ఎంత హాస్యాస్పదమో ఇప్పుడు మనకి తెలియవస్తున్నది. విజ్ఞానం ఎప్పటికప్పుడు పదిమందీ కలిసి నిర్మించుకోవలసీనా ఒక ప్రక్రియ. ఒకప్పుడు దశాబ్దాల కాలమానంలో పోగుపడుతూ వచ్చిన విజ్ఞానం ఇప్పుడు క్షణాల్లో విస్తరిస్తోంది. ఆ వేగాన్ని అందుకోవాలంటే రెండే మార్గాలు: ఒకటి, ఆ విజ్ఞానం వీలైనంతవరకూ ఓపెన్ నాలెడ్జి రిసోర్సుగా మారడం, రెండు, అటువంటి ఓ.ఇ.ఆర్ చుట్టూ ఒక గతిశీలకమైన కమ్యూనిటీ ఏర్పడుతూండటం.
విశ్వవిద్యాలయాల్లో ఓ.ఇ.ఆర్
ఇప్పుడు ప్రపంచమంతటా కూడా ఈ అవగాహన బలపడుతోంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు ఓపెన్ నాలెడ్జి ఇనీటియేటివులను పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. ఈ కొత్త ధోరణిని ఒక విద్యావేత్త perfect storm అని అభివర్ణించాడు. ఇంటర్నెట్టు 2.0 కి చేరుకోగానే అభ్యసనం కూడా 2.0 కి చేరుకుంటున్న కాలం ఇది. అంటే, ఇప్పుడు విద్యార్థులు తమ జ్ఞాన పరికల్పనకు, సమాచారసేకరణకు కేవలం కళాశాలలమీదా, అధ్యాపకులమీదా మాత్రమే ఆధారపడనవసరం లేదు. కంప్యూటర్ ఆధారిత అభ్యసనం ఇప్పుడు ఎందరో విద్యార్థులకు ఒక దైనందిన అవసరంగా మారిపోయింది. అయితే తమ ముందు గుట్టలుగా పోగుపడుతున్న ఈ అపారమైన వనరుల్లోంచి తమకు అవసరమైన వాటిని ఏ మేరకు గ్రహించాలి, ఆ విధంగా తాము సేకరించుకున్న సమాచారాన్ని తాము ఏ విధంగా వినియోగించుకోవాలి అనే ప్రశ్నల ముందు విద్యార్థులు మళ్ళా తడబడుతూనే ఉన్నారు. ఇప్పుడు సమాచారంతో పాటు, ఇంటెల్లిజెంటు ట్యూటరింగు వ్యవస్థలు అవసరమవుతాయి. ఉదాహరణకి ఆర్టిఫిషియలు ఇంటెల్లిజెన్సు అటువంటి ఒక సాధనం. కాన్ని దాన్ని వినియోగించుకోడానికి కూడా మళ్ళా ఒక ఇంటెల్లిజెంటు గైడు లేదా మార్గదర్శక వ్యవస్థ అవసరం. కాబట్టి ఇప్పుడు ఓపెన్ నాలెడ్జి వనరుల్ని నిర్మించుకోవడంతో పాటు ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సుల్ని కూడా మనం నిర్మించుకోవలసి ఉంటుంది.
సార్వత్రిక జ్ఞానవనరులు, సార్వత్రిక విద్యావనరులు
మన దేశంలో విద్యార్థులు అత్యధికంగా మధ్యతరగతి, దిగువమధ్యతరగతి, దళిత, గిరిజన కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వారికోసం మనం వీలైనంతవరకు విజ్ఞాన్ని ఉచితంగానే కాక, తెలుగులో కూడా అందచేయవలసి ఉంటుంది. అందుకుగాను ఓ.ఇ.ఆర్ ను విస్తరించడంలో, వినియోగించడంలో ఇన్నొవేషన్, కొలాబరేషన్ రెండూ చాలా అవసరం. ఇన్నొవేషన్ అంటే కొత్తపుంతలు. ఉదాహరణకి సమాచారాన్ని కేవలం ఇంగ్లిషు పుస్తకాల రూపంలో అందుబాటులో ఉంచితే చాలదు. దాన్ని తిరిగి మళ్ళా తెలుగులోకి అనువదించడం, లేదా తెలుగులోకి అనువదించుకోగల యాప్స్ రూపొందించడం ఒక ఆలోచన. ఆ సమాచారాన్ని ప్రసంగాల రూపంలో రికార్డు చేసి మాసివ్ ఆన్లైన్ కోర్సులుగానో లేదా యూ-ట్యూబు వీడియోలుగానో నలుగురికీ అందుబాటులోకి తీసుకురావడం మరొక ఆలోచన. ఇక కొలాబరేషన్ అంటే వ్యక్తులుగాగాని, సంస్థలుగా గాని కలిసి పనిచేయడం. ఒకరి కృషిని మరొకరు పూరిస్తూ తాము ఉచితంగా అందిస్తున్న విజ్ఞానాన్ని వీలైనంత సమగ్రంగానూ, నిర్దిష్టంగానూ, అప్ డేటెడ్ గానూ అందించేలా చూడటం. కాబట్టి ఏకకాలంలో టెక్నాలజీ, కంటెంటు, నాలెడ్జి మూడూ కూడా అందరికీ అందుబాటులోకి రాగల వనరులుగా మారాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ దిశగా ప్రయాణిస్తున్నది. ఈ ప్రయాణంలో తెలుగు సమాజమ వెనకబడిపోకూడదన్నదే నా ఆకాంక్ష.
తెలుగుప్రభ, 12-12-2025


మనఃపూర్వక అభినందనలు సర్. మీ వంటి వారు ఇలా చెప్తూ ఉంటే… తెలుగు సమాజం అభివృద్ధి చెంది తీరుతుంది. నమస్సులు
హృదయపూర్వక ధన్యవాదాలు
Good evening sir, today article is very good and informative
And today is precious to me
Today i am very happy to see you sir.
Thank u for your compliments sir🙏
-Sreenidhi (dept of heritage employee).
ధన్యవాదాలు శ్రీనిధీ!
రవీంద్రనాథ్ టాగోర్ “గీతాంజలి “లోని 35 వ stanza..;
Where the mind is without fear అనే poem లో “Where knowledge is free”అన్న సందేశానికి విశదీకరణ మీ ఈ అద్భుతమైన ప్రసంగం సర్ భద్రుడుగారు.
👌👏
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం! ఈ స్పందన అత్యంత అమూల్యం.