
స్కైబాబా ప్రోద్బలంతో ‘తెలుగు ప్రభ’ పత్రికలో ‘నడుస్తున్న కాలం’ పేరిట ఒక కాలం రాయడం మొదలుపెట్టాను. ప్రతిశుక్రవారం ప్రచురితమయ్యే కాలం అది. అందులో రాసిన వ్యాసాల్ని ప్రతి ఆదివారం ఇక్కడ మీతో పంచుకోబోతున్నాను.
తెలంగాణా నిరుపేదమహిళలు ఒక శక్తిగా మారే దారి
ఈ మధ్య తెలంగాణా గ్రామీణాభివృద్ధి శాఖవారు తమ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఒక శిక్షణా కార్యక్రమంలో నన్ను కూడా ప్రసంగించమని అడిగారు. గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంఘం, పట్టణ ప్రాంతాల్లోని దారిద్ర్య నిర్మూలన సంఘం వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అది.
ఇందిరా మహిళా శక్తి పేరిట తెలంగాణా ప్రభుత్వం చేపట్టబోతున్న ఒక్ బృహత్ పథకాన్ని పర్యవేక్షించడం కోసం ఒక ప్రాజెక్టు మానిటరింగు యూనిట్ ని ఏర్పాటు చేసారు. గ్రామీణాభివృద్ధి, మానేజిమెంటు, ఇంజనీరింగ్, సోషల్ వర్క్ మొదలైన రంగాల్లో ఎంతో ప్రతిభావంతులైన యువతీయువకుల్ని ఆ యూనిటులో నియమించి వారికి తగిన అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన సదస్సు అది. తెలంగాణా ప్రభుత్వం వారి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్సువారి ఆధ్వర్యంలో జరిగిన ఆ శిక్షణ లో పొదుపు ఉద్యమం గురించి, మహిళా స్వయం-సహాయక బృందాల గురించీ, ఆదాయవనరుల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆ సంఘాలను ఏ విధంగా ముందుకు నడపాలో ఆ అంశాల గురించీ నన్ను మాట్లాడమని అడిగారు.
తెలంగాణాలో పొదుపు ఉద్యమం
తెలంగాణాలో ప్రస్తుతం 63 లక్షల మంది నిరుపేద మహిళలు పొదుపు ఉద్యమంలో భాగంగా ఉన్నారు. వారిలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 47 లక్షలమంది మహిళలు 4.37 లక్షల పొదుపు సంఘాలుగా ఏర్పడ్డారు. తిరిగి ఆ సంఘాలు 18000 గ్రామసంఘాలుగానూ, 553 మండల మహిళా సమాఖ్యలుగానూ, 32 జిల్లా సమాఖ్యలుగానూ సంఘటితమయ్యారు.
అలాగే పట్టణప్రాంతాల్లో దాదాపు 18 లక్షల మంది మహిళలు 1.73 లక్షల పొదుపు సంఘాలుగా, 6367 వార్డుస్థాయి సంఘాలుగా, 189 పట్టణస్థాయి సంఘాలుగా సంఘటితమయ్యారు.
మొత్తం 25000 దాకా ఉన్న ఈ పొదుపుసంఘాలు ఇప్పటిదాకా దాదాపు 4574 కోట్లరూపాయలు కూడబెట్టుకున్నారు. ఏ విధంగా చూసినా ఈ అంకె సామాన్యమైనదికాదు. ఈ నిరుపేదమహిళల్లో దళితులు, వెనుకబడిన తరగతుల కుటుంబాలవారు, గిరిజనులు, బీద ముస్లిములు ఉన్నారన్న విషయం గుర్తుచేసుకుంటే, తెలంగాణాలో మహిళలు డబ్బు కూడబెట్టుకోవడంలో గొప్ప క్రమశిక్షణ చూపిస్తున్నారని మనం గ్రహించగలం.
మహిళాసంఘాలను మహిళా శక్తిగా మార్చే ఉద్యమం
ఇప్పుడు దాదాపు ఈ 25000 వేల సంఘాలకూ ప్రభుత్వం ఒక్కొక్క సంఘానికీ కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి సన్నద్ధమైంది. ఏడాదికి 5000 గ్రామ, వార్డు స్థాయి సంఘాల చొప్పున 2024-25 నుంచి 28-29 మధ్యకాలంలో మొత్తం 25000 సంఘాలకూ 25000 కోట్ల మేరకు ఆర్థికపరమైన తోడ్పాటు అందించాలన్నది తెలంగాణా ప్రభుత్వ లక్ష్యం.
ఈ పథకం గురించిన విధానపత్రం చదవగానే నాకు చాలా సంతోషమనిపించింది. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు సహాయం అందించవలసిన పద్ధతి ఇది. రకరకాల పథకాల పేరిట డైరెక్టు బెనిఫిటు ట్రాన్స్ఫరు ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా సొమ్ము విడుదల చేయడం తాత్కాలికంగా పనికొస్తుందేమోగాని, అది దీర్ఘకాలిక ప్రయోజనాల్ని నెరవేర్చలేదు. ప్రజల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేసే సొమ్ము తిరిగి ఆర్థికవ్యవస్థలోకే ప్రవహించి, స్థూల స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగించవచ్చుగానీ, విడి కుటుంబాల, వ్యక్తుల దారిద్ర్యాన్ని తొలగించడానికి ఆ విధానం సహకరించదు. అందుకు బదులుగా, ప్రజలు, ముఖ్యంగా మహిళలు చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు ఆదా చేసుకోవడం మొదలుపెడితే, ప్రభుత్వం ఇలా వారికి ఆర్థికపరమైన తోడ్పాటునందిస్తే, దాని సత్ఫలితాల్ని మొత్తం వ్యవస్థ చూడటానికి ఎంతోకాలం పట్టదు.
పొదుపు ఆదాయవనరుగా మారడం ఎలా?
అయితే, మహిళలు సొమ్ము ఆదాచేసుకున్నంతమాత్రాన, ఆ సొమ్మును స్వయం సహాయక సంఘాలు తమ సభ్యులకు తక్కువ వడ్డీమీద అప్పుగా ఇచ్చి తిరిగి వసూలు చేసుకున్నంతమాత్రాన, వారి కుటుంబాలు నేరుగా బలోపేతం కావు. అయితే అలాంటి స్వల్పకాలిక ఋణాలు ఆ కుటుంబాలకు అందించే తాత్కలిక తోడ్పాటును కూడా తక్కువ అంచనా వెయ్యలేం. ముఖ్యంగా పొదుపుసంఘాల నుంచి మహిళలకు లభించే ఋణం బయట లభించాలంటే దాదాపు పది రెట్లు వడ్డీ చెల్లించవలసి వస్తుందనేది ఒక నిష్ఠుర సత్యం. అంటే ఆ మేరకి పొదుపుసంఘాలు తమ సభ్యుల్ని ఋణగ్రస్తత నుంచి రక్షిస్తున్నాయన్నమాట. అలాగని పొదుపు చేసుకున్న సొమ్ము కేవలం కుటుంబ అవసరాలకూ, ముఖ్యంగా వైద్యానికీ, వేడుకలకూ అప్పుగా ఇవ్వడం వల్ల కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధ్యం కావు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పొదుపు ఉద్యమమాన్ని ఒక సాంఘిక సంఘటిత శక్తిగా మార్చిన కాల్వ హుస్సేనాపురం గ్రామాన్ని నేను 98-99 లోనే సందర్శించాను. నిరుపేద ముస్లిం మహిళలు చేపట్టిన ఉద్యమం అది. అప్పుడు ఆ మహిళలు నన్ను అడిగిన ప్రశ్న ఇదే: ‘ఇలా దాచుకున్న డబ్బును పెట్టుబడిగా మార్చుకుని మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలంటే ఏమి చెయ్యాలి? ‘
ఈ ప్రశ్న ప్రపంచమంతటా వినబడుతున్నది. యు.ఎన్.డి.పి, ప్రపంచ బాంకులతో సహా ప్రపంచమంతటా గ్రామీణ, పట్టణ దారిద్ర్యనిర్మూలన కోసం కృషి చేస్తున్నవారందరినీ ఈ ప్రశ్న గత ముప్ఫై నలభయ్యేళ్ళుగా వేధిస్తూనే ఉన్నది. ఎందుకంటే, పొదుపుని పెట్టుబడిగా మార్చడం వ్యక్తులకీ సాధ్యమైనంత సులభంగా సంఘాలకి సాధ్యం కాదు. అదీ కాక, ఆ సంఘాలు నిరుపేదలు ఏర్పరచుకున్నవే అయినప్పటికీ, సమాజంలో ఉన్న వివిధ ఆర్థిక, సామాజిక తారతమ్యాలనుంచి ఆ సంఘాలు అంత తేలిగ్గా బయటపడలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా కీలకమైన ప్రశ్న.
నిరుపేద మహిళలు తమ పొదుపును పెట్టుబడిగా, ఆదాయవనరుగా మార్చుకోడానికి వారికి తొమ్మిది రంగాల్లో మార్గదర్శకత్వం అవసరమని గ్రామీణాభివృద్ధి శాఖ భావించింది. అవి: నైపుణ్యాల్ని పెంపొందించడం, పొదుపు సంఘాల ఉత్పత్తులకి బ్రాండింగు, పాకేజింగు, మార్కెటింగు తోడ్పాటు, గ్రామప్రాంతాల్లో ప్రాసెసింగు కోసం ఉమ్మడి కేంద్రాలు, విద్యాలయాలతో భాగస్వామ్యం, పొదుపు సంఘాల పెట్టుబడి ప్రణాళికల్ని పరిశీలించి వారికి సూచనలివ్వడానికి సంస్థాగత సహకారం, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మినీ ఇండస్ట్రియలు పార్కులు, సాంఘిక భద్రత, ఇన్సూరెన్సు.
ముందున్నది చాలా సుదీర్ఘ ప్రయాణం
అయితే ఇటువంటి విధానపత్రాలు రాసుకున్నప్పుడు ఉన్నంత స్పష్టత అమల్లోకి వచ్చేటప్పటికి కనిపించదు. ఎందుకంటే, మన సమాజంలో ఇటువంటి ప్రగతిశీల, ఉత్పాదక, దీర్ఘకాల కార్యక్రమాల పట్ల మొత్తం సమాజానికి అవగాహన చాలా తక్కువ. ఇటువంటి బృహత్ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటే తప్ప మొత్తం సమాజానికే ఒక నిర్దిష్ట అవగాహన సాధ్యం కాదు. ముఖ్యంగా విద్యాలయాల భాగస్వామ్యం చాలా అవసరమవుతుంది. విద్యాలయాలంటే ఐ.ఐ.టిలు, ఐ.ఐ,ఎం లు, బిజినెస్ స్కూళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క మండలంలోనూ ఒక జూనియరు కళాశాల ఉంది. ఆ కళాశాలలో సి.ఇ.సి., హెచ్.ఇ.సి చదువుతున్న విద్యార్థులకి ఈ ప్రణాళిక పట్ల అవగాహన కల్పించాలి. అలానే ఉన్నతకళాశాలల్లో, స్థానిక విశ్వవిద్యాలయాల్లో మానవశాస్త్రాలు, ఎం.బి.ఏ చదువుతున్న విద్యార్థులకి కూడా ఈ అంశం పట్ల అవగాహన కలిగించాలి.
మహిళా సంఘాలు తమ పొదుపును పెట్టుబడిగా మళ్ళించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ మూడు ముఖ్యరంగాల్ని గుర్తించింది. అవి: మానుఫాక్చరింగు, ట్రేడింగు, సర్వీసులు. వాటిలో మళ్ళా 22 మైక్రో రంగాల్ని గుర్తించింది. ఇప్పుడు తక్షణం చెయ్యవలసింది: ఈ 22 రంగాల్లోనూ ప్రతి ఒక్క రంగానికీ ఒక నమూనా ఇన్వెస్టుమెంటు ప్లాను రూపొందించడం. నిరుపేదమహిళలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోడంలో చాలాముందుంటారు. కాబట్టి ఈ రంగాలకు సంబంధిమిన కీలకనైపుణ్యాలను యాప్ ల రూపంలో తయారు చేసి వారికి అందుబాటులోకి తేవచ్చు. ముఖ్యంగా జయగాథల్ని గుర్తించడం, విరివిగా ప్రచారం చెయ్యడం. అటువంటి జయస్థలాలకు మహిళాసంఘాలతో సందర్శన యాత్రలు ఏర్పాటు చేయడం అవసరం.
గ్రామీణాభివృద్ధి శాఖ మరొక అంశం మీద కూడా దృష్టి పెట్టాలి. మహిళాసంఘాలు తమ అనుభవాల్నీ, కష్టనష్టాల్నీ ఒకరితో ఒకరు పంచుకోడానికీ, ఒకరి తప్పొప్పులనుంచి మరొకరు నేర్చుకోడానికీ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సదస్సులు ఏర్పాటు చేయాలి. ట్రేడ్ ఫెయిర్ లాగా ఒక వార్షిక ఇన్వెస్ట్ మెంట్ ఫెయిర్ ఏర్పాటు చేయాలి. అటువంటివి సంఘాల్లోనూ, ప్రజల్లోనూ కూడా అవగాహన పెంచడానికి చాలా సాయం చేస్తాయి.
మరింత పరిశోధన, మరింత చర్చ అవసరం
గ్రామ, వార్డు సంఘాలు మైక్రో ఎంటర్ ప్రైజెసు ప్రారంభించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ మూడు రంగాల్ని గుర్తించిందిగానీ, ఆ రంగాల్లో మరింత పరిశోధన అవసరం. ఉదాహరణకి, వారిచ్చిన జాబితాలో వ్యవసాయరంగం లేదు. నేను మాట్లాడుతున్నది విడివిడి వ్యవసాయ ఋణాల గురించి కాదు. మహిళాసంఘాలు ఉమ్మడి వ్యవసాయ సంఘాలుగా ఏర్పడి కూరగాయలు, పూలు, పండ్లతోటలు చేపట్టవచ్చు. వారిప్పటికే సంఘాలుగా సంఘటితపడి ఉన్నారుకాబట్టి ఉమ్మడి సేద్యపు సంఘాలుగా పనిచేయడం కష్టం కాకపోవచ్చు. ఇదొక ఉదాహరణ మాత్రమే. దేశవ్యాప్తంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ అనుభవాల గురించి సమాచారం సేకరించి, అధ్యయనం చేసి, ఈ రంగాల గురించి మరింత నిశితమైన మార్గదర్శనం చేయవలసి ఉంటుంది.
తెలంగాణా ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకం పూర్తిగా అమల్లోకి వస్తే తెలంగాణా గ్రామీణ, పట్టణ నిరుపేద కుటుంబాల స్థితిగతులు అనూహ్యంగా మారతాయనడంలో సందేహం లేదు.
తెలుగు ప్రభ, 28-11-2025


మంచివార్త భద్రుడు గారు.. శుభాభినందనలు. మిమ్మల్ని పురిగొల్పి ‘నడుస్తున్న కాలం’ కాలమ్ రాయిస్తున్న స్కైబాబా గారికి, ‘తెలుగు ప్రభ’ పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇటువంటి విషయాలు అందరికీ ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారికి ఉపయుక్తంగా ఉంటాయి.
ధన్యవాదాలు సార్!
ప్రసంగించమని అడగడం.. మంచివార్త taking inputs from a experienced n sincere officer is a good sign