అంటున్నాడు తుకా-19

72

నా ఫిర్యాదులు ఎవరికి చెప్పుకోను?
ఈ కటకట ఎప్పుడు ముగిసిపోతుంది?

నేను చేజేతులా తగిలించుకున్న ఉచ్చు
దీన్నుంచి నన్ను బయటపడేసేదెవరు?

ఈ దుఃఖానికి నా ప్రాణం విలవిల్లాడుతున్నది
జనం తమదారిన తాముసుఖంగా ఉన్నారు.

అనుభవించడానికి ముందే వీటికి మనసు సిద్ధపడింది
ఇప్పుడు తలదాచుకోడానికి చోటు వెతుక్కుంటున్నాను.

తుకా అంటున్నాడు: దేవుణ్ణి కుదువపెట్టుకుని
ఈ అప్పునుంచి బయటపడతాను.

कोणापाशीं आतां सांगों मी बोभाट । कधीं खटखट सरेल हे ॥१॥
कोणां आराणूक होईल कोणे काळीं । आपुलालीं जाळीं उगवूनि ॥ध्रु.॥
माझा येणें दुःखें फुटतसे प्राण । न कळतां जन सुखी असे ॥२॥
भोगा आधीं मनें मानिलासे त्रास । पाहें लपायास ठाव कोठें ॥३॥
तुका म्हणे देतों देवाचें गाऱ्हाणें । माझें रिण येणें सोसियेलें ॥४॥ (2660)

73

ఈ సమస్త జగత్తు విశ్వంభరుడి స్వరూపం
కాబట్టి పరపీడకుడు నాకు ప్రతికక్షి.

వాణ్ణి చూడనివ్వకండి, వాణ్ణి దూరంగా తరిమెయ్యండి
వాణ్ణి శిక్షించండి, వాణ్ణి నాతో కలవనివ్వకండి.

ఆ అనాచారిని నేను సహించలేను
ఆ అవగుణాలకు నా మనసు కుంగిపోతుంది.

తుకా అంటున్నాడు: నాకు తెలిసిన దారి ఒక్కటే
దేవుడికి దూరంగా ఉండేవాడినుంచి దూరంగా జరగడమే

परपीडक तो आम्हां दावेदार । विश्वीं विश्वंभर म्हणऊनि ॥१॥
दंडूं त्यागूं बळें नावलोकुं डोळा । राखूं तो चांडाळा ऐसा दुरि ॥ध्रु.॥
अनाचार कांहीं न साहे अवगुणें । बहु होय मन कासावीस ॥२॥
तुका म्हणे माझी एकविध सेवा । विन्मूख ते देवा वाळी चित्तें ॥३॥ (2791)

74

నా నడత అలాంటిదికాదని నేనెందుకు చెప్పుకోవాలి
నన్ను నేను దేనికి సమర్ధించుకోవాలి?

వీళ్ళేమన్నా నన్ను ఆవలి ఒడ్డుకు చేరుస్తారా
లేక నేను పోతానంటే అడ్డుకోగలరా?

నేనెవర్నీ మంచివాళ్ళనీ చెడ్డవాళ్ళనీ లెక్కగట్టను
సుఖంగా నా తిండేదో నేను తింటాను.

నా భారమంతా పాండురంగడిమీద మోపాను
ఇంక నాకీ ప్రపంచంతో పనేముంది?

తుకా అంటున్నాడు: నాకు చాతనైందల్లా
విట్ఠలనామసంకీర్తనమొక్కటే.

काय माझें नेती वाईट म्हणोन । करूं समाधान कशासाठी ॥१॥
काय मज लोक नेतील परलोका । जातां कोणा एका निवारील ॥ध्रु.॥
न म्हणें कोणासी उत्तम वाईट । सुखें माझी कूट खावो मागें ॥२॥
सर्व माझा भार असे पांडुरंगा । काय माझें जगासवें काज ॥३॥
तुका म्हणे माझें सर्व ही साधन । नामसंकीर्त्तन विठोबाचें ॥४॥ (2879)

75

ఎవరో ఒకరు తమ మంచి కోరుకుంటారనే
ఈ మాటలన్నీ చెప్తూ వచ్చాను.

ఇదేమీ సరదాకోసం చెప్పింది కాదు
నలుగుర్ని నవ్వించడానికి చెప్పిందీ కాదు.

దేవుడికోసం అక్షరాలు కూర్చుకోడానికి
అహర్నిశలు పడుతున్న నలుగులాట ఇది.

తుకా అంటున్నాడు: మనసు విసిగి నిద్రపోకు
మెలకువగా ఉండు.

हितावरी यावें । कोणी बोलिलों या भावें ॥१॥
नव्हे विनोदउत्तर । केले रंजवाया चार ॥ध्रु.॥
केली अटाअटी । अक्षरांची देवासाठी ॥२॥
तुका म्हणे खिजों । नका जागा येथें निजों ॥३॥ (2930)


Featured image: Photography by Kat Smit via pexels.com

30-11-2025

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading