అంటున్నాడు తుకా-16

54

ఎవరైనా సాధుసంతుల గోష్ఠి దొరికిందా
నేను వాళ్ళింటిదగ్గర కుక్కలాగా పడుంటాను.

అక్కడ రామనామసంకీర్తన వినగలుగుతాను
వాళ్ళు తినగా వదిలిపెట్టింది తినిబతుకుతాను.

కొలిమిలో కమ్మరికి సాయపడే తోలుతిత్తుల్లాగా
సేవకులకు సేవకుడిగా జీవించడం ఒక భాగ్యం.

తుకా అంటున్నాడు: సాధుసన్నిధిసంతోషం
వాళ్ళ పంక్తిన కూచోనిస్తే అదే గొప్ప సంతోషం.

संतासमागम एखादिये परी । व्हावें त्याचें द्वारी श्वानयाती ॥१॥
तेथें रामनाम होईल श्रवण । घडेल भोजन उच्छिष्टाचे ॥ध्रु.॥
कामारी बटीक सेवेचा सेवक । दिन पणे रंक तेथें भले ॥२॥
तुका म्हणे सर्व सुख त्या संगती । घडेल पंगती संताचिया ॥३॥ (374)

55

భగవంతుడు కృపతో బదులివ్వడమే ప్రసాదం
ఆనందం ఆనందాన్ని మరింత అధికం చేస్తుంది.

ఎందరి భాగ్యమో ఇన్నాళ్ళకు ఓడ రేవుకు చేరింది.
ఇంక పని మొదలుపెట్టాలి, త్వరపడండి.

అలభ్యమనుకున్నది ఇప్పుడు గడపదగ్గరికొచ్చింది
ఇప్పుడు పొరపాటున కూడా పొరపాటు చేయకండి.

తుకా అంటున్నాడు: అంచులుదాటి పొంగిపొర్లేట్టు
నోటిద్వారా, చెవులద్వారా సరుకు ఎత్తిపట్టండి.

कृपेचें उत्तर देवाचा प्रसाद । आनंदीं आनंद वाढवावा ॥१॥
बहुतांच्या भाग्यें लागलें जाहाज । येथें आतां काज लवलाहो ॥ध्रु.॥
अलभ्य तें आलें दारावरी फुका । येथें आता चुका न पाहिजे ॥२॥
तुका म्हणे जिव्हा श्रवणाच्या द्वारें । माप भरा वरें सिगेवरी ॥३॥ (1475)

56

మనమొక విత్తనం వదులుకుంటే
మొత్తం ధాన్యం పంట చేతికొస్తుంది.

ప్రతి ఒక్కరికీ ఈ సత్యం తెలుసు
చిన్నవీ, పెద్దవీ సమానమని తెలుసు.

కష్టపడకుండా, ఆత్మ కసుగందకుండా
ఉచితంగా ఏదీ చేతికందదు.

తుకా అంటున్నాడు: ఈ యుద్ధంలో
ఒక్క జీవితాన్నర్పిస్తే రెండు లభిస్తాయి.

एका बीजा केला नास । मग भोगेल कणीस ॥१॥
कळे सकळां हा भाव । लाहानथोरांवरी जीव ॥ध्रु.॥
लाभ नाहीं फुकासाठीं । केल्यावीण जीवासाठीं ॥२॥
तुका म्हणे रणीं । जीव देतां लाभ दुणी ॥३॥ (767)

57

సుఖం చూద్దామా అంటే ఆవగింజంత.
దుఃఖం మాత్రం పర్వతసమానం.

సాధు సంతుల వచనాలు గుర్తొస్తున్నాయి
మళ్ళీ మళ్ళీ వాటినే తలుచుకుంటున్నాను.

నిద్రలో సగం జీవితం గడిచిపోతుంది
బాల్యం, వార్ధక్యం, రోగం తక్కిన సగం.

తుకా అంటున్నాడు: ముందున్నది మృత్యువు.
మూర్ఖుడా! గానుగెద్దులాగా తిరుగుతున్నావు.

सुख पाहतां जवापाडें । दुःख पर्वता एवढें ॥१॥
धरीं धरीं आठवण । मानीं संताचें वचन ॥ध्रु.॥
नेलें रात्रीनें तें अर्धें । बाळपण जराव्याधें ॥२॥
तुका म्हणे पुढा । घाणा जुंती जसी मूढा ॥३॥ (88)

58

నాకైతే సకలధర్మాలూ విట్ఠలుడి నామమే
ఆ కవచం తప్ప మరొకటి తెలియదు నాకు.

నాకేం తెలుసని! సాధుసంతులు కోరుకుంటే
దైవం నా మీద కురిపించిన కృప యిది.

తుకా అంటున్నాడు, నాకేమి అధికారముందని?
నాకు తెలిసింది నాలో స్థిరపడితే చాలు.

सकळ धर्म मज विठोबाचें नाम । आणीक त्यां वर्म नेणें कांहीं ॥१॥
काय जाणों संतां निरविलें देवें । करिती या भावें कृपा मज ॥२॥
तुका म्हणे माझा कोण अधिकार । तो मज विचार कळों यावा ॥३॥ (874)

59

సాధుసంతుల్ని పక్కనపెట్టి దేవుణ్ణి పూజిస్తే అధర్మం.
అప్పుడు దేవుడినెత్తిన జల్లిన పూలు రాళ్ళైపోతాయి.

అతిథుల్ని పక్కనపెట్టి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు-
తుకా అంటున్నాడు: దేవా, ఆ భేదసేవ సహించకు.

संताचा अतिक्रम । देवपूजा तो अधर्म ॥१॥
येती दगड तैसे वरी । मंत्रपुष्प देवा शिरीं ॥ध्रु.॥
अतीतासि गाळी । देवा नैवेद्यासी पोळी ॥२॥
तुका म्हणे देवा । ताडण भेदकांची सेवा ॥३॥(279)

Featured image: Photography by Kostas Dimopoulos via pexels.com

24-11-2025

2 Replies to “అంటున్నాడు తుకా-16”

  1. ఒక విత్తనం వదులుకుంటే మొత్తం పంటధాన్యం చేతికొస్తుంది

    సుఖం ఆవగింజంత, దుఃఖం పర్వతమంత
    సాధు సంతుల్ని, అతిథుల్ని పక్కన పెట్టి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం అధర్మం . ఆ భాగస్వామి సహించరు అని అన్యాపదేశం గా అలా చేసేవారిని హెచ్చరించడం అసలైన భక్తి భగవంతునిపై విశ్వాసం, తోటివారియెడల సౌమనస్య సమభావం కలిగి ఉండాలని చెప్పిన అభంగాలు
    చైతన్య దాయకాలు . అనువాదం తుకా ఆత్మను పట్టి చూపుతుంది.అభినందనలు సర్.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading