వేములవాడ-కుర్క్యాల

ఇన్నాళ్ళకు వెళ్ళగలిగాను వేములవాడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసినప్పుడు, ఉద్యోగరీత్యా ఆ చుట్టుపక్కల చాలా ఊళ్ళకి వెళ్ళగలిగినా, ఎందువల్లనో వేములవాడకు వెళ్ళడం కాలేదు. కానీ ఎన్నేళ్ళుగానో కోరిక, ఆ ఊరు కూడా చూడాలని.

రెండు కారణాలవల్ల. ఒకటి ద్రాక్షారామ, శ్రీశైలం చూసినతరువాత, వేములవాడా, కాళేశ్వరమూ కూడా వెళ్ళినట్టయితే, శైవం వర్ధిల్లిన పూర్వపు తెలుగునాడును పూర్తిగా చూసినట్టవుతుందని. రెండవది, కన్నడ సాహిత్యానికి ఆదికవిగా చెప్పదగ్గ పంపమహాకవి వేములవాడలోనే తన సాహిత్యకృషి చేసినందువల్ల. తెలుగు సాహిత్యం వికసించిన కేంద్రాల్లో ఈశాన్యాన బరంపురాన్నీ, దక్షిణాన తంజావూరునీ, పడమట హంపీనీ లెక్కవేసుకుంటే, ఉత్తరాన వేములవాడ ఒక ముఖ్యకేంద్రమని నాకొక ఊహ. అందుకని ఇన్నాళ్ళకు ప్రాచీన తెలుగు సాహిత్యపు నాలుగు దిక్కులూ చూసినట్టయిందని నాకు నేను చెప్పుకున్నాను.

శరదృతువు నడికాలానికి చేరుకున్నా ఇంకా మేఘాల్లో కారునలుపు ఛాయ తగ్గలేదు. కాని మేఘాలు శుభ్రపడినచోటల్లా ఎండ మరీ తీక్షణంగా ఉంది. ఆ ఎండవేళ ప్రయాణంలో తెలంగాణా నాకు కొత్తగా కనిపిస్తూ ఉంది. ఇరవయ్యేళ్ళ కిందట నేను తిరిగిన ఊళ్ళూ, దారులూ, పట్టణాలూ, ఈ పదేళ్ళలో గుర్తుపట్టలేనట్టుగా మారిపోయాయి.

మేము వేములవాడ చేరుకునేటప్పటికి సాయంకాలమైపోయింది. ముందు భీమేశ్వర సదన్‌ లో దిగి పక్కనే ఉన్న దేవస్థానం కార్యాలయానికి వెళ్ళాము. అక్కడ అధికారి ‘ఇప్పుడు దర్శనాలు నడుస్తున్నాయి, వెళ్తారా’ అనడిగాడు. శ్రీశైలం వెళ్ళినప్పుడు ప్రయాణంనుంచే నేరుగా దర్శనానికి వెళ్ళిపోవడం అలవాటే. దాన్ని ధూళి దర్శనం అంటారని విన్నాను. ఒక భక్తుడు తనని వెతుక్కుంటూ తన క్షేత్రానికి వచ్చాడని తెలియగానే ఈశ్వరుడు ఎక్కువ సేపు వేచి ఉండలేడు. కాని కార్తికమాసం, అది కూడా ఏకాదశి కావడంతో, స్నానం చేసి గానీ గుళ్ళోకి అడుగుపెట్టలేకపోయాం. అది అభిషేక సమయం. అప్పటికే దేవుడు మా కోసం ఎదురు చూస్తున్నాడని అర్థమయింది. తలా ఒక చెంబుడు నీళ్ళిచ్చి అర్చకుడు మమ్మల్ని అభిషేకం చెయ్యమన్నాడు. ఇన్ని నీళ్ళు శివుడి నెత్తిన పోసేటప్పటికి, నా అలసట, నేనిన్నాళ్ళుగా అనుభవిస్తూ ఉన్న పీడ మొత్తం తుడిచిపెట్టుకుపోయాయనిపించింది.

మేము వెళ్ళింది భీమేశ్వరాలయానికి. రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మరమ్మత్తులు జరుగుతున్నందువల్ల అక్కడ దర్శనం తప్ప అంతరాలయ ప్రవేశం, అభిషేకాదులు లేవు. అందుకనే దేవస్థానం సిబ్బంది మమ్మల్ని భీమేశ్వరాలయానికి పంపించారు. అయితే వేములవాడలోని మూడు ముఖ్యమైన ఆలయాల్లో, రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కల్యాణి చాళుక్యుల ప్రతినిధిగా ఉన్న మహామండలేశ్వర రాజాదిత్యుడు పదకొండో శతాబ్దంలో నిర్మించాడని చెప్తారు. కాని వేములవాడ చాళుక్యుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన రెండవ అరికేసరి కాలం నాటికే ఆ రాజేశ్వర ఆలయం ఉండేదని అతడి శాసనం చెప్తున్నది. బహుశా మహామండలేశ్వరుడు ఆ ఆలయాన్నే మరింత అభివృద్ధిపరచి ఉంటాడు. కాని మేము ఆ సాయంకాలం దర్శించుకున్న భీమేశ్వరాలయం వేములవాడ చాళుక్యుల్లో మొదటి రాజుల్లో ఒకడైన మొదటి బద్దెగుడి పరిపాలనాకాలంలో (850-895) నిర్మించింది. రెండవ అరికేసరి శాసనంలో ఈ ఆలయం గురించి కూడా ఉంది. ఇప్పటి భీమేశ్వరాలయం ప్రాకారం, తదితర నిర్మాణాలు తర్వాతి కాలంలో వచ్చినవైనప్పటికీ, గర్భాలయంలో ఉన్న నీలవర్ణ మహాలింగం, ఆ అంతరాలయానికి ముందున్న మండపం మాత్రం స్పష్టంగా అత్యంత ప్రాచీనాలు, కనీసం పదకొండు శతాబ్దాల కిందటివి అని స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఆ శివుడికి అభిషేకం చేసి, తలతాకించి, నందిని పలకరించి వస్తున్నప్పుడు, నా కన్నా ముందు కొన్ని వేల ఏళ్ళుగా లక్షలాది భక్తులు ఆ దర్శన భాగ్యంతో ఆ ప్రాంగణంలో నడిచి ఉంటారన్న ఊహ నన్ను పులకింపచేసింది.

దర్శనం తరువాత, వేములవాడ రాజన్న ఆలయంలో కోడెని సమర్పించే ఒక మొక్కు ఉందనీ, అటువంటి మొక్కు మొత్తం దేశంలోనే మరే ఆలయంలోనూ లేదనీ విన్నాను. అందుకని మేము కూడా ఆ మొక్కు చెల్లించుకున్నాం. అదొక అందమైన మొక్కు. అంటే వృషభారూఢునికి నువ్వు కూడా ఒక వృషభాన్ని సమర్పించావని చెప్పుకోవడం!

ఆ తర్వాత ఆ ప్రాంగణంలో కార్తికదీపాలు వెలిగించాం. ఎవరెవరో భక్తులు, ఎక్కడెక్కడి వారో, ఆ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్నారు. మరెందరో గ్రామీణులు ఒకరివెనక ఒకరు కోడెల మొక్కు చెల్లించుకుంటూ ఉన్నారు. కాని అంతమంది సందర్శకులు ఉన్నా, ఆ చిన్నపాటి దేవాలయ ప్రాంగణం ఒక విశాలమైదానంలాగా అనిపించింది.

ఆశ్చర్యం, విశ్వనాథ సత్యనారాయణకి కూడా ఇటువంటి అనుభూతినే కలిగిందని మధ్యాక్కరలలో ఈ పద్యం చెప్తున్నది:

ఒక వందమంది యున్న యెడఁ దిరుగుచు నుండియు నేన
యొకఁడనే తిరుగుచున్నట్లుగాఁ దోచుచున్నది నాకు
నొకడనే యనిపించుచున్నదీవు నా యుల్లంబునందు
నెకదొట్టి వేములవాడ రాజరాజేశ్వరా!స్వామి!

దర్శనమయ్యాక మళ్ళా దేవస్థానం అసిస్టెంటు ఎగ్జిక్యూటివు అధికారిని కలిసి, రెండవ అరికేసరి వేయించిన శాసనాలు చూడాలని ఉందనీ, వీలవుతుందా అనీ అడిగాను. ఆయన అవి రాజన్న ఆలయంలో ఉన్నాయనీ, పొద్దున్న వెళ్ళి చూడవచ్చుననీ చెప్పాడు.

మేము మళ్ళా మా బసకి వచ్చేటప్పటికి ఎవరో చెప్తున్నారు, ఆ రోజు దాదాపు డెభ్భై వేలమంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారని! అందుకని రాజరాజేశ్వరస్వామి ఆలయం చూడాలంటే తెల్లవారు జాము నాలుగింటికే వెళ్ళడం మంచిదని సలహా ఇచ్చారు.

నాకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. నేను వేములవాడ చాళుక్యుల గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఆ సాయంకాలం దేవస్థానం ఎ.ఇ.ఒ నాకు రమేష్‌ లోలవార్‌ అనే ఆయన రాసిన ‘వేములవాడ చరిత్ర- క్షేత్ర మహత్యం’ (2016) అనే పుస్తకం ఇచ్చాడు. అందులో స్థలపురాణంతో పాటు, చాళుక్యుల చరిత్ర, వారు చేసిన సాహిత్యసేవల గురించి కూడా కొంత రాసి ఉంది. దాంతో పాటు రచయిత మూడు శాసనాల గురించి కూడా వివరాలిచ్చాడు. వాటిలో రెండవ అరికేసరి వేయించినవి రెండు, మహామండలేశ్వర రాజాదిత్యుడు వేయించింది ఒకటి ఉన్నాయి. ఆ శాసనాలు చూడాలనే నేననుకున్నది.

దక్షిణాపథ చరిత్రలో వేములవాడ చాళుక్యులు (760-1161) శాతవాహనుల్లాగా, బాదామి చాళుక్యుల్లాగా, విజయనగర రాజాధీశుల్లాగా, కాకతీయుల్లాగా చక్రవర్తులు కారు. వేంగీ చాళుక్యుల్లాగా బాదామి చాళుక్యులకు బంధువులు కారు. ఏదో ఒక అనామక ప్రాంతం నుంచి వెలుగులోకి వచ్చి రాష్ట్రకూటులకి సామంతులుగా పరిపాలన చేసినవాళ్ళు. వేములవాడ దేవాలయాలు తప్ప వారు నిర్మించిన గొప్ప నిర్మాణాలూ, తవ్వించిన చెరువులూ, చేపట్టిన పాలనా సంస్కరణలూ కూడా చెప్పుకోదగ్గవేమీ లేవు. నాలుగైదు వందల ఏళ్ళపాటు వారి ఉనికి సింహభాగం రాష్ట్రకూటుల తరఫున యుద్ధాలు చెయ్యడంలోనే గడిచిపోయింది. కానీ దక్షిణాపథ చరిత్రలో మరే రాజవంశానికీ దక్కని అరుదైన, మహత్తరమైన అవకాశం వారికి లభించింది. అదే, పంపమహాకవి (902-955) కన్నడభాషలో ‘విక్రమార్జున విజయం’ రాయడం. ఒకవిధంగా చెప్పాలంటే, దక్షిణభారతసాహిత్యాల్ని పంపకి ముందూ, పంపకి తర్వాతా అని విడదీసి చూడవచ్చు. ఆయన వల్లనే కన్నడంలోనూ, ఆయన ప్రభావం వల్ల తెలుగులోనూ కావ్యరచనాసంప్రదాయం మొదలయింది. తమిళం అప్పటికి వెయ్యేళ్ళకు పైగానే సాహిత్యభాషగా వర్ధిల్లుతున్నప్పటికీ, పంపమహాకవి ప్రవేశం తరువాత, తమిళ సాహిత్యం కూడా పరోక్షంగా ప్రభావితమయిందని చెప్పవచ్చు.

పంప రాసిన మొదటికావ్యం కన్నడభాషలోనే అయినప్పటికీ ఆయన తెరిచిన దారికి అద్వితీయమైన మూడు లక్షణాలున్నాయి. మొదటిది, దేశభాషలో ఒక సంపూర్ణకావ్య నిర్మాణం. రెండవది, మార్గ-దేశి సమన్వయం, మూడవది, చంపూ శైలి ప్రబంధం. ఈ కృషి వెనక జైనులున్నారు. రెండవ అరికేసరి ఉన్నాడు. తర్వాత రోజుల్లో దక్షిణాదిని పాలించిన ప్రతి రాజవంశమూ కావ్యనిర్మాణం ప్రోత్సహించడం వెనక మతప్రభావాలు మారి ఉండవచ్చు. ఉదాహరణకి రాజరాజనరేంద్రుడి వెనుక వైదికమతముంది. శ్రీకృష్ణదేవరాయల వెనక విశిష్టాద్వైతముంది. కాని కవులందరికీ నమూనా మాత్రం పంప మహాకవి నిర్మించిన విక్రమార్జున విజయమే.

ఆ విధంగా దక్షిణభారతసాహిత్యానికి వేములవాడ ఇచ్చిన ఉపాదానం అద్వితీయమైంది. ప్రపంచ సాహిత్యచరిత్రల్లోనే ఇటువంటి గణనీయమైన పరివర్తనకు కారణమైన నగరాల్ని వేళ్ళమీద మాత్రమే లెక్కించగలుగుతాం. భారతీయ సాహిత్యంలో కూడా ఒక వారణాసి, ఒక ఉజ్జయిని, ఒక మదురై, ఒక రాజమండ్రి, ఒక కలకత్తా- ఇంతకుమించి మరే నగరాల పేర్లూ నాకు స్పృహకు రావడం లేదు.

పంప కన్నడ కవి కావడంవల్లా, జైనుడు కావడంవల్లా తెలుగు సాహిత్యచరిత్రకారులు ఆయనకు మన సాహిత్యచరిత్రలో తగిన స్థానాన్ని ఇవ్వకపోయి ఉండవచ్చు. కాని సాహిత్యచరిత్రలో వేములవాడ పోషించిన అద్వితీయమైన ఈ పాత్రను మాత్రం మనం విస్మరించలేం. పంపలేకపోతే నన్నయ లేడని మనం ఒప్పుకోక తప్పదు.

రాజన్న దేవాలయానికి తెల్లవారుజామునే పరుగుపరుగునవెళ్ళేప్పటికే అయిదు గంటలు దాటి పోయింది. కాని అప్పటికే అక్కడ పెద్ద వరస. కనీసం ఆరుగంటలు పడుతుందన్నారు దర్శనానికి. గుళ్ళోకి అడుగుపెట్టడమే కష్టమనిపించేట్టుగా ఉంది.

నా దృష్టి రెండువిధాలుగా చీలి ఉంది. ఒకటి ఇంతదూరం వచ్చి రాజన్నని చూడకుండా వెళ్ళిపోవడమేనా అని. రెండోది, ఆ శాసనాలు చూడకుండా పోవడమెలా అని. ఎలాగైతేనేం, మాకు గుళ్ళోకి ప్రవేశం దొరికింది. ఆ తెలతెలవారు జామున మళ్ళా మాకు స్వామి అభిషేక సమయంలో దర్శనమిచ్చాడు. ఇప్పుడు అమ్మవారి దర్శనం కూడా లభించింది.

దర్శనాలయ్యాక అక్కడ కనబడ్డ ప్రతి ఒక్క ఉద్యోగినీ ‘ఆ శాసనాలెక్కడున్నాయి’ అనడిగాను. శాసనమనే మాటనే కొత్తగా వినబడింది వాళ్ళకి. ఒకాయనైతే, గుడికి మరమ్మత్తులు చేస్తున్నారుకదా, తీసి ఎక్కడో పెట్టేసారు అన్నాడు, బహుశా వాటిని భోషాణం పెట్టెలని అనుకుని ఉండవచ్చు ఆయన! చివరికి ‘రాళ్ళమీద చెక్కి ఉంటారే, అక్షరాలు, ఆ రాళ్ళెక్కడున్నాయో చెప్పగలవా’ అని ఒకామెనడిగితే, ఆ పక్కగా చూపించి, ‘అదుగో, ఆ అద్దాల్తో మూతపెట్టారే, అక్కడ చూడండి’ అంది.

వెళ్ళి చూస్తే- అవే! రెండు శాసనాలు. ఒకటి, రెండవ అరికేసరి వేయించిన తేదీ తెలియని శాసనం. రెండోది, 1083 లో రాజాదిత్యుడు వేయించిన శాసనం. రెండూ చాళుక్యలిపి శాసనాలు. వాటిని నేను ఒక్క అక్షరం కూడా పోల్చుకోలేను. అయినా వాటిని చూడటానికి ఎందుకంతగా తహతహలాడాను?

చాలా కారణాలు చెప్పవచ్చు. సాధారణంగా ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆఫీసుల్లో స్టాకు ఫైళ్ళ రూపంలో భద్రపరచవలసి ఉంటుంది. అటువంటి సంప్రదాయానికి మన కార్యాలయాలు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేసాయి. అందువల్ల పదేళ్ళ కిందట ఇచ్చిన ఉత్తర్వులు కూడా కాపీలు దొరకని పరిస్థితి. అలాంటిది, వెయ్యేళ్ళ కిందటి ప్రభుత్వ ఉత్తర్వులు ఇంత భద్రంగా ఉన్నాయంటే, ప్రభుత్వాల తీరుతెన్నుల్ని చాలా దగ్గరగా చూసిన నాకు, చాలా పెద్ద వింతగా, సంతోషంగా అనిపిస్తుంది.

మరో కారణం- ఆ శాసనాల్లో అరికేసరి శాసనంలో, తాను దానమిస్తున్న భూమి మీద వచ్చే ఆదాయంలో కొంత సత్రాలకీ, యాత్రీకులకీ సౌకర్యం కోసం ఖర్చుపెట్టమని ఉత్తర్వులిచ్చాడు. నాలాంటి యాత్రాలుబ్ధుడికి అంతకన్నా సంతోషించదగ్గ విషయం మరేముంటుంది? ఇక రాజాదిత్యుడి శాసనంలో, రాజు కొంత భూమిని ఆచార్యులకీ, విద్యార్థులకీ దానమిచ్చాడని రాసి ఉంది. వెయ్యేళ్ళ కింద ఒక రాజు (రాజు కూడా కాదు, పాలకుడు) తన దానంలో కొంత విద్యకోసం కేటాయించాడని తెలియడంలో ఎంత పులకింత ఉంది!

భీమన్న దేవాలయంతో పోలిస్తే రాజన్న ఆలయం చాలా పెద్దది. సువిశాలప్రాంగణం, మహాప్రాకారం. బహుశా మరమ్మత్తులు పూర్తయితే, ఆ దేవాలయం మరింత దర్శనీయంగా ఉంటుందనుకోవచ్చు.

2

కుర్క్యాల ఇప్పుడు జగిత్యాల జిల్లా, గంగాధర మండలంలో ఉంది. చిన్న ఊరు. కాని తెలుగు సాహిత్యాభిమానులకు, పద్యప్రేమికులకు ఇప్పుడది ఒక తీర్థక్షేత్రం. అందుకని నా యాత్ర వేములవాడ-కుర్క్యాల యాత్ర కాకుండా ఎలా ఉంటుంది!

అక్కడ బొమ్మలమ్మ గుట్ట అని ఉంటుందనీ, ఆ గుట్టమీద, 940 లో జినవల్లభుడు వేయించిన శాసనం ఉందనీ విన్నాను కాబట్టి, మరీ ఎండ ఎక్కకముందే ఆ ఊరు పోవాలని అనుకున్నాను. నాతో పాటు విజ్జీ, పిల్లలే కాక, విజ్జి చెల్లెలు రాజీ కుటుంబమూ, మరో చెల్లెలు ఉమాదేవి భర్త సత్యనారాయణా కూడా ఉన్నారు. ‘నాతో పాటు దైవదర్శనానికి వచ్చిన మీకు వాగ్దేవి దర్శనం కూడా చేయించబోతున్నాను’ అన్నాను వారితో.

సగం కోసి, సగం ఇంకా కోతకు సిద్ధమవుతున్న పంటపొలాలమధ్య, కొద్దిగా మబ్బుపట్టి చల్లగా ఉన్న ఆ ప్రభాతాన, మేము కుర్క్యాల చేరుకునేటప్పటికి తొమ్మిది దాటింది. ఎవరినీ అడగనక్కర్లేకుండానే మా అమృత గూగులు మాపు పట్టుకుని నేరుగా మమ్మల్ని ఆ గుట్ట దగ్గరకు తీసుకు పోగలిగింది. ఇంకా ఆ గుట్ట ఎక్కడుందో వెతుక్కుంటూ నడిచి వెళ్ళాలేమో, ఆ కొండ ఎక్కాలేమో అనుకుంటున్న నాకు, ఆ గుట్టదాకా సిమెంటు కాంక్రీటు రోడ్డు కనిపించింది. అక్కణ్ణుంచి గుట్టపైకి చాలా చక్కటి మెట్లవరస కనిపించింది. ఆ మెట్లు కూడా ఎంతో సౌకర్యంగా కట్టారు. కొండవాలుని బట్టి మెట్లు పెట్టారు. కొన్ని చోట్ల కొండరాతినే మెట్లుగా చెక్కారు. దాంతో సునాయాసంగానే ఆ గుట్టమీదకు చేరుకునేటప్పటికి, పదకొండువేల ఏళ్ళకిందటి శాసనమూ, ఆ శాసనం పైన చక్రేశ్వరీదేవితో పాటు ఋషభదేవ, మహావీరులు, జైనసిద్ధులూ దర్శనమిచ్చారు!

ఆ ప్రతిమలకీ, ఆ శాసనానికీ పూర్తిగా ఎర్రరంగు పూసారు. బహుశా, ఆ గుట్ట మామూలు గుట్టల్లాంటిది కాదని స్థానికులకీ, బయటివాళ్ళకీ తెలియడం కోసం అలా రంగుపూసి ఉంటారు. అలా రంగు పూయకపోయి ఉంటే బాగుండేది అనిపించింది గానీ, దాన్ని గనులశాఖనుంచి కాపాడుకోవాలంటే, స్థానికులకి ఆపాటి అవగాహన కల్పించడం తప్పనిసరి అని సరిపెట్టుకున్నాను.

ఏ విధంగా చూసినా ఆ శాసనాన్ని కాలమే పరిరక్షించిందని చెప్పుకోవాలి. అయితే, తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక కలుగుతున్న కొత్త చారిత్రిక స్పృహ వల్లనే ఆ రోడ్డూ, ఆ మెట్లూ వచ్చాయని తెలుస్తున్నది. కాని ఆ గుట్టకిందనే పెద్ద షోకేసులాగా ఏర్పాటుచేసి అందులో శాసనపాఠాన్ని, అందులో విషయాన్నీ, ఆ ప్రాశస్త్యాన్నీ వివరిస్తూ రాసి ఉంటే మరింత బాగుంటుందనిపించింది. అటువంటి షోకేసును కాపాడుకోవడమేమీ పెద్ద కష్టం కాదు కూడా.

కుర్క్యాలలోని ఈ శాసనం గురించి మొదట బిరుదురాజు రామరాజుగారికి తెలిసిందనీ, ఆయన ద్వారా ఆ సంగతి విన్న డా.నేలటూరి వెంకటరమణయ్యగారు మరింత పరిశోధించి భారతిలో వ్యాసం రాసారనీ, ఆ తరువాత పి.వి.పరబ్రహ్మశాస్త్రి మొదలుకుని ఈనాటిదాకా ఎందరో పరిశోధకులు, ఔత్సాహికులు ఆ శాసనం గురించి కొత్త విషయాలు చెప్తూనే ఉన్నారనీ, ఈమనిశివనాగిరెడ్డిగారు రాసారు. (చూ.‘మీరూ శాసనాలు చదవొచ్చు’, 2021, పే.286-294) దాంతో పాటు ఆయన ఆ శాసనం పూర్తిపాఠాన్నీ, ఫొటోల్నీ కూడా అందులో పొందుపరిచారు.

నేను కుర్క్యాల వెళ్ళాలనుకుంటున్నానని చెప్తే మిత్రులు శ్రీరామోజు హరగోపాల్‌గారు తాను 2022 లో ఫేస్‌ బుక్‌లో రాసిన పోస్టును, దాంతో పాటు, 2021 లో ‘దక్కన్‌ లాండ్‌’ పత్రికలో పంపమహాకవి పైన తాను రాసిన వ్యాసాన్నీ నాకు పంపించారు.

ఆ వ్యాసాలన్నీ చదివాక, ఆ శాసనం మూడు విధాలుగా ప్రత్యేకమైందని గ్రహించాను. మొదటిది, అది బహుభాషా శాసనం. ప్రాచీన కాలంలో ద్విభాషా శాసనాలు కొత్తకాదు. సంస్కృతంతో పాటు ఒక దేశభాషలో కూడా వేసిన శాసనాలు లేకపోలేదు. విష్ణుకుండినులు సంస్కృతంతో పాటు ప్రాకృతంలో కూడా శాసనాలు వేయించారు. కాని కుర్క్యాల శాసనంలో సంస్కృతంతో పాటు రెండు దేశభాషలున్నాయి, ఒకటి కన్నడం, రెండవది తెలుగు. అంటే శాసనభాష పూర్తి మార్గ-దేశి సమన్వయాన్ని సాధించిన ఘట్టం అది.

రెండవ ప్రత్యేకత, అది ఒక కవి ప్రశస్తి. సాధారణంగా శాసనాలు రాజప్రశస్తిగానో, లేదా వీరప్రశస్తిగానో, లేదా వదాన్యప్రశస్తిగానో ఉంటాయి. కవిని ప్రశంసించే శాసనాలు చాలా అరుదు. కాని ఈ శాసనం పంపమహాకవి ప్రశస్తి. ఆయన్ని స్తుతిస్తూ, ఆయన వివరాల్ని నమోదు చేస్తూ, ఆయన తమ్ముడు జినవల్లభుడు వేయించిన శాసనం అది.

ఇక మూడవ ప్రత్యేకత, అన్నిటికన్నా ముఖ్యమైంది, ఆ శాసనంలో మూడు కందపద్యాలున్నాయి. నన్నయకు పూర్వం శాసనాల్లో లభిస్తున్న కందపద్యాలివే. చూడండి:

జినభవనంబులెత్తించుట
జినపూజల్సేయు చున్కి జినమునులకు న
త్తిన యన్నదానం బీవుట
జినవల్లభు బోలంగలరె జినధర్మపరుల్‌

దినకరుసరి వెల్గుదమని
జినవల్లభునొట్టునెత్తు జితకవినననుం
మనుజుల్గలరే ధాత్రిం
వినతిచ్చుదుననియ వృత్త విబుధ కవీంద్రుల్‌

ఒక్కొక్క గుణంబు కల్గుదు
రొక్కణ్డిగగా కొక్కలెక్క లేకెవ్వరికిం
లెక్కింపనొక్కొ లెక్కకు
మిక్కిలి గుణపక్షపాతి గుణమణి గుణంబుల్‌

ఆ గుట్టమీద నిలబడి ఆ శాసనాన్ని చూస్తున్నప్పుడు, దూరంగా కనిపిస్తున్న చెరువు, జినవల్లభుడు తవ్వించిన ‘కవితాగుణార్ణవం’ అనే సరోవరమే అని తెలిసినప్పుడు, మనమింకా వేములవాడ చాళుక్యుల కాలంలోనే ఉన్నామనీ, అక్కడొక కవీశ్వరుడి సోదరుడు, తాను స్వయంగా ‘సకలకళాప్రవీణుడూ’, ‘భవ్యరత్నాకరుడూ’, ‘గుణపక్షపాతీ’ అయినప్పటికీ, తన సోదరుడి జ్ఞాపకార్థం పద్యాల్ని శిలకెత్తించడమే కాక, ఒక జైనబసదినీ, ఒక ఉద్యానాన్నీ నిర్మిస్తున్న కాలంలోనే ఉన్నామనీ అనిపించకుండా ఉండదు.

3

రెండేళ్ళ కిందట కేరళలో తుంచెన్‌ పండుగ సందర్భంగా సాహిత్య అకాదెమీ ఒక గోష్ఠి నిర్వహించింది. అందులో ‘Poetic Tradition in Telugu’ అనే అంశం మీద ప్రసంగించమని నన్ను ఆహ్వానించింది. ఆ ప్రసంగంకోసం ఆలోచిస్తూ ఉండగా, హటాత్తుగా నాకు, తెలుగులో ఒక tradition కాదు, మూడు traditions ఉన్నాయని స్ఫురించింది.

ఎందుకంటే, తెలుగు కావ్యభాషగా రూపొందడానికి ముందు దాదాపు అయిదారు వందల ఏళ్ళపాటు శాసనభాషగా వికసించి ఉంది. మహాభారతాన్ని నన్నయ ఆంధ్రీకరించిన తరువాత, ఆయన పాటించిన కావ్యసంప్రదాయాల మీద తిరుగుబాటుగా శివకవులు కవిత్వం చెప్పారనీ, తరువాతి రోజుల్లో తిక్కన ఆ రెండు సంప్రదాయాల్నీ సమన్వయ పరిచాడనీ సాహిత్య చరిత్రకారులు చెప్తున్న విషయం మనకు తెలిసిందే. కాని ఒకే భాషాసాహిత్యంలో ఇటువంటి విభిన్నసంప్రదాయాలు తలెత్తడానికి కారణమేమై ఉండవచ్చు?

నాకేమనిపించిందంటే, నన్నయ కన్నా ముందే ఈ మూడు రకాల ధోరణులూ తెలుగు నేలమీద ఉన్నాయని. తెలుగు శాసనభాషగా రూపుదిద్దుకుని కావ్యభాషగా పరిణమించిన మధ్యకాలంలో అంటే 6-11 శతాబ్దాల మధ్యకాలంలో, ఈ మూడు ధోరణుల్నీ మనం శాసనభాషలోనే పసిగట్టవచ్చునని. తీరాంధ్రప్రాంతంలో తెలుగులో శాసనాలు వేయించిన వేంగీ చాళుక్యులది ఒక శైలి అయితే, ఇప్పటి రాయలసీమ, దక్షిణతీరాంధ్ర ప్రాంతానికి చెందిన రేనాటి చోడులది మరొక శైలి. ఇక తెలంగాణా ప్రాంతంలో శాసనాలు వేయించిన వేములవాడ చాళుక్యులది మరొక శైలి.

శాసనాల పరిణామంలో కూడా ఒక రాజకీయ పరివర్తన ఉంది కాబట్టి, భాషా పరివర్తన కూడా తప్పని సరి అయింది. శాసనాలు తామ్రశాసనాలుగా ఉన్నంతకాలం వాటికి సంస్కృతం సరిపోయింది. కాని శాసనాల్ని, నలుగురికీ అర్ధమయ్యేలా, రాళ్ళమీదా, కొండలమీదా చెక్కించడం మొదలయ్యాక ప్రజల భాషలో వాటిని ప్రచురించడం తప్పనిసరి అయ్యింది.

కాని ఇలా ప్రజలభాషలో ప్రకటిస్తున్నప్పుడు, తీరాంధ్రప్రాంతపు శాసనాలు కూడా 11 వ శతాబ్దికి పూర్వమే కావ్యలక్షణాల్ని సంతరించుకోగా, రేనాటిచోడుల శాసనాలు, సంస్కృత, ప్రాకృత, కన్నడ, తమిళ భాషల ఛాయలు సోకని తెలుగులోనే కొనసాగడం గమనించదగ్గది. మరొక వైపు వేములవాడ చాళుక్యుల శాసనాలు, అంటే ఇదుగో, ఈ కుర్క్యాల శాసనాన్నే చూసినట్లయితే, ఇక్కడ తెలుగు పద్యాలు ప్రత్యక్షమయినప్పటికీ, అవి కంద పద్యాలే కావడం గమనించాలి.

ఒకవైపు వేములవాడ చాళుక్యులూ, మరొకవైపు రేనాటి చోడులూ భాషలో ఇంకా ప్రజాసన్నిహితంగా ఉండగా, వేంగీచాళుక్య శాసనాల్లో తరువోజలు, మధ్యాక్కరలూ, సీసపద్యాల స్థానంలో, తత్సమపదజాలమూ, సంస్కృత వృత్తాలూ కనిపించడం మొదలు పెట్టాయి. జయంతి రామయ్యగారి ‘శాసన పద్యమంజరి’ (1930) మొదటి పేజీల్లోనే మనకు ఈ మార్పు కనిపిస్తుంది. తరువోజ (అద్దంకి, 770), మధ్యాక్కర, (బెజవాడ, 820), సీసపద్యం (ద్రాక్షారామ, 987, దీర్ఘాసి, 997) లతో పాటు నెమ్మదిగా ఉత్పలమాల (అమరావతి, 1030), చంపకమాల (చేబ్రోలు,1040) శాసనాల్లో చోటు చేసుకోవడం మనం చూడవచ్చు.

పదవశతాబ్దానికి కూడా ఇంకా దేశిఛందస్సుల్నే పాటిస్తున్న వేంగీచాళుక్యులు, పదకొండో శతాబ్దానికి వచ్చేటప్పటికి, సంస్కృతం వైపు ఇంత మొగ్గు ఎందుకు చూపించినట్టు? రాజకీయంగా చెప్పాలంటే కారణాలు సుస్పష్టం. సా.శ.642 లో బాదామి చాళుక్యుడైన రెండవపులకేశి వేంగిని జయించి అక్కడ తన సోదరుడు కుబ్జవిష్ణువర్ధనుణ్ణి పాలకుడిగా నియమించాక, వేంగీ చాళుక్యులు తెలుగుమీద దృష్టిపెట్టారు. మొదటి జయసింహుడి ‘విప్పర్ల’ శాసనం (649), మంగియువరాజు ‘లక్ష్మిపురం’ తెలుగు శాసనం (7వ శతాబ్ది) లో సింహభాగం తెలుగుపదజాలమే. ఇక పండరంగడి అద్దంకి శాసనంలోనూ, బెజవాడ యుద్ధమల్లుడి శాసనంలోనూ తెలుగు పద్యాలే, దేశిఛందస్సులో ప్రత్యక్షమయ్యాయి.

కాని, సా.శ.7-10 వ శతాబ్దిదాకా వేంగి వేములవాడ చాళుక్యుల చేతిలో రెండు సార్లు ఓడిపోయింది. చాళుక్యుల దండయాత్రలనుంచి రక్షించుకోడానికి వేంగి రాజలు చోళుల్ని ఆశ్రయించకతప్పలేదు. చివరికి, పడమటి వైపు నుంచి వచ్చే దాడుల్ని తప్పించు కోడానికి, రాజరాజనరేంద్రుడు సా.శ. 1019 లో రాజధానిని వేంగినుంచి రాజమండ్రి మార్చక తప్పలేదు. రాజమండ్రిలో పాలన మొదలయ్యాక కూడా అతడికి రాజకీయ సుస్థిరత పూర్తిగా చిక్కిందని చెప్పలేం. కనీసం రెండు సార్లు అతడి సోదరుడు పశ్చిమచాళుక్యుల సహాయంతో అతడిమీద దండెత్తాడు. రెండుసార్లూ కూడా రాజరాజ నరేంద్రుడు చోళుల సహాయంతో గట్టెక్కాడు.

కాని దాదాపు నలభైఏళ్ళ పాటు (1019-61) అతడు రాజ్యసుస్థిరత కోసం పోరాడుతూనే ఉన్నాడు. అందుకు అతడు అనుసరించిన రాజకీయ, ఆర్థిక, ధార్మిక విధానాలతో పాటు సాహిత్యవిధానం కూడా అతడికి సహకరించింది. అటువంటి సాహిత్య విధానానికి అతడు తమిళంవైపు కాక, కన్నడం వైపు, ముఖ్యంగా బాదామి, వేములవాడ చాళుక్యుల నమూనా వైపు చూసాడని చెప్పవచ్చు. బాదామి చాళుక్యులు సంస్కృతాన్ని ఆదరించారు. చివరికి వారి కుడ్యశాసనాలు కూడా సంస్కృతంలోనే వేయించారు. వాటిలో ముఖ్యంగా ఐహోళె శాసనం (సా.శ.634-635) దాదాపుగా దానికదే ఒక కావ్యం. కాళిదాసు రఘువంశం రాసినట్టుగా, భారవి కిరాతార్జునీయంలాగా ఆ శాసనాన్ని రవికీర్తి రాసాడు.  ఆ తర్వాత వేములవాడ చాళుక్యులూ, వారి జైన సాహిత్యకారులూ ఆ మార్గ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే మార్గ-దేశి సమన్వయానికి ప్రయత్నించారు. కానీ రాజరాజుకు ముందు శాసనాలు వేసిన వేంగీ చాళుక్యులు ఆ నమూనాని అనుసరించలేదు. అయితే శాసనాలు కావ్యగౌరవాన్ని పొందడం రాజ్యసుస్థిరతకి ఒక గుర్తుగా భావిస్తున్న రాజరాజనరేంద్రుడు  వేములవాడ చాళుక్యులు అనుసరించిన మార్గ-దేశి శైలిని ఒక నమూనాగా భావించి ఉండవచ్చు.

దానితో పాటు తెలుగులో ఒక కావ్యరచన చేయించినట్లయితే, అది తనకొక రాజకీయ పరమైన గుర్తింపును తేగలదని కూడా రాజరాజు భావించాడని చెప్పవచ్చు. కాబట్టే నన్నయను భారతాన్ని తెలుగు చేయమని అడిగాడు. అందుకు పూనుకున్నప్పుడు, మతపరంగా దాన్ని వైదిక, ఐతిహాసిక పద్ధతికి అనుగుణంగానే తెలుగు చేయడానికి పూనుకున్నప్పటికీ, నన్నయ మూడు విషయాల్లో పంపమహాకవిని తనకు నమూనాగా తీసుకున్నాడని చెప్పాలి. మొదటిది, చంపూ శైలి కావ్యం. రెండవది, విస్తృతమైన తత్సమ, తద్భవ పదజాలం, మూడవది, మార్గ-దేశి సమన్వయం. ఒకసారి ఈ template స్థిరపరుచుకున్నాక, ఆయన దానికి ‘అక్షరరమ్యత’ నీ, ‘ప్రసన్న కథాకలితార్థయుక్తి’ నీ,’ ‘నానా రుచిరార్ధ సూక్తుల్నీ’ జతపరిచి సారమతులైన కవీంద్రులూ, ఇతరులూ కూడా మెచ్చుకునే విధంగా భారతాన్ని అనుసృజించాడు.

కాని నన్నయ పంపకన్నా శతాబ్దకాలం తరువాతి వాడు. ఆయన పంప పద్ధతిలో చంపూ నిర్మాణంలో, సంస్కృత-దేశభాష సమన్వయంతో భారతాన్ని ఆంధ్రీకరణ చేస్తున్నప్పటికి (1022-54), కన్నడంలో చంపూయుగం ముగిసిపోతూ ఉంది. నిజానికి నన్నయకు ముందే వేములవాడ చాళుక్యుల ప్రాభవం అంతరించి కల్యాణి చాళుక్యుల యుగం మొదలయ్యింది. నన్నయకు వందేళ్ళ తరువాత బసవన్న (1130-67) కన్నడ సాహిత్యంలో చంపూ యుగానికి శాశ్వతంగా మంగళం పాడేడు. కల్యాణి చాళుక్యుల జైన-మార్గ-దేశి సాహిత్యం మీద తిరుగుబాటుగా వీరశైవ-దేశి-వచనసాహిత్య యుగాన్ని ప్రారంభించాడు. అందుకనే ‘ఉరుతర గద్యపద్యోక్తుల’ కంటే ‘సరసమై పరగు జాను తెనుగు మేలు’ అని పాల్కురికి సోమన చెప్పగలిగాడు. జైనుల ప్రోత్సాహంతో కన్నడ కవిత్రయం చేపట్టిన  చంపూనిర్మాణం  మీద  కన్నడ వీరశైవవచనకవులు చేసిన తిరుగుబాటుకు కొనసాగింపుగా సోమన్నని మనం భావించవచ్చు. సోమన పద్యాలు కూడా రాసినప్పటికీ చంపూ కావ్యశైలిని మాత్రం పూర్తిగా పరిహరించడం గమనించాలి.

చివరికి పదమూడో శతాబ్దంలో తిక్కన కూడా మొదట్లో చంపూ కావ్యశైలిని పరిహరించే ప్రయత్నంలోనే నిర్వచనోత్తర రామాయణం రాసాడని చెప్పవచ్చు. ఆ తరువాత ఆయన తిరిగి చంపూ పద్ధతిలోనే భారతం తెనిగిస్తూ, పదజాలంలో మాత్రం, తెలుగు వైపు మొగ్గు చూపించాడు. తిక్కన పాలకుడైన మనుమసిద్ధి నెల్లూరు చోడుడు. నెల్లూరు చోడులు కూడా రేనాటి చోడుల్లాగా తెలుగుచోడులు. కాబట్టి తిక్కన కావ్యనిర్మాణంలో మార్గ-దేశి సమన్వయం కొనసాగించినప్పటికీ, భాషాపరంగా మాత్రం  తెలుగుచోడుల శాసనభాషకు వారసుడు.

అంటే, సా.శ. 6 నుంచి 13 వ శతాబ్దందాకా తెలుగు సాహిత్యంలో కావ్యనిర్మాణం చేయడానికి పూనుకున్న కవులు తమకు తెలియకుండానే మూడు శాసనభాషలకి- వేములవాడ చాళుక్యుల, వేంగీ చాళుక్యుల, రేనాటి చోడుల- వారసులుగా కొనసాగారనీ, అంతిమంగా, పంపమహాకవి నమూనాలో నన్నయ చేపట్టిన చంపూకావ్యపద్ధతిలో, సంస్కృత-దేశభాషల సమన్వయంగా నిర్మించే కావ్య-ప్రబంధ శైలినే తెలుగు కావ్యశైలిగా స్థిరపడిరదనీ మనం చెప్పవచ్చు.

ఆ రోజు కేరళలో దాదాపుగా ఈ అభిప్రాయాలే చెప్పానుగాని, ఇప్పుడు కుర్క్యాలలో జినవల్లభుడి శాసనం ఎదట నిల్చొన్నప్పుడు, ఇంతదాకా అస్పష్టంగా ఉన్న భావనలు నాలో మరింత తేటపడ్డాయి.

3-11-2025

16 Replies to “వేములవాడ-కుర్క్యాల”

  1. సర్, కాళిదాస కవి మంత్రలోకం నుండి ఇప్పుడిప్పుడే బయట పడి,
    New England లో ఆ ఇంగ్లీషు కవుల ను ఇంకా వెతుక్కుని తెలుసుకోక ముందే తెలుగు కన్నడ కవులను కూడా invite చేసేశారు. 😃

    On a serious note, your travelogue on Vemulawada makes one feel like they were right there with you.
    శాసనాలు and the historical evolution of Telugu and Kannada language and poetry during the times of various rulers was very interesting and informative.

    నన్నయ మీద పొంపకవి influence!!
    Pioneers and their influence on next generations is always very fascinating to me. వాల్మీకి influencer on కాళిదాసు, Emerson’s influence on Whitman and now పంపకవి influence on నన్నయ!!

    Thank you sir. 🙏🏽

  2. మాకు కూడా దైవదర్శనం తో పాటుగా వాగ్దేవి దర్శనం చేయించారు.
    శాసన భాషల గురించి సంపూర్ణమైన వివరాలు ఇచ్చారు.

  3. మమ్మల్ని కూడా మీ ఈ యాత్రా కథనం ద్వారా వేములవాడకే కాదు.. చరిత్ర పుటల్లోకి తీసుకెళ్లారు. మనము గత సెప్టెంబర్ లో నా ఇండియా ట్రిప్ లో కలసి వెళ్ళలేకపోయినందుకు కలిగిన డిజప్పాయింట్మెంట్ ఇది చదవడంతో కొంచెం స్వాంతన కలిగించింది. ఇలాంటి కథనాలు మీరే రాయాలి. మీకు అనేక ధన్యవాదాలు భద్రుడు గారు.

  4. సబ్బిసాయిరమ్ము సంతసించెనేడు
    సద్వివేకి తీర్థసంగమమున
    వేలఏళ్ల చరిత వెల్లవేసినయట్లు
    కంద పద్యసీమ కందళించె

    పంపకవిని గన్న పరమేశ్వరుని చోటు
    భీమకవిని గన్న బిరుదు ఊరు
    సాంబకవిని గన్న సత్కృతి నిలయంబు
    వేములాడ జూడ వెలుగు జాడ

    జైన బసది గట్టి జైన శాసనముల
    శిలలపైన మూడు శిఖర భాష
    లనగ చెక్కి నిలిపె జినవల్లభుడు తాను
    తెలుగు కంద మందు తేటనిలిచె

    మీరు మా సీమ కేగుట మిగులముదము
    ధన్యమయ్యెను మానేరు దరుల భూమి
    రాజరాజేశ్వరుండును రమ్యభీమ
    లింగరూపులు మీయెద లీనమైరి

    ఓపికతో ఘన చరితను
    చూపితిరీ వ్యాసమందు చూడ్కులు నిల్పన్
    రేపటి తరముల జాగృతి
    మీ పటిమకు లక్ష్యమనగ మిన్నగ సుకవీ!

    మా చిన్న వీరభద్రుడు
    ఏ చిన్న విశేషమైన ఎదలోతులతో
    చూచును చెప్పును విప్పును
    దాచక ఏ విషయమైన తనరగ స్ఫూర్తిన్

    1. నా లాంటి మూగ ప్రేమికుల అందరి తరపున గొంతుక

  5. శరదృతువు నడికాలానికి చేరుకున్నా ఇంకా మేఘాల్లో కారునలుపు ఛాయ తగ్గలేదు. కాని మేఘాలు శుభ్రపడినచోటల్లా ఎండ మరీ తీక్షణంగా ఉంది.( ఆహా!)

    నేను ఒక్క అక్షరం కూడా పోల్చుకోలేను. అయినా వాటిని చూడటానికి ఎందుకంతగా తహతహలాడాను? ( నేనూ అంతే. మీ మాటలు అతి శ్రద్ధతో వినడం కోసం )

    చాలా కారణాలు చెప్పవచ్చు. సాధారణంగా ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆఫీసుల్లో స్టాకు ఫైళ్ళ రూపంలో భద్రపరచవలసి ఉంటుంది. అటువంటి సంప్రదాయానికి మన కార్యాలయాలు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేసాయి. అందువల్ల పదేళ్ళ కిందట ఇచ్చిన ఉత్తర్వులు కూడా కాపీలు దొరకని పరిస్థితి. అలాంటిది, వెయ్యేళ్ళ కిందటి ప్రభుత్వ ఉత్తర్వులు ఇంత భద్రంగా ఉన్నాయంటే, ప్రభుత్వాల తీరుతెన్నుల్ని చాలా దగ్గరగా చూసిన నాకు, చాలా పెద్ద వింతగా, సంతోషంగా అనిపిస్తుంది.
    ( కానీ 35 ఏళ్ళ కిందటి ఒక ఉత్తర్వు ని నేను రోజుల తరబడి అక్కడే నిలబడి… ప్రార్థించి… తిట్లు తిని, ఖర్మ… అని నెత్తి కొట్టుకున్నా వినకుండా వదలకపోతే ఇచ్చారు)

    భలే కదా…

    ఇదిలా ఉంచితే క్రిందటి సవత్సరం వరకు శివుడు, మిగతా దేవుళ్ళు ఉన్నారని గాఢంగా నమ్మేదాన్ని. ఒకటే పూజలు… పుణ్యక్షేత్రాల దర్శనాలు అనుకుంటూ తెగ తిరిగేదాన్ని.
    ఇప్పుడు-
    నా కన్న కూతురికి జరిగిన ఘోరమైన ఆక్సిడెంట్ తరువాత… మా అమ్మాయి కూడా దేవుణ్ణి అంత బాధలోనూ స్తుతిస్తూ ఉంటే నాకు చిరాకు, కోపం, బాధ, దేవుడంటే వెగటు.
    మన్నించాలి తమరు. ఆ దేవుడి కంటే మీమీద, మా నాన్నగారి మీద భక్తి నాకు. మీరు చెప్పేవి, మీ భాష తీరు… చెప్పే విధానం పట్ల వినయాతి వినయంతో భక్తి తో నమస్కరిస్తాను. మీ లోని స్వచ్ఛత కి జోహార్లు. మీకు తెలియదు కదా? నేనూ మీ వెనుకే నేను అనుసరిస్తూ ప్రయాణించినట్లు ఒక గొప్ప అనుభూతి.
    నమోనమః

  6. ఇది కదా కార్తీక మాసపు నిజ దీపారాధన.
    మా రాజన్న కూడా మీ కోసం ఎదురుచూసే ఉంటాడు గురువులా.
    పి ఎం వస్తేనో ఒక శంకరాచార్యులు వస్తేనో మా ఊరి వారికి గలిగించే ఆనందాన్ని మించిన వార్త ఇది, నామట్టుకు నాకు. ఉడతలా నేను లేకపోతినని తప్ప!.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading