
రమణీయనీలిమ మధ్య
రమణీయ నీలిమ మధ్య చర్చి గోపురం
తగరపు రేకుకప్పుతో వికసించింది.
వసంతపక్షుల కూజితాలు దాని చుట్టూ
అల్లుకున్నవి, ప్రగాఢనీలచ్ఛాయ చుట్టూ
పరుచుకున్నది, సూర్యుడు
గగనమధిరోహించి తగరపు కప్పుని
తేజోమయం చేస్తున్నాడు
గాలిమర చప్పుడుచెయ్యకుండా గాలివాలుకు
తిరుగుతున్నది. గంటలగోపురం నుంచి ఎవరో
కిందకి దిగుతున్నప్పుడు చుట్టూ జీవితం
నిశ్చలంగా నిలిచి ఉన్నది, కిందకి దిగుతున్న
మనిషి వెలుగులోకి వస్తున్నవాడిలాగా
ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాడు. గంటలు మోగుతున్నప్పటి
కిటికీలు సౌందర్యానికి తలుపులు తెరిచినట్టున్నవి.
మనుషుల మెచ్చుకోలు
నేను ప్రేమించడం మొదలుపెట్టానుకాబట్టి
నా హృదయం మరింత పవిత్రంగా మారింది కదా
మరింత సౌందర్యంతో పొంగిపొర్లుతున్నదికదా!
కాని ఇదేమిటి లోపల బోలుగానూ
బయట వాచాలుడిగానూ ఉంటే,
గర్విష్టిగానో, దుండుడుకుగానో ఉంటే
నువ్వు నన్ను మరింత గౌరవిస్తున్నావు?
అయ్యో! అంగడికేది చేరుతుందో
మంది దాన్నే మెచ్చుకుంటారు
దౌర్జన్యం చేసేవాణ్ణే
బానిస మెచ్చుకుంటాడు
తాము స్వయంగా దేవతాస్వరూపులైనవారే
దేవుణ్ణిష్టపడతారు.
25-10-2025

