
ఏ శాఖాగ్రంథాలయంలో దొరికిందో గాని రవీంద్ర కథావళి (1968) దొరికినరోజు నా జీవితంలో ఒక పండగరోజు. సాహిత్య అకాదెమీ కోసం మద్దిపట్ల సూరి అనువాదం చేసిన ఆ 21 కథలసంపుటం నాకు ఆ రోజుల్లో టాగోరు నా కోసం తెలుగులో రాసేడన్నట్టే ఉండేది.
అంతదాకా టాగోరుని ఒక కవిగానే ఎరిగి ఉన్న నాకు ఆయన కథలు కూడా రాసాడని తెలియడం ఒక ఆశ్చర్యం కాగా, ఆ కథల్లో కనిపించే జీవితం, సాధారణ రోజువారీ జీవితంగా, అత్యంత వాస్తవికంగా, చాలావరకూ నాకు తెలిసిన జీవితంగా కనిపించి నన్ను మరింత ఆశ్చర్యపరిచింది. కవితల్లో కనిపించే ఆ స్థలాలూ, ఆ జలాలూ, ఆ ఘాట్లూ, ఆ మబ్బూ, ఆ ఎండా కథల్లోనూ కనిపిస్తాయి. కాని కవితల్లో అవి ఆకాశానికి దారితీస్తుంటే కథల్లో మన ఊళ్ళల్లోకీ, వీథుల్లోకీ, మన ఇళ్ళల్లోకీ దారితీస్తుంటాయి.
పుట్టి ముప్ఫై ఏళ్ళయినా కూడా ఏదో ఒక నిశ్చితమైన జీవనాధారాన్ని సముపార్జించుకోని కొడుకుని ప్రయోజకుణ్ణి చెయ్యాలనుకుని మహర్షి దేవేంద్రనాథ టాగోరు 1890 ల ప్రారంభంలో తూర్పు బెంగాల్లోని తమ ఎస్టేటు వ్యవహారాలు చూసుకునే బాధ్యత అప్పగించడం టాగోరు జీవితాన్ని మలుపు తిప్పింది. మొదటిసారిగా ఆయన కలకత్తాని దాటిన ఒక గ్రామీణప్రపంచాన్ని చూసాడు. ఆ పద్మానది తీరంలో, ఆ ఇసుకతిన్నెల మధ్య, ఆ రెల్లుపొదల మధ్య, ఆ బావుల్ సంకీర్తనల మధ్య టాగోరికి సర్వేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కార క్షణాలే గీతాంజలి గీతాలుగా రూపుదిద్దుకున్నాయని మనకు తెలుసు. అదే సమయంలో ఆ గ్రామాల్లో, ఆ పొలాల్లో, ఆ రైతుల మధ్య, ఆ హిందూ-ముస్లిం నిరుపేద జీవితాల మధ్య కూడా ఆయన భగవంతుణ్ణి చూసాడు. కవితల్లోలానే ఇక్కడ కూడా కనబడ్డ దేవుడు నిరాకారుడే. కాని మానవ సంబంధాల్లో, ఒంటరితనంలో, ఉద్వేగాల్లో, నిరుద్వేగంలో, భయాల్లో, ప్రశాంతిలో- జీవితం అనుగ్రహించిన ప్రతి విలువైన క్షణంలోనూ ఆయన భగవంతుడి ఉనికిని కనుగొనగలిగాడు.
ఎస్టేటు వ్యవహారాలు చూసుకోడానికి 1891 లో సజద్ పూరు వెళ్ళిన టాగోరు ఆ తర్వాత అయిదేళ్ళ కాలంలో దాదాపు 36 కథలు రాసాడు. అవన్నీ తమ కుటుంబం నడిపే సాధన పత్రికకోసం రాయవవలసిన అవసరం వల్ల రాసినవే. కాని అలా రాయడానికి తగిన ఒక విస్తారమైన పృష్టభూమి ఆయనకు తన ఎస్టేటు జీవితం వల్ల దొరికింది. అలా 1891 లో రాసిన తొలికథల్లో పోస్ట్ మాస్టర్ కూడా ఒకటి. సజద్ పూరులో వాళ్ళ ప్రాంగణంలో ఒక పోస్ట్ మాస్టరు ఉండేవాడనీ ఆయన ఈ కథకి మూలం కావొచ్చనీ అంటారుగానీ, ఈ పోస్ట్ మాస్టర్ ఒక వ్యక్తి కాడు. తన స్వజనానికి దూరమైన ప్రతి ఒక్కడికీ ప్రతినిధి. తర్వాత రోజుల్లో ఈ పోస్ట్ మాస్టర్ ఇతివృత్తం పోస్ట్ ఆఫీసు నాటికగా మారినప్పుడు కూడా, ఇతివృత్తమైతే అదే, అదే బెంగ. అదే గృహోన్ముఖ ఆరాటం.
కాని ఇందులో అతడికొక ప్రాణి సాన్నిహిత్యం లభించడం ఈ కథని విషాదమధురంగా మార్చేసింది. తర్వాత రోజుల్లో విభూతి భూషణుడు ‘పథేర్ పాంచాలి’ (1928-29) రాసినప్పుడు దుర్గ, అపూ అనే అక్కాతమ్ముళ్ళు ఈ కథలోంచే ప్రవేశించారా అనిపిస్తుంది. అలానే ఆ తర్వాత మరొక పదేళ్ళకు ఆయన ‘ఆరణ్యక’ (1938-39) రాసినప్పుడు పూర్ణియా-ముంగేరు ప్రాంతంలో ఎస్టేటు మేనేజరుగా పనిచేసిన సత్యచరణ్ ఈ పోస్ట్ మాస్టరేనా అని కూడా అనిపిస్తుంది.
టాగోరు రాసిన ‘గోరా’, ‘ఘరే-బైరే’, ‘శేషేర్ కొబిత’ లాంటి నవలల గురించి లోతుగానూ, తాత్త్వికం గానూ చర్చించవచ్చు. కానీ పోస్ట్ మాస్టర్ చర్చించవలసిన కథ కాదు. ఒక పాతహిందీపాటలాగా గుర్తొచ్చినప్పుడల్లా మనసులో తీయని బాధనేదో మేల్కొల్పే కథ. అందుకనే ఈ కథని సత్యజిత్ రే సినిమాగా మలిచినప్పుడు ఆ interpretation నన్ను ఆకట్టుకోలేకపోయింది. టాగోరు కథ రాసిన దాదాపు తొంభై ఏళ్ళ తరువాత రే ఈ సినిమా తీసాడు. కానీ ఆయనకి ఆ కథలోని ఆత్మ అర్థం కాలేదనిపించింది. ఈ మధ్య మరొకరు కూడా ఈ కథని సినిమా తీసారని విన్నానుగాని, ఆ కథాసంగ్రహం విన్నాక ఆ సినిమా చూడకూడదనిపించింది. నేను ఈ కథని సినిమాగా తీస్తే ఆ ఒంటరితనాన్ని పట్టుకోడానికి ప్రయత్నించి ఉండేవాణ్ణి. విస్తారమైన నదీమైదానం, ఆ గ్రామాలూ, ఆ నిర్జనపథాలూ, ఆ పడవలూ ఆ దృశ్యాల మధ్య, మధ్యలో ఆ చిన్న పిల్ల నేత్రాల్ని పదేపదే చూపించి ఉండేవాణ్ణి.
పోస్ట్ మాష్టర్
రవీంద్రనాథ టాగోరు
తెలుగు సేత: మద్దిపట్ల సూరి
ఉద్యోగంలో చేరగానే మొదట ఉలాపూర్ గ్రామానికి పోస్ట్ మాస్టర్ గా రావలసి వచ్చింది. ఉలాపూర్ చాలా చిన్న ఊరు. దగ్గినలో నీలిమందుకార్ఖానా ఒకటి ఉంది. కనుక ఆ కార్ఖానా దొర ఎంతో ప్రయత్నంచేసి, ఈ క్రొత్త పోస్టాఫీసు పెట్టించగలిగాడు.
మా పోస్ట్ మాస్టర్ కలకత్తా బిడ్డ. నీళ్ళలోని చేపను ఒడ్డునపడేస్తే ఏమవుతుందో, ఈ కుగ్రామానికి వచ్చిన పోస్ట్ మాస్టరు స్థితికూడా ఇంచుమించు అంతే అయింది. చీకటి కోణంగా ఉండే ఒక యింట్లో అతడి ఆఫీసు. దగ్గరలో నాచుతో కప్పి ఉండే చెరువు. దానికి నాలుగువైపులా అడవి. కార్ఖానాలో ఉండే గుమాస్తా మొదలైన ఉద్యోగుల కెవరికీ ఇంచుమించు తీరికే ఉండదు. అదీకాక వాళ్లు పెద్ద మనుషులలో కలిసిమెలసి తిరగటానికి అర్హులు కారు.
ముఖ్యంగా కలకత్తా కుర్రవాళ్ళకి కలసిమెలసి ఉండటం తెలియదు. అపరిచితమైనచోటికి వెడితే, తల పొగరు వాళ్ళయినా అవుతారు. లేదా వెర్రివాళ్ళలాంటి వాళ్ళయినా అవుతారు. ఈ కారణంవల్ల స్థానికంగా ఉండేవారితో అతడు కలసిపోలేకపోయాడు. పైగా చేతికి ఎక్కువ పనిలేదు. అప్పుడప్పుడు ఒకటి అర కవితలు వ్రాయటానికి ప్రయత్నించే వాడు. రోజంతా తరుపల్లవాదుల కదలికలు- ఆకాశంలోని మేఘాల్ని చూస్తూ కూచుంటే జీవితం సుఖంగా గడిచిపోతుంది- అన్నభావం వ్యక్తం అవుతూవుంటుంది, కవికల్లో, ఒక వేళ అరేబియన్ అద్భుత నవలల్లోని ఏ దైత్యుడయినావచ్చి, ఒక్క రాత్రిలో శాఖాపల్లవాలతో సహా ఈ చెట్లనన్నీ నరికిపారేసి, గట్టిరాస్తా కనుక నిర్మిస్తే అలాగే పెద్ద పెద్ద మేడలను ఆకాశంలోని మబ్బులు కనిపించకుండా ఉండేట్లు నిర్మిస్తే ఏమవుతుందో అంతర్యామికే తెలియాలి. అలా అయితే ఈ సగం చచ్చిన మర్యాదస్తులబిడ్డ మళ్ళీ క్రొత్త జీవిగా జన్మించవలసిందే.
పోస్ట్ మాస్టర్ జీతం చాలా తక్కువ. తానే వంటచేసుకుని తినాలి. ఊళ్లో తల్లీ తండ్రీ లేని ఒక అనాథ బాలిక అతడి పనులు చేసిపెడుతూ ఉండేది. ఆమెకి నాలుగు మెతుకులు తినటానికి దొరికేవి. ఆ అమ్మాయి పేరు రతన్. పన్నెండు – పదమూడేళ్ళుంటాయి. పెళ్ళయే అవకాశం ఏమీ కన్పించదు.
సంజెవేళ పశువుల పాకల్లోంచి పొగలు పైకి వర్తులాకారంగా లేస్తూ ఉంటాయి. పొదల గుబురుల్లోంచి కీచురాళ్ళు కూస్తూంటాయి. దూరాన ఊళ్ళో త్రాగుబోతులైన దాసరి వాళ్ళ ముఠా చప్పట్లు, డప్పులు మోగిస్తూ బిగ్గరగా పాటలు పాడుతూంటారు. చీకట్లో వసారాలో ఒంటరిగా కూర్చుని చెట్లు ఆకుల కదలికలు చూస్తూంటే, కవిహృదయంలో కూడా రవంత సంచలనం కలిగినప్పుడిహ ఇంట్లో మూల ఒక గుడ్డిదీపం వెలిగించి పోస్ట్ మాస్టర్ ‘రతన్’ : అని పిలిచేవాడు. రతన్ గుమ్మంలో కూర్చుని ఈ పిలుపుకోసమే ఎదురుచూస్తూండేది. కాని ఒక్క పిలుపుతోనే ఇంట్లోకి వచ్చేదికాదు. “ఏం బాబూ! ఎందుకు పిలుస్తున్నారు?” అని అడిగేది.
” ఏం చేస్తున్నావ్ నువ్వు ?”
“ఇప్పుడే పొయ్యి వెలిగించటానికి వెళ్ళాలి. వంటింట్లో —”
“నీ వంటింటి పనుల తర్వాత చేసుకుందువుగాని ముందు ఒకమాటు చిలుంగొట్టం సిద్ధంచేసి ఇయ్యి”
కొంచెం సేపట్లోనే బుగ్గలు రెండు ఉబ్బించి చిలుంగొట్టం ఊదుకుంటూ రతన్ ప్రవేశించేది. ఆమె చేతిలోని గొట్టాన్ని అందుకుని, పోస్ట్ మాస్టర్ గబుక్కున “అవును కాని రతన్, మీ అమ్మ జ్ఞాపకం వస్తూంటుందా?” అని అడిగేవాడు. చాలా సంగతులవన్నీ. కొన్ని జ్ఞాపకం వస్తాయి, కొన్ని జ్ఞాపకంరావు, తల్లికంటె తండ్రి ఆమెని ఎక్కువ అపేక్షగా చూసేవాడు. తండ్రే కొంచెం లీలగా జ్ఞాపకం ఉన్నాడు. పగలల్లా కష్టపడి తండ్రి సంజెవేళ కింటికి తిరిగివస్తూ ఉండేవాడు. అలాంటి రెండు సంజెవేళలు ఆమె హృదయంలో స్పష్టమైన చిత్తరువుల్లా హత్తుకుపోయాయి. ఈ మాటల్లోంచి క్రమంగా రతన్ పోస్ట్ మాస్టరు కాళ్ళ దగ్గిర – కింద కూర్చుని చదువుకుంటూ ఉండేది. జ్ఞాపకాలు మెదిలేవి. ఆమె కొక తమ్ముడుండేవాడు. చాలా రోజులక్రితం ఒకనాడు వర్షంగా ఉన్న రోజున ఒక గుంటగట్టున ఇద్దరూ కలిసి, చెట్టున విరిగిన సన్నటి కొమ్మను గాలంచేసుకుని ఉత్తుత్తి చేపలుపట్టే ఆట ఆడుకున్నారు. చాలా ముఖ్యమైన సంఘటనలకంటే ఈ సంఘటనే ఆమె మనస్సులో బాగా మెదలుతూండేది. ఇలా మాటల్లో మధ్యమధ్య ఒకొక్క నాడు రాత్రి చాలా ప్రొద్దుపోతూ ఉండేది. అప్పుడిహ బద్ధకంకొద్దీ పోస్ట్ మాస్టర్ వంట చేసుకోటానికి ఇచ్చగించేవాడు కాదు. ప్రొద్దున వండుకున్న చప్పగా చల్లారిపోయిన కూరలవీ ఉండేవి. రతన్ గబగబా పొయ్యి వెలిగించి, కాసిని రొట్టెలుకాల్చి తీసుకువచ్చేది. వాటితోనే ఆరాత్రి కిద్దరికీ తిండి వెళ్ళిపోయేది.
ఒకొకరోజున సంజెవేళ ఆ పెద్ద ఎనిమిదిదూలాల ఆఫీసు గృహంలో ఒక వైపున బల్ల మీద కూర్చుని పోస్ట్ మాస్టర్ తన యింటి సంగతులు ఏకరువు పెట్టేవాడు. తల్లి, తమ్ముడు అక్కల సంగతులు-ప్రవాసంలో ఒంటరిగా ఇంట్లో కూర్చున్నప్పుడు మనస్సు ఎవరికోసం కొట్టుకుంటూ ఉంటుందో-వారి సంగతులు చెపుతూండేవాడు. ఎప్పుడూ మనస్సులో మెదలుతూండే సంగతులు, నీలిఫాక్టరీ గుమాస్తాలదగ్గిర తీసుకురావటానికి వీల్లేని సంగతులన్నీ చదువు సంస్కారంలేని ఆ చిన్నబాలికతో చెప్పుకునేవాడు. ఆసంగతమని అనిపించేదేకాదు. చివరకి – అతడా సంగతులన్నీ చెపుతున్నప్పుడు ఆ బాలిక వాళ్లు యింట్లో వాళ్ళని అమ్మ, అక్క, అన్న అని వరసలు కలిపి మాట్లాడేదాకా వచ్చింది. అంతే కాదు తన చిన్నహృదయపటం మీద వారి ఊహారూపాలనుకూడా చిత్రించుకుంది.
వర్షకాలంలో- మబ్బులులేని ఒకనాటి మధ్యాహ్నవేళ చక్కని నులివెచ్చనిగాలి వీస్తోంది. ఆ గాలికి పచ్చిక మీదినుంచి, చిన్నచిన్న మొక్కల మీదినుంచి ఒక విధమైన వాసన వస్తోంది. అలసిపోయి ఉన్న ధరణి వేడినిట్టూర్పు ఒంటికి తగులుతున్నట్లుంది. ఎక్కడిదో మొండిపట్టు విడిచిపెట్టని పక్షి ఒకటి విరామమనేది లేకుండా ఒకే వరసన కూస్తూ, ఎదుటివారికెంతో జాలికలిగేట్లు ప్రకృతిదర్బారులో ఫిర్యాదుచేస్తోంది. పోస్ట్ మాస్టరు కి చేతిలో పనిలేదు. ఆనాటి వర్షంలో శుభ్రంగా కడిగివేసినట్లయి, ఒత్తుగా, నిగనిగలాడు తున్న చెట్లచిగురుటాకుల కదలికలు, పరాజయం పొంది భగ్నావశిష్టాలై, ఎండలో తళతళలాడుతూ కుప్పలాగా ఉన్న మబ్బుతునకలు నిజంగా చూడతగినట్లున్నాయి. పోస్ట్ మాస్టర్ వాటి కేసిచూస్తూ ఈ సమయంలో అత్యంతాత్మీయులెవరైనా దగ్గిరఉంటే-హృదయానికి హత్తుకునే అనురాగ పుత్తలియైన మానవమూర్తి సరసన ఉంటే- అని భావించుకో సాగాడు. క్రమంగా ఆ పక్షి కూడా మాటిమాటికీ ఈమాటే చెపుతున్నట్లు- ఎక్కడా ఒక్క మనిషయినా లేని ఈమధ్యాహ్నపు చెట్లనీడల్లోని ఆకుల మర్మరధ్వనుల్లోని అర్థం కూడా చాలావరకు అదే అయినట్లు తోచసాగింది. ఒక చిన్న పల్లెటూరిలోని కొద్ది జీతం తెచ్చుకునే సబ్ పోస్ట్ మాస్టరు మనస్సులో – ఒక సెలవునాటి గభీరనిస్తబ్ధ మధ్యాహ్నవేళ ఇలాంటి భావాలు తలెత్తాయని అంటే-ఎవరూ నమ్మనూ నమ్మరు; అర్థమూ చేసుకోలేరు.
పోస్ట్ మాస్టర్ పెద్ద నిట్టూర్పు ఒకటి విడిచి ‘రత్నా!’ అనిపిలిచాడు. రత్న అప్పుడు జామచెట్టుకింద, కాళ్ళు చాచుకుని పచ్చిజామకాయతింటూ కూర్చుంది. యజమాని గొంతు విన్పించగానే హడావిడిగా పరుగెత్తుకువచ్చి, రొప్పుతూ “బాబుగారూ, పిలిచారా?” అన్నది. “నీకు కాస్త చదువునేర్పుతాను” అని పోస్ట్ మాస్టరు ఆ మధ్యాహ్నమంతా ఆమెకు ‘ఆ’ ‘ఆ’ లు నేర్పటం మొదలెట్టాడు. ఇలా కొద్దిరోజుల్లొనే ఆమెకి ‘ఒత్తులు’ కూడా వచ్చేశాయి.
శ్రావణమాసంలో వర్షాలకు అంతులేదు. కాలువలు, చెరువులు, దొరువులు నిండి పోయాయి. రాత్రింబగళ్ళు కప్పల బెకబెకలు – ఒకటే వర్షపుహోరు. గ్రామాల్లోని వీథుల్లో రాకపోకలు ఇంచుమించు నిలిచిపోయాయి. సంతలకి పడవలమీద వెళ్ళవలసిందే.
ఒకనాడు ప్రొద్దునుంచి తెరపిలేకుండా కురుస్తోంది వర్షం. పోస్ట్ మాస్టరు శిష్యురాలు చాలాసేపటినుంచి గుమ్మందగ్గిర కనిపెట్టుకుని కూచుని ఉంది, కాని ఎప్పటిలాగా ఎంత సేపటికీ మామూలు పిలుపు రాకపోవటంతో తన పుస్తకాలు, కలం పెట్టుకున్న చిన్న పెట్టె తీసుకుని తానే లోపలికి వెళ్ళింది. పోస్ట్ మాస్టరు తన మంచంమీద పడుకుని ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడనుకుని, ఏం చప్పుడు కానీయకుండా మళ్ళీ మెల్లిగా గదిలోంచి బయటికి వెళ్ళబోయింది. చటుక్కున “రత్నా”: అని పిలుపు విన్పించింది. వెంటనే వెనక్కితిరిగి “బాబుగారూ! నిద్రపోతున్నారా” అని అడిగింది. పోస్ట్ మాస్టర్ భయభయంగా “ఒంట్లో బాగున్నట్లు లేదు. నుదురు మీద చెయ్యి వేసి చూడు”అన్నాడు. మరీ తోడు ఎవరూలేని ఈ ప్రవాసంలో, జోరుగా కురుస్తున్న వర్షంలో అస్వస్థతగా ఉన్న శరీరానికి కాస్త శుశ్రూష కావాలనిపించింది. కాలిపోతున్న నుదురుమీద గాజుల చేతి కోమలస్పర్శ తలపుకు వచ్చింది. ఈ దుస్సహమైన ప్రవాసంలో రోగ బాధలో స్నేహరూపిణులైన తల్లి అక్క ప్రక్కన ఉండాలనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రవాసి మనస్సులోని అభిలాష వ్యర్థంకాలేదు. బాలిక అయిన రత్న ఇంక బాలికగా ఉండిపోలేదు. ఆ క్షణంలోనే ఆమె తల్లిస్థానాన్ని, అధికారాన్ని చేపట్టింది. వైద్యుణ్ణి పిలిపించింది. వేళకు మందు తాగించేది. రాత్రి అంతా తలంపిదిక్కున మేలుకుని కూర్చునేది. తానే పథ్యం వండిపెట్టేది. అంతేకాదు; “ఏం బాబుగారూ! కాస్త తేలిగ్గా ఉన్నట్లుందా?” అని ఒకటికి పదిసార్లు అడిగేది.
చాలారోజులకి పోస్ట్ మాస్టరు చిక్కిశల్యమై రోగశయ్యమీదినుంచి లేచాడు. “ఇహ లాభం లేదు. ఇక్కడినుంచి ఎలాగయినాసరే బదిలీచేయించుకోవాలని మనస్సులో నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతపు అస్వస్థతతను వ్యక్తంచేస్తూ తక్షణమే కలకత్తా లోని పై అధికారులకు, బదిలీ కోరుకుంటూ దరఖాస్తు పంపుకున్నాడు.
రోగి శుశ్రూషనుంచి బయటపడి, రత్న మళ్ళీ గుమ్మంబయట తన స్వస్థానాన్ని ఆక్రమించుకుంది. కాని వెనుకటిలాగా ఇప్పుడామెకి పిలుపురావటంలేదు. మధ్యమధ్య తొంగిచూస్తూ ఉండేది. పోస్ట్ మాస్టరు మరీ పరధ్యానంగా బల్లమీద కూర్చునో, మంచంమీద పదుకునో ఉండేవాడు. రత్న తన పిలుపుకోసం ఎదురుచూస్తూ ఉన్నప్పుడు అతడు ఆదుర్దాగా తన దరఖాస్తుకి సమాధానం కోసం యెదురుచూస్తూ ఉండేవాడు. బాలిక గుమ్మంబయట కూర్చుని తన పాతపాఠాలు వెయ్యేసిసార్లు చదివేది. చటుక్కున ఎప్పుడు పిలుపు వస్తుందో, ఆ సమయానికి తనకు వచ్చిన ఒత్తులన్నీ ఎక్కడ తారుమారవుతాయో అని ఆమె కొక భయం ఉండేది. చివరకి వారంరోజులు పోయాక ఒకనాడు సంజెవేళ పిలుపు వచ్చింది. రత్న ఉద్వేలితహృదయంతో లోపలకు వచ్చి
” బాబుగారూ! పిలిచారా నన్ను?” అని అడిగింది.
“ రత్నా! రేపే నేను వెళ్లిపోతున్నాను” అని చెప్పాడు పోస్ట్ మాస్టరు.
” ఎక్కడి వెడతారు బాబుగారూ? ”
“ఇంటికి వెడుతున్నా.”
“మళ్లీ ఎప్పుడొస్తారు ? ”
“ఇంక రాను”
రత్న ఇంకేమీ అడగలేదు. పోస్ట్ మాస్టరు తనంతట తానే తాను బదిలీకోసం దరఖాస్తు పెట్టుకున్నానని దరఖాస్తు మంజూరు కాలేదని, అంచేత ఉద్యోగం వదిలేసి ఇంటికి వెళ్లి పోతున్నానని చెప్పాడు. చాలాసేపు ఇంక ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మినుకు మినుకు మంటూ దీపం వెలుగుతోంది. ఒకచోట శిథిలమైపోయిన పైకప్పు చిల్లులలోనుంచి మట్టి మూకుడులో టప్ టప్ మని వానబొట్లు పడుతున్నాయి.
కొంచెం సేపయాక రత్న మెల్లగా లేచి, రొట్టెలు చెయ్యటానికి వంటింట్లోకి వెళ్లింది. రోజూలాగా ఆ తొందరేమీలేదు. బహుశా మధ్య మధ్య మనస్సులోకి చాలా ఆలోచనలు వస్తున్నాయేమో అని తోస్తుంది. పోస్ట్ మాస్టరు భోజనమయిన తర్వాత — ఆ బాలిక అతణ్ణి ” బాబుగారూ : నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లరాదూ? ” అని అడిగింది.
పోస్ట్ మాస్టరు నవ్వి “అది యెలా సాధ్యమవుతుంది?” అన్నాడు. అసలు విషయమేమిటో – ఎందువల్ల సాధ్యం కాదో ఆ సంగతి బాలికకు నచ్చచెప్పటం ఆవశ్యకమని అనుకోలేదు.
రాత్రంతా మెలకువగా ఉన్నప్పుడు – కలలోనూ కూడా ‘అది యెలా సాధ్యమవుతుంది?’ అని నవ్వుతూ పోస్ట్ మాస్టరు అన్నమాట ఆ బాలికకు చెవుల్లో ప్రతిధ్వనించసాగింది.
పోస్ట్ మాస్టరు తెల్లారకట్లనే లేచి, చూసేసరికి తన స్నానానికి నీళ్లు సిద్ధంగా పెట్టి ఉన్నాయి.
కలకత్తాలోని అలవాటు ప్రకారం – అతడు పట్టి ఉంచిన నీళ్లతోనే స్నానం చేస్తాడు. అతడు యెప్పుడు బయలుదేరుతున్నదీ బాలిక యెందుచేతనో అడగలేకపోయింది. ఒక వేళ ప్రొద్దున్నే ఎక్కడ అవసరమొస్తాయో అని రత్న క్రితం రాత్రే నదినుంచి స్నానానికి నీళ్ళు తీసుకొచ్చి పెట్టి ఉంచింది. స్నానం అయాక రత్నకి పిలుపు వచ్చింది. రత్న నిశ్శబ్దంగా లోపలికి వచ్చింది. అతడి ఆదేశానికి ఎదురుచూస్తూ ఏం మాట్లాడకుండా ఒక్కసారి యజమాని ముఖంకేసి చూసింది. “రత్నా: నా స్థానంలో వచ్చే అతడితో నేను చెప్పి వెడతాను. అతడు నిన్ను, నాలాగానే ఆదరిస్తాడు. నేను వెళిపోతున్నానని నువ్వేమీ బెంగపెట్టుకోనక్కర్లేదు” అన్నాడు యజమాని. అతడి ఈ మాటలు ఆదరపూర్వకమయినవీ – దయార్ద్రహృదయంలోంచి వచ్చినవే; ఆ విషయంలో సందేహం యేమీలేదు. కాని స్త్రీ హృదయాన్ని ఎవరు తెలుసుకోగలరు ? రత్న ఎంతోకాలం యజమాని చివాట్లనెన్నో నోరెత్తకుండా సహించింది. కాని ఈ మెత్తని మాటలను మాత్రం సహించలేక పోయింది. ఒక్కసారి బావురుమని యేడుస్తూ — “వద్దు వద్దు. మీరెవరికీ యేమీ చెప్ప నవసరం లేదు. నేనిక్కడ ఉండాలనుకోవటం లేదు ” అన్నది.
రత్న ఇలా వ్యవహరించటం పోస్ట్ మాస్టరు యెన్నడూ చూసి యెరుగడు. అంచేతచటుక్కున తెల్లబోయాడు.
క్రొత్త పోస్ట్ మాస్టర్ వచ్చాడు. అకడికి చార్జి అంతా అప్పగించి, పాత పోస్ట్ మాస్టర్ ప్రయాణోన్ముఖుడయాడు. వెళ్లేప్పుడు రత్నను పిలిచి “రత్నా! నీ కెప్పుడూ నేనేమీ యివ్వలేకపోయాను. ఇవాళ వెళ్లిపోతూ నీకు కొంచెం ఇచ్చి వెడుతున్నాను. దీంతో నీకు కొన్నాళ్లు గడుస్తుంది” అన్నాడు.”
కొంచెం త్రోవ ఖర్చుకు పోను — తనకు వచ్చిన జీతం పైకం మొత్తమంతా జేబులోంచి పైకితీశాడు. రత్న అప్పుడు అతడికి సాష్టాంగపడి, కాళ్లు రెండూ పట్టుకొని, ” బాబుగారూ! మీ కాళ్లు రెండూ పట్టుకుంటున్నా. మీ కాళ్లు రెండూ పట్టుకుంటున్నా. నాకేమీ యివ్వదు. మీ కాళ్ళురెండూ పట్టుకుంటున్నా, నన్ను గురించి ఎవరూ ఏమీ దిగులు పెట్టుకోనఖ్కర్లేదు” అని, అక్కడినుంచి ఒక్క పరుగున పారిపోయింది.
పాత పోస్ట్ మాస్టరు ఒక్క నిట్టూర్పు విడిచి, గళ్ల సంచి చేతికి తగిలించుకుని గొడుగు పైన వేసుకుని, నీలం-తెలుపు చారల రేకుట్రంకు ఒకటి కూలివాడి నెత్తిన యెత్తి, మెల్లిగా పడవలరేవుకి బయలుదేరాడు. పడవయెక్కి, పడవ బయలుదేరేసరికి — వర్షాల మూలంగా విస్తరించి ఉన్న నది-పొంగి పొరలిన ధరణి ఆశ్రురాశిలాగా నాలుగు వైపులా జలజలా ప్రవహిస్తోంది. అప్పుడతడి హృదయంలో అపరిమితమైన వేదన కలగసాగింది. ఒక సామాన్యగ్రామీణబాలిక ముఖచిత్రం. — ఏదో విశ్వవ్యాప్తమైన అవ్యక్తమర్మవేదనను వ్యక్తం చేయసాగింది. “తిరిగి వెడదాం, జగతి ఒడినుంచి జారిపోయిన ఆ అనాథను వెంట పెట్టుకు తీసుకువద్దాం” అని మరీ మరీ అనిపించిందొకసారి. కాని అప్పటికి తెరచాపకు గాలి బాగా అందుకుంది. నదీ ప్రవాహం చాలా వడిగా ఉంది. ఊరు దాటిపోయి, నది ఒడ్డున నుండే శ్మశానం కన్పిస్తోంది. నదీ ప్రవాహంలో పయనిస్తున్న పథికుని ఉదాసీనహృదయంలో ” జీవితంలో ఇలాంటి ఎన్ని విచ్ఛేదాలు, ఎన్ని మృత్యువులున్నాయో? తిరిగి వెళ్లటంవల్ల లాభమేమిటి ? పృథివిలో ఎవరికి ఎవరు?” అన్న వైరాగ్యం ఉదయించింది.
కాని రత్న హృదయంలో ఎలాంటి వైరాగ్యం ఉదయించలేదు. ఆమె ఆ పోస్టాఫీసు నాలుగువైపుల్నీ కన్నీళ్లతో తడిపివేస్తూ అలాగే తిరుగుతోంది. బాబుగారొక వేళ తిరిగివస్తారేమో’ అన్న ఆశ మనస్సులో లీలగా తలెత్తి ఉంటుంది. ఆ బంధంలో చిక్కుకుని ఏమయినా అక్కడినుఁచి కదలి దూరంగా వెళ్లలేకపోతోంది. ఎంత జ్ఞాన విహీనమైనది మానవ హృదయం : భ్రాంతి అనేది ఒక పట్టాన తొలగిపోదు. యుక్తి, వివేచన ఎంతో ఆలస్యంగా ప్రవేశిస్తాయి మనన్సులో ప్రబలమైన ప్రమాణాలను సైతం విశ్వసించటం మాని, మిథ్య అయిన ఆశనే రెండుచేతులలో కౌగలించుకుని, శక్తి అంతనీ మోపి గుండెలకు గట్టిగా హత్తుకుని ఉంటుంది. చివరి కెప్పుడో ఒకనాడది నాడులనన్నీ ఛేదించుకుని, హృదయంలోని రక్తాన్నంతనీ పీల్చివేసి పారిపోతుంది. అప్పుడు చైతన్యంకలుగుతుంది. కాని మళ్లీ మరో భ్రాంతిపాశంలో చిక్కుకోటానికి మనస్సు తహ తహలాడుతుంది. …
[1891]


తెలుగు అనువాదం హృదయానికి హత్తుకుంది. తెలుగులో గొప్ప కథని తెలియ పరచినందుకు మీకు వేనవేల కృతజ్ఞతలు. నిజంగా వెంటాడే కథ.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
“కాని కవితల్లో అవి ఆకాశానికి దారితీస్తుంటే కథల్లో మన ఊళ్ళల్లోకీ, వీథుల్లోకీ, మన ఇళ్ళల్లోకీ దారితీస్తుంటాయి.”
“ ఒక పాతహిందీపాటలాగా గుర్తొచ్చినప్పుడల్లా మనసులో తీయని బాధనేదో మేల్కొల్పే కథ. “
So true, sir!
🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!