
సాహిత్య అకాదెమీ తీసుకొచ్చిన కథాసంకలనాల్లో ‘కన్నడ కథానికలు’ (1979) కూడా ఒక విశిష్ట సంకలనం. ఎల్.ఎస్.శేషగిరిరావు సంకలనం చేసిన ఈ పుస్తకంలో 22 కథలున్నాయి. ఆ రచయితలెవ్వరో సరే, ఆ అనువాదకుడెవరో కూడా తెలియని వయసులో నేనా పుస్తకం చదివాను. నలభయ్యేళ్ళ కింద చదివిన ఈ పుస్తకం మళ్ళా ఇన్నేళ్ళకు ఇదే తెరవడం. కానీ ఆ చిన్నవయసులోనే నా మనసుకు హత్తుకు పోయిన కథ ‘కొళాయిలో నీళ్ళు వచ్చినవి’ ఇప్పుడు చదివినా అంత ఫ్రెష్ గానూ, అంత ప్రభావశీలంగానూ ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది.
ఈ కథారచయిత కె.సదాశివ 28 ఏళ్ళ వయసుకే ఇటువంటి కథ రాసి ఉండటం ఆశ్చర్యం కాగా, ఆయన రాసిన మొత్తం కథలు ఇప్పటికి కూడా ఇరవైకన్నా మించి లేవని విన్నాను. కాని రాసిన ప్రతి ఒక్క కథా కన్నడ పాఠకుల హృదయాల్లో పొడిచిన పచ్చబొట్టులాగా నిలిచిపోయిందని కూడా విన్నాను.
ఈ సంకలనానికి ముందుమాట రాస్తూ శేషగిరిరావు గారు ఈ కథ గురించి ఇలా రాసారు:
‘నల్లియల్లి నీరు బందితు’ అను కథ శ్రీ సదాశివగారిని మొదట వెలుగునకు తెచ్చినది. చిన్నకథకు వస్తువు ఇంతకంటె సామాన్యము, సూక్ష్మము ఉండదు. మహానగర వాసులకు ప్రతిదిన జీవనభాగమైన చిరపరిచిత అనుభవమొకదానిని గ్రహించి కథారచయితలు ఒక నూతనజగత్తును సృష్టించెదరు. ఇద్దరు వ్యక్తుల మనస్సులలోని ఆందోళనలను చాల సహజముగ చిత్రించెదరు. కథ చివరలో వచ్చు కొళాయి నీరు మానవీయతకు కరుణాధారయై పాఠకులకు రోమాంచము కలిగించును.
ఈ కథ గురించి ఇంతకన్నా ఒక్క మాట కూడా అదనంగా చెప్పగలననుకోను. ఆశ్చర్యమేమిటంటే, ఈ కథ మాత్రమే కాదు, ఈ కథ గురించిన పైన రాసిన చివరి వాక్యం కూడా ఇన్నేళ్ళుగానూ నా మనస్సులో చెక్కుచెదరకుండా ఉండటం.
సాధారణంగా ఒక రచయిత రాసే కథల వల్ల ఆ రచయిత నిర్మాణమవుతాడు అని అంటారు. ఇప్పుడు నాకు మరో మాట కూడా స్ఫురిస్తూ ఉంది. మనం చిన్నప్పటినుంచీ ఎటువంటి కథల్ని ఇష్టపడుతూ ఉంటామో ఆ కథలే మనల్ని కూడా నిర్మిస్తూ ఉంటాయని. లేకపోతే ఒక టాగోరు రాసిన ‘పోస్టు మాష్టరు’, ఒక ప్రేమ చందు రాసిన ‘సాల్ట్ ఇన్స్పెక్టరు’, ఒక చాసో రాసిన ‘ఎందుకు పారేస్తాను నాన్నా ‘ లాంటి కథలే నన్నెందుకు ఇన్నేళ్ళుగానూ వెన్నాడుతూ ఉంటాయి!
మరో మాట కూడా చెప్తాను. చరిత్రకారులు భారతదేశచరిత్రని యుగయుగాల దండయాత్రల చరిత్రగా అభివర్ణిస్తూ ఉంటారు. అది పాక్షిక సత్యం మాత్రమే. నిజమైన భారతదేశ చరిత్ర సర్దుబాట్ల చరిత్ర, సమన్వయాల చరిత్ర, సమాధానపడటాల చరిత్ర. దానివల్ల మాత్రమే ఇంత బహుళతాసంకీర్ణమైన ఉపఖండం ఇన్ని యుగాలుగానూ మనగలుగుతూ వస్తున్నది.
కొళాయిలో నీళ్ళు వచ్చినవి
కె. సదాశివ
తెలుగుసేత: గడియారం రామకృష్ణ శర్మ
ఆరు ఇండ్లు ఉన్న కాంపౌండులో సీతమ్మా, రంగమ్మల ఇండ్లు ఒక గోడకు ఆవల ఈవల ఉన్నవి. సీతమ్మ ఇంట్లో కూర్చున్న రంగమ్మ లోకాభిరామాయణము సాగిస్తుండెను. ఎర్రని మబ్బు పడమట ఏనుగు రూపముదాల్చి రెండు గంటల వీరి మాటల ధోరణిలో కనపడీ కనపడనట్లు మాయమై ఉంఅడెను.
సీతమ్మ గర్భములోని జీవము కదలాడెను. ఈదినమో రేపో అనేట్టు ఉండెను.
‘చాలా దిగులవుతుందండీ, రంగమ్మా.’
పదిమందిని కన్న రంగమ్మతో ఈమాట సిగ్గుతో అన్నది.
‘ఇట్లంతా దిగులు పెట్టుకోరాదు తల్లీ.’
కనిన పదిమందిలో ఏడుగురిని మిగుల్చుకొన్న ఆమె ధైర్యపు మాటలు చెప్పెను. చీకటి కోణములో రెప్పలాడించని ప్రాణి పొరలి నందున తల్లిదేహమునకు నొప్పి కలిగెను. ఎర్రబారిన ముఖమును వంచుకొనెను. సిగ్గువచ్చి పెదవులను రెండు కానీలేదు.
ఎండిపోయిన అన్నముపాత్రను నానబెట్టడానికి సీతమ్మ వంటయింటికి మెల్లగా లేచిపోయెను. నీటికొరకు కొళాయి త్రిప్పి ఆశ్చర్యము పొందెను.
నీళ్ళు దారమువలె పడుతున్నవి. గంటలో ఇవి కూడ నిలిచిపోవచ్చు.
‘నీళ్ళు నిలిచేట్టుంది రంగమ్మ.’
చెడ్డవార్త సోకినట్లు కూర్చున్న స్థలానికి ఎండవచ్చినట్లు రంగమ్మ లేచిపోయెను. ఆమె ఇంట్లో కొళాయి క్రింద కుండను పెట్టి త్రిప్పెను. తాడుమందముతో పడుతున్న నీటిధారను చూచి ధైర్యము పొందెను.
అట్లా రంగమ్మ కొళాయి తిప్పినందువలన సీతమ్మ ఇంటి కొళాయి కోప గించుకొనెను, ‘కొర్’ అని కూత పెట్టెను. సీతమ్మ చూచినది. వెనక బ్రతికి ఉండిన తాత మరణశయ్యమీదినుండి ఉబ్బసవ్యాధితో బాధపడి నప్పుడు అతని ముక్కునుండి ఇట్టి స్వరమేవెడలి ఉండెను దారమువలె ఉండిన నీరు చుక్కలుగా మారెను. చివరకు అదీ నిలిచిపోయెను.
ఎప్పుడూ ఇట్లే ఆమె ఇంట్లో కొళాయి తిప్పితే ఈమె ఇంట్లో కొళాయి ‘గుర్’ కొట్టి హఠము పడుతుంది.
పాపమని ఆమె వదిలితే ఇక్కడ నీరువస్తుంది.
తాను నీళ్ళు నింపడము మరచిపోయింది. అది ఇప్పుడు కష్టమయింది. నిలిచిన కొళాయినే దీపము వెలుగులో చూస్తుండిన సీతమ్మకు రంగమ్మ ఇంట్లో బుడబుడమని నీరు కుండలో పడుతుండుట వినపడుతూనే ఉన్నది. బిందె ముక్కాలు నిండి కంఠము వరకువచ్చిన శబ్దము విని ఇంక ఆమె చాలిస్తుందని తలచెను కాని బిందె నిండుతూనే హండాకు పోసి మళ్ళీ కొళాయికింద పెట్టడము విని తన తలపు తప్పని గ్రహించెను. గర్భభారముతో నిలబడలేక అక్కడే కూర్చుండెను. నొప్పి అప్పుడొకసారి ఇప్పుడొకసారి కనబడుతుండెను.
‘త్రాగడానికి చుక్కనీరులేదు. విడుస్తారా రంగమ్మ.’
రంగమ్మకు వినబడేట్లు గట్టిగా అరచెను. రంగమ్మ బిందెలు ఎంచుకుంటూ నిలబడినది. ‘హండాకు నాలుగు పెద్ద తపెలకు రెండు, బానకు రేపు నీళ్ళు పోస్తావా’ అనిన భర్త మొగమును ఆశ్చర్యముతో చూచెను ‘ఏ దేవుడు మీకు ఈ బుద్ధి పుట్టించెనో సంధ్య పోసుకోండి.’
పతిరాయడు ఉదయము హండాకు నీరు పడుతున్నప్పుడు అన్న మాట జ్ఞాపకమునకు వచ్చెను. హండాకు తపెలకు నిండేట్లు నీళ్ళువస్తే తెల్లవారి అయనకు నీళ్ళు పోయవచ్చు పాడుకొళాయి ఇప్పుడే నిలిచి పోవలెనా?
‘ఏమండి రంగమ్మ కొంచము నీరు విడవండి త్రాగడానికి చుక్క లేదు’ తారస్థాయిలో సీతమ్మ అరవటము నీటిచప్పుడును మించి వినపడెను.
(అబ్బా ఎంత గట్టిగా కొట్టుకుంటుంది గయ్యాళిది.)
‘విడుస్తా ఉండండి’ ఈమె అంతే గట్టిగా బదులు చెప్పెను.
చివరకు వినబడింది కదా. అబ్బా. కొంచెం నీళ్ళు వదలమంటే ఎంత బాధపడుతుంది. తలమీద కొట్టుకొంటుందా.
కొళాయి గొట్టము మీద కూర్చున్న సీతమ్మ నాలుగు సార్లు అరచిన తర్వాత ఆమె బదులు చెప్పినందుకు ఆలోచించెను. మళ్ళీ మూడు నిమిషాలైనది.
చిన్నగా నొప్పివచ్చెను. ముఖమంతా చెమటపట్టెను. వెంట వెంటనే భయమూ అయినది. భర్త వూళ్ళోలేరు. ప్రొద్దున్నే పెద్ద దొరగారితో దూరస్థలానికి ఇన్ స్పెక్షనుకు పోయినారు. వారు ఉన్నప్పుడే నొప్పులు వచ్చిఉంటే ప్రయాణము తప్పిపోయేది. అని అలోచిస్తూ తెప్పరిల్లి మళ్ళీ అరచెను. ‘ఏమండీ. కొంచెం నీళ్ళు వదలండి’ ఆమె పేరుపెట్టి పిలిచే ఓపిక కూడా లేకుండెను.
‘సరే. ఉండేదె. ఇంక మూడు కడవలయిన తర్వాత మహారాణివలె నీళ్ళన్నీ ఆమే త్రాగనీ. ఎవరు వద్దంటారు. నేనేమి తలమీద కొట్టుకొనిపోతానా’ గొణకొడుతూ రంగమ్మ మళ్ళీ చెప్పెను.
‘అయిందమ్మా విడుస్తాను. అయ్యో’ ఎందుక్కొట్టుకుంటావు అనే ధాటితో.
ఆమె చెప్పుతూ వుండగానే చిన్నధారతో పడుతున్న ఆ నీళ్ళు ఆగి పోయెను. కొళాయి ‘గొర్’ అని కూత పెట్టెను.
‘తథ్ ఇంక రెండు అయితే సరిపోయేది, పాడయిపోను’ కొళాయి పనివాళ్ళను కలిపి రంగమ్మ మనసారా శపించెను.
నీరు నిలిచిపోవడము సీతమ్మ వినెను. చివరకైనా నిలిపినారు కదా అని కొళాయి త్రిప్పెను. నీరు రాలేదు. సీతమ్మకు బాధకలిగెను. ఏడుపు వచ్చెను.
ఛ ఆమెకు అంతమాత్రం దయ రాలేదు తాగడానికి నీళ్ళు లేవన్నా నిలపలేదు. ఒకటి రెండు చెంబులైనా నరిపోయేవి. ఆలోచిస్తూ మళ్ళా అరచెను. ‘కొంచెం వదలండీ.’ సహనము మీరి దుఃఖము ఎదనుంది ఉబికివస్తున్నా, కోపము వళ్ళంతా నిండి ఉన్నా అణుచుకొని అరిచింది.
‘నిలిపినానండి.’
సీతమ్మ భయపడెను. అనుకున్నంతా అయింది నీరు పూర్తిగా అయింది. ‘అబ్బా చివరి వరకు ఆమె హఠము సాధించింది ఎంత మందిని కంటే ఎమి ఇంత కరుణ లేకపోతే’ అనుకొనెను కంటిలో చుక్క తొణికెను.
నొప్పి మళ్ళీ వచ్చెను. ఆకలి పోటీ పడెను. మెల్లగా లేచి కంచము పెట్టుకొన్న. పగలు చెంబులో నీళ్ళు పెట్టి ఉండడము జ్ఞప్తికి వచ్చెను. మూలలో ఉన్న చెంబును చూడగా ముక్కాలు నీళ్ళు ఉండెను. కొద్దిగా ధైర్యము వచ్చెను నగము తినెనో లేదో మళ్ళీ నొప్పులు ఎక్కువైనవి. మొన్న వచ్చి పరీక్షించి పోతూ మంత్రసాని సుందరమ్మ ‘ఎప్పుడైనా నొప్పులు వస్తే కొంచెము జీలకర్ర కషాయము త్రాగండి. అప్పటికీ నిలవకపోతే వచ్చి పిలవండి వస్తాను’ అని చెప్పి ఉండెను’
‘భయమేమీ లేదు కదా.’
‘ఛ ఏమి భయం నేను లేనా’ భర్త అడిగినప్పుడు ఆమె ఆ విధముగా చెప్పెను. పాపము ఆమె ఎంత మంచిది. తనకు తల్లిలేదు. పుట్టింట్లో కానుపు చెయ్యడానికి తండ్రికి శక్తి చాలదని తెలుసుకొని ఆమె కన్నతల్లి కంటె ఎక్కువ అంగలార్చి ఉండెను. ఆ జ్ఞాపకము రాగానే కషాయము చేసుకోవాలి. చేతకావడములేదు. రంగమ్మను పిలుస్తామా అనుకొనెను. వెంటనే స్వాభిమానము అడ్డు వచ్చినది. ఊహు వద్దు చెంబుడు నీళ్ళు విడువ లేదు నేనయి ఎందుకు పోవాల అనిపించెను.
నొప్పితో అన్నము నోటికి పోలేదు. లేచి చెయ్యి కడుక్కొనెను. కుంపటి అంటించి రెండు లోటాల నీళ్ళు పోసి కషాయము కాచెను.
కొళాయిలో నీరు నిలిచి పోగానే రంగమ్మకు కోపము మితిమీరెను. ఇంకా రెండు బిందెలు కావలసి ఉండగా ఆగిపోవడము అంతలోనే సీతమ్మ అరవడము ఒళ్ళు మండించినది. ‘ఓర్వలేనిది ఇప్పుడు చావనీ’ అనుకొని నింపిన హండాకు పాత్రలకు మూత పెట్టి గుటికెడు నీళ్ళు త్రాగి దీపమార్చి వసారాకు వచ్చెను. అప్పటికే భర్త గురక పెడుతున్నాడు. పిల్లలు నిద్ర పోతున్నారు. దీపము చేతికి కళాయిలో వీళ్ళు వచ్చినవి తీసుకొని రూముకు పోయి టైముకు చూచెను. పదకొండున్నర అయినది. మళ్ళీ వసారాలోకి వచ్చి పరువు పరచెను. అప్పుడనిపించెను.’ఆమె నీళ్ళు లేవని కొట్టుకున్నది చెంబుడు నీళ్ళు అడిగితే ఇవ్వనా. ఏమిలేక పోయినా జంభము మాత్రం ఉంది. హు ఎవరు వింటారు ఇవన్నీ. కోపపడి కూచుంటే కూర్చోనీలే ఎవరికి నష్టం నీళ్ళు నిలిచిపోతే నా తప్పా.’
పరుపు పరిచి దుమ్ము దులిపెను అంతలో పాలు మూసి పెట్ట లేదని గుర్తుకు వచ్చి వంటింటి లోపలికి పోయెను. సీతమ్మ చేసుకొన్న కషాయము త్రాగి బయటికి వచ్చి పరుపు ఝాడించెను.
‘నేనింకా నాలుగు రోజులు ఊర్లో ఉండనమ్మా. దయచేసి సీతను చూచుకొనే భారం మీదే. రాత్రి మా యింట్లోనే పడుకుంటే.’
‘అయ్యో దానికేమి నాయనా. నేను మనిషిని కానా తప్పకుండా పండుకొంటాను నీవు నిరాటంకముగా నీ పనికి పోవచ్చు. మా పిల్లలో సీతమ్మా ఒకటి.’ క్యాంపు పోయే ముందు తన భర్త రంగమ్మను పిలిచి చెప్పి తనకు ధైర్యము కలిగించి వెళ్ళడము తలుచుకొనెను. పాపం. వారు దూరములో ఉన్నా ఆయన మనస్సు ఇంటి విషయమే ఆలోచిస్తుండవచ్చు, అనుకొనెను. చీకట్లో తానొక్కతే ఉండవలసిన పరిస్థితిని తలుచుకుంటే గుండెల్లో భయము నిండెను. ఆమెను తోడుగా పిలుస్తామా అనిపించి మళ్ళీ ఊహుఁ. చూస్తాం ఆమే రావచ్చు ప్రొద్దున తన భర్తకు. ధైర్యమిచ్చింది కదా. అది జ్ఞాపకము రాకపోతుందా అనుకొనెను. భయమూ నడుమ వచ్చిన బిగుమానమూ భూతమైనది. కావాలనే మళ్ళీ రగ్గును ఒకసారి ఝాడించెను. ఆమెకు వినబడాలని, శబ్దము విని రావాలని.
ఒక వేళ రాకపోతే? అప్పుడు తానే పిలవవలెనా అన్పష్టసమాధానము భయంకరమై ఉండెను. గౌరవభంగమని పిలవడము వీలు కాదు. అట్లని ఒకతే పండుకోవడము సాధ్యము కాదు వస్తున్న నొప్పులు ఒక్కోసారి ఆమె నిశ్చయాన్ని నడలిస్తుండెను. ధైర్యమును జారుస్తుండెను. ‘థూ, పాడు నొప్పి’ అనుకొంటుండగానే నొప్పి తగ్గి ముందు తాను ఎదుర్కోవలసిన దృశ్యమును కల్పించుకొన్నపుడు వళ్ళంతా సిగ్గుతో ముడుచుకొని పోయెను. దీపము సన్నగా చేసి పరుపు మీద శరీరము వాల్చి మసక వెలుగుతో నెత్తురు గుడ్డును ఊహించుకొంటూ రంగమ్మ రాకనే కాచుకొని ఉండెను రగ్గు ఝాడించడము రంగమ్మ కూడా విన్నది.
‘ఏమండీ. వింటున్నారా?’
‘ఏమి?’
‘రాత్రి సీత ఇంట్లో పండుకొంటాను.’
‘ఎందుకూ?’
‘అతను ఊళ్ళోలేడు చెప్పి పోయినాడు పాపం నెలలు నిండిన మనిషి.’
‘సరే. కానీ. దానికేం.’
పగలు భోజన సమయములోనే ఆమె భర్తతో అనుమతి పొందినది సీతమ్మ రగ్గు ఝాడించినపుడు అది గుర్తుకు వచ్చెను. అయినా ఊరకుండెను ఆమెకు కోపము వస్తే నేనేమి చేసేది. ఇంత చిన్న విషయాలకు కోపగించుకొంటే ఎవరైనా నవ్వుతారు. రేగి కూచుంటే కూచోని. నాకేమవసరము. ప్రాధేయపడి మాట్లాడడానికి. వ్రేలెడంత మనిషికి పది మందిని కన్న తాను బెదరటమా?
దీపము పెద్దగానే వెలుగుతున్నది. దినమంతా పనిచేసి అలిసిన దేహము పరుపు కోసము త్వరపడుతున్నది. పరుపు మీద నిద్ర పోతున్న బిడ్డను ప్రక్కకు జరిపి దీపము దూరముగా పెట్టి వళ్ళు వాల్చెను హాయి అనిపించినది.
దీపము పెద్దగా మండుతున్నది. నిద్ర ముంచుకొని వస్తున్నా మహా ప్రయత్నముతో ఆపుకొని ఆమె పిలుస్తుందేమో అని కాచుకొన్నది – నిద్ర పట్టినది.
‘అయ్యో. చస్తిని.’
బిడ్డను ఆడిస్తుండిన రంగమ్మ చెవి యొగ్గి వినెను.
‘అయ్యో . అయ్యో.’
ఇంటి చూరు వణికెను. భూమి కంపించెను రూములో పొగనిండిఊపిరి ఆడనీయ లేదు. చుట్టూ పిల్లలు నవ్వుతున్నారు. హ్హ హ్హ హ్హ
గడియకాలేదు. సీతమ్మ భర్త ఎదురు నిలిచి కండ్లలో నిప్పులు రాలుస్తున్నాడు.
నర్స్ తీక్షణముగా చూస్తున్నది.
తన మొగుడు మింగేట్లు చూస్తున్నాడు.
‘ఏమండీ. గాడిద వలె ఉన్నారే కొంచెం చూచుకోలేక పోయినారా?’
‘అంతమందిని ఎందుకు కన్నారు. తగలబెట్టండి.’
‘అయ్యో రాక్షసి.’
రంగమ్మ చెయ్యివిసిరి వాళ్ళను కొట్టడానికి యత్నించెను చెయ్యి పైకి లేవలేదు.
సీతమ్మ పడిఉన్నది. రక్తపు మడుగులో రంగమ్మ ఈదుతున్నది. పుట్టిన శిశువు కండ్లు మిటకరిస్తూ ఎడుస్తున్నది పైకప్పు కంపిస్తున్నది.
తటాలున రంగమ్మకు మెలుకువ వచ్చెను. కండ్లు తెరుస్తూనే పెద్దగా మండుతున్న దీపము భయంకరముగా కనబడినది. పక్క నున్న బిడ్డ ఏడుస్తున్నది బిడ్డను తొడమీద ఉంచుకొని జోకొడుతున్నది. నిద్రమైకము జారి యథాస్థితికి వచ్చిన తరువాత ధైర్యము వచ్చెను. బిడ్డ నిద్రపోయినది. రూములోకి పోయి టైముచూచి తన కన్నులు తానే నమ్మలేకపోయెను. నాలుగున్నర అయిఉంది. బయట కాకి కూతలు వినవస్తున్నవి అప్పుడు రాత్రి జరిగినది జ్ఞాపకము వచ్చి గుండెలదిరెను.
‘ఇంతకూ అమ్మాయి బలేమొండిది. నాకు వయను వచ్చీదండగ. ఆడవాళ్ళకు అంతహఠము ఉండకూడదు’ అనిపించెను. మెల్లగా లేచి హండా క్రింద నిప్పు వేసెను
నీళ్ళు కాగే వరకు ఇంటి పనులు చేసుకొనేను. మాటి మాటికి సీతమ్మ ఇంటి వాకిలిని చూస్తుండెను. భర్త స్నానముచేసి బచ్చలినుండి వచ్చిరి. తడిసిన టవల్ ఉతకడానికి కంపౌండులో సమిష్టగా ఉండిన కొళాయి దగ్గరకు పోయెను. ఇంకా నీళ్ళు రాలేదు లోపలి నుంచి తపెలతో నీళ్ళు తెచ్చుకొనెను
బట్ట ఉతికిన చప్పుడుకు సీతమ్మకు మెలుకువ వచ్చినది. కనులు తెరచి చూస్తే దీపము చిన్నగా వెలుగుతున్నది. ఎదో గుర్తుకు వచ్చి వళ్ళు ‘జుమ్’ అనెను. సధ్య నొప్పులు తగ్గినవి మెల్లగా లేచి తలుపు తెరచి బచ్చలికి పోయెను. పోయేప్పుడు తిరిగిచూడగా రంగమ్మ కనపడెను. రాత్రి జరిగినది గుర్తుకు వచ్చి గుండె బరువయ్యెను.
మౌనముతో లోపలికి పోయి హండాలో తొంగిచూచెను. అడుగు పట్టిన నీళ్ళలో తన ముఖము నగమే కనపడెను. వట్టిబిందెను నడుమున పెట్టుకొని మూడిండ్ల ఆవల ఉన్న బావినుంచి నీళ్ళు నీళ్ళు తేవడానికి కదిలెను. బయటకి వచ్చి రంగమ్మ ముందునుంచి మౌనముగా తలవంచు కొని పోయెను.
‘బిందె ఇక్కడియ్యి సీతమ్మా’ రంగమ్మ అనెను.
చెవిటిదానివలె ఆమె అడుగు ముందు వేయగానె రంగమ్మ లేచి వచ్చి ఆమె చంకలోని బిందెను లాక్కొనెను.
ఎదురుగా ఉన్న కొళాయి ‘కొర్’ అని కూసెను. నీళ్ళు రభసముగా కొళాయి నుండి చిమ్మినట్లు పడుచుండెను. చిమ్మిననీరు ఇద్దరిముఖాలను తడిపెను. సీతమ్మ రంగమ్మ ముఖమును చూచెను. రంగమ్మ కళ్ళలో కనపడీ కనపడకుండా నీళ్ళు వచ్చి దృష్టి మందగించెను. ముఖమును ప్రక్కకు తిప్పుకొనెను.
Featured image courtesy: pratisrutiplus.com
12-8-2025


మనసును తల్లడిల్ల జేసే కథ
ధన్యవాదాలు సార్!
ముగింపు వాక్యం తో పాఠకుడి కళ్ళకి కూడా కనపడీ కనపడకుండా నీళ్ళు వచ్చి దృష్టి మందగిస్తుంది. ఆ వాక్యం తరువాత రచయిత ఏమైనా రాసివున్నా ఇక చదవలేడు. మరో మంచి కథ పరిచయం చేశారు..
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
“ పాఠకుల హృదయాల్లో పొడిచిన పచ్చబొట్టులాగా నిలిచిపోయిందని”
“ చిన్నకథకు వస్తువు ఇంతకంటె సామాన్యము, సూక్ష్మము ఉండదు. మహానగర వాసులకు ప్రతిదిన జీవనభాగమైన చిరపరిచిత అనుభవమొకదానిని గ్రహించి కథారచయితలు ఒక నూతనజగత్తును సృష్టించెదరు. ఇద్దరు వ్యక్తుల మనస్సులలోని ఆందోళనలను చాల సహజముగ చిత్రించెదరు. కథ చివరలో వచ్చు కొళాయి నీరు మానవీయతకు కరుణాధారయై పాఠకులకు రోమాంచము కలిగించును.”
“ఈ కథ గురించి ఇంతకన్నా ఒక్క మాట కూడా అదనంగా చెప్పగలననుకోను.”
So true!
Simple yet very real, very effectively told.
Thank you for introducing this story sir!!
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!