నన్ను వెన్నాడే కథలు-2

తెలుగు కాకుండా ఇతర భాషల్లోని కథలతో నాకు పరిచయం కలిగింది సాహిత్య అకాదెమీ, నేషనలు బుక్ ట్రస్టు వారి కథాసంకలనాల వల్లనే. కాబట్టి కథాసాహిత్యం వరకూ అవి నాకు ప్రాథమిక వాచకాల కింద లెక్క. నలభయ్యేళ్ళ కిందట నా చేతుల్లోకి వచ్చిన ఆ సంకలనాలు ప్రతి ఒక్కటీ పదేపదే చదివేవాణ్ణి. కథలు రాయడానికి కావలసిన మెలకువలు చాలావరకూ ఆ పుస్తకాలనుంచే గ్రహించానని చెప్పినా అతిశయోక్తి కాదు.

అటువంటి సంకలనాల్లో సాహిత్య అకాదెమీ వెలువరించిన ‘మరాఠీ కథాసంగ్రహం’ (1981) కూడా ఒకటి. అచ్యుత్ కేశవ్ భాగవత్ అనే ఆయన చేసిన ఈ సంకలాన్ని అకాదెమీ కోసం సోమంచి యజ్ఞన్న శాస్త్రి తెలుగుచేసారు. యజ్ఞన్న శాస్త్రి ముంబై మునిసిపల్ కార్పొరేషనులో చాలా పెద్ద ఉద్యోగమే చేసారు. ముంబై ప్రవాసాంధ్రులకి ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడని చెప్పుకునేవారు. యజ్ఞన్న శాస్త్రి కథలు రాసినప్పటికీ నాటకరంగంలో ఆయన చేసిన కృషికి ఎక్కువ గుర్తింపు లభించింది.

మరాఠీ కథాసంగ్రహం వెలువడిన వెంటనే రాజమండ్రి బుక్ ఫెయిర్ లో 83 లోనో 84 లోనో కొనుక్కున్నట్టు గుర్తు. అందులో ప్రతి ఒక్క కథా నన్ను ఆకట్టుకున్నప్పటికీ, మూడు కథలు మాత్రం నాకు మరవలేనివిగా మిగిలిపోయాయి. ఒకటి, గంగాధర్ గాడ్గిల్ రాసిన ‘మొహం లేని సాయంకాలం’, రెండవది వ్యంక్యటేశ మాడ్గూళ్కరు రాసిన ‘ఆంజనేయ స్వామి’, మూడవది-

ఇప్పుడు నన్ను వెన్నాడే కథల్ని పరిచయం చేద్దామనుకున్నప్పుడు ఆ పుస్తకం కావాలని ఆదిత్యని అడిగాను. ఆయన వెంటనే అందచేసాడు. నలభయ్యేళ్ళ తరువాత మళ్ళా తెరిచాను ఆ పుస్తకం. తెరవగానే ముందు గాడ్గిల్ కథ చదివాను. కాని, కాదు, మరో కథ ఉంది, ఏమిటది? ఆతృతగా పేజీలు తిప్పాను.

ఆశ్చర్యం. ఆ కథ ‘మంజుల’, ఇప్పుడు మళ్ళా చదువుతుంటే, ఆ పేజీలు మొత్తం, దాదాపుగా మొత్తం వాక్యాలన్నీ నా హృదయంలో ఎప్పుడో స్కాన్ అయిపోయాయని తెలిసొచ్చింది. ఆ పుస్తకంలో నా కళ్ళు పరుగెడుతున్నాయిగాని, హృదయంలో నలభయ్యేళ్ళుగా స్కాను చేసి ఉన్న ఆ పేజీలు నా మనోనేత్రం ముందు తెరుచుకుంటూనే ఉన్నాయి.

అందుకని, ఈ మరాఠీ కథాసంగ్రహం నుంచి ముందు ఆ కథనే పరిచయం చేస్తున్నాను. ఈ కథ రాసిన అరవింద్ గోఖలే (1919-1992) అగ్రశ్రేణి మరాఠీ కథకుల్లో ఒకరు. వృత్తి రీత్యా వ్యవసాయ శాస్త్రజ్ఞుడు. చాలా కాలం పూణేలో వ్యవసాయ కళాశాలలో పనిచేసాడు. కొన్నాళ్ళు ఒక సాహిత్యపత్రికకి కూడా సంపాదకత్వం వహించాడు.

మంజుల కథకి ఎటువంటి వ్యాఖ్యానమూ అవసరం లేదు. ఇటువంటి కథని conceive చెయ్యడం కష్టం. కాని ఒకసారి స్ఫురించాక, కథగా చెప్పాక, ప్రతి ఒక్కరికీ, అది తమకి బాగా తెలిసిన సన్నిహిత అనుభవమే అని అనిపించడంలో ఆశ్చర్యంలేదు.

కాని ఒక్కమాట మాత్రం అదనంగా చెప్పాలనిపిస్తున్నది. అది కథకి పెట్టిన పేరు. ‘మంజుల.’ ఈ కథకి రచయిత ఆ పేరు ఎందుకు పెట్టి ఉంటాడో ఊహించగలరా!


మంజుల

మూలం: అరవింద్ గోఖలే

తెలుగు సేత: సోమంచి యజ్ఞన్న శాస్త్రి

రైలుబండి, మధ్యమధ్య ఆగుతోంది: అటూ యిటూ వూగుతోంది. ఒగరుస్తూ పరుగెడుతోంది. ప్రతిపెట్టెలోనూ మనుష్యులు కిక్కిరిసిపోయి కూర్చున్నారు. కూర్చునే బెంచీలు, మధ్య మనుష్యులు నడిచేవారి, అంతా ప్రయాణీకులతో విండిపోయి, ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కిటికీ, తలుపులు, బుష్ కోట్లతో, చీకలతో, టోపీలతో, ముడుచుకుపోయి కూర్చున్న అవయవాలతో నిండిపోయింది. పెట్టె బయటకూడా ప్రయాణీకులు వేళ్లాడుతున్నారు. చీమలు ఆక్రమించేసుకున్న పాము ఏవిధంగా, మెల్లి మెల్లిగా, బాధతో పాకుతుందో, ఆవిధంగా, పాకుతోంది రైలుబండి. ఈ రైలుబండి వానపాములా రెండువైపులా నడవగలదు. స్టేషను దగ్గిర  ఒక్కక్షణం రైలు ఆగితే, లోపలినించి నెట్టుకుంటూ మనుష్యులు బైటపడతారు. దిగిన జనంకంటె ఎక్కువమంది లోపలికి జొరబడడానికి ప్రయత్నిస్తారు.

ఒకటే జనం : ఇళ్ళల్లోనించి, ఫుట్ పాత్ మీదికి, దానినించి ట్రాములోకి, ఆ తరవాత రైలు ప్లాటుఫారమ్, అక్కడినించి లోకల్ రైలుబళ్ళు. లోకర్ రైళ్ల లో జనసమ్మర్దం, అంత్య స్థాయి అందుకుంటుంది. ప్రతి మనిషి, రోజుకి రెండుమార్లు లోకల్ రైలుబండిలో ప్రయాణం చెయ్యాలి. పొద్దున్న ఆఫీసుకి వెళ్లడానికి, సాయంకాలం తిరిగి ఇంటికి చేరడానికి. రెండుమార్లు నరకయాతన అనుభవించాలి. రైలు పెట్టెలో, నించోడానికి చోటుదొరకడం కష్టం. శరీరం ఎంత కుదించుకు నించున్నా ఎవరికో ఒకరికి తగలక మానదు. కొందరికి అవతలవాడు పెట్టుకున్న హాటు అంచు తగిలేది. ఒక్కొకప్పుడు భుజానికి తగిలేది. గట్టిగా ఎవరివో తెలియనివేళ్లు శరీరానికి తగిలేవి. కాలిమీద బూట్లుపడి నొక్కేసేవి. వొళ్లంతా మాలిష్ చేసినట్టు నలిగిపోయేది. అటూ యిటూ దృష్టిపరపి చూడడానికి వీలేలేకుండా, మధ్యన ఇరుక్కుపోవడమే మామూలు. ఒకవేళ దృష్టిని నిగుడించిచూసినా, కనిపించేవేమిటి ? ఓ బట్టతల, మాసినగడ్డం. చెమటతో తడిసిపోయిన పపుడరు చెంపలు, మొహం ఎటూ తిప్పకుండా కిందచూపుతోనే నించుందామన్నా, మనిషి వాసనతో, ముక్కూ నోరూ, నిండిపోయి, కడుపులో తిప్పేస్తుంది. వంటి యెదుట, ముక్కు ముందర లెక్కలేనంతమంది మనుష్యులు, శరీరంలో ప్రతి రంధ్రం నుంచి, చచ్చిన మనసులతో, వాంతిపుట్టించే, మనుష్యులు. కాని సాయంకాలపు ప్రయాణం కొంచెం సుఖంగా వుంటుంది. పొద్దున్న ఎలాగో ఆలాగ కడుపులో తిండి పడేసుకుని, వెంటనే రైలెక్కాలి. పెట్టెలో అటూ యిటూ తోపులు తింటూ, విసుగ్గా నించుని ప్రయాణం చెయ్యాలి. ఆతరవాత స్టేషను నుంచి, ఆఫీసుదాకా నడవాలి. ఈగొడవల్లో, పొద్దున్న చేసిన స్నానమూ,  ఆ తరవాత చేసుకున్న సింగారమూ వృథా అయిపోతాయి. అంతా పాడయిపోతుంది. సహం సహం నమిలిన చపాతీ కడుపులో అల్లరిపెడుతుంది. ఆ మీద ఆఫీసుగొడవ. సాయంకాలం బండిలో తొక్కిడివున్నా, ప్రయాణం గడబిడగా జరిగినా, ఇంటికెళ్ళి, మొహం కడుక్కుని హాయిగా భోజనంచేసి, విశ్రాంతిగా పడుకోవొచ్చువని ఆశ. ఆరున్నర గంటలబండిలో చచ్చి చెడి బయటపడ్డ మనుష్యులు, తమతమ పాపురాలగూడులలాటి యిళ్లకి ప్రయాణమవుతారు. టై వొదులుచేసుకుని, చేతులో సాయంకాలపు పత్రిక పట్టుకున్న మొగాళ్లు: మాసిపోయిన జేబురుమాలుతో ఆఖరిమాటు మొహం తుడుచుకుంటున్న ఆడవాళ్ళు. చేతుల్లోంచి జారిగాని; పూడిగాని పడిపోతాయేమోనన్నట్టు వున్న చేతిబాగులు ఎలాగో ఓలాగు పట్టుకుని ప్రయాణం చెయ్యాలి మహిళలు. నిట్టూర్పులు, ఆవలింతలు, తమతమ స్టేషన్లు త్వరత్వరగా రావాలని చూస్తున్న అలసిపోయిన కళ్ళు, బండి ఆగగానే, మిగిలిన శ క్తిఅంతా కూడదీసుకుని బండివించి ఒక్కతోపుతో బయట పడడము:

అంధేరిస్టేషను చేరుతూవుండగానే మంజుల పెట్టెలోంచి కిందికి దిగడానికి ప్రయత్నం ప్రారంభించింది. చర్చిగేటు స్టేషనులో ఎక్కినప్పుడు ఎలా, ఒకశసీటుకి పక్కగా నించుందో, అలాగే, తొక్కిడిలో, అంధేరి చేరే దాకా నించుంది. సీటుమీద కూర్చున్న లాపు గుజరాతీ గృహస్థు వొళ్ళు తగిలేలా ఆవిడ పక్కకి జరిగాడు. కొంచెం జాగా చూపించి, కూర్చోమని తన పక్కకి ఆహ్వానించాడు కూడాను. కాని మంజుల అలాగే నిలుచుండి పోయింది. ఆవిడని పట్టుకుని మరో తరుణి నించుంది. ఆ అమ్మాయీ, ఎక్కడో వుద్యోగం చేస్తోంది. మంజుల యెదురుగుండా, పాలభాండంతో ఓ భయ్యా కూర్చున్నాడు. మిగతా రెండుపక్కలా, అనేకమంది కిక్కిరిసి నించున్నారు. మంది దిగుతున్నారు. జరుగుతున్నారు. కావి, ఎప్పుడూ తగ్గులేదు. అంథేరిస్టేషను బండిచేరిన తరువాత, దిగడం చాలా కష్టమయింది. భయ్యా, గుజరాతీ సేట్జీ, ముడుచుకునించున్న తరుణి. రెండు పక్కలా, గోడలావున్న మనుష్యులు: చివరికి మంజుల చెంగు బిగించి, బాగు గట్టిగా పట్టుకుని, కళ్ళుమూసుకువి, దిగేవైపు తోసుకుంటూ బయలు దేరింది. చాలా తోపుడులు. భుజాలు నొక్కడం, అల్లరిగా గిల్లడం, జుట్టు ముడిలాగడం: చివరికి మంజుల బయటపడింది. మంజుల ప్లాటుఫారము నించి బయటికి వొచ్చి, గబగబ నడక ప్రారంభించింది, రోడ్డుమీద. జుట్టు ఎగురుతోంది. రాసిన నూనె ఎండిపోయింది. పెదిమలు ఆరిపోయాయి. కళ్ళు అలిసిపోయాయి. చంకలకింద, పొట్టమీద, చెమటతో తడిసి, బట్టలు అంటుకుపోయాయి. మధ్యాహ్నమంతా టైపు కొట్టి, కొట్టి వేళ్ళు నెప్పులు పెట్టేస్తున్నాయి. ఈ స్థితిలో, నడక ప్రారంభించకమునుపే పాదాలు నొప్పి పెట్టడం ప్రారంభించాయి. ‘మంజులా!’ మిపెస్ భార్కర్’ మంజుల వెనక్కి తిరిగి చూసింది. ఆగింది. కాశీకులకర్ణి, పర్సు ఆడించుకుంటూ వొస్తోంది, మంజుల పనిచేస్తున్న ఆఫీసు పక్క ఆఫీసులో ఆ అమ్మాయి పని చేస్తుంది. పొద్దున్న ఇద్దరూ ఒకే బండిలో వెళతారు కాని, సాయంకాలం తిరిగి వొచ్చేటప్పుడు ఎప్పుడూ మంజులని కలియదు: ఇద్దరూ రోడ్డు చివరగా నడుస్తున్నారు. మంజుల అడిగింది, ‘రోజూ ఈ ట్రెయిసులోనే వొస్తారా !’

‘ఛీ. ఇవాళే వొచ్చాను, ఈ బండిలో. రోజూ ఏడున్నరబండి పట్టుకుంటాను.’

“ఇంత లేటవుతుందా, ఆఫీసులో.”

‘లేదు. ఆరుగంటలకే అయిపోతుంది ఆఫీసు. కాని ఇంటికోసం వెతుకుతూ తిరుగుతున్నాను. ఎవరో ఎక్కడోవుంది, అద్దెకి, యిల్లు అని చెబుతారు. వెళతాను, ఫలితమేమీ వుండదు. మీకేమన్నా తెలిస్తే. ..’

ఇంటికోసం పడుతున్న కష్టాలు చెప్పడం ప్రారంభించేసరికి మంజులకి విసుగెత్తిపోయింది. ఓ సంవత్సరం క్రితం మంజులకూడా, ఈ సంకటంలోనే చిక్కుకుంది. రోజూ, పొద్దున్నా, సాయంత్రం: జాగా దొరకడం ఎంతకష్టంగావుందో, వెదకడానికి ఎంత కష్టపడుతున్నారో, ఎవరో ఒకరు, ఎక్కడో ఒకచోట చెప్పగా వివి విని విసుగెత్తిపోయింది. కొంచెంసేపయిన తరవాత, ఆకస్మాత్తుగా అంది. ‘మీరు పెళ్ళిచేసుకోండి.’ నా పెళ్ళి స్థిరమయింది. అందుకే ఇంటికోసం వెతుకుతున్నాను. సంవత్సరమున్నర అయింది పెళ్ళి స్థిరమయి. మేమిద్దరమూ వారంలో ఆరురోజులు బొంబాయంతా ఇంటికోసం గాలిస్తాము. ఏడోరోజున పై వూరు ఎక్కడికైనావెళ్ళి, ఇల్లు దొరకలేదని, మాడిన మొహంతో, ప్రేమ, ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాము.’

మంజుల మొహం వాడింది. ‘కాశీ’ కథ విని కాదు. మంజుల ప్రేమించింది. ఇల్లు దొరికింది. పెళ్ళయింది కాని . ..’

‘నే కూరలు కొంటాను. ఒక్క నిమిషం ఆగుతారా’  అని మంజుల కూరలబండి ఆపింది. రుమాలులో ఉల్లిపాయలు మూటకట్టుకుంది. బాగులో మిరపకాయలు, కొత్తిమిరి వగైరా పెట్టుకుంది. చేతిలో ఓ కొబ్బరికాయ పుచ్చుకుని నడక ప్రారంభించింది. కాశీ కులకర్ణి మంజులకేసి అసూయతో చూస్తోంది. వూరుకోలేక అంది. ‘మిపెస్ భార్కర్. మీరు చాలా అదృష్టవంతులు.’

‘మీకూ దొరుకుతుంది ఇల్లు. నేను కూడా మీ కోసం వాకబు చేస్తాను; మా ఆఫీసులో సుబ్రహ్మణ్యానికి తెలుస్తుంది.’

ఇద్దరూ పొడిపొడిగా నవ్వారు. కులకర్ణి మరోదారిని వెళ్ళింది. మంజుల గబగబ నడక ప్రారంభించింది. ఇంకా చాలాదూరం వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి వంటచెయ్యాలి. నీళ్ళు పట్టుకుని, నింపుకోవాలి. స్నానం చెయ్యాలని అనిపిస్తోంది. ఆకలేస్తోంది. శరత్ ఇంటికి వొచ్చుంటే, అతనికి టీ కూడాచేసి ఇవ్వాలి. శరత్ జ్ఞాపకం రాగానే ఉలిక్కిపడింది మంజుల. పొద్దున్న ఇంటినించి బయటపడిన తరవాత టికెట్ చెకర్, రైలుబండిలో తోపుడు, ఆఫీసులో, పై ‘బాస్’, సుబ్రహ్మణ్యం, అక్కౌంటెంటు కావళే, మేరీ డి సూజా, సరళ సాటే, టీ ఇచ్చే భట్టు, చర్చిగేటు స్టేషనులో కన్నుగొట్టే ముసిలాడు, రైల్లో గుజరాతీ సేట్జీ, కాశీ కులకర్ణి, కూరలమ్మే మనిషి, ఈ గొడవల్లో శరత్ ఎక్కడా జ్ఞాపకానికే రాలేదు. ఏ శరతుని ప్రేమించి సంసారం ప్రారంభించిందో . .. జ్ఞాపకం రాగానే, ఆవేగంతో, అతని ఆకర్షణకి తిరిగి గురిఅయింది. కాని మరో క్షణంలో మనసు స్తంభించింది. కాళ్లు, మెల్లిమెల్లిగా నడక ప్రారంభించాయి.

పక్కనించి వెళుతున్న మోటారు కారులో అలూ బిలిమోరియా కనిపించింది. కారు వేగం తగ్గించి, ఆలూ ఆడిగింది ‘లిప్టు’.

‘వొద్దు. వొచ్చేసింది ఇల్లు’ అంది మంజుల. ముందుకి సాగింది. అలూ గురించి, ఆలోచనలు, మంజుల మనసుని, ఆక్రమించేశాయి. ఆలూ కూడా ఉద్యోగం చేస్తోంది: ఏదో విమానాల సర్వీసు నడిపే ఆఫీసులో. కాని ఆనందంతో కాలం గడుపుతుంది. మొగుడిని ఎప్పుడో వొదిలేసింది. రోజూ ఓ కొత్త మిత్రుడితో తిరుగుతుంది. వాళ్ళ మోటారు, వాళ్ళసొమ్ము. వేసుకున్న ఫ్రాకులు, రాసుకున్న లిప్ స్టిక్ కూడా మిత్రులు ఇచ్చినదే. లోకమంతా కోడై కూసింది. లోకమంతా ఆడిపోసుకుంది. కాని ఆలూకి ఫరవాలేకపోయింది. కాలేజీలో, పూర్వపు స్నేహితులతో కలిసి గోడ్ బందరుకి పిక్ నిక్ కి  వెళ్ళినప్పుడు, అలూ తన గోడు చెప్పుకుంది మంజులకి, మనసు విప్పి. “పెళ్ళి సరిపడలేదు నాకు. మొగుడు ఏమీ సంపాదించేవాడుకాదు. నే మజాచెయ్యడం ఆపుకోలేను. మొగుడి తాలూకు బంధువులతో ఇల్లు నిండిపోయేది. కాని నా చిన్ననాటి స్నేహితులెవరన్నా ఇంటికొస్తే మాత్రం, అందరికీ సందేహాలే!”

ఆలూ బిలిమోరియా ఎదురు తిరిగింది. బందిఖానా నించి బయటపడింది. బయటపడినట్టు, అధవా అనుకుంది. కాని వేళ్ళతో పెకలించబడిపోయినట్టు, స్వేచ్ఛగానేకాక, విచ్చలవిడిగా ప్రవర్తించటం ప్రారంభించింది.

ఆలూ జ్ఞాపకాలు, ఎక్కువ అవగానే మంజులకి భీతి పట్టుకుంది. మంజుల భర్త శరత్ సంపాదిస్తున్నాడు. ఇంటికి ఎవరినీ చుట్టాలని తీసుకు రావడంలేదు. తనకి స్వయంగా మొగస్నేహితులూ అక్కర్లేదు. స్వాతంత్ర్యమూ అవసరంలేదు. అలూకూడా, ‘నువ్వు ఆనందగృహిణివి’ అంటూ వుండేది. అయినా. ..మంజుల ఇంటిదగ్గరకొచ్చేసింది. మంజుల నివాసం ఓ చాళ్ లో. చీకటిపడింది ఇల్లు చేరేసరికి, దీపాలు వెలిగాయి. అప్పుడే చీకటిపడిపోయిందని మంజుల మొహం ముడుచుకుంది. తమ తమ గదులముందు మొగవాళ్లు, చొక్కాలు విప్పేసి, కూర్చున్నారు. బాతాఖానీ కొడుతున్నారు. పిల్లల్ని ఆడిస్తున్నారు. చొక్కాలులేని మొగాళ్ళనీ, అసంఖ్యాకమైన పిల్లల్నీచూసి, మంజులకి కడుపు తిప్పేసి, వాంతి వొచ్చిన పర్యంతమయింది. రేడియో, గ్రామఫోనులు గట్టిగా మోగి చెవులు బద్దలు కొట్టేస్తున్నాయి. సినీ సంగీతాల రికార్డులు. సంగీతంమీద ఏమాత్రం మోజువున్నా, దానిని నాశనంచేసే, ఈ రణగొణధ్వని విని విసుగెత్తి పోయింది.

మెట్లెక్కి తన గదిదగ్గిర కొచ్చింది. శరత్ ఇంటికి వొచ్చేశాడు. పడకకుర్చీలో విశ్రమిస్తున్నాడు. మంజుల అడిగింది ‘ఎప్పుడొచ్చావు.’

‘ఇప్పుడే.’

‘నాకు ఆరుంబావు ట్రెయిను కొంచెంలో తప్పిపోయింది. టేబులు మీద బాగ్సు, కూరలు పడేసి లోపలి గదిలోకి వెళ్ళింది, బాల్టీలో నీళ్ళులేవు. పొద్దున్న వెళ్ళేటప్పుడు బాల్టీ నింపివెళ్ళింది. శరత్ నీళ్ళన్నీ ఉపయోగించేసి వుండాలి. మంజులకి కొంచెం కోపమొచ్చింది. నీళ్లు పోసేసుకుంటే పోసుకున్నాడు. తిరిగి పట్టి పెట్టి వుండవలసింది. పొద్దున్న ఆఫీసుకి వెళ్లినప్పుడు విడిచిన పైజామా ఇంకా అలాగే పడివుంది. తాను విడిచిన చీరా అక్కడే వుంది. మంజుల, కాలితోనే చీర, పయిజామా, పక్కకి తోసేసింది. శరత్, బయట గదినించి అరిచాడు ‘ఏం చేస్తున్నావు : అలా తిరిగొద్దాం, రా!’

‘వొస్తాను. ఇప్పుడే వొచ్చాను కదా ‘ బాల్టీ పట్టుకుని బయటి కొచ్చింది. ‘మొహం కడుక్కుంటాను. తరవాత వెళదాము’ శరత్ కేసి చూస్తూ అంది. వరండామీదవున్న కొళాయిదగ్గిరకి వెళ్ళింది. నే తెచ్చి పెట్టనా అని అడగనన్నా ఆడగలేదు, శరత్. మంజులకి దుఃఖమొచ్చింది. ఇంకేం చెయ్యలేక నీటి కొళాయిదగ్గిర నించుంది. ఎవరో బాల్టీతో నీళ్లు పట్టుకుంటున్నారు. ఎవరో మొహం కడుక్కోవాలి. మంజుల తన బాల్టీ సహం నింపుకుంది. పూర్తిగా బాల్టీ నింపుతే, అది మొయ్యడానికి బలమేదీ!

మొహం తుడుచుకుని, బట్టలు మార్చుకున్న తరవాత కొంచెం హాయనిపించింది. తేలికగావుంది. ఫ్రెష్, పరిశుభ్రంగా అద్దంలో తన వికసించిన మొహం చూసుకుని కొంత సేపు, తరవాత అంది సంతోషంగా  ‘శరత్, పద.’

శరత్ అలాగే కుర్చీలో కదలకుండా కూర్చున్నాడు. చిరుకోపంతో అన్నాడు. ‘ఇప్పుడెక్కడికి వెళతాము. ఎనిమిదయిపోయింది. ఓ గంట తయారయావు !’

మంజులకి వొళ్లు మండింది. కోపంతో, ఏదో అనబోయింది కాని, అనే లోపల శరత్ అన్నాడు. ‘నీ సంగతి నువ్వు చూసుకోడం తప్ప, ఇతరుల సంగతి పట్టించుకోడమే లేదు. ‘టీ’ కావాలా అని నన్ను అడగనన్నా లేదు. దానితో మంజుల మొహం వాడిపోయింది. ఏం చెప్పాలో, ఏమనాలో, చాలాసేపు తోచలేదు. చివరికి ఎలాగో అలాగ అంది. ‘సారీ: నే ఎంతో అలిసిపోయాను. నువ్వు అడిగితే ఏం పోయింది। ఉండు నీళ్లు పెడతాను. కోపగించకు.’

శరత్ ఉదాసీనంగా వుండిపోయాడు. మంజులని తోసేస్తూ అన్నాడు. ‘వొద్దులే. హోటల్లో తాగుతాను. నిజంగా టీ చెయ్యకు:’

అతను లేచి నించోడం చూసి, మంజుల అంది. ‘మరి, మనం బయటకి వెళదామా!’

‘వొద్దు. నాకు విసుగెత్తిపోయింది. కొంచెం నాలుగడుగులు వేసేసరికి, ఇంటికి తిరిగివెళిపోదామని నీ గోల. వంటచెయ్యాలి. నీళ్ళు పట్టుకోవాలి!!’

_అయితే మనం భోజనం బయటచేద్దాం. నీళ్లు పొద్దున్నే పట్టుకుందాం.’

‘బయటి భోజనమంటే నీకు చాలా ఇష్టంగావుందే. డబ్బెక్కడుంది? టీ తాగడంకోసం కేవలం రెండణాలు మిగిలాయి నా దగ్గిర.’

మంజులకి నిజంగా వొళ్లు మండిపోయింది. టేబులుమీదున్న కొబ్బరి కాయ గట్టిగా నేలకేసికొట్టి, బద్దలుకొట్టింది. కొబ్బరినీళ్లు తాగాలని బుద్ధి పుట్టింది కాని ఆ కోపంలో, నీళ్ళన్నీ అక్కడే కార్చేసింది. రుమాలులో వున్న ఉల్లిపాయలు, బాగులోవున్న మిరపకాయలు, తీసుకుని కోపంతోనే లోపలికి వెళ్ళిపోయింది. శరత్ సిగరెట్టు వెలిగించి పొగ వొదలడం ప్రారంభించాడు, పడకకుర్చీలోనే కూర్చుని,

మంజుల స్టవ్ వెలిగించింది. ఉల్లిపాయలు మిరపకాయలు తరిగింది. కూరగిన్నె కుంపటిమీద పెట్టింది. దింపేసింది. టీకి నీళ్లు పెట్టింది. ఆ నీళ్ళలో ఉల్లిపాయముక్కలు పడేసింది. తీసేసింది. మళ్ళీ టీకి నీళ్ళు పెట్టింది. శరత్ వొచ్చి, మంజుల వెనక నించున్నాడు. మృదువుగా అన్నాడు ‘మంజూ.’

మంజుల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. భుజంమీద శరత్ చెయ్యి వేశాడు. ఆ చెయ్యితీసి, తనచేతిలో పెట్టుకుంది.

‘అయింది టీ.’

‘నిజంగా అక్కర్లేదు. ఎందుకు చేశావు. మనం బయటే భోంచేద్దాం!’

‘అయిపోయింది. టీ కప్పులోపోస్తూ అంది మంజుల, తరువాత పోపు పెడుతూ అంది, ‘బయట తినడమెందుకు? నీకు ఇష్టమయిన కూర చేశాను, చూడు.’

శరత్ ప్రేమతో మంజులని నిమిరాడు. టీ తాగాడు. తరవాత అన్నాడు. ‘ఇంకేమీ చెయ్యకు!’

‘చపాతీలు చేస్తాను.’

‘వొద్దు. చేతులు నెప్పెడుతూ వుండాలి ఇప్పటికే. బ్రెడ్ తీసుకొస్తాను.’

‘కొంచెం బ్రెడ్. రెండు చపాతీలు వున్నాయి, ఏమన్నా తీసుకురావాలంటే, ఎదురుగుండా సింధీ దుకాణం కొత్తగా తెరిచారు; అక్కడివించి కొంచెం మిఠాయి తీసుకురా’

విప్పారిన మంజుల మొహంకేసి చూస్తూ శరత్ అన్నాడు.

‘మిఠాయి తినాలని కోరికగా వున్నట్టుంది. నెల తప్పలేదు కద!’

దానితో మంజుల మొహం నల్లబడింది. కూర మళ్ళీ స్టవ్ మీద పెట్టి కలపడం ప్రారంభించింది. శూన్యదృష్టితో శరత్ బయటగదిలోకి, అక్కడి నించి, వరండాలోకి వెళ్ళిపోయాడు. మంజులకి కన్నీరు ధారగా ప్రవహించింది. అపుకోకుండా ప్రవహించనిచ్చింది. ‘నీ కళ్లు జాగర్త’ అని డాక్టరు ఇదివరలో ఇచ్చిన సలహా జ్ఞాపకమొచ్చింది. ఇంకా ఎక్కువ కన్నీరు కారింది. డాక్టరు, ఆరోగ్యంకోసం, కొన్నాళ్ళు వాతావరణం మార్చమన్నాడు. మంజులకి వేళ్ళన్నీ నెప్పులెడుతున్నాయి. నడిచినా, లేచి నించున్నా కాళ్లు పీకుతున్నాయి. అయినా నాలుగయిదు గంటలు ఏకధాటిన టైపు కొట్టాలి. ఠణఠణమన్న ధ్వని చెపుల్లో గింగురుమంటోంది. బర్ర వేడెక్కిపోయి, నొప్పి పెడుతోంది. వంట ముగించుకుని ముందుగదిలో కొచ్చింది. తలుపు బార్లాగా తెరిచివుంది. మూలనున్న పడకకుర్చీ, టేబులు, మంచం, పుస్తకాలు, ఈ సంసారమంతటినీ, మంజుల శూన్యదృష్టితో చూపింది. ఒక్కొక్కవస్తువునీ చేకూర్చుకుంటున్నప్పుడు ఎంత ఆనందం కలిగింది. ఓ సంవత్సరమున్నర క్రితమే! కాని ఇప్పుడు ఎందుకిలా అయింది. ఇంత శీఘ్రంగా ఉత్సాహమంతా ఎందుకిలా తగ్గిపోయింది. ఇదివరకూ కష్టాలుండేవి. కాని, ఇతరులకంటే ఎంత అదృష్టవంతులు తాము, నిజానికి! కాశీకులకర్ణికి వుండడానికి ఇల్లు దొరకలేదు. బిలిమోరియాకి, మొగుడు డబ్బు సంపాదించేవాడుకాదు. తన సంసారం వుండటానికి రెండు గదులున్నాయి. ఇద్దరూ నౌకరీ చేసుకుంటున్నారు. అయినా తగువులు. ఏదీ తిన్నగా, నడవడంలేదు. ఏమి తప్పుతోందో ఎక్కడ తప్పుతోందో : గదిలో కాస్సేపు నించుంది. తరవాత వరండాలోకి వెళ్ళింది. మళ్లీ గదిలో కొచ్చింది. వరండాలో శాంతంగా వుండడానికి వీల్లేదు. అక్కడ అంతా రణగొణధ్వని. శాంతంగా ఎక్కడా నించోడాని కన్నా వీలులేని పరిస్థితి. వంటింటినించి పొగ, వాసన. సినీమాపాటల సంగీతం. ఇరుగుపొరుగుతో మాట్లాడాలని బుద్ధిపుట్టదు. ఎక్కడికి వెళితే అక్కడ గడబిడ. గదిలో వున్నా సుఖంగాలేదు. రాత్రి తొమ్మిదిన్నర అయినా శరత్ తిరిగి రాలేదు. వొస్తే బాగుండునని ఓమారు. పోనీ, రాకపోతే రాకపోనీ అని మరోమారు అనిపిస్తుంది. అతను వొస్తేనే వంటగది శుభ్రం చెయ్యడానికి వీలవుతుంది. అతను రావాలి. భోజనం చేసిన గది శుభ్రం చెయ్యాలి. మంజులకి ఏడుపొచ్చింది.

శరత్ వొచ్చాడు. అతన్ని చూశాక మంజుల శాంతపడింది. అతను మిఠాయి తెచ్చాడు. నిజంగా ఆనందమేసింది. శరత్ కి వొడ్డించింది. భోజనానికి కూర్చున్నారు. శరత్ కి మారు వొడ్డించింది. తరవాత తను తింది. ఆఫీసులో సుబ్రహ్మణ్యం సంగతి చెప్పింది. ఇద్దరూ నవ్వుకున్నారు. భోజనం ముగిసిన తరవాత శరత్ ని పైగదిలో కూర్చోమని, కంచాలు తీసేసి, గది శుభ్రం చేసింది.

మంజుల ముందుగదిలో కొచ్చేసరికి, శరత్, పక్కపరిచి, పడక కుర్చీలో కూర్చుని సిగరెట్టు కాలుస్తున్నాడు. పరిచినపక్క, సిగరెట్టుపొగ చూచేసరికి మంజులకి భయం పట్టుకుంది. కడుపులో తిప్పింది. అసహ్యమేసింది. మంజుల అంది. ‘నిద్రపోయేముందు సిగరెట్టు ఎందుకుతాగుతావు!’

‘అప్పుడే నిద్రపోయే టైమెక్కడయింది.’

‘పది అయిపోయింది.’

‘అయితే నువ్వు పడుకో.’

“దీపం వెలుగుతూవుంటే నిద్దురరాదు నాకు.”

శరత్ కి కోపమొచ్చింది. సిగరెట్టు ఘాటుగాపీల్చి, తరవాత ఆర్పేశాడు, అన్నాడు. ‘నీకు దీపంవుంటె కష్టం. సిగరెట్టుతాగితే కష్టం!’

మంజుల మాట్లాడలేదు. పక్కమీద నడుంవాల్చి, చేత్తో కళ్లుమూసుకుని పడుకుంది, ఓ నిమిషంలో శరత్ లేచాడు తలుపుమూసి దీపం ఆర్పేసి, పక్కమీద పడుకున్నాడు.

అంతా నిశ్శబ్దంగా, శాంతంగావుంది.

మెల్లిగా శరత్ అన్నాడు ‘ఏయ్.’

మంజులకి శరీరంలో వెయ్యిసూదులు గుచ్చుకున్న వేదన కలిగింది.

‘వొద్దు, నన్ను పడుకోనీ!’

దీపం ఆరిపోయి గదంతా చీకటి అయినా కళ్ళమీదనించి చెయ్యి తీసెయ్యలేదు మంజుల. చెయ్యితీసి, శరత్ భుజంమీద వేద్దామా అనిపించింది. కాని వొంట్లో త్రాణేలేదు. పక్కమీద వీపు. కళ్లు పై కప్పుమీద. ఎందుకిలా అవుతోందా అని మనసులో ఆలోచన.

‘నిద్రాదేవత నీ నెత్తెక్కి సవారీ చేస్తోంది. పో. నిద్రపో.’

శరత్ కోపంతో అన్నమాటలు వినగానే మంజులలేచి కూర్చుంది. కంపితస్వరంతో అంది. ‘ఎంతకోపం! నీకేకాదు కోపం. నాకూను. లే, బాతాఖానీకొడదాం, చదరంగం ఆడుకుందాం. లేకపోతే షికారెళదాము వస్తావా ?’

‘వొద్దు. మేలుకుంటె నీ ఆరోగ్యం పాడవుతుంది.’

‘ఏమొచ్చిపడిందో నాకు.’

‘అదే నాకర్థం కావడంలేదు. ‘

శరత్ మాటల వెనకవున్న ఉద్రేకం మంజులకి అర్థమయింది. అసహాయదుఃఖంతో గొంతుక బిగుసుకుపోయింది. శరీరమంతా కంపించింది. కంపితస్వరంతో అంది, ‘చాలా కోపంగావుందికాదు నీకు. నాకు తెలుస్తూనే వుందిలే. కాని వొట్టుపెట్టి చెబుతున్నాను. నాకేమీ కోరికలేకుండావుంది. ఉత్సాహం లేకుండావుంది!’

‘ఇదివరకు అన్నీ వుండేవి. ఈమధ్య నీకు కోపం ఎక్కువయింది. స్నేహం చచ్చిపోతోంది. నేనంటె అయిష్టంపుట్టి కాదుగద.’

‘దానికి నేనేం చెప్పను’ అన్నట్టు మొహంపెట్టి, మంజుల అంది.

‘బుర్రలో వెర్రిబుద్ధులు పుట్టనీకు. నన్ను అర్థంచేసుకో.’

‘అంతా అర్థం. …”

‘నే అలిసిపోయానురా! వంటచేసి అలిసిపోతున్నాను. నీళ్లుపట్టుకునిఅలిసిపోతున్నాను. ఆఫీసుకు వెళ్లి వొచ్చే ఆ కిటకిటలో అలిసిపోతున్నాను. టైపుచేసి అలిసిపోతున్నాను.’

‘నేను అలవడంలేదూ! నే పనిచెయ్యడంలేదూ! లోకంలో అందరు ఆడవాళ్ళూ పనిచేస్తూనే వున్నారు. ఎందుకు చదువుతావు ఓ పెద్ద జాబితా. నౌకరీచెయ్యడం మానుకోవొచ్చు. కాని, అలా చెయ్యమని నేనెలా చెప్పగలను! నా దారిద్ర్యం, దౌర్బల్యం బయటపడిపోతాయి.’ మంజుల గాభరాపడింది. శరత్ కి ఎలా చెప్పాలో, నిజానికి తన మనసుకి ఎలా చెప్పుకోవాలో అర్థంకాలేదు మంజులకి. చివరికి ఓ నిర్ధారణకొచ్చి, లేచి పెదిమలు కొరుక్కుంటూ. ..

‘కిటికీ ముయ్యకు’ శరత్ కోపంగా అరిచాడు. అప్పటికే శరీరమంతా ఉడికిపోయి గాభరావుంది. మంజుల ఉలిక్కిపడింది. కిటికీకిదూరంగా వెళ్లి అంది, ‘పక్కింటికొచ్చినచుట్టం, వాళ్లింట్లో చోటులేదని, ఈ కిటికీదగ్గిరే పక్కేసుకు పడుకుంటున్నాడు.’

‘ఉండనీ. ప్రతిరోజూలాగే పడుకో నువ్వు ఇవాళకూడా!”

మంజులకి వొళ్లు మండింది. పడకకుర్చీలో కూలబడిపోయింది. భయానక నిశ్శబ్దం భరించలేకపోయింది మంజుల. ‘వొచ్చేనెలలో, మొట్టమొదట మనం ఫాను కొనుక్కుందాం.’

శరత్ వికటంగా నవ్వుతూ అన్నాడు, ‘అంటే, ఓనెల శలవన్న మాట.’

మంజుల మొహం ముడతలుపడిపోయింది.

‘ఏమంటున్నావు శరత్’ అంది మాటలో కటుత్వం కనుపింప చేస్తూ.

శరత్, ఇంకా రెండింతలు కటువుగా అన్నాడు ‘అబద్ధమేముంది. భార్యాభర్తల సంబంధం మనకి మిగలలేదు. ఇందులో అబద్ధమేముంది?’

‘శరత్, శరత్’ మంజుల కోపంతో అందికాని, కొంచెంసేపటి లోనే ధైర్యం కోలుపోయింది. ఏడుపు ప్రారంభించింది. మళ్ళీ అంతా నిశ్శబ్దం, గదిలో మటుకు బయట రణగొణధ్వని, సినీమా సంగీతపు అరుపులు, తిరిగి ప్రారంభమయాయి. గదిలో శాంతతకి బయట దరువు.

శరత్ పక్కమీదనించి లేచి కుర్చీ చేతిమీద కూర్చున్నాడు. మంజుల అతని నుదుటిమీద ప్రేమతో నిమిరింది. శరత్ మృదువుగా అన్నాడు.’ఇలా ఎందుకు చేస్తున్నావు మంజూ: ఇంతకి ముందు ఎంత మజాగా వుండేదానివి. అంతా మరిచిపోతున్నావా? పెళ్ళయినతరవాత మీ గ్రామంలో గడిపిన ఆ వారంరోజులూ జ్ఞాపకంలేదూ, రాత్రి రాత్రి అంతా మేలుకునే వుండేవాళ్ళం. తెల్లవారినా, గదివిడిచి బయటకి రావడానికి ఒప్పుకునేదానివి కావు. ఇక్కడకూడా, సాయంకాలం ఇంటికొచ్చినతరవాత నన్ను కరుచుకునే తిరిగేదానివి.’

మంజుల ఆపుకోలేక వెక్కివెక్కి ఏడుస్తూ అంది, ‘జ్ఞాపకముంది. అంతా జ్ఞాపకముంది, శరత్ నువ్వంటె నాకు అపారమైన ప్రేమ, నువ్వంటె చాలా ఇష్టం.’  శరత్  ఉద్వేగంతో దగ్గిరకి జరిగాడు: తెలియజెప్పే స్వరంలో అన్నాడు, ‘నేను నీ వాడినే. నువ్వు పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. మిగిలినవాళ్ళకి ఈ మాత్రమైనా ఏకాంతం దొరకడంలేదు. పదిమంది మనుష్యులున్న ఇంటిపరిస్థితి కనిపెట్టు ఒక్కమారు. కూలి, నాలి చేసుకు బతికేవాళ్ళని చూడు. ఎందుకిలా ప్రవర్తిస్తావు. కొత్త తీరినతరవాత పూర్వమంత ఆకర్షణ వుండకపోవచ్చును. అయినా. ..’

అతనిచేతులు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, మంజుల అంది. ‘కొత్త తీరిపోయినా, నువ్వంటె ఇష్టం తీరిపోలేదు. చాలా ఇష్టం. కాని ఈ చెమట సంసారం, ఓ యంత్రంలాటి బతుకు, నే సహించలేకపోతున్నాను. శరత్ మనం ఇక్కడి నించిపోదాం. ఎక్కడికో అక్కడికి, ఎక్కడికైనా, తీసుకుపో నన్ను. ఇప్పుడే తీసుకుపో.’

మంజుల మాటలు, ఆవిడ హృదయావేగమూ, గాలిలోనే అల్లల్లాడి పోయాయి. చాలాసేపు వూరుకున్నతరవాత శరత్ అన్నాడు, ‘నీకు విసుగెత్తిపోయింది. నే ననుకుంటున్నాను, నీకో కొడుకు పుట్టాలి. నువ్వు కావాలనుకుంటున్నావు.’

‘కాబోలు, కావి నాకు పిల్లలే కావాలనుకుంటె, ఇక్కడ అసలు వుండను. పోన్లెద్దు. ఎందుకు వృథా చర్చ!’

మంజుల కన్నీరు ఎండిపోయింది. శరత్ ఉద్వేగంకూడా అదుపులోకొచ్చింది. కొంచెం కోపంతో అన్నాడు. ఉన్న పరిస్థితితో రాజీపడి గడుపుకోకపోతే మనం దుఃఖపడుతాము. నాకు మాత్రం ఈ కష్టజీవితం, ఆకర్షణీయంగావుందా!  కాని ఏంచెయ్యను. రోజంతా కష్టపడి అలిసిపోతే ఆ అలసట తీర్చుకోడానికి నాకు ఒకటేమార్గం. అది నువ్వు.’

శరత్ మాటలు వినగానే మంజుల మనసు మండిపోయింది. కోపమొచ్చింది. అసహ్యమేసింది.

శరత్ అలా ప్రవర్తించకూడదు. తనమీద ఈ విధమైన ఇష్టం చూపించవలసిన అవసరం లేదనిపించింది. ఎక్కడికో వెళిపోతే. చాలాదూరంగా . ..ఎక్కడికో . ..శరత్, మంజులని, కుర్చీనించి బయటకి తన వైపుకి లాక్కున్నాడు. కోపంతో మాట్లాడడం ప్రారంభించాడు.

‘ఓనెల, నెలంతా సహించాను. చాలా చమత్కారంగావుంది నీ ప్రవర్తన.’

మంజుల కిందికి జారిపోయింది. అతని కౌగిలిలో సుఖం కనిపించ లేదు. ఉక్కమూలాన ఇంకా ఎక్కువ ఉక్కిరిబిక్కిరి అయింది. శరత్ కౌగిలి, లోకలుబండిలో, నాలుగు మూలల నించి మనుష్యులుతోసే తోపుళ్లలా అనిపించింది. జనసమ్మర్దంలో ఎవరో గిల్లినట్టు అనిపించింది, అతను పెట్టుకున్న ముద్దు.

శరత్, కోపంతో, మంజులని దూరంగాతోసి, ‘చావు’ అన్నాడు.

మంజులకి ‘నిజంగా చచ్చిపోతే హాయిగా వుంటుంది’ అనిపించింది. తనభర్త, తన ప్రియుడు. కాని అతనితో సహకరించడానికి తగిన శక్తి సామర్థ్యాలుకూడా మిగలలేదు తనకి. మంజులకి స్వతహాగా తనమీదే తనకి ఏవగింపుకూడా కలగడం ప్రారంభించింది. ఏ యితర విషయాలలో మాత్రం, తన ఆలోచనలు, తన యిష్టానిష్టాలు శిథిలమైపోకుండా నిలిచివున్నాయా. ఈ విషయంలో మాత్రం ఎందుకు తనకీ పట్టుదల. వేలమంది స్త్రీలు, తమ యిష్టాయిష్టాలతో ప్రసక్తిలేకుండా, మనసులో ఎలావున్నా, తమ భర్తలతో సహకరించడంలేమాః తన శరతుకూడా మిగిలిన భర్తలలాగే ప్రవర్తించగా, ఆశ్చర్యమేముంది. వ్యాకులతతో సతమతమౌతూ మంజుల అంది.

‘రా. దగ్గిరకి తీసుకో.’

‘ప్రేతాలతో శృంగారం చెయ్యడం నాకు చేతకాదు’ అంటూశరత్ కోపంతో లేచాడు. ‘ఇవాళిటినించీ, నీకూ నాకూ సంబంధం తీరిపోయింది. నువ్వు స్వయంగా నన్ను దూరం చేశావు. నువ్వు ఇలావుండగలపు. నాకు అలా వుండడం శక్యం కాదు. నేను నా సుఖం సాధించుకోవాలి. నీ దబాయింపు నా కక్కర్లేదు. నువ్వులేకుండానే వుండగలను. నే వెళ్ళిపోతున్నా!’

మంజుల కన్నీరు ఆగిపోయింది. మొహం ముడతలు పడిపోయింది. కోపంతో అంది ‘వెళ్ళు, నీ యిష్టమొచ్చినచోటికి వెళ్లు.’

‘వెళతాను. మీ నాన్న భయమేమన్నావుందా నాకు!’

‘తీసుకో, ఆ పర్సులోంచి డబ్బు తీసుకో, కావాలంటే మంజులకి ఆపుకోలేని కోపమొచ్చింది. బుర్ర పగిలిపోతోంది. శరీరం దహించుకు పోతోంది. కాని ఏదో భయమావరించింది ఆకస్మాత్తుగా! అలసటవల్ల, దుఃఖం మూలాన్ని కళ్లుతిరిగి పడిపోబోతున్నట్టు అనిపించింది. కోపమూ, దుఃఖమూ మంజులని ఇరువైపులా లాగజొచ్చాయి. చెప్పుకోలేనంత సంతాపం కలిగింది. చాలా కష్టంమీద తనని సంబాళించుకుంది. పాకుకుంటూ, వెతుక్కుంటూ శరత్ పాదాలు పట్టుకు అంది, ‘క్షమించు. నన్ను దగ్గిరకి తీసుకో. నన్ను అర్థంచేసుకో. సువ్వంటె నాకు ఇష్టం, కాని. ..’

శరత్ విసుగుతో పడకకుర్చీదగ్గిరకి వెళ్లాడు. ఆ కుర్చీలో, ఓ రాయిలా, కూర్చుండిపోయాడు. సిగరెట్టుకాల్చడం మొదలెట్టాడు. మంజుల నిస్సహాయురాలై అతనివైపు జరిగింది. చాలా దీనస్వరంతో చెప్పడం ప్రారంభించింది.

‘ఏమని చెప్పను. నా ఆలోచనలు మరోవిధంగా వున్నాయి. మనసు ప్రసన్నంగా పుంటే, శరీరం పరిశుభ్రంగావుంటే, వాతావరణం స్వచ్ఛంగా, సుందరంగావుంటె, అప్పుడే నా ప్రవృత్తి వికసిస్తుంది. ఇక్కడ చుట్టు పక్కల గడబిడ, వొచ్చేపోయేవాళ్ళు హమేషా వుంటున్నారు. ఏడుపులు. అరుపులు. తిట్లు; దీవనలు. ఇవన్నీ వింటూవుంటె, వొళ్లు ఎలాగో అయిపోతోంది. ఎప్పుడూ చెమటే. దోమలు కుడుతూవుంటాయి. శరీరమంతా కుదించుకుపోయింది. ఆలిసిపోయింది. తలనొప్పిపెడుతోంది. తిన్న పాత బ్రెడ్ ముక్కలు, లోకలుబండిలో మిడిగుడ్ల చూపులు, టైపురైటరు టకటక, ఎప్పుడూ బుర్రలో తిరుగుతూనే వుంటాయి. మనసుని కష్టపెడుతూనే వున్నాయి. మనసు చచ్చిపోతోంది. శరీరం ఉత్సుకత చూపించదు. ఈ పని తలుచుకుంటె వాంతిపుట్టే పరిస్థితివొచ్చింది. పశువులాగ, ఆలోచనలు లేకుండా ప్రవర్తించవొచ్చునేమో. కాని నే పశువునవడానికి ఇష్టంలేదు. నా భావనలు, నా కోరికలు, పవిత్రమైనవని ఊహించుకుని వాటిని కాపాడుకుంటాను: జాగర్తగా! ఇదైనా నన్ను కాపాడుకోనీ. నన్ను కించపరచకు శరత్!’

మంజుల మాటలు ఎప్పుడు ముగించిందో, తనకే తెలియదు. ఆ మాటలు వెక్కివెక్కి ఏడ్చిన ఏడుపులో విలీనమైపోయాయి. కళ్ళు నుండి పోతున్నాయి. వీపు పీక్కుపోతోంది.

లోకలుబండిలో మనుష్యులు అటూ యిటూ తోస్తున్నారు. కామదృష్టితో ఆవిడకేసి చూస్తున్నారు. రోడ్డుమీద అశ్లీలాలైన మాటలు, చాళ్ లో అసంఖ్యాకమైన పిల్లల సముదాయాలూ, చుట్టుముట్టేస్తున్నారు. దోమలు కుడుతున్నాయి. చెమట ప్రవహిస్తోంది. శరత్ ఒడిలో తలపెట్టుకుని, మంజుల నిద్రలోకి జారిపోయింది.

5-8-2025

4 Replies to “నన్ను వెన్నాడే కథలు-2”

  1. సగటు జీవుల బ్రతుకులకు అడ్డం పట్టిందీ కథ! నిజం, బొంబాయిలో సామాన్యుడి జీవితం దుర్భరంగా ఉంటుంది. ఒకే గదిలో రెండు మూడు కాపురాలు, తల్లిదండ్రులు, అన్నదమ్ముల మధ్య, తెరలు కట్టుకొని బ్రతికే పరిస్థితి. హ్రిషికేష్ ముఖర్జీనో, బాసూ చటర్జీయో ఈ అంశంపై సినిమా తీసిన గుర్తు.

  2. What a great story and translation!!
    కథ పూర్తయ్యేటప్పటికి reader experiences ఆ చెమట, ఉక్కపోత, ఆ జనం, ఎడతెగని రణగొణ ధ్వనులు, అలసట అన్నీ !!

    మంజుల అనే పేరు చాలా apt గా పెట్టారు!!
    కథలో చాలా చోట్ల మంజులమైన ఆమె ముడుచుకు పోయిందనీ, నలిగి పోయిందనీ, అలిసిపోయిందనీ, వాడిపోయిందనీ … చెప్పడం ద్వారా writer tell us how the day to day grind of a heartless busy city life robs the heart and soul of a beautiful person!!

    1. చాలా బాగా చెప్పారు! అవును. మంజుల అనే పేరు గురించి మీరు చెప్పిన వివరణ చాలా చక్కగా ఉంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading