
తగుళ్ళ గోపాలుని నేను మొదటిసారి చూసింది మల్లెగోడ గంగాప్రసాదు పుస్తకావిష్కరణ సభలో. ఆ రోజు అతడి ప్రసంగం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. స్పష్టమైన వాచికం, వినసొంపైన తెలంగాణ నుడికారం, కవుల పట్లా, కవిత్వం పట్లా అణచుకోడానికి ఇష్టపడని ప్రేమ. ఆ తర్వాత కొన్నాళ్ళకు కవిసంగమంలో మానస చామర్తి కవితల సంపుటి ‘పరవశ’ పైన అతడు రాసిన లేఖ చూసాను.
దిగ్భ్రమ చెందాను.
ఎందుకంటే ఆ పుస్తకానికి నేను ముందుమాట రాసాను. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కవిత్వంతో నాకున్న అనుబంధాన్ని రంగరించి రాసిన ముందుమాట అది. కానీ నా కన్నా ముప్ఫై ఏళ్లు చిన్నవాడైన గోపాల్ రాసిన లేఖ ముందు నా మాటలు వెలవెలబోయాయన్న సంగతి నాకొక్కడికే తెలుసు. అసలు ఆమె నాతో కాకుండా గోపాల్ తోనే తన పుస్తకానికి ముందుమాట రాయించుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది.
ఉత్తరం రూపంలో అతడు రాసిన ఆ వ్యాసాన్ని మళ్ళా మళ్ళా చదవాలనిగానీ లేదా ఆ విషయం గురించి ఆలోచించాలని గానీ అనిపించకుండా నా మనసుని పక్కకు తిప్పుకోడానికి ప్రయత్నించేను. ఎందుకంటే, అతడి వాక్యాలు చదివిన తరువాత నా పట్ల నాకు చెప్పలేనంత దిగులు పుట్టింది. ఏదో ఉంది, అతడు రాసినదాంట్లో, అటువంటిదేదో, నా ముందుమాటలో లేదని నా మనసు నాకు చెప్తోనే ఉంది. కాని ఆ విషయం గురించి ఆలోచించకూడదనుకున్నాను, ఎందుకంటే, ఆలోచించేకొద్దీ నేనేదో కోల్పోయానేమో, నాకు లభ్యం కానిదేదో ఈ పిల్లవాడికి లభ్యమైందేమో అని నాకు మరింత బెంగ పుడుతుందనిపించింది. ఆ తలపుల్ని మరింత ముందుకు సాగనివ్వక పక్కకు నెట్టేసాను.
కానీ ఇదుగో, మీ చేతుల్లో ఉందే ఈ పుస్తకం, ఇది చదివేక నాకు అర్థమయింది, ఆ రోజు మానస కవిత్వం మీద అతను రాసిన ఉత్తరంలో ఉన్నదేదో. ఆ వ్యాసం ఇందులో కూడా ఉంది. ఆమెతో కలిపి మొత్తం అరవై మంది కవులకి గోపాల్ రాసిన ఈ ఉత్తరాలు చదివేక నాకు పోగొట్టుకున్న నా బాల్యం, కవులంటే ఆకాశం నుంచి మన ఇంటికి దిగివచ్చే దేవతలని నమ్మిన ఆ నా తొలియవ్వనం గుర్తొచ్చాయి. కవిత్వం గురించి మాట్లాడాలంటే అన్నిటికన్నా ముందు నీలో ఒక బాలుడు ఇంకా పసిహృదయంతో మసలు తుండాలని మతికొచ్చింది. కనిపించిన ప్రతి కవిలోనూ ఒక అన్ననీ, అక్కనీ చూడగల ఆ పురాతనకాలపు ఆదిమ అమాయికత్వమేదో ఇంకా నీలో పచ్చగా కలల్లాడుతూ ఉండాలని అర్థమయింది.
2
నాకు కవిత్వం చదవడం అంటే ఎంత ఇష్టమో, ఎవరేనా కవుల గురించీ, తాము చదివిన కవిత్వాల గురించీ రాస్తే చదవడం కూడా అంతే ఇష్టం.
తమ తమ కాలాల్లో కొత్తగా వస్తున్న కవుల్నీ, కవిత్వాల్నీ తాము అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ తక్కినవాళ్లకి కూడా పరిచయం చేయడానికి ప్రయత్నించినవాళ్లు కొందరు లేకపోలేదు. ఒకప్పుడు భావకవుల గురించి కురుగంటి సీతారామయ్య, సి.నారాయణ రెడ్డి, తర్వాత రోజుల్లో అభ్యుదయ, దిగంబర కవిత్వాల గురించి టి.ఎల్. కాంతారావు, రామ్మోహన రాయ్ రాసిన పుస్తకాలు, ఎనభైల్లో, తొంభైల్లో వచ్చిన కవిత్వం గురించి వడలిమందేశ్వరరావు, చేరా వంటివారు రాసిన వ్యాసాలూ లేకపోలేదు. కానీ గోపాల్ రాసిన ఈ ఉత్తరాలు వాటన్నిటికన్నా ప్రత్యేకమైనవి. ఒక విధంగా చెప్పాలంటే వాటన్నిటి కన్నా ఎన్నో విధాల విశిష్టమైనవీ, అద్వితీయమైనవి కూడా.
Edward Hirsch అని ఒక అమెరికన్ రసజ్ఞుడున్నాడు. ఆయన రాసినPoet’s Choice (2006) అనే పుస్తకం నా పారాయణ గ్రంథాల్లో ఒకటి. ఆ పుస్తకంలో ఆయన వందమందికి పైగా కవుల్నీ, కవితల్నీ పరిచయం చేసాడు. తన పుస్తకానికి రాసుకున్న ముందుమాట మొదలుపెడుతూనే అతడిలా రాసాడు:
సూర్యకాంతితో భళ్ళున తెల్లారే ప్రభాతాలు, వానాకాలపు అపరాహ్ణాలు, కవిత్వతారకానిశీథులు నన్ను గుర్తుపెట్టుకుని నాకోసం మళ్ళీ వెనక్కి వస్తాయి. జీవితకాలపు కలయికలు, జీవనరేఖలు, తీర్పులు నన్నెన్నటికీ వదిలిపెట్టవు. నా తొలియవ్వనంలో చికాగోలో కవిత్వం నాకు ఎదురుపడ్డప్పుడు-నేనొక సముద్రం ఎదట ఉన్నాను, ఆమె నాకొక తెప్పనందించింది-అప్పణ్ణుంచీ నలభై ఏళ్ళుగా ఆమె నన్ను బతికిస్తూనే ఉంది. ఒక టార్చిలైటులాగా కవిత్వాన్ని నా జేబులో పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాను. ఎన్ని చిన్న చిన్న కవిత్వపుస్తకాల్ని నా జేబుల్లో కుక్కుకుని తిరిగానని! వాటి సాయంతో మరెన్నో జీవితాల్ని, మరెన్నో ప్రపంచాల్ని కనుగొంటూనే ఉన్నాను. ఇలా ఇతరుల్ని గుర్తుపట్టే క్రమంలో నన్ను నేను గుర్తుపడుతూ వచ్చాను. నేను చదివిన ఈ కవితలు నేను తీసే ఊపిరిలో భాగమైపోయేదాకా నేను వీటితో కలిపి గడుపుతూనే వచ్చాను.
అంతేకాదు, ప్రతి కవీ, ప్రతి కవితా తనకి ఎప్పుడు ఎదురయ్యారో ఆ చోటు, ఆ వేళ, ఆ లైబ్రరీ, ఆ టీకార్నరు, ఆ కవిసమ్మేళనం ప్రతి ఒక్కటీ ఆయనకి గుర్తుచేసుకుంటూనే ఉంటాడు. కవిత్వం చదవడమంటే అదీ, చదివినదాన్ని మననం చేసుకోవడమంటే అదీ అని అనిపించేలా!
ఆ మధ్య గుంటూరు దగ్గర చోడవరంలో చేతన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మా అమ్మ మంగాదేవమ్మ అంటూ ఉన్నారు, ‘మా తోటలో ఉన్న చెట్ల గురించీ, మొక్కల గురించీ పుస్తకం రాస్తే, అందులో ప్రతి మొక్కనీ నేను మొదటిసారి ఎప్పుడు చూసానో, ఆ మొక్క మా తోటలో మొదటిపువ్వు ఎప్పుడు పూసిందో, అదంతా నాకు గుర్తే, అవన్నీ ఆ పుస్తకంలో రాయాలనుకుంటున్నాను’ అని. మా మాష్టారు అన్నారు నాతో ఒకసారి, తాను చిట్టిగూడూరులో కాలేజికి వెళ్ళివస్తున్నప్పుడు వానాకాలంలో రాలిపడ్డ నేరేడుపళ్ళని చూస్తో మేఘసందేశాన్ని గుర్తుచేసుకుంటూ ఉండేవారని. తన యవ్వనకాలంలో మద్రాసులో ఉన్నప్పుడు వానపడ్డప్పుడు ఏ ఇంటిముందు నిలబడ్డా అది వసంతసేన నివాసమే అని అనిపించేదట ఆయనకి.
కవుల గురించి ఎవరేనా మాట్లాడితే అలా మాట్లాడాలనిపిస్తుంది నాకు. తమకి ఇష్టమైన కవితలు తాము మొదటిసారి ఎప్పుడు చదివారో అప్పటి ఆ గాలి, ఆ వెలుగు ఇప్పుడు కూడా వాళ్ల మాటల చుట్టూ అల్లుకుని నాకు కనిపించాలనిపిస్తుంది. ఇదుగో, ఈ పుస్తకంలో గోపాల్ రాసినట్టుగా. అందుకనే ఈ ఉత్తరాలు సాహిత్యవిమర్శ కాదు, సాహిత్య సమీక్ష కాదు, సాహిత్య చరిత్ర కాదు, అన్నీ కలిసిన, అన్నిటినీ మించిన ఆత్మీయ కథనాలు.
విమర్శకులు రాసే రచనల్లో బేరీజు వెయ్యడం ఉంటుంది. అదీకాక చాలాసార్లు విమర్శకులు తమ పూర్వకవుల కవిత్వాల గురించి మాత్రమే రాయడం ఉంటుంది. తమ సమకాలికుల గురించి రాసినప్పుడు కొన్నిసార్లు వెన్నుతట్టడం ఉంటుంది. మరికొన్నిసార్లు అభిశంసించడం ఉంటుంది. తమ రాగద్వేషాల్ని విమర్శపేరిట సిద్ధాంతీకరించడం ఉంటుంది. కానీ తమ సమకాలికులు రాసిన కవిత్వం చదివినప్పుడు, ఉదాహరణకి చలంగారు శ్రీశ్రీ కవిత్వం చదివినప్పటిలా, అన్నిటికన్నా ముందు ‘అనుభవించి పలవరించడం’ ఉండాలి. ఆ కవిత్వం ఎదట కరిగినీరై పోవడం ఉండాలి, తమని తాము పక్కకునెట్టుకుని సాష్టాంగపడగలగడం ఉండాలి.
ఇవన్నీ ఈ ఉత్తరాల్లో ఉన్నాయి. గోపాల్ రాసిన ఈ ఉత్తరాలన్నీ తమ సమకాలికులకి రాసినవేగాని, తన సమవయస్కులకి రాసినవి కావు. ఈ ఉత్తరాలు అందుకున్న కవుల్లో మూడుతరాల వారున్నారు. ఆశారాజు, ఎన్.గోపి, ఎన్.వేణుగోపాల్, యాకూబ్, ఎం. నారాయణశర్మలాంటి తన కన్నా ముందుతరం కవులున్నారు. రావెళ్ళ రవీంద్ర, ఆకాశ్, మచ్కూరి వెంకట్ లాంటి విద్యార్థులున్నారు. ఇక తక్కిన కవులంతా దాదాపు తన సమ వయస్కులున్నారు. కానీ గోపాల్ ప్రేమకి మాత్రం వారంతా సమానంగా నోచుకున్నారు.
మన సాహిత్య విమర్శకుల్లో ఒక అపోహ ఉంది. అదేమంటే, కవిత్వం గురించీ, సాహిత్యం గురించీ రాసేటప్పుడు ఒక impersonal tone లో రాయాలని. కాని మా మాష్టారు అనేవారు, ‘నాది impressionistic విమర్శ. ఆ పద్యాలు గుర్తుచేసుకోగానే వాటితో నాకున్న అనుబంధం అంతా గుర్తురాకుండా ఉండదు. వాటి గురించి మాట్లాడ మంటే నా గురించి నేను మాట్లాడుకోకుండా ఉండలేను’ అని.
గోపాల్‌ది కూడా అదే దారి. అతడు ఏ కవిని తలుచుకున్నా ఆ తలపులన్నీ కవిత్వం కావడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతడు ఒక కవినిఅతణ్ణో, ఆమెనో తాను మొదటిసారి చూసిన సమయం, సమావేశం లేదా అతడి కవిత మొదటిసారి చదివిన తరుణం ఇవేవీ గుర్తు రాకుండా ఆ కవి గురించీ, ఆ కవిత్వం గురించీ మాట్లాడలేడు. ఆ కవిత్వం తన మనసుమీద వదిలిపెట్టిన ముద్రల్ని కూడా అతడు కవిత్వంగా మార్చేసుకోకుండా ఉండలేడు. అసలు ఉత్తరాలు మొదలుపెడుతూనే అతడు చేసిన సంబోధనలు చూడండి:
మండెగట్టిన ఇత్తనపొట్ల అక్షరం, పిలనగర్ర పాట, బతుకుకు తేనెదీసిన జాజుపూతల పదం, పూతరేకుల మనసు, మేకపాల నురుగు, బుగ్గవాగు తడి, తుమ్మపూల పసిడి పద్యం, నిండుబువ్వకుండ, నల్లదారంతో గుచ్చిన నీలంరంగు పూసలదండ, తాటాకు పందిరి సలువనీడ, రాయలసీమ రాగిసంగటి వాక్యం, వలసెల్లిన తుమ్మెదవాగు పిట్ట, వరిపోసల ఎంటుగట్టిదనం, ఎర్రమన్నుపూతల వాక్యం, గురిగి నిండ నింపిన సల్ల, పొయ్యి రాజేస్తున్న ఒక దృశ్యం, అప్పుడే కన్ను తెరిచిన దోసపువ్వు, నల్లగొంగడి, ఎర్ర రుమాలు కలబోత..
ఈ విశేషణాలు వాటికవే నిండైన సాహిత్యానుభవ సూత్రీకరణలు. కవిత్వాన్ని అనుభవించి పలవరించితే తప్ప ఇలాంటి సూత్రవాక్యాలు స్ఫురణకు రావు. అలానే ఆ కవుల్తో వారి కవితల గురించి చెప్తున్నప్పుడు ఎలాంటి పదాలు ప్రయోగిస్తాడని! కొన్ని ఎత్తిరాయకుండా ఉండలేకపోతున్నాను. ఆశారాజు కవిత్వం గురించి చెప్తూ అంటాడు:
మీ కవిత్వం మఫ్లర్ చుట్టుకున్న పద్యం, దవఖానాలో తోడు విడవని చేయి, ‘చాయ్ తాగిపో’ అని బలవంతపెట్టె ఒక ప్రేమ. ఎన్ని పనులున్నా, ఫోన్ ఎత్తమని చెప్పె పిలుపు. ఒక మిత్రుడుంటే బాగుండేదని తండ్లాడే జీవితకాల ఎదురుచూపు. ఇంకొంచెం సేపు మాట్లాడమ్ని కళ్లలోకి చూసే గుండెభాష.
హరగోపాల్ కవితల గురించి చెప్తూ
విషమెక్కిన మనిషిని దగ్గరికి తీసుకుని నోటితో వాళ్ళ విషాన్ని బయటకు గుంజుతయి మీ కవితలు.
మారాబత్తుల పెద్దన్న కవిత్వం గురించి రాస్తూ
వరిచేల మీదంగ వీస్తున్న కరుణపద్యం మీది. ఏ అక్షరాన్ని తాకినా తుమ్మపూల పసుపు పరిమళం అంటుకుంటుంది.
గీతావెల్లంకికి రాసిన ఉత్తరంలో మొదటి రెండు పేరాలూ ఇక్కడ రాయకుండా ఉండలేకపోతున్నాను:
మీ డార్క్ ఫాంటసి మొత్తం జ్ఞాపకాలు, కలలు, ఊహలు, నది, సముద్రం, ఆల్చిప్పలు, పావురాలతో కలిసి మెరిసే నక్షత్రమండలాన్ని తలపిస్తుంటది. పారుతున్న సెలయేటిలో రంగురంగుల గులకరాళ్ళు మీ కవితలు. చూడడానికి అన్నీ ఒకేలా ఉన్నా దేని రంగు దానిదే. దేని నునుపు దానిదే. దేని అస్తిత్వం దానిదే. నదీ తీరంలో ఒక ఒంటరి పడవ, చిగురించే చెట్టుకొమ్మ మీద ఒక పిట్ట, జోరువానలో తడుస్తున్న ఒంటరి చెట్టు, తలుపుకు ఆనుకొని శూన్యంలోకి చూస్తున్న అమ్మాయి, టేబుల్ మీద జ్ఞాపకంగా మిల్గిన కాఫీ కప్పుని చిత్రంగా గీస్తే ఎలా ఉంటుందో మీ కవిత్వం అలాగే వుంటుంది. ఒక ఎడతెగని భావధార మీ కవిత్వం. చుట్టూ ఒక నిశ్శబ్దం, జ్ఞాపకాల వాన, యుగాల తరబడి ఎదురుచూపు మొత్తంగా ఇదే మీ కవిత్వం. ఏ నదీతీరం వెంబడో నడిచిపోతున్న పురాప్రేయసి మీ కవిత్వంలో ఉంది. ప్రియుడిరాకకోసం మంచు బిందువుల బాటలో గడ్డిపువ్వులా నిలబడ్డ నాయిక వుంది.
రహీమొద్దీన్‌కి రాస్తూ అంటాడు కదా:
మీ కవిత్వంలో ఏదో ఊపిరాడని ఉక్కపోతతనం ఉంది. సాంత్వనకోసం ఎదురుచూడడమూ ఉంది. అందుకనే మీ అక్షరం మైదానాల వెంట పిల్ల కాలువగా పరిగెత్తాలనే కాంక్షను కలిగిస్తుంది. పోర్షియాదేవిని తలుచుకుంటూ ఇలా రాస్తాడు: మీ సాహిత్య ప్రయాణం చూసినప్పుడు చిన్న ఆధారాన్ని పట్టుకుని పందిరంతా అల్లుకున్న తీగ గుర్తొస్తుంది. పందిరి నీడ గుర్తొస్తుంది. ముళ్ళమధ్యలోంచి తలెత్తి పూస్తున్న పువ్వు గుర్తొస్తుంది. తనకు ఆధారంగా నిల్చిన నిట్టాడిని చిన్నచిన్న పూలతో చుట్టుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్న పూలతీగ గుణం మీ చేతులది.
డా. కాళ్లకూరి శైలజ గారి కవిత్వసంపుటి
‘కొంగలు గూటికి చేరేవేళ’ కవిత్వమంతా ఒక ఆప్యాయతల పూలపొట్లం. ఒక ప్రేమపందిరి. ధ్యానంలోకి వెళ్ళిన ప్రకృతి. ఏసు, సాయిల ఏకత్వం. ప్రాణంపిట్టను ఎగిరిపోకుండా చేస్తున్న యుద్ధసందర్భం. కన్నీళ్ళకు పట్టిన దోసిలి. కరుణనిండిన బుద్ధవాక్యం.
పసునూరు శ్రీధర్‌బాబుతో ఇలా అంటాడు:
నిజంగా మీ కవిత్వ ప్రయాణమంతా ఒక నక్షత్రపురం తొవ్వనే. ఎంతో ఆశ్చర్యంలోకి తీసుకెళ్ళే వాక్యాలు. గుండెలోపలి దీపం వత్తిని దేదీప్యమానంగా వెలిగించే చుక్కపద్యం లాంటి వాక్యాలు.
3
కవిత్వం గురించిన ఇంత ప్రాణవంతంగా పలవరించడం ఇతనికెట్లా సాధ్యమయ్యిందంటే ముందు మనుషులకోసం అలా పలవరిస్తాడు కాబట్టి. కృష్ణశాస్త్రిగారు అనేవారట తనకి మనుషులంటే ఆబ అని. ఆ ఆబ అనే మాటని నా మిత్రుడు మహేశు పదేపదే తలుచు కుంటూ ఉండేవాడు. గోపాల్‌కి మనుషులంటే దప్పి, ఆబ, ఆరాటం. ఇరవైనాలుగ్గంటలూ అతడి మనోప్రపంచంలో కవిసంగమాలు జరుగుతూనే ఉంటాయనుకుంటాను. ఈ ఉత్తరాల్లో అతడు కవుల్తో పంచుకున్న ఎన్నో ఆలోచనలే ఇందుకు సాక్ష్యం. మీరు ఆ ఉత్తరాలు చదవకముందే ఆ వాక్యాల్ని ఇక్కడ ముందే చెప్పెయ్యడం భావ్యంకాదుగాని, అతడి ఆరాటమెలాంటిదో చెప్పడానికి మరో మార్గం లేదు నాకు. చూడండి:
సుర్మాకళ్ల చిన్నోడు సలీమాకు ఉత్తరం మొదలుపెడుతూ
ఈ ఉత్తరం రాస్తుంటే ఆర్ట్స్ కాలేజి మెట్ల ముందు కూర్చోని మనకిష్టమైన కవితలన్నీ తీసి చదువుతూ వెన్నెలకు వినిపిస్తున్నట్టు, తెల్లారి బడికి వెళ్ళాలని టెన్షన్ పడుతుంటే ఏ ఓలానో, రాపిడో బుక్ చేసి సాగనంపుతూ ఇంకా దారికేసి చూస్తున్నట్టే ఉంది. కవిత్వమంటే శాలువలు, సన్మనాలు అనుకుంటరు గానీ, ప్రేమరాహిత్య ప్రపంచంలో ఇంత ప్రేమ దొరకడం కదా కవిత్వమంటే, మనకోసం ఎదురుచూసే ఒక మనిషి ఉండడం కదా కవిత్వమంటే అనిపిస్తది.
చందుశివన్నకు రాసిన ఉత్తరంలో అంటాడు కదా:
మీరు కూడా పాలమూరు జిల్లాకు చెందిన వారనే ఒక ప్రాంతీయ అభిమానం నాకు. కవులైనా, బంధువులైనా విడిపోవడానికి చిన్న చిన్న కారణాలు వెతుక్కుంటున్నప్పుడు ఒక వ్యక్తిమీద ప్రేమ ఏర్పరుచుకోవడానికి ఇలాంటి అభిమానాలు ఉండాలేమో అన్న.
బ్రతికిన క్షణాలను మిగిల్చిన కవిమిత్రులందరికీ ఒక ఉత్తరం రాస్తూ ఇలా అంటున్నాడు:
మనం ఏం మర్చిపోయినం? కలవడం మర్చిపోయినం. కలబోసుకోవడం మర్చిపోయినం. ఈ మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది కవిత్వం. విశాల మైదానంలో నిలబడ్డా ఊపిరాడనితనం మనల్ని వెంటాడుతుంది. అచ్చుగుద్దినట్టు ఒకేలా చేసే సంతకాలను చెరిపేసి హాయిగా ఇసుకమీద మన పేరును రాసుకునే సందర్భాలు తక్కువైనయి. ఊపిరి పీల్చుకుని మళ్ళీ మన రోజువారీ సంతకాల్లోకి వెళ్ళిపోవడానికి ఒక కలయిక కావాలి. ఒక ఉద్వేగభాష కావాలి. అదే కవిత్వం. ఎన్ని తుపానులు వీచినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో కవిత్వం ముందుంది.
హరగోపాల్‌కి రాసిన ఉత్తరం ముగిస్తూ అంటాడు కదా:
సారు, గారు లాంటి ఈ పై పై మాటలను దాటి ‘బాపూ’ అని గుండెకు గుండె ఆనియ్యాలని వుంది..దానికి తోడు ‘లోపలి సందుకల దాసిన దుఃఖం ఎవలి కండ్లవడ్తది’ అనే వాక్యాలు చదివిన తరువాత వొచ్చిన కవిత్వ జ్వరం. పెయ్యంతా కాలుతుంది. మీతో పంచుకుంటే మనసు నిమ్మలపడుతదని ఈ లేఖ రాస్తున్న.
సిరికి స్వామినాయుడుకి రాసిన ఉత్తరంలో చివరి వాక్యాలు:
ఇప్పటివరకు మనం కలుసుకోలేదుగానీ దూరంగా ఉన్నానని ఎప్పుడూ అనిపించలేదు. ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ప్రేమ కురిసి వెలసినట్టుంటది. ఎటువంటివారినైనా చాలా ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు అల్లుకుపోయె పల్లెతనం మీది. ప్రతి మనిషికి ‘అరేయ్’ అని పిలిచే ఒక ఆత్మీయుడు వుండాలి. ఆ పిలుపు మనిషి లోపల ‘జల’ను కాపాడుతుంది, ‘నా తమ్ముడివిరా నువ్వు’ అని నన్ను సొంతం చేసుకొని మీరు మాట్లాడు తున్నప్పుడు ఏ వంశధార నదో నా గుండెను తడిపినట్లుంటుంది.
యశస్వి సతీష్‌తో అంటాడు:
అన్నా! జీవితంలో ఎవరైనా ఏం కోరుకుంటరు? డబ్బు, హోదా, కీర్తి ఇవ్వలేని ఆనందం వేటిలో ఉంటుంది? అసలు జీవితానికి ఏం కావాలి? ఏమో చెప్పలేను. ‘ఏరా నాన్నా ఎలా ఉన్నావ’్ అనే ఒక పలకరింపు, కండ్లనిండా నింపుకునే మీ ప్రేముంది నాకు. ఇంతకంటే ఎక్కువ నేనేమి మాట్లాడుత?
చిత్రం ప్రసాద్ రాసిన కవితను అతనితోనే పంచుకుంటూ ఇలా ఆ ఉత్తరం ఇలా ముగిస్తున్నాడు:
రెండేళ్ళుగా వెంటాడుతున్న ఈ కవితను మీతో పంచుకున్నక గుండె నిమ్మళ పడ్డది. కాని చెలకదున్నేటపుడో, ఇత్తనమేసేటపుడో బిడ్డలను యాజ్జేసుకుంటూ శోకం గడుతున్న తల్లులే కండ్లల్ల మెదుల్తున్నరు. ఇగ ఇప్పుడేం మాట్లాడగలను?
పోర్షియాదేవి కవిత్వం మీద మాట్లాడమన్నప్పుడు
ఇంతమంది ఆత్మీయుల మధ్యన నేను మీ కవిత్వం మీద మాట్లాడడం ఎప్పటికీ మరిచిపోలేను మేడం. తొలుత ఎట్ల మాట్లాడుతనో అనే భయం ఉండే. వేదికమీద చెప్పలేదుగానీ గుండే వడ్లరాశొలే మారింది.
విఠలాపురం పుష్పలతకు రాసిన ఉత్తరంలో
ఒక గిన్నెల బువ్వ తినే ప్రేమల గురించి తెలిసినవాళ్ళు మీరు.
అని రాసాడే, ఆ వాక్యం దగ్గరే చాలా సేపు ఆగిపోయేను, ఎంత బెంగ పుట్టించిందో ఆ వాక్యం నాలో.
ఏ కవిని మొదటిసారి ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నాడో ఆ తేదీలు, ఆ తావులు అతడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఫలానా రాజు ఎప్పుడు సింహాసనం ఎక్కాడో, ఫలానా కట్టడం ఎప్పుడు పూర్తయ్యిందో నాకెప్పుడూ ఆసక్తికలిగించలేదుగాని, గోపాల్ ఆశారాజుని మొదటిసారి 25-12-2016 న హైదరాబాదు బుక్ ఫెయిరులో చూసాడనీ, హరగోపాల్‌ని కూడా ఆ ఏడాదే ఓల్డు ఆల్వాలులో కవిత్వం వర్కుషాపులో కలుసుకున్నాడనీ, 2018 జనవరి 21 న కవిసంగమం 36 వ సిరీసులో పెనుగొండ సరసిజ అక్క కవిత్వం చదువుతుండగా తొలిసారి చూసాడనీ రాస్తాడే, ఆ తేదీల్ని నేను కూడా మర్చిపోలేను. కాసుల రవన్నని కూడా ఆ రోజే అక్కడే కలుసుకున్నాడనీ, ఈ కలయికలే కాదు, ఎవరు తమ పుస్తకాలు తనకెప్పుడిచ్చారో ఆ తేదీలు కూడా- యశస్వి సతీష్ తన పుస్తకం 12-10-2019 న ఇచ్చాడనీ- మై గాడ్! నేను కూడా కవుల్ని ప్రేమించానుగానీ, ఈ ప్రేమ తీవ్రత నా ఊహకి కూడా అందనిది!
4
అలాగని ఈ ఉత్తరాలన్నీ కేవలం ఆత్మీయతాప్రకటనలు మాత్రమే కాదు, ఈ పుస్తకం ఒక చారిత్రికపత్రం కూడా. ఇప్పుడు తెలుగుసాహిత్యం ప్రధానంగా దళితులది, గిరిజనులది, వెనకబడ్డ వర్గాలదీ, ముస్లిములదీ, ఇంతదాకా అవకాశాలు అందక, అణచివేతకూ, నిరాదరణకూ గురవుతూ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్న ప్రజాసమూహాలదీ అనే సామాజిక వాస్తవానికి ఈ పుస్తకం అద్దం పట్టేదిగా ఉంది.
అందరికన్నా ముందు గోపాల్‌నే చూడండి. అభివృద్ధిలో వెనకబడ్డ పాలమూరు జిల్లాలో మాడ్గుల మండలంలో కలకొండ గ్రామంలో వెనకబడ్డతరగతికి చెందిన కుటుంబంలో పుట్టాడు. తండ్రి జీతగాడు. ఉన్నవూళ్ళో ఉపాధి కరువై ఆ కుటుంబం కొన్నాళ్ళు వలసకు కూడా పోయింది. ఎట్లానో ఇంటర్మీడియేటు దాక చదువుకోగలిగాడు. ఆ తర్వాత పై చదువులు చదివే ఆర్థిక పరిస్థితి లేదు. టీచర్ ట్రైనింగుచేసి కొన్నాళ్ళు వెస్ట్టు మారేడుపల్లిలో ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేసాడు. 2012 లో డి.ఎస్.సి ద్వారా టీచరుగా సెలక్టయ్యాక అతడికీ, అతడి తల్లిదండ్రులకీ ఒకింత ఆధారం దొరికింది. ఇప్పుడు వెల్దండ మండలం అజిలాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడు గొర్రెలు కాసిన రోజులనుంచి ఇప్పుడు సాహిత్యఅకాదెమీ పురస్కారం దాకా అతడు చేసిన ప్రయాణం దానికదే ఒక విజయగాథ.
అలాంటివాళ్ళే మరెందరో కవులు ఇంతదాకా సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటు తనాన్ని చవిచూసి, ఇప్పుడు అక్షరం ఇస్తున్న ఆసరాతో తమ అస్తిత్వాన్ని ప్రకటించుకుంటున్న వారు ఇందులో కనిపిస్తున్నారు. న్యూసు రీడరుగా, ప్రైవేటు స్కూళ్ళల్లో టీచరుగా పనిచేసే సరసిజ, ఒరిస్సాలోని అడగాంలో పుట్టి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో స్థిరపడ్డ పోర్షియా దేవి, సిద్ధిపేట బస్వాపూరులో పుట్టి అరబ్బుదేశాల్లో ఉపాధి వెతుక్కుంటున్న జాబేర్ పాషా, జర్నలిస్టుగా పనిచేస్తున్న సలీం, నిజామబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లెలో పుట్టి సశస్త్ర సీమా బలంలో సైనికుడిగా పనిచేస్తున్న గొట్టిముక్కల నాగేశ్, పార్వతీపురంలో ఫొటోగ్రాఫరు పనిచేస్తున్న కలమట దాసబాబు, సినిమారంగంలో పనిచేస్తున్న రవీంద్రసూరి, నాగర్ కర్నూలు జిల్లా పదరలో పుట్టి కాన్ స్టేబులుగా పనిచేస్తున్న వెంకటేశ్, సాఫ్ట్‌వేరు ప్రాజెక్టు మేనేజరు మానస చామర్తి, ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ సర్జనుగా పనిచేస్తున్న కాళ్ళకూరి శైలజ- ఇన్ని విభిన్న జీవితపార్శ్వాల ప్రతినిధులు ఇలా ఒక్కచోట కనబడటం నాకైతే ఎంతో కొత్తగానూ, ఎంతో అపురూపంగానూ కూడా ఉంది.
తాడేపల్లిగూడెం రైతుబిడ్డ యశస్వి, బెస్తజీవితాల్ని చిత్రించే బోల యాదన్న, సూర్యాపేట జిల్లా పత్తిరైతుల గోస వినిపించే వేల్పుల మహేశ్, చాకిరేవులో పూసిన శ్రమపద్యం మెట్టానాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాలో ఒక లైన్‌మేను కొడుగ్గా పుట్టి ఐటిఐ చదివి అక్కడితో ఆగకుండా తెలుగు ఎమ్మేలో గోల్డ్ మెడలు దాకా ప్రయాణించిన మల్లెగోడా గంగాప్రసాద్, ఆర్టిసి డ్రైవరు కుటుంబంలో పుట్టి కవిత్వం వైపు అడుగులు వేసిన బుర్రా సంతోష్ గౌడ్, మోటార్లు బాగుచేస్తూ తన తండ్రి చదివిస్తే గౌడ జీవితాల్లోని కష్టసుఖాల్ని ప్రపంచంతో పంచుకుంటున్న తండ హరీష్ గౌడ్‌తో పాటు వాచ్‌మేనుగా పనిచేస్తూ కవితలు రాస్తున్న ఉప్పుల లింగన్న దాకా ఈ పుస్తకంలో మనకి కనిపిస్తారు.
గౌడ సామాజిక వర్గానికి చెందిన మరో కవి తాళ్ళపల్లి శివకుమార్, గౌడజీవితాలతో పాటు కుమ్మరి జీవితానుభవాల్ని కూడా కవిత్వంగా మలుస్తున్న తుల శ్రీనివాస్, యాదవ కవి మిత్రులతో ‘కవ్వంసాహితి’ ప్రారంభించిన జంగ వీరన్నల దాకా విస్తృత సమాజ ప్రతినిధులు ఈ ఉత్తరాలు అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు.
ఎక్కువమంది ఉపాధ్యాయులు కావడం, అది కూడా తెలుగు ఉపాధ్యాయులూ, తెలుగుసాహిత్య విద్యార్థులూ కావడం కూడా నాకు సంతోషం కలిగించిన మరోవిషయం.
సమాజంలో అట్టడుగు వర్గాలనుంచి రావడమే కాదు, ఇందులో చాలామంది కవుల వ్యక్తిగతజీవితాల గురించి గోపాల్ మనతో పంచుకున్నవి, ఒకటి రెండు విశేషాలే కావొచ్చు, కాని అవి చాలు వ్యక్తులుగా ఈ కవులు ఎంత ఉన్నతులో చెప్పడానికి.
కాసుల రవికుమార్‌ని సరళక్క కొడుగ్గానే తలచుకుంటాడు గోపాల్. ఎందుకంటే ‘రాత్రి పగలు బీడీలు చుట్టిన ఆ చేతులు లేనిది’ రవన్న లేడని అతడికి తెలుసు. కవులు మామూలుగా అమ్మమీదా, భార్యమీద కవితలు రాస్తుంటారు. కాని అత్తమీద కవిత రాసిన తెలుగుకవి యశస్వి సతీష్. ఒంటరి మహిళ తన బిడ్డలకు అమ్మా, నాన్నా రెండూ తానై బతుకుతుంది కాబట్టి ‘అమ్మకే ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ చెప్పిన భావుకురాలు ఫణిమాధవి కన్నోజు. తెలుగు పండిటుగా ఉద్యోగం వచ్చినప్పుడు తన మొదటి జీతం అనాథాశ్రమానికి ఇచ్చి ఒక రోజంతా వాళ్ళతోనే గడిపిన కవి శ్రీకవనాల ప్రసాద్.
ఇంకా తెలుగు భాషలో మొదటి అక్షరాలైన అ, ఆ లతో మొదలయ్యేలా తన ఇద్దరు కొడుకులకీ ‘అక్షర’, ‘ఆద్య’ అని పేర్లు పెట్టుకున్న నామల రవీంద్రసూరి. ఆయనే రవీంద్ర అనే తనపేరులో తన అన్న పేరు సూరి కూడా జతపరుచుకుని రవీంద్రసూరి అయ్యాడట. కాన్‌స్టేబులుగా పనిచేస్తూనే ‘సేవ్ నల్లమల’ ఉద్యమం మొదలుకుని ‘ఆపద్బాంధవుల ఫౌండేషను’ దాకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకటేష్, నిత్యం మోటారు వైండిరగు వైర్ల మధ్య జీవితాన్ని పేనుకుంటూ తానొక తూనీగగా మారి కవిత్వం చెప్పే తెలుగు వెంకటేష్- ఈ పుటల్లో కనిపిస్తున్న ఇటువంటి హీరోలు. కవిత్వం మీద మాత్రమే కాదు, జీవితం పట్లా, భవిష్యత్తు పట్లా కూడా ఆశకలిగిస్తున్న ఆశాదీపాలు.
5
ఆచంట జానకీరాం రాసిన ‘నా స్మృతి పథంలో..’ నా ఇంటర్మీడియేట్ రోజుల్లో చదివాను. ఆ పుస్తకం చదివినప్పటి బెంగ నన్ను చాలా కాలంపాటే అంటిపెట్టుకుని ఉంది. అయ్యో, అటువంటి కాలంలో నేనెందుకు పుట్టలేదు, కవులంతా ఒక కుటుంబంగా బతికిన ఆ కాలంలో, ఆ కలయికల్లో, ఆ వీడుకోళ్ళల్లో నేనెందుకు పాలుపంచుకోలేదు అనిపిస్తూ ఉండేది. కాని ఇప్పుడు ఈ ఉత్తరాలు చదివేక నాకు చాలా సంతోషంగానూ, ధైర్యంగానూ ఉంది. కవులు ఎప్పుడూ ఉంటారు, కాని కావలసింది సహృదయులు. వాళ్ళకి తన హృదయాన్నొక ఆశ్రయంగా మార్చగల తగుళ్ళ గోపాల్‌లాంటి సహృదయులు కనబడితే ఇదుగో, స్వర్ణయుగానికి స్వాగతం అనాలనిపిస్తుంది.
22-10-2024


తగుళ్ల గోపాల్ లేఖల ప్రస్తావనతో ఈ ఉదయం కాంతివంతమైంది. కవిత్వానికి మనిషి ముఖ్యం . మనసు ముఖ్యం .మనసున్న మనుషులే మంచి సాహిత్యం వెలువరిస్తారు. మంచి సంస్కృతికి పాదుకొల్పుతారు. తమ్ముడు తగుళ్లకు అభినందనలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
శుభోదయం సర్. గోపాల్ మంచి కవిత్వాన్ని అందిస్తున్నారు. ఇప్పుడీ వ్యాసంలో అతనిలోని ప్రతిభ మరింతగా శోభించిన విషయం వెల్లడైంది.
ధన్యవాదాలు మేడం!
మొదటిసారి చదివినప్పుడు ఎలా కళ్ళ నీళ్ళు వచ్చాయో, ఎన్నోసారో గుర్తు లేని ఈ రోజూ అట్లానే. సర్, గోపాల్ హృదయం అట్లాంటి హృదయం ఉన్న వాళ్ళకే కదా అర్థమవుతుంది, దాన్నిట్లా మాటల్లో పెట్టడం, ఆ హృదయం అపురూపమని, ఈ ప్రేమ ఎంత స్వాభావికమో, అంత ప్రయత్నపూర్వకంగా కాపాడుకున్నది కూడానని ఎంతో నిశితంగా పరిశీలించిన వాళ్ళు తప్ప చెప్పలేరు.
మీరొక్కరు మా తరానికి ఇంత అండ. మీరొక్కరు.
ఇంత మన్నన, ఇంత ప్రేమ నోచుకున్న అదృష్టవంతులం మేం.
గోపాల్…మీ పుస్తకానికి హృదయపూర్వక స్వాగతం. మరొక్కసారి మనసారా అభినందనలు ❤️
హృదయపూర్వక ధన్యవాదాలు మానసా!