
‘సమూహ సెక్యులర్ ఫోరం’ వారు మొన్న ఆదివారం నాడు స్కైబాబ కథాసంపుటి ‘తెహ్ జీబ్’ (2024) మీద ఒక గోష్ఠి నిర్వహించారు. అందులో తన కథల గురించి మాట్లాడమని స్కైబాబ నన్ను కూడా అడిగాడు. పుష్కర కాలం కిందట అతడు తన కథాసంపుటి ‘ఏక్ కహానీ కే తీన్ రంగ్’ (2013) కు ముందుమాట రాయమని అడిగిన తర్వాత ఇది రెండవసారి తన రచనలమీద నా అభిప్రాయాన్ని వినిపించమని అడగడం.
గత పాతికేళ్ళుగా స్కైబాబ రాస్తూ వచ్చిన కథల నుంచి 17 కథల్ని జి.వెంకటకృష్ణ ఎంపికచేసి ఈ సంపుటంగా తీసుకువచ్చారు. ఇందులో 14 కథలు 2015 కన్నా ముందువి. మూడు కథలు ఆ తర్వాతవి. ఇందులో రెండు మూడు కథలు తప్ప తక్కిన కథలన్నీ నేనిదే మొదటిసారి చదవడం. చదువుతూ ఉండగానే ఈ కథలు నన్ను ముగ్ధుణ్ణి చేస్తూండటం నాకు అనుభవానికి వస్తూండింది. మరీ ముఖ్యంగా ‘ఫరిష్తా’ (2016) కథ చదివేటప్పటికి నా హృదయాన్ని అపారమైన ఆనందం ముంచెత్తింది. కథగాని, కవితగాని, అసలు ఏ రచననుంచైనా నేను కోరుకునేది అటువంటి ఒక దివ్యానుభూతిని. ఆ కథ నా సమకాలికుడైన ఒక తెలుగుపిల్లవాడు రాసేడంటే నాకెంతో గర్వంగా అనిపించింది. అది పాఠ్యపుస్తకాల్లో చేర్చవలసిన కథ. లఘుచిత్రంగా తీయవలసిన కథ. చిన్న నాటికగా రాసి ప్రతి ఒక్క పాఠశాల వార్షికోత్సవంలోనూ ప్రదర్శించవలసిన కథ.
ఈ ఒక్క కథ అనే కాదు, దాదాపుగా చాలా కథలు నాకు పదేపదే ప్రేమ్ చంద్ ని గుర్తుకు తెస్తూ ఉన్నాయి. పుస్తకం చదవడం ముగించేక, 2013 లో ఆయన వెలువరించిన ‘ఏక్ కహానీ కే తీన్ రంగ్’ కి నేను రాసిన ముందుమాట మరోసారి తీసి చదివాను. ఆశ్చర్యంగా అప్పుడు కూడా నాకు ప్రేమ్ చంద్ గుర్తొస్తున్నాడనే రాసాను. అంటే నా అనుభూతి నిక్కమైనదేన్నమాట. నా epiphany స్థిరంగానే ఉందన్నమాట!
ఎందుకని ప్రేమ్ చంద్ గుర్తొచ్చాడు?
ఈ సందర్భంగా ఒకటిరెండు మాటలు వివరంగా రాయాలి. సాధారణంగా ఇప్పుడెవరేనా ఇటువంటి కథాసంపుటాలు తేగానే మన సమీక్షకులు, విమర్శకులు ఆ కథల్ని సంతోషంగా స్వాగతిస్తారుగాని, వాటి సాహిత్యవిలువకన్నా ముందు వాటి సామాజిక సందర్భం గురించి రాయడం మొదలుపెడతారు. కాని వాళ్ళు మర్చిపోతున్నదేమంటే, కథలు అన్నిటికన్నా ముందు social studies కావు. ఆ కథలు ఏ సామాజిక నేపథ్యం లోంచి వెలువడ్డాయో ఆ సమాజాన్ని అర్థం చేసుకోడానికి ఆ కథలు ఉపకరిస్తాయనే మాట నిజమేకాని, అది వాటి ప్రాథమిక ప్రయోజనం కాదు.
ఉదాహరణకి ఈ కథలు చదవగానే మనకు బీద, దిగువ మధ్య తరగతి ముస్లిం కుటుంబాలూ, వారి మతం, వారి జీవనసంస్కృతి పరిచయమయ్యేమాట నిజమేగాని, కథలుగా అవి తాము మనకి అందించాలనుకునేది ఇంతకన్నా విలువైన పార్శ్వాన్ని. కేవలం సామాజిక పార్శ్వాన్నే పరిచయం చెయ్యాలనుకుంటే వ్యాసాలు, డాక్యుమెంటరీలు ఆ పని ఇంతకన్నా ప్రభావశీలంగా చెయ్యగలవు. పాఠకుడు తన self తాలూకు పరిమితుల్లో కూరుకుపోయినప్పుడు అతడికి other ని పరిచయం చేసే discourse ఆ social studies లో మరింత శక్తిమంతంగా కనిపించగలదు.
కాని సాహిత్య ప్రయోజనం other ని other గా పరిచయం చెయ్యడం కాదు. అది అన్నిటికన్నా ముందు ఆ other కూడా నీ self లాంటిదే, నీ self లో ఒక భాగమే అని ఎంతో సున్నితంగా చెవిలో చెప్పే సన్నిహిత వాక్యం. ఉదాహరణకి టాల్ స్టాయి, డొస్టొవిస్కీ వంటి రష్యన్ రచయితల్ని తీసుకోండి. నేనెప్పుడూ రష్యాకి వెళ్ళకపోయినా, సెంట్ పీటర్స్ బర్గ్ చూడకపోయినా, వారి నవలలు చదువుతున్నప్పుడు, అన్నిటికన్నా ముందు నాకు కలిగే అనుభూతి, ఆ కథల్లో కనిపించే మనుషులు నాలాంటి వాళ్ళే అన్నది. వాళ్ళ జీవితచిత్రణలు చదివినతర్వాత నాకు నేను మరింత బాగా అర్థమవుతాను. నా చుట్టూ ఉండే ఇక్కడి మనుషులు మరింత తేటతెల్లంగా గోచరించడం మొదలుపెడతారు. నిజమైన సాహిత్యలక్షణం ఇది, లక్ష్యం ఇది. చినువా అచెబె రాసిన Things Fall Apart చదివినప్పుడు నాకు నైజీరియాలోని ఇగ్బొ తెగ గురించి తెలిసినదానికన్నా, మా శరభవరం లోని కొండరెడ్ల గురించి మరింత బాగా తెలియడానికి కారణం అది గొప్ప సాహిత్యం కావడమే.
కాబట్టి, ఇదుగో, ఈ కథలు చదివినప్పుడు, ఈ కథల్లోని సల్మా, ఆయేషా, అతీషా, సోఫియా, గౌసియా, జబీన్, పర్వీన్, కరిమా, జాని, సలీం, మహబూబ్, ఉస్మాన్ లాంటివాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళనే స్ఫురణకన్నా కూడా ముందు నాకు చాలా కావలసినవారుగా, చాలా దగ్గరిమనుషులుగా కనిపించారు. చివరికి ‘ఫరిష్తా’ కథలో కనిపించే సులేమాన్ సాబ్ వంటి వ్యక్తి హిందువుల్లోనూ, ముస్లిముల్లోనూ కూడా కనిపించే మనిషి కాడని తెలిసినప్పటికీ, ఆయన లాంటి మనిషిని నా ఇన్నేళ్ళ జీవితంలో ఎక్కడో ఎప్పుడో ఒక్కసారేనా చూసి ఉంటాననీ, పరాకుగా దాటి వచ్చేసి ఉంటాననీ పదే పదే అనిపిస్తూ ఉండింది.
ఆ విధంగా చూసినప్పుడు ఈ కథలు సాహిత్యంగా ఎంతో సఫలమయ్యాయి అనిపించింది. కాబట్టి ఈ కథలపైన మాట్లాడాలనుకునేవాళ్ళు ముందు ఈ సాహిత్యసాఫల్యానికి కారణాలు వెతకవలసి ఉంటుంది. ఈ కథలు సాహిత్యంగా రూపుదిద్దుకోకుండా, కేవలం social studies గా మిగిలిపోయినా కూడా వీటికి ఎంతో కొంత ప్రాసంగికత ఉంటుందనే మాట నిజమేకాని, అప్పుడు నాలాంటివాడు, ఇలా కూచుని ఈ నాలుగు వాక్యాలూ రాయడానికి సిద్ధపడి ఉండడు.
ఈ కథలు ముస్లిముల కథలు అనేదానికన్నా ముందు మనుషుల కథలు అని చెప్పాలి. ఆ మనుషులు నీ చుట్టూ, నా చుట్టూ ఉన్న మనుషులే. ఇన్నేళ్ళ నా జీవితంలో ఎన్నిసార్లు నేను నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో తిరిగి ఉండలేదు! కాని స్కైబాబ చూపించినందువల్ల మాత్రమే ఆ ప్రాంతాల్లో జీవిస్తున్న ముస్లిముల జీవితాల్ని దగ్గరగా చూడగలిగాను. కాని అలా చూసినందువల్ల, వాళ్ళు కూడా నాలాంటి మనుషులేననీ, వాళ్ళ కుటుంబ సమస్యలకీ, మా కుటుంబసమస్యలకీ మధ్య పెద్ద తేడా ఏమీ లేదనీ తెలుసుకున్నాను.
ఈ ఎరుక కేవలం ‘జ్ఞానం’ లో సంభవించిన కదలిక కాదు. ఇది నా హృదయంలో తలెత్తింది. ఎందుకని? బహుశా అన్నిటికన్నా ముందు ప్రతి కథలోనూ రచయిత నాకు కనిపిస్తూ ఉండటమే నాకు కారణమనుకుంటాను. ఆ రచయిత ఒక సున్నితమనస్కుడిగా, తనవాళ్ళని ప్రేమించినవాడుగా, వాళ్ళ కష్టసుఖాల్ని తనవిగా తన హృదయానికి ఎత్తుకున్నవాడిగా కనిపించడమే కారణమనుకుంటాను. కథల్లో పాత్రలు కనిపించాలిగాని, రచయిత కనిపించడమేమిటి అని మీరడగవచ్చు. కాని ఒక టాగోర్నో, ఒక ప్రేమ్ చంద్ నో, ఒక చలాన్నో చదివినప్పుడు కూడా నాకిలాంటి అనుభూతి కలిగిందనే చెప్పగలను.
ఈ కథలు చెప్తున్న కథకుడిలో ఇంకా ఒక innocence ఉంది. ఈ పాతికేళ్ళుగా మన చుట్టూ సంభవిస్తున్న సామాజిక-మతధార్మిక రాజకీయాలు అతడిలోని ఆ అమాయికత్వాన్ని భగ్నం చేయలేకపోయాయి. పైగా తనని ఏదైనా ఒక జీవితసన్నివేశం కలవరపరుస్తుంటే, బస్సులో ప్రయాణించే ఒక గ్రామీణుడు తన డబ్బుల సంచీని మరింత జాగ్రత్తగా పట్టుకున్నట్టు, అతడు తన నిర్మలహృదయాన్ని మరింత పదిలంగా చూసుకుంటున్నాడనిపించింది.
ఈ innocenceలోంచి అతనిలో ఒక ఆదర్శవాదం రూపొందింది. అందుకనే ఇతడి కథలు 2013 లోనూ, 2025 లోనూ కూడా నాకు ప్రేమ్ చంద్ ని గుర్తుచేసాయి.
ప్రేమ్ చంద్ మనకన్నా సంక్షుభితమైన కాలంలో జీవించాడు. భారతీయ సమాజం ఆధునీకరణ చెందుతున్న రోజుల్లో, జాతీయపరంగా,అంతర్జాతీయంగా ఎన్నో పెనుతుపాన్లు సంభవిస్తున్న కాలంలో జీవించాడు. కాని మనిషిలోని మానవత్వసుగుణశీలంపట్ల ఆయనకి నమ్మకం పోలేదుసరికదా ఎప్పటికప్పుడు మరింత బలపడుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన మనుషుల్ని మనుషులుగా చూసాడు. కాబట్టే ఆ కథల్లో మనుషులు types గా కనిపించరు. మనుషులుగా కనిపిస్తారు. ఆ మనుషులనుంచి ముందు ఆయన తానేదో తెలుసుకున్నాడు, తానేదో నేర్చుకున్నాడు కాబట్టి మనం ఆ కథలు చదివినప్పుడు మనం కూడా ఏదో తెలుసుకుంటాం, ఏదో నేర్చుకుంటాం. అలాకాక, ఆయన తాను మనకేదో చెప్పడానికి ఆ మనుషుల్ని case-studies గా వాడుకుని ఉంటే, ఆ కథలు చదివినప్పుడు మన హృదయంలో సంభవించే ఒక నిర్మలానుభూతి సంభవిచేదేకాదు.
ఇప్పుడు స్కైబాబ కథల్లో నన్ను అపరిమితంగా ముగ్ధుణ్ణి చేసిన అంశం ఇదే. అతడు ఆ కథల్లో పాత్రల్ని పాత్రలుగానూ, మనకి పరిచయం చేయవలసిన sociological samples గానూ భావించడు. అసలు వాళ్ళని మనకి పరిచయం చెయ్యడం కాదు అతడికి ముఖ్యం. వాళ్ళని తలుచుకోడం, వాళ్ళ జీవితాల్లో ఆ కష్టాల్ని చూసి, వాళ్ళకేదన్నా మంచి జరిగితే బాగుణ్ణని కోరుకోడం కోసమే అతడు ఆ కథలు రాసాడు. రాసాడు అనేకన్నా, రాసుకున్నాడు అనడం సముచితంగా ఉంటుంది.
ఉదాహరణకి ‘కబూతర్’ (2011) కథ చూడండి. అందులో తన బిడ్డకు పెళ్ళి సంబంధం కుదిరేక, ఆ షాదీకయ్యే ఖర్చుకోసం అప్పుచేయడానికి ఆ తల్లి ఫాతిమా ఎక్కని గడప లేదు, తట్టని తలుపు లేదు. కాని చివరికి ఇంకా కూడవలసిన సొమ్ము పూర్తిగా కూడాకుండానే, వచ్చిన సంబంధం తాము ఇంకా ఆగలేమనీ, మరో సంబధం తమ కోసం ఎదురుచూస్తున్నారనీ వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఫాతిమా నిస్సహాయత్వాన్ని ముందు రచయిత తన నిస్సహాయత్వంగా తీసుకున్నాడు. కాబట్టి అతడు ఆ కథ చెప్తున్నప్పుడు, అది మన నిస్సహాయత్వంగా మారకుండా ఉండదు. మనం కూడా రచయితలానే, ఏదన్నా అద్భుతం జరిగి, ఫాతిమా ఆ నిస్సహాయత్వం నుంచి బయటపడాలని కోరుకుంటాం. కాబట్టే, అప్పటిదాకా ఆమెని తన సైకిలు మీద ఇంటింటికీ తిప్పిన సలీం తనే ఆమె బిడ్డను పెళ్ళిచేసుకుంటానని ముందుకు వచ్చినప్పుడు, ఆ క్షణంలో, ఫాతిమా కన్నా, స్కైబాబ కన్నా మనమే ఎక్కువ సంతోషానికి లోనవుతాం. అలా వచ్చినపిల్లవాడు ఎక్కడో దేవరకొండలో ఒక ముస్లిం కుటుంబాన్ని ఆదుకోడానికి వచ్చిన ముస్లిం పిల్లవాడుగా కాక, ముందు మనల్ని ఆదుకోడానికి వచ్చిన దేవదూతలాగా కనిపిస్తాడు. నిజమైన సాహిత్యం చెయ్యగలిగేదిదే. చెయ్యవలసిందీ ఇదే.
అలాగని ఈ కథల్లో ముస్లిం సమాజం ఎదుర్కుంటున్న సమస్యల గురించిన చిత్రణలేదని కాదు. ఒక insider గా రచయిత తన మతం తాలూకు పరిమితులపట్లా,సంకుచిత ధోరణుల పట్లా కలాన్ని ఎక్కుపెట్టలేదని కాదు. కాని నేను చెప్పదలచుకున్నదేమంటే, అవి నా వరకూ, రెండో ప్రాధాన్యత ఉన్న అంశాలు మాత్రమే. ఆ మనుషులు వేషభాషలు నాలాంటికావనీ, వాళ్ళ ఆహారవిహారాలు నాలాంటికావనీ అయినా వాళ్ళు కూడా నాలాంటి మనుషులేననీ తెలుసుకోవడం కాదు ఈ కథల ద్వారా నాకు కలిగిన ప్రయోజనం. అసలు అన్నిటికన్నా ముందు వాళ్ళు మనుషులనీ, మామూలు మనుషులనీ, చిన్న చిన్న జీవితాల్లో, చాలా సాధారణమైన సమస్యలే-చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రేమవివాహం, తీర్థయాత్ర-లాంటి సమస్యలే, మన జీవితాల్లోలానే వాళ్ళ జీవితాల్లో కూడా, ప్రాణాంతకంగా పరిణమిస్తుండం చూసి మనం తల్లడిల్లిపోతాం. తన సమాజ జీవనస్రవంతిని అలా మన హృదయపు గడపదాకా ప్రవహింపచెయ్యడంలోనే రచయితా స్కైబాబ సాధించిన విజయం దాగి ఉంది.
రచయితలోని ఆదర్శవాది ఆదర్శంకోసం ఆదర్శవాది కాలేదు. తన మనుషుల పట్ల వల్లమాలిన ప్రేమ అతణ్ణి ఒక నిజమైన మానవుడిగా మార్చడంవల్ల, లేదా మార్చాలని కోరుకుంటున్నందువల్ల అతడు ఆదర్శవాదిగా కనిపిస్తాడు. ‘మౌసమీ'(2013) ‘అనమోల్ రిష్తే’ (2015), ‘ఉర్సు’ (2011), ఏక్ నయీ ఖిడికీ (2014) లాంటి కథలు కన్నీటిబిందువులంత నిర్మలంగా కనిపించడానికి కారణం అవి ఒక మానవుడి కంటివెంట వెడలిన అశ్రువులు కావడమే కారణం. అతడిలోని ఆదర్శవాది ఎంత బలంగా ఉన్నాడంటే తనకి ఒకప్పుడు దూరమైన మిత్రుడికి మళ్ళా చేరువకావడమెలా అనుకునే ఒక పాత్ర చివరికి తాను చనిపోయినట్టుగా భావించడానికి కూడా సిద్ధంకావడాన్ని మనం ‘జీవం’ (2011) కథలో చూస్తాం.
ఈ కథల్లో మౌసమీ కథ గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. నా దృష్టిలో అది ఒక కావ్యం. ఎవరైనా సున్నిత హృదయం కలిగిన దర్శకుడు దానిని ఒక చలనచిత్రంగా తీస్తే ఆ కథలోని సౌందర్యం మరింత దృశ్యమానమవుతుంది.
అలాగే ఒక కథలో నన్ను ముగ్ధుణ్ణి చేసిన ఘట్టం ఒకటుంది. ‘కబూతర్’ కథలో తన బిడ్డ షాదీకోసం అప్పుకోసం తిరుగుతున్న ఫాతిమా తన తమ్ముడు జమీర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతడు ఆమెకి ధైర్యం చెప్పి, అక్కడితో ఆగకుండా, ఈ ఎండలో కాలినడకన తిరక్కు, ఆటోల్లో తిరుగు అని రెండువందలు ఆమె చేతిలో పెడతాడు. అప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో, ఆ రెండువందలు ఎంతో విలువైనవి. ఆ విలువ మన చేతులకి కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె దేవరకొండలో ఉన్న తన అన్న మక్సూద్ భాయిని చూడటానికి వెళ్తుంది. వెళ్ళేదాకా ఆమె అతడి ఆర్థికపరిస్థితి గురించి ఊహించుకున్నదివేరు, అక్కడికి వెళ్ళాక కనిపించిన దృశ్యం వేరు. తాగుడికి బానిసై, రోగిష్టిగా మారి మంచమెక్కిన ఆ సోదరుణ్ణి చూసి ఆమె చలించిపోతుంది. అతనితో మాట్లాడి వచ్చేస్తూ తన దగ్గరున్న డబ్బుల్లో, తిరుగుప్రయాణానికి కావలసింది అట్టేపెట్టుకుని, మిగిలిన సొమ్మంతా ఆ కుటుంబం చేతుల్లో పెట్టేస్తుంది. నిజానికి ఈ దృశ్యం లేకపోయినా ఈ కథకి లోటు లేదు. కాని ఇది రచయిత మనస్సుని ప్రతిబింబించే దృశ్యం. అతడు తాను అటువంటి సన్నివేశంలో ఉంటే అలాగే చేసి ఉంటాడని మనం నమ్మదగ్గ ఘట్టం ఇది. ఇటువంటి హృదయం ఉంది కాబట్టే, అతడు ఆ ఫాతిమా కూతురిని పెళ్ళిచేసుకోడానికి ఒక సలీం ముందుకు రాగలడని ఊహించగలిగాడు.
ఇలా ప్రతి ఒక్క కథలోనూ కనీసం ఒక్క సన్నివేశాన్నైనా ఎత్తిచూపవచ్చు. ఒక కథని సాహిత్యంగా మార్చే తావులివి. తెహ్ జీబ్ అనే మాటకి సభ్యత, సంస్కృతి, నాగరికత అని డిక్షనరీలో అర్థాలు కనిపించాయి. కాని నేనేమనుకుంటానంటే తెహ్ జీబ్ అంటే సంస్కారం. ఇది ఒక మనుష్య సమాజం గురించిన సంస్కారాన్ని మాత్రమే కాదు, ఆ జీవితాన్ని చిత్రించిన రచయిత సంస్కారాన్ని కూడా మనకి పరిచయం చేసే కథలు. సాహిత్య ప్రయోజనం గురించి రాస్తూ ఒకప్పుడు కొడవటిగంటి కుటుంబరావు చట్టం చేయలేని పని సంస్కారం చేస్తుందని రాసాడు. నేను ఆ వాక్యాన్ని పొడిగించి ఇలా చెప్తాను: సామాజిక విశ్లేషణలు చేయలేని పని సాహిత్యసంస్కారం చేస్తుంది అని. ఒకసారి సాహిత్యం మన హృదయంలో అటువంటి కదలిక తెచ్చిన తర్వాత అప్పుడు అటువంటి మానవుల గురించి, మానవ సమూహాల గురించి మరింత తెలుసుకోవడానికి సామాజిక విశ్లేషణలు సహకరిస్తాయి.
ఈ కథల్లో రచయితకి స్త్రీలపట్ల ఉన్న అనుకంపన సామాన్యమైనదికాదు. సమాజం రెండు విభాగాలుగా చీలిపోయే సందర్భం ఏర్పడ్డ ‘అంటు’ (2013) లాంటి కథలో కూడా అతడు ఆడబిడ్డ వైపే ఆలోచిస్తాడు. తన సమాజంలోని స్త్రీలు చెల్లెళ్ళుగా, అక్కలుగా, తల్లులుగా, అభాగినులుగా కనిపించే ప్రతితావులోనూ అతడు ముందు కరిగి నీరవుతాడు. ఏ రచయితనుంచైనా నేను కోరుకునేది ఇటువంటి సహానుభూతినే.
మొన్నటి ప్రసంగంలో ఇదంతా చెప్పాను. దీంతో పాటు మరొక రెండు మాటలు కూడా చెప్పాను. మొదటిది, ముస్లిం బాలికల విద్య గురించిన కథలు అతడు విస్తారంగా రాయవలసి ఉంటుందని. నాలుగైదేళ్ళ కిందట నేను సమగ్రశిక్ష రాష్ట్రప్రాజెక్టు అధికారిగా పనిచేసినప్పుడు మైనార్టీ బాలికల కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో సీట్లు నిండకపోవడం గమనించాను. చివరికి ఆ సీట్లు వేరే బీదబాలికలతో నింపక తప్పని పరిస్థితి కూడా చూసాను. అన్నిటికన్నా ముందు ముస్లిం బాలికల విద్య చాలా అవసరం. ఒక లెక్క ప్రకారం నేడు ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం అక్షరాస్యత గిరిజనఅక్షరాస్యత కన్న తక్కువగా ఉంది. మరొకవైపు తెలంగాణలో ముస్లిం అక్షరాస్యత జాతీయ ముస్లిం అక్షరాస్యత కన్నా ఎక్కువగా ఉన్నమాట నిజమేగాని, విద్యాప్రమాణాల్లోనూ, ఉన్నత విద్యకు చేరడంలోనూ తెలంగాణా ముస్లిములింకా చాలా వెనకబడి ఉన్నారు. కాని ముస్లిం పిల్లలు ప్రతిభలో ఎవరికీ తీసిపోరు. నేనొక మదర్సా సందర్శించినప్పుడు, అక్కడ రాహిల్లా అనే ఆరేడేళ్ళ అమ్మాయి, ఆరబిక్, ఉర్దూ, హింది, తెలుగు, ఇంగ్లిషు- అయిదు భాషల్లోనూ అలవోకగా మాట్లాడటం చూసేను. వాళ్ళకి అవకాశాలు కూడా తక్కువ కాదు. కాని ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోడానికి వారికి అడ్డుపడుతున్న శక్తులేవి, వాటిని అధిగమించిన పిల్లలు ఎలా అధిగమించగలుగుతున్నారు- వాటిని స్కైబాబ పరిశీలించాలని నా కోరిక.
ఇక రెండోది, ఈ సంపుటంలో కథల్ని తేదీలబట్టి చూస్తే, 2015 తర్వాత అతడు కథలు చెప్పడం తగ్గినట్టుగా కనిపిస్తున్నది. అతడు 2025 నుంచి మరింత విస్తారంగా కథలు చెప్పాలి. వెళ్ళాలి, ఎన్ని గ్రామాలకు వీలైతే అన్ని గ్రామాలకు వెళ్ళాలి, ఎన్ని కుటుంబాలకు చేరువకాగలిగితే అన్ని కుటుంబాలకు దగ్గర కావాలి. వారి హృదయఘోష తాను వినాలి, మనకి వినిపించాలి.
29-4-2025


స్కై కథలపై గొప్పగా మాట్లాడారు ఆరోజు. గొప్ప విశ్లేషణ వ్యాసంగా అందించారు. స్కై చేయాల్సిన మరో పనిని సున్నితంగా చెప్పారు. ధన్యవాదాలు సర్.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
What a depiction, Sir.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
స్కై కథలపై సమగ్రమైన విశ్లేషణ. విన్నప్పటికన్నా రాతలో చదువుతుంటే మరింత గాఢంగా గుండెకు హత్తుకుంది.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
సర్! మీ మాటలు చదువుతూ చదువుతూ నా గుండెలు ఉద్వేగంతో ఎగిరి పడ్డాయి.. కళ్ళ నుంచి కన్నీటి బిందువులు రాలిపోయాయి.. మరిన్ని కథలు రాయడానికి బోలెడు స్థైర్యాన్ని ఇచ్చాయి సర్ మీ మాటలు! మనసుకి సంబురంగా ఉంది సర్! పువ్వుల బుట్టెడు కృతజ్ఞతలు మీకు 🙏💕
ధన్యవాదాలు స్కైబాబ!
నమస్తే….
కథా సంపుటిలోని మేలిమి గుణాల్ని చక్కగా చెబుతూనే పాఠకులందరికీ సాహిత్య ప్రయోజనం, సాహిత్య సంస్కారం అనే రెండు విషయాల గురించి ఆలోచన కలిగించారు.
Thank you
ధన్యవాదాలు సార్!