
నాకు చాలా ఇష్టమైన కవిత్వాల్లో చీనా కవిత్వం ఒకటి. మూడువేల ఏళ్ళ చీనా కవిత్వాన్ని పరిచయం చేస్తూ కొన్ని కవితలు అనువదించాలని ఎప్పణ్ణుంచో అనుకుంటూ ఉన్నాను. మూడేళ్ళ కిందట, ఆ ప్రాజెక్టులో ఒక భాగం పూర్తిచేసాను. ప్రాచీన కాలం నుంచి సామాన్యశకం ఆరవశతాబ్దిదాకా చీనా కవిత్వాన్ని పరిచయం చేస్తూ 22 వ్యాసాలు, 111 కవితల అనువాదాలు వెలువరించాను. ప్రాచీన చీనా కవిత్వం గురించిన ఇంత సమగ్ర పరిచయం తెలుగులో రావడం ఇదే ప్రథమం.
ఈ నెలలో చైనాలో కింగ్-మింగ్ పండగ జరుగుతుంది. ప్రతి వసంతకాలంలోనూ జరుపుకునే ఈ పండగలో చీనీయులు తమ పితృదేవతల్ని, పూర్వీకుల్ని తలుచుకుంటారు. వారిలో ప్రాచీన కవులు కూడా ఉన్నారు కాబట్టి, ఆ పండగ సందర్భంగా, నా వ్యాసాల్ని ఇలా పుస్తక రూపంలో ‘ఏకాంత కుటీరం’ పేరిట ఇలా అందిస్తున్నాను.
దీన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. మీ మిత్రుల్తో పంచుకోవచ్చు.
దూర ప్రాచ్య కవిత్వాన్ని ప్రేమించేవాళ్ళు తెలుగులో మరికొందరున్నారు. వారిలో నా సమకాలికుల్లో గాలి నాసరరెడ్డి ముందువరసలో ఉంటాడు. ఆయనకి ఈ పుస్తకాన్ని సంతోషంగా కానుక చేస్తున్నాను.
ఇది నా 61 వ పుస్తకం.
26-4-2025


మొన్ననే మందారిన్ గా పిలువ బడే చైనీయ భాషకు అకికషరాలు లేవనీ , పదసముదాయములే పలు సందర్భాల్లో పలురీతులుగా వాడతారనీ ఆ భాషావరణంలో అభిమన్య ప్రవేశం చేసాను. వారిది శబ్దప్రాధాన్య భాష అనిపించింది. రామస్వామి గారి కవనకోకిలలు లోకొందరు చైనీయుల జీవన రేఖలు చూసాను. ఇప్పుడు ఈ అందమైన పుస్తకం చూడగానే ఆనందం కలిగింది. మా గౌడు గారి
గేయంలోని చరణం
విశ్వమానవ మహోదధిలో
అలల వంటివి జనుల భాషలు
గుర్తుకు వచ్చింది.
భాషలే కద ప్రజల
హృదయాలు వెలిగించి
విశ్వమానవ దీప్తి వెల్లడించు అని ఇప్పుడు నాకనిపించింది . మీ పుస్తకం సేవ్ చేసుకున్నాను.
అభినందనలు.
హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహకర వాక్యాలకు ప్రణామాలు.
ఇంతటి మహిమాన్వితమైన కాన్కను అందుకుంటున్న ఆత్మీయ మిత్రుడైన గానా ను అభినందిస్తూ..
ఈ ఏకాంతకుటీరంలోకి దర్శనభాగ్యం కల్గించినందుకు మీకు నమఃపూర్వక ధన్యవాదాలు.
డా. పి బి డి వి ప్రసాద్
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ప్రయాణంలో ఉండి పొద్దున చదవలేకపోయాను…తెరచి చూస్తే ఇంత పెద్ద కానుక. మీరు రాసిన వ్యాసాల నుండే ఎందరో కవులను వెదుక్కుని చదువుకున్నాను. వ్యాసాల దాకా కూడా కాదు, కేవలం మీరు కోట్ చేసినవి, కవితల్లో ఫుట్ నోట్స్ లో ఇచ్చినవి…ఎన్నో.
ఈ మాటలు రాస్తుంటే, హృదయం మొత్తం కృతజ్ఞతతో నిండిపోతోంది. నేను, నాలా ఎందరో, మీకు ఈ మాట చెప్పచ్చు, సందర్భం కుదరక అన్నిసార్లూ చెప్పలేకపోనూ వచ్చు. కానీ, కవిత్వానికి సంబంధించి, మీరు తెలుగు సాహిత్య లోకానికి చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ఇది మా భాగ్యం. మీ సాహిత్య కృషి నిరాటంకంగా సాగాలని కోరుకోవడమొక్కటే మేం చేస్తున్నది. Thank you very very much for this precious gift, sir. <3
హృదయపూర్వక ధన్యవాదాలు మానసా! ఆ నీ స్పందన వచ్చాకనే ఆ పోస్టు సఫలం అవుతుంది.
కవర్ పేజ్ మీద ఉన్న బొమ్మ, లోపలివి మీవి కావా? వివరాల్లో చూసి ఉండకపోతే మీవనే అనుకునేదాన్ని. :O
అలాంటి బొమ్మల్లో ఒక్క బొమ్మ వేయగలిగినా నా జీవితం సఫలమైనట్టే.
Thank you, sir.