శిలానిశ్శబ్దం

ఆ మధ్య ఒకరోజు నందకిశోర్ ఫోను చేసి ఒక చిత్రకారుల బృందం బస్సుమీద కాకతీయ దేవాలయాలు సందర్శించి ఆ దృశ్యాల్ని బొమ్మలు గీసుకోడానికి వెళ్తున్నారనీ నాకు కూడా రాడానికి ఆసక్తి ఉందా అనడిగాడు. వరంగల్లు, రామప్ప, ఘనపురం లాంటి క్షేత్రాలకు వెళ్తున్నారని చెప్తూ ఆ ఇటినరి కూడా పంపించాడు. నా మనసైతే చాలా ఉత్సాహపడిందిగాని, రెండురోజుల పాటు ఊరువదిలి వెళ్ళే అవకాశం లేకపోవడంతో ఆగిపోయేను.

ఇప్పుడు ఆ చిత్రకారులు తాము గీసిన చిత్రలేఖనాల్ని ‘శిలానిశ్శబ్దం’ పేరిట స్టేటు ఆర్టు గాలరీలో ప్రదర్శిస్తున్నారని తెలిసాక వెంటనే పోయి చూడాలనిపించింది. కానీ, ఇవాళ్టికి, అంటే ప్రదర్శనలో చివరి రోజు, చివరిగంటకు అక్కడికి చేరుకోగలిగేను. నాతో పాటు మా పిల్లలు అమృత, సౌందర్య కూడా ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి ముగింపు సమావేశం ముగింపులో ఉంది. ఈమని శివనాగిరెడ్డిగారి కంఠస్వరం వినబడుతోంది. ప్రాచీన దేవాలయాల గురించిన ఒక కళాయజ్ఞం జరుగుతున్నప్పుడు ఆయన తప్పనిసరిగా ఉండవలసిన వ్యక్తి కదా.

కాని సమయం చాలా తక్కువ ఉండటంతో ముందు గాలరీలోకే పరుగులాంటి నడక సాగించాను. ముందు సుడిగాలిలాగా రెండు గాలరీలూ ఒక చుట్టు చుట్టేసాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఈ మధ్యకాలంలో మన చిత్రకారుల చిత్రకళాప్రదర్శనలో నేను చూసినవాటిలో దీన్ని అగ్రశ్రేణి ప్రదర్శనగా చెప్పాటానికి నాకేమీ సంకోచం లేదు.

సాధారణ ప్రకృతిదృశ్యాలో, లేదా నగరదృశ్యాలో చిత్రించడం కన్నా, దేవాలయ దృశ్యాల్ని చిత్రించడం అంత సులభం కాదు. ఎందుకంటే, ఆ రంగులు మామూలు రంగులుగా ఉండవు. ఆ మట్టిరంగులు కొంత వెలిసిపోయి కూడా ఉంటాయి. ఆ దృశ్యంలో చాలా intricate detail ఉంటుంది. ఆ సూక్ష్మవివరాలన్నిటినీ చిత్రించకపోయినా, చిత్రించినంతమటుకూ నిర్దిష్టంగా చిత్రిస్తే తప్ప విశ్వసనీయత సిద్ధించదు. అదీకాక, దేవాలయ దృశ్యాలు, ముఖ్యంగా శిథిలాలు మనల్ని ముందు కంగారుపెట్టేస్తాయి.

అపారమైన వివరాలతోపాటు, అబ్బురపరిచే వెలుగునీడలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మన కళ్ళముందున్న దృశ్యాన్ని చిత్రించుకోడానికి, ఎక్కడ నిలబడాలి, ఏ మేరకు ఎంచుకోవాలి, ఎంచుకున్నదానిలో కూడా ఎంత వదిలిపెట్టేయాలి- లాంటి చాలా నిర్ణయాలు మనం సత్వరమే తీసుకోవలసి ఉంటుంది. అదీకాక ఆ రోజు చిత్రకారుల ప్రయాణవివరాలు చూసినప్పుడు వారికి ఏ దేవాలయం దగ్గరా, ఏ శిథిలాల దగ్గరా ఎక్కువసేపు ఆగి చిత్రించుకునే వ్యవధి ఉన్నట్టు కనబడలేదు. కాబట్టి ఆ ప్రయాణపు తొందరలోనే వారు నిదానంగా తమ సబ్జెక్టుని పరిష్కరించుకోవలసి ఉంటుంది.

ఈ నేపథ్యంలో చూసినప్పుడు చిత్రకారులు తమ సందర్శనలోనూ, దర్శనంలోనూ కూడా కృతకృత్యులయ్యారనే చెప్పవలసి ఉంటుంది. తైలవర్ణాలు, యాక్రిలిక్, పెన్సిలు, ఇంకు, నీటిరంగులు మొదలైన అన్ని ప్రధాన మాధ్యమాల్లోనూ వాళ్ళు తమ చిత్రాల్ని చిత్రించిపట్టుకొచ్చేరు. ప్రతి ఒక్క చిత్రలేఖనం ఒక కాలానీ, ఒక దేశాన్నీ గుర్తుచేయడంలో సఫలమయినట్టే ఉంది. ఇంత creative energy మన చిత్రకారుల్లో ఉందా అని ఆశ్చర్యం కలిగింది.

నావరకూ నేను కొన్ని చిత్రలేఖనాల దగ్గర కొంతసేపు ఆగిపోయేను. అందులో మొదటిస్థానం ఒక నీటిరంగుల చిత్రలేఖనానికి ఇవ్వాలనిపించింది. ఆ చిత్రకారిణి అంజని. ఆర్టు టీచరుగా పనిచేస్తున్నారట. ఆమె చిత్రలేఖనంలో దేవాలయ వాస్తులోని గాంభీర్యానికి సాయంసంధ్యలోని గాంభీర్యం జతగూడి ఒక అనిర్వచనీయ అనుభూతిని అందిస్తూ ఉన్నది.

గిరిధర్ అరసవల్లి గారి చిత్రలేఖనం కూడా నన్ను నిలువరించింది. అందులో ఆయన వాడిన రంగులు మరింత ప్రశస్తంగా ఉన్నాయి. యాక్రిలికు సాధారణంగా తైలవర్ణాల ప్రకాశాన్ని వెంటతెచ్చుకుంటుంది. కాని తాను చిత్రిస్తున్నది ఒక శిథిలదేవాలయం కాబట్టి ఆయన ఆ రంగుల్లో ఒక వెలిసిపోయిన తనాన్ని గొప్పగా పట్టుకొచ్చారు. అదీకాక, అంత సూక్ష్మవివరాల్ని చిత్రిస్తున్నప్పటికీ, చిత్రంలోని unity of feel ని నిలబెట్టగలిగారు.

చిత్రగారు ప్రొఫెషనలు చిత్రకారులు, శిల్పి కూడా. ఆయన కూడా రామప్ప దేవాలయ ప్రాంగణంలోని ఒక శిథిలాన్ని చిత్రించారు. ఆ శిథిలాల దృశ్యాన్ని ఆయన క్రాప్ చేసిన తీరు, దానిపక్కనే కొంత ఆకాశాన్ని కూడా చిత్రించడంలో చెప్పుకోదగ్గ compositional skill చూపించారు. ఎందుకంటే ముదురు నారింజరంగుకి నీలం పూరకవర్ణం కాబట్టి శిథిలాలూ, ఆకాశమూ, ఒకటి మారనిదీ, మరొకటి అనుక్షణం మారేదీ, ఒకటి కూలిపోతున్నదీ, మరొకటి ఎప్పటికీ కూలిపోనిదీ, ఈ పరస్పర పూరకలక్షణాల వల్ల ఆ దృశ్యం మనల్ని ఆపేస్తుంది. అదీకాక, అందులో ప్రధాన స్తంభం ఫోకలు పాయింటుగా ఉండటంతో, మన దృష్టి ముందు ఆ స్తంభం మీద పడి, ఒక చుట్టు తిరిగి, ఆ చుట్టూ పడి ఉన్న శిథిలాలమీంచి మళ్ళా ఆ స్తంభం దగ్గరికి చేరుకుంటుంది. తక్కిన నిర్మాణం అంతా కూలిపోతున్నా,  కూలకుండా నిలబడ్డ ఆ ఒక్క స్తంభంలో  చిత్రకారుడు గొప్ప వ్యక్తిత్వాన్ని దర్శించాడని మనకు అర్థమవుతుంది.

మరికొన్ని అద్భుతమైన చిత్రలేఖనాల చిత్రకారుల్ని పరిచయం చేసుకుని మాట్లాడదామనుకున్నానుగానీ, అప్పటికే ముగింపు వాతావరణం ఆ గాలరీని కమ్మేసింది.

యాభై మంది పై చిలుకు చిత్రకారులు పాల్గొన్న ఆ శిబిరంలో ఇద్దరు చిత్రకారుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒకరు అన్వర్ కుమారుడు బెతూన్. ఆయన వేయి స్తంభాల గుడిని ఇంకులో చిత్రించాడు. అతడు అంత మంచిచిత్రకారుడని నాకిప్పటిదాకా తెలియదు.


మరొకరు, పింగళి చైతన్య కుమారుడు ఖుదీరాం- అతను చిన్నపిల్లవాడని నాకు గుర్తు- ఆ పిల్లవాడిది కూడా ఒక పెద్ద నీటిరంగుల చిత్రం అక్కడ ఉంది. నీటిరంగుల్లో అంత పెద్దబొమ్మ గియ్యాలంటే ముందు అపారమైన confidence అవసరం. నీటిరంగులు నీనుంచి ముందు కోరుకునేది ఆ ఆత్మవిశ్వాసాన్నే. ఆ పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పగలను.

ఒక్క దేవాలయాలే కాదు, నదులు, అడవులు, కొండలు, నగరశివార్లలో ఉండే గండశిలలు- ప్రతి ఒక్క స్థలానికీ ఇటువంటి చిత్రకారుల బృందాలు తరలివెళ్ళాలనీ, ఇటువంటి కన్నులపండగ ఏడాది పొడుగునా జరుపుతూనే ఉండాలని కోరుకుంటున్నాను.

14-4-2025

16 Replies to “శిలానిశ్శబ్దం”

  1. నాకూ ఆ రోజు వెళ్ళాలని అనిపించినా దూరాల భయానికి కదల్లేదు. మీరు పరిచయం చేసిన బొమ్మలన్నీ, మీ మాటల అందం కూడా కలుపుకుని అద్భుతంగా ఉన్నాయి.

  2. మీ పరిచయ వాక్యాలతో ఆ చిత్రాలు మరిన్ని రంగులు కలబోసుకుని ప్రాణాలు పోసుకున్నాయి.. నందకిశోర్ ఆ చిత్రకారుల బృందం కాకతీయ దేవాలయాలు సందర్శించి ఆ దృశ్యాల్ని బొమ్మలు గీసుకోడానికి వెళ్తున్నారనీ ఫేస్బుక్ లో ఏదో పోస్ట్ లో చదివినట్టు గుర్తు. ఆ చిత్రాలు పుస్తకం రూపంలో కూడా తెస్తే బాగుంటుందేమో.. మీరు పంచుకున్న చిత్రాల్లో ఆ శిలా సౌందర్యం సజీవంగా కనిపిస్తోంది…

  3. మధురం. నేను కూడా వెళ్ళ లేక పోయాను సార్. మీరు చిత్రకారుడు కోణం నుండి చూశారు. నేనైతే చరిత్రకారుడి గా ఆ చారిత్రక కాలపు వస్తు వైవిధ్యం, మనుషుల దుస్తులే కాదు వాటితో వాళ్ళ సౌకర్యం.. మరికొన్ని అంశాలు నా దృక్కోణం నుండి దాటి పోయేవి కావేమో. అరవింద్ ఆర్య బృందం చేసిన ఓ గొప్ప వినూత్న ప్రయోగంగా చెప్పుకోవచ్చు. సాధారణ సమాజానికి కూడా ఓహో ఈ దృక్కోణం నుండి కూడా దేవాలయాలను చూడాలి అనే కొత్త ఆలోచన ఈ ప్రదర్శన కలిగించ వచ్చు. Thank you for giving your valueble observation

  4. నేను రెండో రోజు వెళ్ళి శిలా నిశ్శబ్దం ప్రదర్శన చూసాను.ఇది నిజంగా ఒక గొప్ప ప్రయత్నం అనిపించింది.ఈ విధంగా శిల్ప సౌందర్యం గల ప్రదేశాలకు చిత్రకారుల సమూహం వెళ్ళి వూరికే చూసి రావటం కాకుండా వాటిని రేఖల్లో,రంగుల్లో బంధించి ప్రదర్శించటం ఒక అపురూపమైన విషయంగా భావించాను.మీరు ఆ అపురూప అనుభూతిని చాలా బాగా అక్షరీకరించారు

  5. Thank You Sir, you have depicted not the locations but the marvellous srt works of amazing painters. A unique experience 🙏💐

  6. ఇది నిజంగా ఒక అద్భుత ప్రదర్శన. నేనూ, చివరి రోజు ఒక అరగంట చూసి వద్దామని వెళ్ళిన వాణ్ణి సాయంత్రం దాకా ఉండిపోయాను. మీరు రావటానికి కొద్ది నిమిషాల ముందు వెనక్కు వచ్చానని మీ యీ మాటలవల్ల తెలిసింది.
    ప్రదర్శనకు వుంచిన చిత్రాలన్నీ అద్భుతంగా వున్నాయి .
    మీ విశ్లేషణకు జోహార్లు.

  7. మీ చూపుల్తో చూపించినందుకు పోలేకపోయాననే పోరు తీరింది కృతజ్ఞతలు

  8. ఈ చిత్రాలు చాలా బాగున్నాయి. అందరికీ అభినందనలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading