ఇంకొంచెం సూర్యకాంతి

ఇంకొంచెం సూర్యకాంతి విడుదల చేసాక నాకు లభించిన రెండవ స్పందన ఇది. మొదటి స్పందన పంచుకున్నందుకు సోమశేఖర్ కీ, ఆత్మీయమైన ఈ వాక్యాలు రాసినందుకు వీణావాణిగారికీ హృదయపూర్వక ధన్యవాదాలు.


ముఖపుస్తక మాధ్యమంలో వాడ్రేవు గారి నా కుటీరంలో అడుగుపెట్టని వారు అరుదని నమ్ముతాను. వారు ప్రతీరోజూ ఒక సాహిత్య మయూఖాన్ని వెంట పెట్టుకొని పలకరిస్తారు, ఆ దినమంతా కాంతిమంతంగా మార్చేస్తారు. గత కొంతకాలంగా వారి రచనలను ఈ- బుక్ గా వారి బ్లాగ్ లో ఉచితంగా అందుబాటులో తెచ్చి ఆ కాంతిని మరింతగా చేరువ చేస్తున్నారు. ఆ గుచ్ఛం లోంచి ఇంకొంచం సూర్యకాంతి పుస్తకం నిన్నటికి పూర్తి చేశాను.

వాడ్రేవు గారు బతుకును వెలిగించే క్షణాలుగా చూసిన సందర్భాలు మనందరికీ ఎదురయ్యే మామూలు విషయలుగానే అనిపించినా అవే కదా మనల్ని మన అంతరంగం ముందు నువ్వు ఎటువైపు ప్రశ్నించే క్షణాలు. అదే వారి తాత్విక చింతన. ఏది మామూలు క్షణమంటూ ఉండదు, కొలవగలిగితే ప్రతి క్షణమూ తూకంలో ఉన్న తులసీ దళమే. ఆ తులసీ దళాలను పోల్చుకున్న క్షణాలు పంచిన కాంతే ఇంకొంచం సూర్యకాంతి. పుష్కర కాలంలో (2013- 2024) అట్లాంటి క్షణాలను ముప్ఫై అయిదు మ్యూజింగ్స్ గా రాశారు. ప్రపంచం చుట్టూ పరికించి దొరికిన దాన్ని కాక కావల్సిన దాన్ని దొరక బుచ్చుకొని ఆయా సందర్భాలను చూసే నేర్పును, అందులో నుంచి తానెనుకున్న మార్గాన్ని చదును చేసుకుంటారు వారు.

ప్రభుత్వ ఉద్యోగం అనే దాస్య వృత్తి నుంచి విముక్తి పొందడం కోసం తానెంత అల్లాడిపోయారో, తన్ను తాను వెలిగిచుకోవడానికి తానే యుద్ధం చేశారో నాకిప్పుడు అర్థం అవుతున్నది. చుట్టూ ఉన్నది కాసారమని తెలిసీ అక్కడ నుంచే జీవనసారాన్ని అందుకోవడం కోసం బంగారపు మొప్పలున్న చేప చేసిన అంతర్యుద్ధపు ఆక్రందనలు ఎవరికీ కనబడవు.

ఎప్పటికప్పుడు అలౌకిక లౌకికాల మధ్య తెరలను తొలగించుకుంటూ పోతే తప్ప సత్యం బోధ పడదు. అది సూర్యునితో సంభాషించే తామర పువ్వు కావచ్చు, పువ్వుతో సంభాషించే తేనెటీగ కావచ్చు, వసంతంతో సంభాషించే మామిడి పూత కావచ్చు మనకున్న స్వర పేటిక కన్నా గొప్ప చైతన్యంతో ఉన్నాయని , వాటిని కనిపెట్టడం కోసం అట్లా జీవితాన్ని పరామర్శించడం కోసం దేనినైనా వదులుకోవచ్చునని తెలిసిన మనిషి మరింకెన్నో అస్పష్ట సూత్రాలకు బంధితుడవడం నవీన మానవుని దీనత్వం. అయితే ఇట్లా పంచుకున్న కాంతి రేఖల వెంట ప్రయాణం చేస్తే మాత్రం ఉన్న చోటునుంచే ఉద్దరించబడడం సాధ్యమేనని అర్థం చేసుకోగలం.

ఈ మ్యూజింగ్స్ చదివి అప్రయోజక జీవితంగా మిగిలిపోకుండా నేనెట్లా నడవాలో తెల్సుకున్నట్టు అనిపించింది. మిట్ట మధ్యాహ్నపు కాంతికి కమిలిపోకుండా బతుకును సంధ్య కాంతి పుంజంగా మలుచుకోవడం కోసం మీరూ ఇంకొంచం సూర్యకాంతిని అందుకోండి. మనకు దీనిని కానుక చేసినందుకు వారికి కృతజ్ఞతలతో ఈ పోస్టు.

దేవనపల్లి వీణావాణి
12.03.2025

One Reply to “”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading