
17
ఈ దేవుడు చూడెలాంటివాడో
భక్తులంటే పిచ్చి, వట్టి భోళా.
పిలిచిన వెంటనే పరుగెత్తుకొస్తాడు
సేవచెయ్యడానికి ఎంత ఆత్రం అతడికి.
ఎండుకట్టెలో కూడా ఒదగగలడు
సిగ్గుపడడు, మొహమాటపడడు
తుకా అంటున్నాడు, ఆయన
మనకోసం అర్థనారి కాగలడు.
पाहा रे हें दैवत कैसें । भक्तीपिसें भाविक ॥१॥
पाचारिल्या सरिसें पावे । ऐसें सेवे बराडी ॥ध्रु.॥
शुष्क काष्ठीं गुरुगुरी । लाज हरी न धरी ॥२॥
तुका म्हणे अर्धनारी । ऐसीं धरी रूपडीं हा ॥३॥ (1388)
18
విట్ఠలుడు జీతంబత్తెం లేని పనివాడు
ప్రతిఫలం ఆశించకుండానే పనిచేస్తాడు
నడుమ్మీద చెయ్యిపెట్టుకుని ఎలా ఉన్నవాడు
అలా నిలబడి ఉంటాడు, కూచోనైనా కూచోడు
నువ్వేం పెడతావని అడగడు
జాతీ కులం పట్టించుకోడు
తుకా అంటున్నాడు, రమ్మని పిలిచావా
హుటాహుటిని పరుగెత్తుకొస్తాడు.
विठ्ठल नावाडा फुकाचा । आळविल्या साटीं वाचा ॥१॥
कटीं कर जैसे तैसे । उभा राहिला न बैसे ॥ध्रु.॥
न पाहे सिदोरी । जाती कुळ न विचारी ॥२॥
तुका म्हणे भेटी । हाका देतां उठाउठीं ॥३॥ (752)
19
చూడ్డానికి ఇంటింటికీ పుట్టెడుమంది కవులు
కాని దైవానుగ్రహం చవిచూసినవాళ్ళెవరూ లేరు
నీచుడు నగల్ని చూసుకుని మురిసిపోతాడు
అవి తెచ్చిపెట్టే చిక్కులు తెలుసుకోడు
నువ్వు నీ మంచికోరుకుంటున్నావా
వాటిని తీసేక తప్పదు
తుకా అంటున్నాడు మనుషులకి తెలియక కాదు
అయినా కళ్ళుమూసుకునే ఉంటారు.
घरोघरीं बहु जाले कवि । नेणे प्रसादाची चवी ॥१॥
लंडा भूषणांची चाड । पुढें न विचारी नाड ॥ध्रु.॥
काढावें आइतें । तें चि जोडावें स्वहितें ॥२॥
तुका म्हणे कळे । अहाच झांकतील डोळे ॥३॥ (1468)
6-3-2025


అద్భుతమైన అనువాదం. తుకారామ్ హృదయమెరిగి చేసిన తర్జుమా. నమస్తే సర్
ధన్యవాదాలు సార్