
భూమన్ గత కొంతకాలంగా తిరుపతి పరిసరప్రాంతాల్లో శేషాచలం కొండకోనల్లో చేస్తూ వచ్చిన ట్రెక్కింగ్ అనుభవాల్ని ‘శెషాచల కొండకోనల్లో ‘అని పుస్తక రూపంగా వెలువరించారు. శ్రీనివాసన్ (ట్రెక్ శీను) సం కలనం చేసి, లే ఔట్, డిజైన్ చేసిన ఈ పుస్తకం పర్యాటకులకి, టెక్కీలకి, ప్రకృతిప్రేమికులకి ఊహించని ఒక కానుక. అందుకని ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న సాయంకాలం హైదరబాదు జింఖానా లో శివ రాచర్ల, వివేక్ లంకమల, స్వర్ణ కిలారి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు.
భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, వారి శ్రీమతి కుసుమకుమారిగార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆ సమావేశంలో నగరంలోని ఎందరో కవులు, రచయితలు, పాత్రికేయులు, పర్యాటకులు పాల్గొన్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ భూమన్ తో తమ సాన్నిహిత్యం గురించీ, బహుముఖీనమైన ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడేరు. ఎంతో ఆత్మీయంగా గడిచిన నిన్నటి సాయంకాలం నగరంలో సాధారణంగా జరిగే సాహిత్యసాయంకాలాల కన్నా ఎంతో విభిన్నంగానూ, ఉత్సాహపూరితంగానూ గడిచింది.
భూమన్ గారితో నా పరిచయం మరీ ఇటీవలిది. కిందటేడాది మేనెలలో నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన ఒక రోజు శ్వేత కార్యాలయ సిబ్బందికి నాతో ఒక మోటివేషన్ సెషను నిర్వహించడం, ఒక సాయంకాలం తిరుపతిలోని రచయితలతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం గురించి నేనప్పుడే మీతో పంచుకున్నాను. ఆ రోజు ఆయన నా పట్ల చూపిన ఆదరం, ఆత్మీయత, ఎటువంటి భేషజాల్లేని కలివిడితనం నన్ను ఆయన పట్ల వినమ్రుణ్ణి చేసాయి.
కాని నిన్న చాలామంది మిత్రులు తమ అనుభవాలు చెప్తున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం మరింత విశిష్టమైందనీ, దాదాపుగా గత యాభై ఏళ్ళుగా ఆయన తిరుపతిలో, రాయలసీమలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందరినో ప్రభావితుణ్ణి చేస్తూనే ఉన్నాడని అర్థమయింది. హక్కుల ఉద్యమాల కార్యకర్తగా, విప్లవ సాహిత్యోద్యమ ప్రారంభకుల్లో ఒకడిగా, వనరుల్లో రాయలసీమకు రావలసిన వాటాకోసం పాదయాత్రలు చేసినవాడిగా, ప్రజల కోసం పదే పదే రాజ్యయంత్రాంగంతో తలపడ్డవాడిగా ఆయన జీవితం ఇప్పటికే సుసంపన్నమైందని గ్రహించాను. ఇప్పుడు డెబ్భై అయిదేళ్ళ వయసులో ఇలా ప్రకృతి ప్రేమికుడిగా తన అనుక్షణ జీవితానుభవాల్ని నలుగురితో పంచుకోవడం ద్వారా ఆయన మరొక మారు విస్తృత ప్రజానీకాన్ని స్పందింపచేయగలుగుతున్నాడని అర్థమయింది.
నిన్న ఆయన గురించి తమ అనుభవాల్ని పంచుకున్న మిత్రుల ప్రసంగాలన్నీ ఒక ఎత్తూ, ఆయన శ్రీమతి కుసుమకుమారి గారు చేసిన ప్రసంగం ఒకటీ ఒక ఎత్తూ. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలరుగా పనిచేసిన కుసుమకుమారిగారి గురించి నేను వినడమైతే విన్నానుగాని, ఆమె ప్రసంగం వినడం ఇదే మొదటిసారి. స్పష్టమైన వాచకం, విస్పష్టమైన వ్యక్తీకరణల వల్ల మాత్రమే కాదు, అన్నిటికన్నా ముందు, ఎంతో విలువైన తమ జీవితానుభవాల్ని, సాహిత్యం పట్లా, సమాజాన్ని మార్చాలన్న తమ తపనవల్ల తాము చేసిన ప్రయాణం గురించీ ఆమె చెప్పిన ప్రతి ఒక్క మాటా ఎంతో సూటిగా హృదయంలోకీ సొరవేసుకుపోయేదిగా ఉంది. లెనిన్, మావో, గోర్కీ, రాహుల్ సాంకృత్యాయనుల నుండి ఇప్పుడు తరిగొండ వెంగమాంబదాకా వారు స్ఫూర్తిపొందడానికి దేశాల సరిహద్దులేకాదు, సిద్ధాతాల సరిహద్దులు కూడా అడ్డురాలేదనిపించింది.
‘శేషాచలం కొండకోనల్లో’ పుస్తకం నాకు రెండుమూడు రోజులకిందటనే వివేక్ పంపించాడు. ఆ పుస్తకంలో అన్నిటికన్నా ముందు ఆ కొండలు, ఆ కోనలు, ఆ జలపాతాలు, ఆ అడవులు, ఆ గుట్టలు, ఆ దారులు నన్ను కట్టిపడేసాయి. ఎంతో భాగ్యవంతులైతే తప్ప అంత సౌందర్యసన్నిధానానికి చేరువగా గడపలేరనిపించింది. ఆ ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు భూమన్ గారు కేవలం ఆ భూగోళాన్ని మాత్రమే వర్ణించరు. తన కన్నా ముందు ఏ కవులు, ఏ గాయకులు ఆ దారిన నడిచారో వాళ్ళ జాడలు వెతికి పట్టుకుంటూ ఉంటారు. కాబట్టే ఆ పుటల్లో అన్నమయ్య, తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు, సారంగపాణి, తరిగొండవెంగమాంబ మొదలుకుని ఎందరో కవిగాయకులు కనిపిస్తున్నారు.
ఈ పుస్తకం గాని, ఈ మధ్యనే వివేక్ వెలువరించిన ‘లంకమల దారుల్లో’ గాని లేదా స్వర్ణ కిలారి సంకలనం చేసి తీసుకొచ్చిన ‘ఇంతియానం’ గాని కొన్ని విషయాల్ని మనకి చాలా దృఢంగా చెప్తున్నాయి.
వాటిల్లో మొదటిది, మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక పర్యాటకుడు ఇంకా సజీవంగానే ఉన్నాడనీ, మనం మన పసితనంలో కొత్తస్థలాలు చూసేటప్పుడు అన్నిటికన్నా ముందు ఏ wonder ని అనుభూతి చెందామో, అలా విస్మయం చెందగల శక్తికి మనమింకా దూరంగా జరగలేదనీ ఆ పుస్తకాలు చెప్తున్నాయి. రెండోది, పర్యటనలంటే మనమెక్కడికో హిమాలయాలకో, స్విజ్జర్లాండుకో పోనక్కరలేదనీ, చూసే చూపుండాలేగాని, మన చుట్టుపక్కల మనం నిర్లక్ష్యంగా డాటుకుంటూపోయే వాగులూ, వంకలే మనకొక మంత్రమయ భూగోళాన్ని చూపించగలవని. అలా వీలైనన్ని సార్లు మన చుట్టుపక్కలకి మనం వస్తూ పోతూండటం మొదలయ్యాక, నెమ్మదిగా మన దృష్టి ఆ కొండకోనలతోపాటు అక్కడి మనుషుల్నీ, వాళ్ళ సుఖదుఃఖాల్నీ కూడా పరికించడం మొదలుపెడుతుందని.
నిన్న తన ప్రసంగంలో కందుకూరి రమేష్ బాబు దీన్ని ‘పరిసరాల విజ్ఞానం’ అన్నాడు. ఎంత చక్కటి మాట! మనం స్కూల్లో పిల్లకి భాష, గణితం తర్వాత నేర్పేది పరిసరాల విజ్ఞానమేగాని, మన పాఠ్యపుస్తకాలూ, మన ఉపాధ్యాయులూ ఆ పరిసరాలంటే అవెక్కడో మనముండే చోటుకి ‘అవతల’ దూరంగా ఉండేవన్నట్టుగా చెప్పడం మొదలుపెడతారు. అక్కడే వస్తుంది సమస్య.
ఇక ఈ కొత్తతరం పర్యాటకులు మనకి చెప్తున్న మూడో అంశం ట్రెక్కింగ్ ఒంటరిగా చేసేదికాదనీ, ఒక బృందంగా చేపట్టవలసిందనీ. నిజానికి మన తీర్థయాత్రల్లో కూడా ఈ బృందానుభవం అంతర్లీనంగా ఉంది. నలుగురు కలిసి నడవడంలో ఒక అత్యంత ప్రాచీన మానవానుభవస్ఫురణలేవో ఉన్నాయనుకుంటాను. భూమన్ గారి ట్రెక్కింగ్ అనుభవాల్లో ఒంటరిగా చేపట్టినవి దాదాపుగా అరుదనే చెప్పాలి.
అయితే ఆ ఫొటోలూ, ఆ కథనాలూ చూసిన తరువాత, ఆ పర్యటనలు పదిమందీ కలిసి చేస్తున్నవని తెలిసాక, నా వరకూ నాకు వారందరికీ ఒక మాట చెప్పాలనిపిస్తోంది. అదేమంటే, వాళ్ళట్లా కలిసి తిరిగినప్పుడు, ఆ నడకలూ, ఆ యాత్రలూ వారిలోని సృజనసామర్థ్యాల్ని మరింత వెలికితీసేవిగా ఉండాలని. ఆ ట్రెక్కింగుతో పాటుగా ఆరుబయట బొమ్మలు వేసుకోవడం మొదలుపెట్టొచ్చు, కవితలు కూర్చడం నేర్చుకోవచ్చు. పాటలు పాడటం సాధన చేయవచ్చు. అంతిమంగా, అలా ప్రకృతిలోకి నడిచివెళ్ళి వచ్చిన ప్రతిసారీ తమకు తెలీకుండానే తాము మూటగట్టితెచ్చుకుంటున్న మానసిక ప్రశాంతిని తమ ఇంటిముందో, తమ వీథిలోనో మొక్కలుగా నాటవచ్చు.
మన సమాజ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం. మనుషుల్ని కలపటానికి సినిమాలూ, రాజకీయాలూ, క్రీడలూ ఇవ్వగల స్ఫూర్తికన్నా ఈ కొత్త వ్యాపకం మరింత ఆరోగ్యవంతమైన ఉత్తేజాన్ని అందిస్తుందని నమ్ముదాం. అందుకు భూమన్ గారే ఒక ఉదాహరణ అన్నదే నిన్న అక్కడ కూడుకున్న మిత్రులంతా ముక్తకంఠంతో చెప్పింది.
Photo courtesy: Kandukuri Rameshbabu through Siva Racharla
3-3-2025


భద్రుడు గారూ..
మా అక్క శ్రీమతి పి.కుసుమకుమారి భర్త భూమన్ గారు trecking team తో ప్రకృతిలోకి నడిచివెళ్ళివచ్చిన అపురూప అనుభవాలను అక్షర బద్దం చేసిన “ శేషాచలం కొండకోనల్లో” పుస్తక పరిచయ సభ విశిష్టతను మనోహరంగా వ్యక్తీకరించారు. అభినందనలు సర్.
ధన్యవాదాలు మేడం
ధన్యవాదాలు భద్రుడుగారు .మీ ఆలోచనలకు నేను చాల ఇష్టుణ్ని .చెప్పవలసినవి చాలానే మిగిలివున్నాయి .మీ సాంగత్యములో తిరుపతి లో ముచ్చటించుకుందాము
ధన్యవాదాలు సార్!