
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా 14-2-2025 న బైరాగి ప్రేమకవితల పైన ప్రసంగించాను. బైరాగి కవిత్వంలోంచి ప్రేమకవితలు అనే పేరిట సంకలనం చేసింది ఆదేశ్వరరావుగారు. ఆయనతో ఒక సారి బైరాగి అన్నాడట. షేక్స్పియర్ సానెట్లతో సమానమైన ప్రేమకవితలు తాను రాసాన్నేను అని. కాని అవి ఏ కవితలో బైరాగి ఆయనతో చెప్పలేదు. ఆదేశ్వరరావుగారు ఆ మాటపట్టుకుని బైరాగి కవిత్వం నుంచి 20 కవితలు ఎంపికచేసి, వాటిలో అయిందింటికి తాను ఇంగ్లిషులోకి చేసిన అనువాదాలూ కూడా కలిపి 25 కవితలలతో ప్రేమకవితలు పేరిట ఒక సంకలనంగా వెలువరించారు. నిన్న ఆ కవితల గురించీ, ముఖ్యంగా ఆగమగీతి కవితల్లో బైరాగి ప్రేమాన్వేషణ గురించీ మాట్లాడాను. ఈ అంశం మీద తెలుగులో ఇంతవరకూ ఇదే మొదటిప్రసంగం అని కూడా చెప్పవచ్చు.
ఈ ప్రసంగం మీద ఒక మిత్రుడి స్పందన:
సార్.. ఏం ప్రసంగం సార్.. ఇక మీదట మీ వ్యాసాలు చదివి, మీ ప్రసంగాలు విని, మీరు ప్రస్తావించిన సాహిత్యాన్ని, సాహితీ వేత్తల రచనల్ని చదివితే చాలనిపిస్తోంది…🙏
I am very very happy that you have taken this weekly talks initiative .. మాలాంటి సాహితీ పిపాసులకి వారి తృష్ణ తీర్చుకుందుకు ఇంతకన్నా గొప్ప అవకాశం ఉండదు..ధన్యవాదాలు.
ఈ ప్రసంగం మీద ఒక మిత్రురాలి స్పందన:
ఈ రోజు మీరు చెప్పిన బైరాగి కవిత్వంలో ప్రేమ గురించి విన్నాను. మీరు చెప్పినట్టు ప్రేమ అంటే ఒక చట్రం లో బంధించబడేది కాదు.
కానీ, ప్రేమ అనేది ఒకరి నుండి వేరొకరు పొందేది కూడా కాదు. నాకు మీరు చదివిన బైరాగి కవితలో అర్థమయ్యింది ఏమిటంటే…ప్రేమకి వ్యతిరేఖ పదం భయం
అనుకుంట.
మీరన్నట్టు నీళ్ళల్లో కొట్టుకుపోతున్నపుడు చేతికి దగ్గరగా ఏ ఆలంబన దొరుకుతుందా అని దగ్గరగా వెతికినట్టు, అంతా వట్టిదే అని తెలిసినపుడు ఒక మనిషి తన లోపల, తన అంతరాళం లో ఉన్న జగన్మాతకి చేరువవుతాడు.
అంటే, పురుషుడు, స్త్రీ, ప్రేమ వేరు, వేరు కాదు. ప్రతి మనిషి అర్ధనారీశ్వర రూపమే. తనకి భాధ కలిగినప్పుడు వేరొక మనిషి మరియు ఆ మనిషి చైతన్యం మాసిపోయేదే అని తెలిసినప్పుడు, తనలో ఉన్న ఆమెని అంటే శక్తి అంటే సాక్షాత్తు ఆ జగన్మాత ని తనలోనే వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అదే కదా ప్రాణంలో ఇంకో ప్రాణం. అదే ప్రేమ.
అలానే, బైరాగి ఆ చిన్ని పాప నుండి ఆనందం పొందలేదు, తాను ఏది చూసినా ఒక వ్యక్తావ్యక్త ఆనందం అనుభవించడం అనే దశలో ఉన్నాడు అనిపించాడు. అతను, ఆనంద స్వరూపి. అందుకే ప్రేమ అనేది తనలో తాను వెతికి పట్టుకోవచ్చని తెలిసింది. అది ఎప్పుడు తెలుస్తుంది…వేరొక వ్యక్తి పురుషుడైనా, స్త్రీ అయినా ఆ స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ ఏదో ఒక నాటికి వమ్ము అవుతుంది అని తెలిసినప్పుడు మాత్రమే.
పదార్థ పంకంలో ఆదిశక్తి అంటే పదార్థం అణువులుగా, పరమాణువులుగా, ఎలక్ట్రాన్ లుగా ఇంకా దానిలో వలయాలు లయం అయ్యేటప్పుడు చివరగా నాశనం కాని శక్తి ఒకటి అనంత విశ్వంలో ప్రకటితమవుతుంది కదా. ఎంత బాగా చెప్పాడు.
మీరన్నట్టు మీకు దుఃఖం కలిగినప్పుడు మీ ఊరిలో గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటానని అంటే మీలో నిబిడీకృతమై శక్తి మీ మనోఫలకం లో అచ్చయిన సంధ్యా దేవిలో, ఆ చిన్ననాటి ప్రకృతి కాంతలో ఉంది అని కదా…నాకు అలా అర్థమయ్యింది.
15-2-2025


ధన్యోస్మి భద్రుడు గారు..
నమస్కారం సార్!
బైరాగి కథల మీద కూడా ఒక చర్చ జరపాలని మనవి.
తప్పకుండా